‘ప్రధాని మోదీ గారూ! రంజాన్‌ ‌నెలంతా ఉండేటట్టు లాక్‌డౌన్‌ ‌పొడిగించడం అవసరం.’
‘ఆరోగ్య కార్యకర్తల మీద ముస్లింలు చేస్తున్న అఘాయిత్యాలు తల దించుకునేలా ఉన్నాయి.’
మౌలానా ఆజాద్‌ ‌జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం (మాను, హైదరాబాద్‌) ‌చాన్సలర్‌ ‌డాక్టర్‌ ‌ఫిరోజ్‌ ‌భఖ్త్ అహమ్మద్‌ ‌ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖలోని విషయాలివి. ఏప్రిల్‌ 17‌న ఈ లేఖ మీడియాలో వచ్చింది. ఇలాంటి వాటిని సెక్యులర్‌ ‌మీడియా పట్టించుకోదు. కాబట్టి ఎక్కువ మంది దృష్టికి వెళ్లలేదు. ఒక మతాన్ని అవలంబించే వ్యక్తిగా కన్నా, మనిషిగా మనుగడ సాగించడం, కొన్ని అంశాల పట్ల వాస్తవికంగా మాట్లాడడం దేశ హితాన్ని, సమాజ శ్రేయస్సును కోరే వారి లక్షణం. ఇదే ఫిరోజ్‌ ‌భఖ్త్ ‌గారి చేత ఇలాంటి ఒక లేఖ రాయించిందని అనిపిస్తుంది. మే 24వ తేదీన ముగిసే రంజాన్‌ ‌నెల వరకు లాక్‌డౌన్‌ ‌పొడిగించడం అవసరమని ఆ లేఖలో ఫిరోజ్‌ ‌భఖ్త్ అభిప్రాయపడ్డారు. కొందరు ముస్లింలు దేశవ్యాప్తంగా వైద్య సిబ్బంది మీద చేస్తున్న దురాగతాలకు తాను క్షమాపణలు చెబుతున్నట్టు కూడా ఆయన వెల్లడించారు.
‘మే నెల 24న పూర్తయ్యే రంజాన్‌ ‌మాసం వరకు లాక్‌డౌన్‌ ‌కొనసాగే విధంగా చర్యలు తీసుకోవాలి. ముందు ప్రకటించినట్టు మే 3వ తేదీన ఎత్తివేయడం వల్ల సమస్య మొదటికొస్తుంది. అత్యుత్సాహం కలిగిన ముస్లింలు (హద్దులెరుగని తబ్లిఘి జమాత్‌ అనుచరులు చేసినట్టు) మార్కెట్లలో గుమిగూడడం మొదలుపెడతారు. ప్రధాని ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘిస్తూ ఇఫ్తార్‌ ‌విందులు చేసుకుంటూ, కలసికట్టుగా ప్రార్థనలు చేస్తారు. కరోనా విస్తరించకుండా ఇంతకాలం చేసిన కృషికి గండి కొడతారు. ఇది ఈ దేశ హితం కోసం ముస్లిం వర్గం కోసం, మానవాళి ప్రయోజనం కోసం నేను సవినయంగా చేస్తున్న మనవి.’ వైద్యులు, వైద్య సిబ్బంది మీద ముస్లింలు దాడి చేయడాన్ని కూడా ఆయన తీవ్ర పదజాలంతో ఆక్షేపించారు. వైద్య కార్యకర్తల పట్ల ముస్లింల ప్రవర్తనకు వారి తరఫున క్షమాపణ చెబుతున్నట్టు కూడా ఫిరోజ్‌ ‌భఖ్త్ ‌లేఖలో పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధుడనైన ఈ దేశ ముస్లింగా నేను క్వారంటయిన్‌లో ఉంటూ వైద్య సిబ్బంది మీద, బయట పోలీసుల మీద, పారిశుద్ధ్య సిబ్బంది మీద ముస్లింలు చేసిన దాడులకు నేను క్షమాపణ కోరుతున్నాను అని ఆయన రాశారు. ఉమ్మడం, ఆస్పత్రి సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించడం (ముఖ్యంగా నర్సులతో), మూత్రం నింపిన సీసాలను వైద్యుల మీదకు విసరడం, వైరస్‌ ‌తగ్గడానికి వైద్యంలో సహాయ నిరాకరణ చేయడం వంటివి విన్నప్పుడల్లా నా తల అవమాన భారంతో కుంగిపోయేది అని ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
(ఫిరోజ్‌ ‌భఖ్త్ ‌స్వతంత్ర భారత తొలి కేంద్ర విద్యామంత్రి మౌలానా అబుల్‌ ‌కలాం ఆజాద్‌ ‌మనవడు)

By editor

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
Instagram