సమతామూర్తి

భగవద్‌ ‌రామానుజాచార్యులు ధార్మికవేత్త మాత్రమే కాదు. దిగువ వర్గాల సముద్ధరణకు కృషి చేసిన సాంఘిక సంస్కర్త. మమతను మానవతను ప్రవచించిన సమతామూర్తి. వేదానికి సరైన నిర్వచనం చెప్పి, సనాతన ధర్మం గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు. వేయి సంవత్సరాల క్రితమే ఆధ్యాత్మికత, మానవ విలువలు, సామాజిక సమానత్వం, శ్రీవేంకటేశ్వరుని ప్రాభవం, విశిష్టాద్వైతం విశిష్టతను విశేషంగా ప్రజల్లోకి తీసుకెళ్లి ధార్మిక ప్రచారం చేశారు. ఆయన 1017లో తమిళనాడులోని శ్రీ పెరంబదూరులో జన్మించారు. బాల్యం నుంచే చాలా తెలివైన విద్యార్ధి. గురువుల బోధనలోని లోపాలు కనిపెట్టే సామర్ధ్యం ఆయన సొంతం. గురువు రామానుజానికి ‘ఓం నమో నారాయణాయ’ అనే మంత్రాన్ని ఉపదేశించి దీనిని చాలా రహస్యంగా ఉంచమని చెప్పాడు. అయితే వెంటనే రామానుజాచార్యులు తిరుకొట్టియూర్‌ ఆలయ గోపురం ఎక్కి తనకు తెలిసిన మంత్రాన్ని ప్రజలందరికీ బిగ్గరగా బోధించాడు. ఆ తర్వాత తాను ఉపదేశించిన మంత్రం వల్ల సకల జనులు స్వర్గం పొందితే, వారికి ఈ మంత్రం ఉపదేశించిన పాపానికి నేను నరకం భరించడానికి కూడా సిద్ధమే అని చెప్పాడు. హరిజనులందరికీ దేవాలయ ప్రవేశం కల్పించిన సమతామూర్తి శ్రీరామానుజాచార్యులు.
కలియుగ దైవం తిరుమల వేంకటేశ్వర స్వామి విగ్రహం విష్ణువు రూపానిదా? శివ రూపానిదా? అని వైష్ణవులు, శైవులకు మధ్య ఏర్పడిన వాదోపవాదాలకు రామానుజాచార్యులు పరిష్కారం చూపించారు. తిరుమల స్వామి గర్భాలయంలో శంఖు చక్రాలను ఉంచగా తెల్లవారి చూసే సరికి స్వామి వాటిని ధరించి కనిపించారు. ఇంతటితో ఈ సమస్య పరిష్కారమైంది. స్వామివారి నిత్య కైంకర్యాలను, సేవలను కూడా రామానుజాచార్యులే నిర్ణయించారు. తిరుమలలో వైఖానస ఆగమాన్ని గౌరవించి ఆ పద్దతులను కొనసాగించారు. ఇప్పటికీ తిరుమలలో రామానుజాచార్యులు ప్రవేశపెట్టిన ఎన్నో సంప్రదాయ పూజా పద్దతులు కొనసాగుతున్నాయి. దేవుడు, జీవుడు, ప్రకృతి వేర్వేరు అని ఆయన తన సిద్ధాంతాల్లో పేర్కొన్నారు. బాదరాయణుడి సిద్ధాంతాలపై వ్యాఖ్యానం రాశారు. దీనినే శ్రీభాష్యం అంటారు. తన గురువైన యమునాచార్యునికి ఇచ్చిన మూడు హామీలు భాష్యం రాయడం, వైష్ణవమతప్రచారం, దేవాలయ నిర్మాణం (మెల్కొటెలో ఆలయ నిర్మాణం) నెరవేర్చారు. తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయప్రతిష్టాపన కూడా ఆయన నేతృత్వంలోనే జరిగింది. సాలగ్రామమయమైన తిరుమల క్షేత్రానికి వచ్చినప్పుడు మోకాలి మిట్ట ప్రాంతంలో కాళ్లతో నడవకుండా మోకాళ్లతో నడిచిన మహా భక్తుడు ఆయన. అందుకనే ఇప్పటికి మోకాళ్ల మిట్ట అని పిలుస్తారు. భగవంతుని చేరుకోవాలంటే శరణాగతి కీలకమని చెప్పారు. రామానుజాచార్యులు వ్యాససూత్ర భాష్యం, గీతాభాష్యం, తర్కభాష్యం, వేదార్థసంగ్రహం, న్యాయామృతం, వేదాంత ప్రదీపం, వేదాంత తత్త్వసారం, నారదీయ పాంచరాత్రాగమం, రంగనాథస్తవం, గద్యత్రయం తదితర గ్రంథాలను రచించారు.
ద్వైత,అద్వైత సిద్ధాంతాలను సమన్వయం చేస్తూ బేధాబేధ సిద్ధాంతాన్ని రూపొందించిన నింభార్కునికి సమకాలీనుడు. నూట ఇరవై సంవత్సరాల తన జీవిత కాలంలో హైందవ దేవాలయాల విధి నిర్వహణ, పూజాదికాలను ససాంప్రదాయంగా నిర్ణయించిన ఘనత భగవద్‌రామానుజులదే. కర్తవ్యదీక్షలో ప్రదర్శించవలసిన ధైర్యానికి, దేవునిపై చూపవలసిన అనన్య సామాన్యమైన నమ్మకానికీ, సాటిలేని భక్తికీ, రామానుజాచార్యుని జీవితం గొప్ప ఉదాహరణ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
Instagram