ప్రసార మాధ్యమాల మీద, వాటి సారథుల మీద దాడులు కొత్త కాదు. సాధారణంగా అధికారంలో ఉన్నవారి మీద దాడి నెపం పడుతూ ఉంటుంది. ఎందుకంటే సాధారణంగా మీడియాది ప్రతిపక్షం పాత్ర. చిత్రంగా రిపబ్లిక్‌ ‌టీవీ చానల్‌ ‌ప్రధాన సంపాదకుడు అర్ణబ్‌ ‌గోస్వామి మీద ఏప్రిల్‌ 22-23 అర్ధరాత్రి జరిగిన దాడికి కాంగ్రెస్‌ ‌నాయకురాలు సోనియాగాంధీ కేంద్ర బిందువయ్యారు. ప్రధాన ప్రతిపక్షంగా గ్రేస్‌ ‌మార్కులతో గట్టెక్కిన కాంగ్రెస్‌ ‌పార్టీ నాయకురాలామె. అయితేనేం, ఆమె ఆశీస్సులతో, ఆమె పార్టీ మద్దతుతో కొలువుదీరిన ప్రభుత్వం ఉన్న రాష్ట్రంలో ఇదంతా జరిగింది. అదే మహారాష్ట్ర. అసలు శాంతిభద్రతలు ఉన్నాయా? అని దేశం మొత్తం ప్రశ్నించుకుంటున్న రాష్ట్రం కూడా ఇప్పుడు అదే. తన మీద దాడి చేసిన ఇద్దరు యువకులు ప్రతీక్‌ ‌కుమార్‌ ‌శ్యాంసుందర్‌ ‌మిశ్రా, అరుణ్‌ ‌దిలీప్‌ ‌బొరాడే యువజన కాంగ్రెస్‌ ‌కార్యకర్తలని అర్ణబ్‌ ఆరోపణ.
దాడి జరిగిన రాత్రి ఆయన రిపబ్లిక్‌ ‌టీవీలో నిర్వహించిన చర్చలో సోనియాగాంధీని తీవ్ర స్థాయిలో నిలదీశారు. తనను ఎప్పుడు అరెస్టు చేయిద్దామా అని సోనియా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారని కూడా ఆ చర్చ సందర్భంగా అర్ణబ్‌ ‌వ్యాఖ్యానించడం విశేషం. ఇంతకీ అర్ణబ్‌ ‌చేసిన వ్యాఖ్యలు ఏమిటి? ఒకటి, పాల్గర్‌ ‌జిల్లాలో ఇద్దరు సాధువులను కిరాతకంగా హత్య చేసినా సోనియా ఎందుకు నోరు విప్పరు? ఈ ప్రశ్న అడగడం సబబే. ఒడిశా అడవులలో క్రైస్తవ మిషనరీ గ్రాహంస్టెయిన్స్ ‌హత్యకు గురైనప్పుడు సోనియా వెక్కి వెక్కి ఏడ్చారని ఆమె రాజకీయ సహచరుడు రాసిన పుస్తకంలో కనిపిస్తుంది. మరి ఇప్పుడు ఆమె కనీసం ఎందుకు నోరెత్తరు? అన్నదే అర్ణబ్‌ ‌ప్రశ్న. ఇలా కొన్నింటికే స్పందించడం ఎలాంటి సంకేతాలు ఇస్తుంది? ఒక వర్గం వారు చనిపోతే ఒక రకం స్పందన, మరొక వర్గం- అంటే మైనారిటీల మీద దాడులు జరిగితే వేరే విధంగా స్పందించడం ఏమిటి? రెండు, కొవిడ్‌ 19 ‌సేవలు అందిస్తున్న అలహాబాద్‌ ఆస్పత్రిలో హిందువులను, ముస్లింలను వేర్వేరుగా ఉంచారంటూ ప్రియాంకా గాంధీ ట్వీట్‌ ‌చేయడం ఏమి సబబని కూడా అర్ణబ్‌ ‌ప్రశ్నించారు. ఇక్కడ ముస్లింల పట్ల వివక్ష చూపుతున్నారని ప్రియాంక ఆరోపణ. కానీ ఇది అబద్ధమని తరువాత తేలింది. కానీ దీనికి విచారం ప్రకటించిన దాఖలాలు లేవు.
