అది యూపీఏ మహా కుట్ర!

అది యూపీఏ మహా కుట్ర!

సోనియాగాంధీ నేతృత్వంలో పదేళ్లు సాగిన యూపీఏ పాలన హిందువులకు నరకం చూపించింది. 2004లో ఈ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే హిందువుల పండుగ దీపావళి నాడే హిందువులకు మార్గదర్శకుడైన కంచి పీఠాధిపతి శంకరాచార్యను హత్యారోపణలతో అరెస్టు చేసి జైలులో నిర్బంధిం చింది. బాంబు పేలుళ్ల నేరాన్ని హిందూశక్తులు, నాయకులపై మోపి సాధ్వీ ప్రజ్ఞాసింగ్‌, స్వామి అసీమానంద, కల్నల్‌ పురోహిత్‌ వంటి ఎంతోమంది అమాయకులను జైళ్లలో నిర్బంధించింది. వీరిపై అక్రమంగా బనాయించిన ఈ కేసులన్నిటిని సాక్ష్యాధారాలు లేక కోర్టులు కొట్టివేశాయి. అలాగే హిందువుల ఆరాధ్యదైవమైన శ్రీరాముడు నిర్మించినదని విశ్వసించే రామసేతును విధ్వంసం చేసే ప్రయత్నం నిస్సిగ్గుగా చేసింది. హిందూ వ్యతిరేక డీఎంకేకు ఇందుకు వంత పాడింది.

హిందువులను అణచివేసేందుకు చేసిన ఇటువంటి ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో అత్యంత పగడ్బందీగా మరో క్రూరమైన బిల్లును అప్పటి యూపీఏ ప్రభుత్వం తయారుచేసింది. ఆ బిల్లును 2014 సార్వత్రిక ఎన్నికల ముందు ఆదరాబాదరా పార్లమెంటులో ప్రవేశ పెట్టాలని ప్రయత్నించింది. అయితే దానిని నాటి ప్రధాన ప్రతిపక్షం బీజేపీతో పాటు, అన్నాడీఎంకే, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. హిందువుల అణచివేతే లక్ష్యంగా, సమాఖ్య స్పూర్తిని దెబ్బతీసేలా ఉన్న ఈ బిల్లును ఎలాగైనా గట్టెక్కించా లని కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అధికారం చేపట్టి ఆ బిల్లును అటకెక్కించింది. అదే మత హింస నిరోధక బిల్లు.

ప్రభుత్వం ఏ చట్టం తెచ్చినా అంతిమంగా అది ప్రజలకు ప్రయోజనం కలిగించే విధంగా ఉండాలి. సమాజంలో శాంతికి, ప్రజలంతా కలిసి మెలిసి జీవించడానికి ఉపయోగపడాలి. ఏ చట్టం లక్ష్యమైనా అదే కావాలి. కానీ కాంగ్రెస్‌, ఆ పార్టీ మద్దతుతో ఏర్పాటైన ఇతర ప్రభుత్వాలు ఇలాంటి ప్రయోజనాల కన్నా తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నాయి. ఇటువంటి వీరి ధోరణి సమాజంలో మరింత అశాంతికి దోహదం చేస్తుంది. సమాజం మీద తీవ్ర ప్రభావం చూపించి, సామ రస్యాన్ని దెబ్బతీస్తుంది. అప్పట్లో యూపీఏ ప్రభుత్వం ప్రతిపాదించిన మతహింస నిరోధక బిల్లుపై ఇలాంటి విమర్శలే వెల్లువెత్తాయి.

కేంద్రంలో పదేళ్లపాటు కాంగ్రెస్‌ నేతృత్వంలోని యునైటెడ్‌ ప్రోగ్రెసివ్‌ అలయన్స్‌ ప్రభుత్వం అవినీతి, అసమర్ధ పాలన కారణంగా ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది. అదే సమయంలో దేశంలో శాంతి భద్రతలు క్షీణించి పాలన అస్తవ్యస్తంగా మారింది. ముఖ్యంగా దేశంలో ఉగ్రవాద, తీవ్రవాద కార్య కలాపాలు ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేశాయి. పాకిస్తాన్‌ ప్రేరిత ఉగ్రవాదులు ముంబైతో సహా దేశంలోని పలు ప్రాంతాల్లో అమాయక ప్రజల ప్రాణాలను బలిగొన్నారు. అయితే ఇంతటి దారుణాలకు పాల్పడిన ఉగ్రవాదులను నిరోధించ డానికి యూపీఏ ప్రభుత్వం ఎటువంటి కచ్చితమైన ప్రణాళికను తయారుచేయలేకపోయింది. చివరకు పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులను కట్టడి చేయలేక, హిందువులపై ఉగ్రవాద నిందలు వేసే కుట్రలకు ప్రభుత్వ పెద్దలు తెరతీశారు. ఈ కుట్రలో భాగంగానే కాషాయ తీవ్రవాదం అనే చర్చ లేవదీశారు.

యూపీఏ పాలనలో చోటు చేసుకున్న సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌, మాలేగావ్‌, మక్కామసీదు పేలుడు ఘటనలపై దర్యాప్తు సందర్భంగా అప్పటి యూపీఏ కాంగ్రెస్‌ ప్రభుత్వం తన ఇటువంటి కుట్రను బయట పెట్టుకుంది. ఈ ఘటనల వెనుక హిందూ సంస్థలు ఉన్నాయనే ఆరోపణలతో స్వామి అసీమానంద, సాధ్వీ ప్రజ్ఞాసింగ్‌, కల్నల్‌ పురోహిత్‌ తదితరులను అరెస్టు చేశారు. దర్యాప్తు సంస్థలపై వత్తిడి తెచ్చి వీరిపై అన్యాయంగా కేసులు మోపారు. దర్యాప్తు సందర్భంగా వీరిని ఎన్నో రకాల చిత్రహింసలకు గురిచేశారు. కానీ పదేళ్ల తమ పాలనలో వీరిపై మోపిన ఆరోపణలను రుజువుచేసే ఒక్క ఆధారమూ రాబట్టలేకపోయారు. అసలు వీరి హస్తం ఉంటే కదా ఆధారాలు దొరకడానికి! కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పతనమై బీజేపీ అధికారం చేపట్టిన తర్వాతే వీరంతా జైళ్ల నుంచి విడుదలవటం గమనార్హం.

క్రూర బిల్లుకు అంకురార్పణ

యూపీఏ ఛైర్‌ పర్సన్‌ హోదాలో సోనియాగాంధీ కనుసన్నల్లో రూపుదిద్దుకుంది మత హింస నిరోధక బిల్లు. దీని కోసం భారీ కసరత్తే జరిగింది. 2009 నుంచి మొదలైన ప్రయత్నాలు 2011 నాటికి ముసాయిదా బిల్లు దశకు చేరాయి. ‘ప్రివెనెన్షన్‌ ఆఫ్‌ కమ్యూనల్‌ అండ్‌ టార్గెట్‌ వయలెన్స్‌ బిల్లు – 2011’ పేరుతో రూపొందిన ముసాయిదాను 2013లో ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదించింది. 2014 ఆరంభంలో దీనిని పార్లమెంటులో ప్రవేశ పెట్టి ఆమోదింపజేసుకునే ప్రయత్నాలు జరిగాయి. కానీ బిల్లులోని అంశాలు ముందుగానే బయటకు పొక్కడంతో పెద్ద ఎత్తున దుమారం మొదలైంది. దేశ వ్యాప్త చర్చకు దారితీసింది.

హిందువులలోనే విభజన

దేశంలో మతహింసను నిరోధించడానికి, లౌకికవాదాన్ని కాపాడటానికి మత హింస నిరోధక బిల్లు ఉపకరిస్తుందని నాటి యుపీఏ ప్రభుత్వం చెప్పింది. ఈ బిల్లు హిందువులకు సంబంధించినది మాత్రమే. హిందువులనే మెజారిటీలు, మైనారిటీలుగా ఈ బిల్లు విభజిస్తుంది. దీని ప్రకారం కేవలం ఓ.సీ., బీ.సీ.లకు చెందిన హిందువులే మెజారిటీ ప్రజలవుతారు. ఎస్సీ, ఎస్టీలు, ఇతర బలహీన వర్గాలకు చెందిన హిందువులు మైనారిటీలవుతారు. ఇలా ఈ బిల్లు కేవలం హిందువులకే వర్తిస్తుంది.

ఈ బిల్లు ప్రకారం మన దేశంలో ఉన్న హిందువు లంతా సహజంగానే దోషులు, నేరగాళ్లు, హింసను ప్రేరేపించేవారు, ఆందోళనకారులు. దేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్నందున హిందువులు మాత్రమే భయాందోళనలు సృష్టిస్తారు. దేశంలో ఎక్కడ మత ఘర్షణ జరిగినా, ఉగ్రవాదులు బాంబు పేల్చినా, నిజానిజాలతో సంబంధం లేకుండా హిందూ సమాజాన్నే బాధ్యులను చేస్తారు. ఏ దేశం ప్రోద్బలంతో చేశారన్నది కూడా పట్టించుకోరన్న మాట. హిందువులనే అరెస్ట్‌ చేస్తారు. అది ఏ ప్రాంతంలో జరిగిందో ఆ ప్రాంతంలో ఉన్న హిందు నాయకులను, పీఠాధిపతులను జైల్లో వేస్తారు. ఈ ఆలోచనతోనే అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రతి బాంబు పేలుడుకు హిందువులనే బాధ్యులుగా చేసి అనేకమందిని జైళ్లలో నిర్బంధించింది.