కాంగ్రెస్‌ ‌పార్టీ, సెక్యులరిస్టులు, మేధావులు, అవార్డ్ ‌వాపసీలు, తుకడా తుకడా గ్యాంగ్‌, ‌పీపుల్స్ ‌ఫ్రంట్‌ ఆఫ్‌ ఇం‌డియా వంటివన్నీ ఎంపిక చేసుకున్న కొన్ని ఘటనల మీదే గగ్గోలు పెడతాయని అర్ణబ్‌ ఆరోపణ. ఇదే అంశాన్ని ఆయన తరుచూ ప్రస్తావిస్తారు. ఆ క్రమంలోనే పాల్గర్‌ ‌జిల్లాలో జరిగిన ఇద్దరు సాధువుల హత్య విషయం కూడా చర్చకు పెట్టి, వీరందరినీ కూడా ఆయన దుయ్యబట్టారు. ఈ వర్గం వెనుక ఉన్న మీడియా ప్రతిపక్ష పాత్రను నిర్వహిస్తే తప్పు పట్టవలసిన పని లేదు. కానీ కాంగ్రెస్‌, ‌వామపక్షాల తరఫున ఈ మీడియా శిఖండి పాత్రను నిర్వహిస్తున్నది. ఈ మీడియా ద్వారానే అధికార పార్టీ మీద బురద చల్లే పనిని నిర్విఘ్నంగా వారంతా చేస్తున్నారు.
పత్రికా రచన ఎంత రుచించకపోయినా, దానికి హింస మాత్రం పరిష్కారం కాలేదు అంటారు. అర్ణబ్‌ ‌మీద దాడి యత్నం నిజం. టీవీ స్టూడియో నుంచి ఆయన తన భార్య సమయబ్రాతా రాయ్‌తో వస్తుండగా గణపతిరావ్‌ ‌మార్గ్‌లో ఇద్దరు మోటారు సైకిళ్ల మీద వచ్చి దాడికి యత్నించారు. వారి దగ్గర కర్రలు ఉన్నాయి. కారు ఆపేందుకు యత్నించి సిరా పోశారు. అయితే అర్ణబ్‌కు వై కేటగిరి రక్షణ వ్యవస్థ ఉంది. అందుకే వారు ఆ ఇద్దరిని వెంటనే పట్టుకున్నారు. ఎన్‌ఎం ‌జోషి మార్గ్ ‌పోలీస్‌ ‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే ఈ దాడిలో క్రిమినల్‌ ‌కోణంతో కేసు నమోదు చేయడానికి పోలీసులు అంగీకరించలేదు. తనకు రక్షణ ఇస్తున్నవారికి దొరికిన ఆ ఇద్దరు యువజన కాంగ్రెస్‌ ‌కార్యకర్తలని, ఆ విషయం తన రక్షణ సిబ్బంది దగ్గర అంగీకరించారని అర్ణబ్‌ ఆరోపణ. ఈ దాడి జరగడానికి ముందే యువజన కాంగ్రెస్‌ అర్ణబ్‌ ‌మీద కేసు పెట్టింది. చానల్‌ ‌ద్వారా మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని యువజన కాంగ్రెస్‌ ఆరోపణ. అలాగే వలస కార్మికులను ఆయన నటులు అన్నారని కూడా యువజన కాంగ్రెస్‌ ఆరోపించింది. అర్ణబ్‌ ‌మీద దాడిని ప్రెస్‌ ‌కౌన్సిల్‌, ఎడిటర్స్ ‌గిల్డ్, అనేకమంది రాజకీయ నాయకులు, జర్నలిస్టులు ఖండించారు.


సోనియా ప్రమేయం గురించి వచ్చినప్పుడు ఇటలీ మాఫియా అని కొందరు వ్యాఖ్యానించడం కనిపిస్తూ ఉంటుంది. అర్ణబ్‌ ‌కూడా అలాంటి వ్యాఖ్య చేస్తారు. నిజం చెప్పాలంటే, అర్ణబ్‌ ‌మీద దాడి ఇటలీ మాఫియా శైలిలో, ఎమర్జెన్సీ స్ఫూర్తితో జరిగిందనాలి. ఇప్పుడు కాంగ్రెస్‌ ‌పార్టీ ఆ రెండు లక్షణాలు కలిగి ఉన్నదే. ఎమర్జెన్సీ కాలంలో జర్నలిస్టులను, పత్రికలను కాంగ్రెస్‌ ‌పార్టీ వేధించినట్టు చివరికి బ్రిటిష్‌ ‌హయాంలో కూడా జరగలేదన్న విమర్శ ఉంది. తమకు వ్యతిరేకంగా మాట్లాడిన మీడియా పీచమణచేయాలని అనుకుంటే వాస్తవాలు ఏవీ బయటకే రావు. మరొక సంగతి ఇక్కడ చెప్పాలి. నరేంద్ర మోదీ మీద మీడియా చేసిన ఆరోపణలు, రాజేసిన వివాదాలతో పోలిస్తే అర్ణబ్‌ ‌చేసినది చాలా తక్కువ. మోదీని కాల్చి పారేయ్యాలని టీవీ చానెళ్ల చర్చలలో నోరు పారేసుకున్న వామపక్షులు కూడా ఈ దేశంలో ఇప్పటికీ క్షేమంగా తిరుగుతున్నారు. నిజానికి మెజారిటీ మీడియా మోదీకి వ్యతిరేకంగానే పనిచేస్తున్నది. తిరుగులేని బలంతో అధికారంలో ఉన్నప్పటికీ, దేశం అంతా అనుసరిస్తున్న నాయకునిగా పేర్గాంచినప్పటికీ మోదీ ఎప్పుడైనా మీడియా మీద దాడులకు ఆస్కారం కల్పించారా? అలాంటి ఆరోపణలైనా ఆయన మీద వచ్చాయా? ఆయన మీడియాతో మాట్లాడరు. అది వేరే విషయం. ఈ విషయంలో ఎవరి అభిప్రాయం వారికి ఉండవచ్చు. హిందుత్వ మీద ఈ దేశ మీడియా ఎంత విషం కక్కుతున్నదో కూడా అందరికీ తెలుసు. భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో హిందువుల ఆరాధ్యదైవాలను చానళ్లలో తిట్టిస్తున్న సంఘ విద్రోహ శక్తులు ఈ దేశ మీడియాలో ఉన్నాయి. అయినా హిందువులంతా ఆ మీడియా కేంద్రాల మీద దాడికి దిగడం లేదు. కానీ ఎమర్జెన్సీ కాలంలో మీడియా మొత్తం దాసోహమనేటట్టు చేశారు ఇందిరాగాంధీ. ఎన్నో పత్రికలు మూత పడ్డాయి. జర్నలిస్టులు జైళ్లలో మగ్గారు. కులదీప్‌ ‌నయ్యర్‌, ‌కేఆర్‌ ‌మల్కానీ వంటివారు అందులో ప్రముఖులు. కానీ సెన్సార్‌షిప్‌ ఎత్తివేసిన తరువాత మీడియా వల్లనే చాలా వాస్తవాలు బయటకు వచ్చాయి. అవన్నీ ఇందిర పతనానికి దారి తీశాయి. నిజం చెప్పాలంటే సెన్సార్‌షిప్‌ ఇం‌దిరను అంధకారంలో ఉంచింది. తను ప్రజాస్వామ్యానికి ఎంత చేటు చేస్తున్నదో తనే గమనించలేని స్థితిలో పడిపోయారామె.
ఢిల్లీలోని జెఎన్‌యులో అల్లర్లు జరిగితే కాంగ్రెస్‌ ‌పార్టీ నాయకులు వెళ్లి మద్దతు పలికి వచ్చారు. షాహీన్‌బాగ్‌లో అక్రమంగా ముస్లింలు ధర్ణా చేస్తే ఈ దేశంలో ముస్లింలకు రక్షణ లేదంటూ కాంగ్రెస్‌ ‌ప్రముఖులే మాట్లాడి వచ్చారు. తాజా ఢిల్లీ అల్లర్లలో బీజేపీ మీద నెపం పెట్టే కార్యక్రమంలో ముస్లింలను అడ్డగోలుగా సమర్థించారు. కానీ ఆ ఉదంతాలన్నిటిలోని వాస్తవం ఏమిటో, కుట్ర ఏమిటో త్వరలోనే బయటపడింది. దీనిని చాలా చానళ్లు ప్రశ్నించాయి. అర్ణబ్‌ ‌కొంచెం తీవ్రంగా ప్రశ్నించారు. అంతే తేడా. నిజానికి ఇప్పుడు నాయకులను తీవ్రంగా ప్రశ్నించడం, అవతలి వారు అంతే తీవ్రంగా స్పందించడం అర్ణబ్‌కు, ఆయన నిర్వహించే చర్చలకే పరిమితం కాదు. మిగిలిన చానళ్లలో అసలు హిందువుల తరఫున వాదించడానికి వచ్చిన వారికి న్యాయంగా దక్కవలసిన సమయమే దొరకని సందర్భాలు ఎన్నో చూస్తున్నాం. కానీ అర్ణబ్‌లోని మంచి లక్షణం, చాలామంది బీజేపీ వ్యతిరేకులను కూడా తెచ్చి మాట్లాడే అవకాశం ఇస్తారు. వాళ్లంతా స్వేచ్ఛగా మాట్లాడతారు. అందుకే ఆయన చర్చ దేశమంతటా అత్యధికంగా ప్రాచుర్యం పొందింది. ఆయన తీవ్రంగా ప్రశ్నించే వాటిలో హిందువులకు నష్టం జరిగినప్పుడు మేధావులు నోరు విప్పరు, ఎందుచేత? అన్నది ఒకటి. మెజారిటీ మీద జరిగే దారుణాల గురించి నోరు విప్పని పార్టీ ఏదీ అంటే సాధారణంగా కాంగ్రెస్‌నే చూపవలసి ఉంటుంది. గోరక్షకులు చేసిన నేరాల విషయంలో కాంగ్రెస్‌ ‌నాయకులు చేసిన గగ్గోలు తక్కువేమీ కాదు.
యువజన కాంగ్రెస్‌ ‌చేసిన ఫిర్యాదు మేరకు 27వ తేదీన అర్ణబ్‌ ‌గోస్వామిని ఎన్‌ఎం ‌జోషి మార్గ్ ‌పోలీసు స్టేషన్‌లో ప్రశ్నించారు. పన్నెండు గంటల పాటు ప్రశ్నించారు. ఇది పత్రికా సేచ్ఛను భయపెట్టే యత్నం కాదా? అయినా జరిగింది. అది కాంగ్రెస్‌ ‌మద్దతు ఉన్న ప్రభుత్వం పాలిస్తున్న రాష్ట్రం. ఒక్కొక్క రాజకీయ వ్యాఖ్యాతకు ఒక్కొక్క శైలి ఉంటుంది. అర్ణబ్‌కూ ఒక శైలి ఉంది. రాజకీయ నేతలను చూసి పళ్లు నూరుతూ మాట్లాడే వ్యాఖ్యతలు లేరా? బీజేపీ తరఫున మాట్లాడేవారిని రెండు వాక్యాలు కూడా పూర్తిగా మాట్లాడనివ్వని వ్యాఖ్యాతలు ఉన్నారు కదా! అదే బీజేపీని దుమ్మెత్తి పోసే ప్యానల్‌ ‌సభ్యుడిని ప్రోత్సహించే విధంగా కనిపించే వ్యాఖ్యాతలు ఉన్నమాటా నిజమే. అవతలి వారికి ఒక్క మాట కూడా మాట్లడడానికి అవకాశం ఇవ్వరని చెప్పుకునే మహిళా టీవీ యాంకర్‌ (ఇం‌గ్లీష్‌) ‌మాటేమిటి? సోనియా విషయమే చూద్దాం. మోదీని నెత్తుటి బేహారి అని ఆమె వ్యాఖ్యానించిన మాట అబద్ధమా? కానీ ఆమెను ఇటలీ మూలాలు కలిగిన మహిళ అని అనగానే దారుణమైన వివాదం రేపుతూ ఉంటుంది మీడియా. గోద్రా అల్లర్ల గురించి అలుపు లేకుండా మాట్లాడేవారు, ఇందిర మరణం తరువాత ఢిల్లీలో చోటు చేసుకున్న సిక్కుల ఊచకోత గురించి, ఆ ఘోరకలి గురించి ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్నారు. రక్షణ కొనుగోళ్లలో బీజేపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని రాహుల్‌ ఆరోపించారు. దీనికి వెంటనే ప్రతిధ్వని ఉంటుంది. ఎందుకంటే, కాంగ్రెస్‌ అనేది ఈ దేశంలో అవినీతి సృష్టికర్త. ఆశ్రిత పక్షపాతానికి చిరునామా. కొన్ని వందల అవినీతి ఆరోపణలు ఉన్నాయి. కొందరు కాంగ్రెస్‌ ‌నాయకులు జైలుకు వెళ్లారు. పైగా ఎంత పెద్ద స్థాయిలో అవినీతికి పాల్పడినా, హిందుత్వానికీ, బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే అలాంటి వాళ్లకి ఎక్కడలేని మద్దతు రాత్రికి రాత్రి వచ్చి పడుతుంది. వారు నికార్సయిన ప్రజాసేవకులు, బడుగు బలహీన వర్గాల శ్రేయోభిలాషులు అయిపోతారు. ఇలాంటి వాటిని ప్రశ్నించే మీడియా లేకపోలేదు. అందులో అర్ణబ్‌ ‌మీడియా ఒకటి.. ఏ విధంగా చూసినా అర్ణబ్‌ ‌మీద దాడి మీడియా మీద దాడే. ఇలాంటి వాటికి ఎవరూ పాల్పడకూడదు. మీడియాను చట్టపరిధిలో పని చేయడానికి అనుమతించాలి. మీడియా మీద వ్యతిరేకత ఉన్నా కూడా, ఫోర్త్ ఎస్టేట్‌గా దానికి ఉన్న గౌరవాన్ని భంగపరచడం సరికాదు. ఈ విషయంలో కాంగ్రెస్‌ ‌పార్టీయే ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి.

About Author

By editor

Twitter
Instagram