హిందువులలోని మెజారీటీ జనాభా అధికంగా ఒక ప్రాంతంలో చేరితే, అది ఉద్రిక్తతలకు, ఆందోళనకు దారి తీస్తుందని, హిందువులలోని మైనారిటీలపై (ఈ బిల్లు ప్రకారం హిందువులలోని ఎస్సీ, ఎస్టీలు మైనారిటీలవుతారు) దాడులకు కారణమవుతుందని ఈ బిల్లు సూత్రీకరించింది. కనుక హిందువులు అందరూ ఒకచోట చేరి నిర్వహించుకోదలచిన సభలను, ర్యాలీలను, ఉత్సవా లను ప్రభుత్వం నిషేధించవచ్చు. అంటే వినాయక చవితి, దుర్గా నవరాత్రి, బతుకమ్మ, జాతరలు మొదలైనవి ఈ బిల్లు ప్రకారం నిషేధానికి గురి కాగలవు. హిందూ సంస్థల సభలు కూడా నిషేధించ వచ్చు. వేల సంవత్సరాల నుంచి ఈ దేశంలో జరుగుతున్న యజ్ఞాలు, యాగాలు, వేదపారాయ ణాలు ఈ బిల్లుతో ఆగిపోయే పరిస్థితి. దేవాలయాలు పరిస్థితి ఇక చెప్పనక్కర్లేదు. చివరికి హిందువుల పెళ్లి సంబరాలను కూడా ఎక్కువమంది ఒకచోట చేరటం నేరమనే నిబంధన కింద అడ్డుకో వచ్చు. ఇదే కారణం చేత సంగీత కచేరీలు, భరత నాట్యాలు జరగడం ఇక కలే అని చెప్పుకోవాలి. ఇక్కడ ఒక ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే కేవలం నింద పడిన కారణంగా హిందువుల ఆస్తిని స్వాధీనపరుచుకునే హక్కు ప్రభుత్వానికి ఈ బిల్లు కల్పిస్తుంది.

ఈ మత హింస నిరోధక బిల్లును బీజేపీతో పాటు అన్నా డీఎంకే, తృణమూల్‌ కాంగ్రెస్‌ కూడా వ్యతిరే కించాయి. అందుకు కారణం తాము అధికారంలో ఉన్న రాష్ట్రాలలో మత ఘర్షణలు జరిగితే, కేంద్రం జోక్యం చేసుకొని ప్రభుత్వాలను రద్దు చేసే ప్రమాదం పుష్కలంగా ఉండటమే. ఇది సమాఖ్య వ్యవస్థకు విఘాతం కలిసిగిస్తుందని వారి వాదన.

ఇంత దిక్కుమాలిన బిల్లును యూపీఏ ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టడం కూడా జరిగిపోయింది. హిందూ లౌకికదేశంలో హిందువులకు అన్యాయం చేసే ఈ బిల్లు గురించి బీజేపీ తప్ప ఇతర రాజకీయ పార్టీలు స్పందించకపోవడం ఈ దేశపు హిందువులు దురదృష్టం. ప్రతి చిన్న విషయాన్ని పదేపదే భూతద్దంలో చూపించే మీడియా ఈ భయానక బిల్లు గురించి జనానికి చెప్పకపోవడం, మీడియా కుహనా లౌకికవాదానికి; ఈ దేశానికి ఏది మంచిది, ఏది చెడు చేస్తుందనే అవగాహనా రాహిత్యానికి నిదర్శనం.

యూపీఏ ప్రభుత్వం మైనారిటీల ఓట్లను రాబట్టుకొని తిరిగి అధికారంలోకి రావడమే లక్ష్యంగా 2014లో హడావుడిగా మతహింస నిరోధక బిల్లును తీసుకువచ్చింది.. బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించడంతో పార్లమెంటులో ప్రభుత్వం ముందడుగు వేయలేక పోయింది. ఇంతలో లోక్‌సభ ఎన్నికలు వచ్చాయి. బీజేపీ ఘన విజయం సాధించి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో మత హింస నిరోధక బిల్లు కోల్డ్‌ స్టోరేజీకి చేరిపోయింది.

ఇప్పటికీ పొంచి ఉన్న ప్రమాదం

ప్రస్తుతం దేశం సార్వత్రిక ఎన్నికల ముంగిట ఉంది. కేంద్రంలో మళ్లీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని స్పష్టంగా తెలుస్తోంది. అయితే నరేంద్ర మోదీ ప్రధాని కాకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్న శక్తులన్నీ కూటమిగా ఏర్పడ్డాయి. రేపు కాంగ్రెస్‌ లేదా కాంగ్రెస్‌ మద్దతిచ్చిన కూటమి అధికారాన్ని చేపడితే, కాంగ్రెస్‌ ఒత్తిడితో, అవగాహనా లోపంతో ఈ మతహింస నిరోధక బిల్లును తిరగదోడే ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో దేశ ప్రజలందరి సంక్షేమం (సబ్‌ కా సాథ్‌, సబ్‌ కా వికాస్‌) కాక తనకు నచ్చినవారి సంక్షేమం గురించి మాత్రమే ఆలోచించే కాంగ్రెస్‌కు, ఆ పార్టీకి మద్దతు తెలుపు తున్న ఇతర కూటములకు ఓటు వేసే విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవటం మన భవిష్యత్తుకు, భారత లౌకిక, ప్రజాస్వామ్య భవిష్యత్తుకు చాలా మంచిది.

– క్రాంతిదేవ్‌ మిత్ర

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *