భారతదేశ 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఎర్రకోటపై పతాకావిష్కరణ చేయడం వరుసగా ఇది పదోసారి! అయితే ఈ ఆగస్టు 15కు మూడు ప్రత్యేకతలున్నాయి. మొదటిది ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, స్వాతంత్య్ర సమరంలో విప్లవ పథాన్ని ఎంచుకున్న అరవిందఘోష్‌ 150‌వ జయంతి కాగా, రెండవది స్వామి దయానంద సరస్వతి 200వ జయంతి జరుపుకుంటున్న సంవత్సరం, మూడవది రాణి దుర్గావతి 500వ జయంతి కూడా. సార్వత్రిక ఎన్నికలకు ముందు జరుగుతున్న స్వాతంత్య్ర దినోత్సవాలు కావడంతో నరేంద్ర మోదీ ముఖ్యాంశాలను ప్రస్తావించడంలో పెద్ద విశేష మేముంటుందని భావించినా, దేశహితానికి అవెంతో కీలకమైనవిగా గుర్తుంచుకోవాలి.


ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంలో ప్రధానంగా ఐదు అంశాలను ప్రస్తావించారు. మొదటిది సంప్రదాయిక నైపుణ్యాలను పెంపొందించే విశ్వకర్మ పథకం, రెండవది జన ఔషధి కేంద్రాలను ప్రస్తుతం ఉన్న పదివేల నుంచి 25 వేలకు పెంచడం, మూడవది పట్టణ పేదలు, మధ్యతరగతి వారికి సొంత ఇంటి కల నెరవేర్చడం, నాల్గవది ఐదేళ్ల కాలంలో భారత్‌ను ప్రపంచంలో మూడో ఆర్థిక వ్యవస్థగా నిలపడానికి హామీతో పాటు ద్రవ్యోల్బణాన్ని మరింతగా తగ్గించి, ప్రజలపై దాని భారాన్ని తొలగించడానికి కృషి చేయడం. ఇక ఐదవది ‘లక్‌పతి దీదీ’ పథకం. వీటితో పాటు మణిపూర్‌ ‌సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చారు. గత ఐదేళ్ల కాలంలో 13.5 కోట్లమంది పేదరికం నుంచి బయటపడ్డ అంశాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. పేదల కొనుగోలు శక్తి పెరిగినప్పుడు, వ్యవస్థాపకత కూడా వృద్ధి అవుతుంది. ఫలితంగా పట్టణాలు, నగరాల్లో ఆర్థిక వ్యవస్థ మరింత వేగంగా పరుగులు పెడుతుంది. ఇదంతా చక్రగతిన జరిగే కార్యక్రమం. ఈ చక్రాన్ని మరింత ముందుకెళ్లేలా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం. ప్రధాన మంత్రి ముద్రా యోజన ద్వారా ప్రభుత్వం ఎంతోమందికి ఉపాధి కల్పించింది. ఇవి ప్రజాకర్షక అంశాలు కావు! సమర్థవంతంగా అమలుచేసే తమ సత్తాను ప్రజలకు తెలియజేసిన ముఖ్యమైన విశేషాలు. అంతేకాదు సర్వజన హితం, సర్వజన సుఖాన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకునే నిర్ణయాలు రాబోయే వెయ్యి సంవత్సరాల దేశ బంగారు భవిష్యత్తును నిర్మిస్తాయి. భారత్‌ ‌నుంచి వెలువడుతున్న సచేతన కాంతి నుంచి ప్రపంచం తమను తాము ఉద్దీప్తం చేసుకోవాలని చూస్తోంద నడంలో ఎంతమాత్రం సందేహం లేదు. నేడు భారత్‌ ‌ప్రపంచానికి గ్లోబల్‌ ‌సౌత్‌ ‌వాణిని వినిపించే స్థాయికి ఎదిగిందంటే అందుకు ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే.

పీఎం విశ్వకర్మకు కేబినెట్‌ ఆమోదం

ఆగస్ట్ 16‌న ప్రధాని అధ్యక్షతన జరిగిన ‘ఆర్థిక వ్యవహారాలపై కేబినెట్‌ ‌కమిటీ’ సమావేశం ఐదేళ్ల కాలంలో అమలు చేయనున్న పీఎం విశ్వకర్మ పథకానికి ఆమోద ముద్ర వేసింది. పీఎం విశ్వకర్మ పథకాన్ని ప్రధాని ఆగస్ట్ 15‌న ఎర్రకోటపై తన ప్రసంగం సందర్భంగా ప్రకటించారు. రూ.13 వేల కోట్లు ఖర్చు కాగల ఈ పథకం కింద మొత్తం 30 లక్షల కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుంది. చేనేత కార్మికులు, స్వర్ణకారులు, వడ్రంగులు, లాండ్రీ కార్మికులు, క్షురకులు, కుమ్మరులు, శిల్ప కళాకారులు, రాళ్లు కొట్టేవారు, తాపీ మేస్త్రీలు, బుట్టలు అల్లేవారు, చీపుర్లు తయారు చేసేవారు, తాళాలు తయారు చేసేవారు, బొమ్మల తయారీదారులు, పూలదండలు తయారుచేసేవారు, మత్స్యకారులు, దర్జీలు, చేపల వలలు అల్లేవారు.. తదితర సంప్రదాయ వృత్తుల వారికి ఈ పథకం లబ్ధి చేకూరుస్తుంది. విశ్వకర్మ జయంతి సందర్భంగా సెప్టెంబర్‌ 17‌న పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద అర్హులైనవారికి ఒక సర్టిఫికెట్‌, ‌గుర్తింపుకార్డు ఇస్తారు. 5శాతం వడ్డీతో రూ.2లక్షల వరకు రుణ సదుపాయం కల్పిస్తారు. ఈ పథకం కింద లబ్ధిదారులకు నైపుణ్య శిక్షణతో పాటు ఇతర ప్రోత్సాహకాలను కూడా అందిస్తారు. ముఖ్యంగా మార్కెటింగ్‌ ‌విషయంలో ప్రభుత్వ మద్దతు లభిస్తుంది. అంటే ఉత్పత్తుల విక్రయంలో ప్రభుత్వం సహాయపడుతుంది.

రెండు దశల శిక్షణ

పీఎం విశ్వకర్మలో బేసిక్‌, అడ్వాన్స్‌డ్‌ అనే రెండు దశల నైపుణ్య శిక్షణ ఉంటుంది. శిక్షణకాలంలో లబ్ధిదారులకు నెలకు రూ. 500 స్టైపండ్‌ ‌కింద చెల్లిస్తారు. ఆధునిక యంత్రాలు, పరికరాల కొనుగోలుకు రూ.15 వేల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుంది. మొదటి ఏడాది ఐదు లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూర్చాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. రానున్న ఐదేళ్లకాలంలో మొత్తం 30లక్షల కుటుంబాలకు ఈ పథకం ద్వారా ప్రయోజనం కలిగించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. మొదట 18 రకాల సంప్రదాయ నైపుణ్యాలకు ఈ పథకాన్ని వర్తింపజేస్తారు. గురు-శిష్య పరంపరను, కుటుంబ ఆధారిత సంప్రదాయ నైపుణ్యాలను అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం.

‘లక్‌పతి దీదీ’ పథకం

ప్రధాని మహిళల కోసం ప్రకటించిన మరో పథకం ‘లక్‌పతి దీదీ’. ఈ పథకం కింద రెండు కోట్ల మంది మహిళలకు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొని రావాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం ముఖ్యంగా గ్రామీణ మహిళలకు సాంకేతిక శిక్షణ అందిస్తారు. ప్లంబింగ్‌, ఎల్‌.ఇ.‌డి. బల్బుల తయారీ, డ్రోన్‌ ఆపరేటింగ్‌ ‌రంగాల్లో శిక్షణ ఇస్తారు. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఉపయోగ పడేందుకు వీలుగా మహిళలకు ‘డ్రోన్‌ ఆపరేటింగ్‌’‌లో శిక్షణ ఇస్తారు. ఇప్పటికే దేశంలో స్వయం సహాయక బృందాల ద్వారా పది కోట్ల మంది మహిళలు వివిధ బ్యాంకులతో లావాదేవీలు జరుపుతున్నారు. అంగన్‌వాడీల్లో పనిచేస్తున్నారు. ఔషధసేవల్లో పాలు పంచుకుంటున్నారు. వీటన్నింటికీ అదనంగా దేశంలోని స్వయం సహాయక గ్రూపుల్లోని మహిళలకు డ్రోన్‌ల పైలెటింగ్‌, ‌నిర్వహణ, మరమ్మతుల విషయంలో శిక్షణ ఇస్తారు. ఆ విధంగా వేలాది స్వయంసహాయక బృందాలకు డ్రోన్‌లను అందుబాటులోకి తేవా లన్నది ప్రధాని లక్ష్యం. తొలి విడతగా దేశంలోని 15 వేల స్వయం సహాయక బృందాలకు డ్రోన్‌లను అందుబాటులోకి తీసుకురానున్నారు. దేశంలో అత్యధికశాతం మంది ప్రజలు ఆధారపడిన వ్యవసాయరంగాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ డ్రోన్‌ ‌శిక్షణ ఇవ్వడం వల్ల, ఈ రంగంలో మరింత విస్తృ తంగా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్ట డానికి వీలవుతుందన్నది ప్రభుత్వ ఉద్దేశం. ప్రధాని ప్రకటనపై ‘ఐఒ టెక్‌ ‌వరల్డ్ ఏవియేషన్‌’ ‌సంస్థ సహ వ్యవస్థాపకులు, డైరెక్టర్‌ ‌దీపిక భరద్వాజ్‌ ‌స్పందిస్తూ 15వేల స్వయం సహాయక బృందాలకు డ్రోన్‌లను అందుబాటులోకి తెచ్చి వాటిని నడపడం, మరమ్మ తులు, నిర్వహణ విషయంలో శిక్షణ ఇవ్వడం నిజంగా వ్యవ సాయ రంగం రూపు రేఖలను సమూలంగా మార్చి వేసే చర్య అంటూ అభినందించారు. దీనివల్ల వ్యవసాయ రంగంలో డ్రోన్‌ల వినియోగం మరింత విస్తృతం కావడమే కాకుండా, ఉపాధి అవకాశాలు మరింతగా పెరుగు తాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇదొక విప్లవాత్మక మార్పునకు దోహదం చేయగలదు. ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొని రావడం ద్వారా గ్రామాల్లో రెండు కోట్ల మంది ‘లక్‌పతి దీదీ’లను తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యం. అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం విషయాన్ని జి-20 సదస్సు దృష్టికి తీసుకెళ్లినప్పుడు వారి ప్రాముఖ్యాన్ని ప్రతి ఒక్కరూ అంగీకరించిన అంశాన్ని సాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని  మోదీ ప్రస్తావించిన సంగతి ఇక్కడ ప్రస్తావనార్హం.

నగరాల్లో ఈ-బస్‌ ‌సేవ

పర్యావరణానికి హితం కలిగించే రీతిలో దేశంలోని వివిధ నగరాల్లో ఈ-బస్‌ (ఎలక్ట్రిక్‌ ‌బస్సులు)లను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. ఇందులో భాగంగా ‘పీఎం ఈ-బస్‌ ‌సేవ’ పథకానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రవాణా సదుపాయం వ్యవస్థీకృతంగా లేని నగరాల్లో వీటిని ప్రవేశ పెడతారు. ప్రభుత్వ-ప్రైవేటు భాగ స్వామ్య విధానంలో దేశంలోని 169 నగరాల్లో పదివేల ఈ-బస్సులను ప్రవేశపెట్టనున్నారు. ఈ పథకం అంచనా వ్యయం రూ.57613కోట్లు. ఇందులో కేంద్రం రూ.20 వేల కోట్లు సమకూరు స్తుంది. హరితపట్టణ రవాణా కార్యక్రమాల్లో భాగంగా 181 నగరాల్లో మౌలిక సదుపాయాలు వృద్ధి చేయనున్నారు.

ఏడు మల్టీ ట్రాకింగ్‌ ‌ప్రాజెక్టులు

రైల్వేలో 7 మల్టీ ట్రాకింగ్‌ ‌ప్రాజెక్టులకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దీని అంచనా వ్యయం రూ.32,500 కోట్లు. ఈ భారాన్ని కేంద్రమే భరిస్తుంది. తెలంగాణ, ఆంధప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, ‌బిహార్‌, ‌మహారాష్ట్ర, గుజరాత్‌, ఒడిశా, జార్ఖండ్‌, ‌పశ్చిమబెంగాల్‌ ‌రాష్ట్రాల్లోని 35 జిల్లాల్లో ఈ ప్రాజెక్టు లను చేపడతారు. ప్రస్తుతం ఉన్నవాటి సామర్థ్యం పెంచుతారు. ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రస్తుతం ఉన్న రైల్వే నెట్‌వర్క్ ‌మరో 2339 కిలో మీటర్ల మేర విస్తరిస్తుంది. అంతేకాదు చేపట్టబోయే కొత్త ప్రాజెక్టుల వల్ల ప్రస్తుత సామర్థ్యానికి అదనంగా వార్షికంగా 200 మిలియన్‌టన్నుల సరుకు రవాణా సాధ్యంకాగలదని అంచనా. దక్షిణమధ్య రైల్వే పరిధిలో రూ.7500 కోట్ల వ్యయంతో ట్రాక్‌ ‌డబ్లింగ్‌ ‌పనులు చేపడతారు. ఇందులో గుంటూరు- బీబీనర్‌ ‌సెక్షన్‌లో 239 కిలోమీటర్ల మేర డబ్లింగ్‌ ‌పనులకోసం రూ.2853.23 కోట్లు ఖర్చు చేస్తారు. అదేవిధంగా ముద్ఖేడ్‌-‌మేడ్చెల్‌, ‌మహబూబ్‌నగర్‌-‌డోన్‌ ‌సెక్షన్లలో 417.88 కిలోమీటర్ల మేర రూ.4686.09 కోట్ల వ్యయంతో డబ్లింగ్‌ ‌పనులు చేపట్టనున్నారు. గుంటూరు-బీబీనగర్‌ ‌ప్రాజెక్టును వచ్చే నాలుగేళ్ల కాలంలో పూర్తిచేయాలన్నది లక్ష్యం. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయితే తెలుగు రాష్ట్రాల్లో సరుకు రవాణా మరింత అధికంగా జరగడమే కాకుండా, రైళ్ల వేగం పెరిగి ప్రయాణసమయం గణనీయంగా తగ్గుతుంది. ఫలితంగా ఈ ప్రాంతాల్లో సామాజిక, ఆర్థికాభివృద్ధి ఊపందుకోగలదు. ఇక ఖుర్దా రోడ్‌ ‌నుంచి విజయనగరం మధ్యలో 385 కిలో మీటర్ల మేర మూడో లైన్‌ ‌నిర్మాణం చేపడతారు. ఇందుకు రూ.5618 కోట్లు ఖర్చు కాగలదని అంచనా. ఈ లైన్‌ ఆగ్నేయ రైల్వే పరిధిలోకి వస్తుంది.

నెరవేరనున్న పేదల సొంతింటి కల

పట్టణాల్లో అద్దె ఇళ్లలో కాలం గడుపుతున్న పేదలు, మధ్య తరగతి ప్రజల కోసం ప్రత్యేక పథకాన్ని తీసుకురానున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించారు. ముఖ్యంగా మురికివాడలు, అనధికారిక నివాస ప్రాంతాల్లో బతుకులీడుస్తున్న వారికి ఇది ప్రయోజనం కాగలదు. ముఖ్యంగా అటువంటివారు ఇళ్లు కట్టుకోవడానికి రుణాలు మంజూరు చేసేందుకు బ్యాంకులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. వడ్డీలేని రుణాలు సమకూర్చడం వల్ల పేదలు, మధ్య తరగతి వారికి లక్షలాది రూపాయల వడ్డీభారం తగ్గుతుంది. దీనిపై పూర్తివివరాలు తెలియాల్సి ఉంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 2015 నుంచి ప్రధానమంత్రి ఆవాస్‌ ‌యోజన అమలుచేస్తోంది. ఇందులో ప్రధానంగా నాలుగు అంశాలుంటాయి. మొదటిది లబ్ధిదారుడే ఇల్లు నిర్మించుకోవడం, రెండవది భాగస్వామ్యంతో తక్కువ ఖర్చుతో ఇళ్లనిర్మాణం, మూడవది మురికివాడల పునరాభివృద్ధి కాగా నాల్గవది రుణాలపై వడ్డీ రాయితీ కల్పించడం. నిజానికి ఈ యోజన అమలు గడువు మార్చి 31, 2022, కానీ మొదటి మూడు అంశాలకు సంబంధించి ఈ పథకం అమలును డిసెంబర్‌ 31, 2024 ‌వరకు పొడిగించారు.

ఇక నాల్గవ దాన్ని 2022, మార్చి 31 తర్వాత కూడా ప్రభుత్వం అమలు జరుపుతోంది. ఆగస్ట్ 14 ‌వరకు పీఎంఏవై-యు పోర్టల్‌ ‌ప్రకారం 1.18 కోట్ల ఇళ్లు మంజూరు కాగా, వీటిల్లో 76.25 లక్షల ఇళ్లు పూర్తయ్యాయి. ఇందుకు మొత్తం వ్యయం కేటా యింపు రూ.1.42 లక్షల కోట్లు కాగా రూ.58,868 కోట్లు వడ్డీ రాయితీకి ఖర్చు చేసింది. పేద మధ్యతరగతి వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం, పీఎం సహాయనిధి ద్వారా 50వేల కోట్లు ఖర్చు చేసింది. రూ.4 లక్షల కోట్ల వ్యయంతో పేదలకు ఇళ్లు నిర్మించి 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలు నెరవేర్చామని ప్రధాని పేర్కొనడం గమనార్హం.

మణిపూర్‌ ‌సమస్య

మణిపూర్‌ ‌రాష్ట్రంలో శాంతి నెలకొల్పేందుకు కృషి చేస్తున్నామని ప్రధాని స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రకటించారు. మణిపూర్‌ ‌ప్రజలకు దేశం యావత్తు అండగా నిలుస్తున్నదని, రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుటపడుతున్నాయ న్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమస్యకు శాంతియుత పరిష్కారం కోసం, శాంతి స్థాపన కోసం కృషిచేస్తున్నాయి. విచిత్రమేమంటే మణిపూర్‌ ‌విషయంలో కేంద్రంపై అవిశ్వాసం పెట్టిన విపక్షాలకు హోంమంత్రి అమిత్‌షా, ప్రధాని నరేంద్ర మోదీలు సహేతుకమైన రీతిలో దీటుగా సమాధానం చెప్పడంతో, తట్టుకోలేని విపక్షాలు లోక్‌సభ నుంచి వాకౌట్‌ ‌చేయడం వాటి నిస్సహాయతను వెల్లడి చేసింది. సరైన రీతిలో సంసిద్ధంగా రావాలంటూ ప్రధాని విపక్షాలకు చురకలంటించడం గమనార్హం.

మరో ఐదేళ్లలో మూడో ఆర్థిక వ్యవస్థగా..

వచ్చే ఐదేళ్లలో భారత్‌ ‌మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అమెరికా, చైనా తర్వాత మనదేశమే ఉంటుందని ప్రధాని నొక్కి చెప్పడం విశేషం. ఇదే సమయంలో ప్రపంచం మొత్తం నేడు ద్రవ్యోల్బణం గుప్పిట్లో చిక్కుకొని ఉంది. మరి అటువంటి ప్రపంచ దేశాల నుంచి వస్తువులు దిగుమతి చేసుకుంటే, వాటితో పాటు దేశంలోకి కూడా ద్రవ్యోల్బణం ప్రవేశించడం అనివార్యం. ఈ నేపథ్యంలో ద్రవ్యోల్బ ణాన్ని కట్టడి చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేసి కొంతమేర విజయం సాధించింది. అయితే ఈ స్వల్ప విజయం ప్రభుత్వానికి సంతృప్తినివ్వడం లేదు. మనదేశంలో పరిస్థితులు ప్రపంచం కంటే మెరుగ్గా ఉన్నాయని చెప్పడానికి వీల్లేదు. కానీ దేశప్రజలపై ద్రవ్యోల్బణ భారాన్ని తగ్గించడానికి మరిన్ని చర్యలను ప్రభుత్వం తప్పక తీసుకుంటుందని ప్రధాని స్పష్టంచేశారు. కరోనా నేర్పిన పాఠాల నేపథ్యంలో, మనదేశం ప్రపంచానికే దిక్సూచిగా మారింది. కరోనా సమయంలో ఎన్నో కఠిన సవాళ్లను ఎదుర్కొంటూ దేశం ముందుకు సాగింది. కొవిడ్‌ ‘ఒకే ధరిత్రి’, ‘ఒకే ఆరోగ్యం’ అన్న సూత్రాలను మనదేశం ముందుకు తెచ్చింది. ప్రపంచాన్ని మార్చడంలో భారత్‌ ‌నిర్ణయాత్మక పాత్ర పోషిస్తోంది. దేశంలో 200 కోట్ల టీకాలు ఇవ్వాలన్న బృహత్‌ ‌సంకల్పాన్ని చేపట్టినప్పుడు, ప్రపంచ దేశాలు ఇది ఎంతవరకు సాధ్యమని ప్రశ్నించాయి. కానీ అశావర్కర్లు, అంగన్‌వాడి వర్కర్లు, హెల్త్ ‌వర్కర్లు దీని సుసాధ్యం చేసి చూపారు. ఇదే మన దేశానికున్న అద్భుత శక్తి! జనఔషధి పేరుతో ప్రజలందరికీ చౌకధరలో మందులను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఇందుకు వీలుగా జనౌషధి మందుల దుకా ణాలను 10వేల నుంచి 25 వేలకు పెంచనున్నారు. జన్‌ధన్‌ ‌ఖాతాలతో పేదల బతుకుల్లో వెలుగులు నింపడమే కాదు మారుమూల గ్రామాలకు విద్యుత్‌ ‌సదుపాయం అందుబాటులోకి వచ్చింది. దేశ ప్రజలందరికి ఇంటర్నెట్‌ అం‌దుబాటులోకి వచ్చింది.

ప్రధాని ప్రసంగంలోని మరికొన్ని అంశాలు

గత పదేళ్ల కాలంలో భారత్‌ ‌సాధిస్తున్న అభివృద్ధిని, మనదేశ గొప్పదనాన్ని ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. రాబోయే కాలంలో ప్రపంచాన్ని టెక్నాలజీ శాసిస్తుంది. ఉపగ్రహ ప్రయోగాల రంగంలో మనం దూసుకుపోతున్నాం. 30 ఏళ్ల యువతే దేశానికి దిశను నిర్దేశించాలి. యువశక్తే భారత్‌కు బలం. సాంకేతిక రంగంలోనే కాదు, వ్యవసాయ రంగంలో కూడా దేశం ముందుకు దూసుకెళుతోంది. ‘డెమోగ్రఫీ, డెమోక్రసీ, డైవర్సిటీ’ దేశానికి ఎంతో ముఖ్యం. టెక్నాలజీ విషయంలో ఎంతో ముందుకెళ్లి, డిజిటల్‌ ‌దిశగా దూసుకెళుతోంది. క్రీడారంగంలో కూడా యువత ప్రపంచ వేదికల్లో తమ సత్తా చాటుతోంది. సాంకేతిక రంగంలో స్టార్టప్‌లలో మనదేశం మూడో స్థానంలో ఉంది. ఈ ఏడాది జరుగబోయే ప్రతిష్టాత్మక జీ-20 సమావేశానికి మనదేశం ఆతిథ్యం ఇచ్చే అరుదైన అవకాశం లభించింది. గతంలో స్థానిక సంస్థల అభివృద్ధి కోసం రూ.70వేల కోట్లు ఖర్చుపెడితే నేడు అది రూ.3లక్షల కోట్లకు చేరుకుంది. గతంలో నిరుపేదలకు ఇళ్ల నిర్మాణం కోసం రూ.90 వేల కోట్లు ఖర్చు చేస్తే ఇప్పుడది రూ.4 లక్షల కోట్లకు చేరింది. రైతులకు యూరియా కొనుగోలు కోసం రూ.10 లక్షల కోట్లు ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తోంది. అదేవిధంగా యువకులకు స్వయం ఉపాధి కింద కేంద్రం రూ.20 లక్షల కోట్లు ఖర్చు చేసింది. ముద్ర యోజన కింద 8కోట్ల మంది ప్రయోజనం పొందితే, వీరు మరో 8-10 కోట్ల మందికి ఉపాధి కల్పించే స్థాయికి చేరుకున్నారు. కరోనా కాలంలో దేశంలోని మధ్యతరహా పరిశ్రమలు మూతపడకుండా ఉండేం దుకు ప్రభుత్వం రూ.3 లక్షల కోట్లు ఖర్చుచేసి వాటిని బలోపేతం చేసింది. రూ.2.5 లక్షల కోట్లు పీఎం కిసాన్‌ ‌సమ్మాన్‌ ‌నిధి కింద ప్రభుత్వం జమ చేసింది. ఇవి నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. అలాగే, ప్రతి ఇంటికీ తాగునీరు అందించాలన్న ఉద్దేశంతో చేపట్టిన జల్‌ ‌జీవన్‌ ‌మిషన్‌కు మరో రూ.2 లక్షల కోట్లు ప్రభుత్వం కేటాయించింది. పశువుల వ్యాక్సి నేషన్‌ ‌కోసం రూ.15వేల కోట్లు, ఆయుష్మాన్‌ ‌భారత్‌ ‌స్కీమ్‌ ‌కింద రూ.70 వేల కోట్లు ప్రభుత్వం కేటాయిం చింది. ఇంటర్నెట్‌ ‌డేటా 2014కి ముందు చాలా ఖర్చుతో కూడి ఉండేది. కాగా ప్రపంచంలో అత్యంత చౌక ధరలో ఇంటర్నెట్‌ ‌సదుపాయం కల్పిస్తున్నది కూడా మనదేశంలోనే.

పునరుత్పాదక ఇంధన వనరులు

నేడు దేశం పునరుత్పాదక ఇంధన వనరుల కోసం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే హైడ్రోజన్‌పై ప్రధానంగా దృష్టిపెట్టింది. ఇప్పుడు మనదేశం పునరుత్పాదక ఇంధన వనరుల రంగంలో ముందుకు తెచ్చిన ‘ఒకే సూర్యుడు’, ‘ఒకే ప్రపంచం’, ‘ఒకే గ్రిడ్‌’ అనే భావనలను ప్రపంచం ఆమోదిస్తోంది. ఇదే సమయంలో అంతరిక్షంలో భారత్‌ ‌పాత్ర మరింతగా పెరుగుతోంది. సుదూర సముద్ర మిషన్‌లను కూడా దేశం చేపడుతోంది. దేశంలో రైళ్లు ఆధునికతను సంతరించుకుంటున్నాయి. వందేభారత్‌ ‌రైళ్లు ఇందులో భాగమే. నేడు ప్రతి గ్రామానికి ఇంటర్నెట్‌ ‌సదుపాయం ఉంది. ఇదే సమయంలో దేశం క్వాంటమ్‌ ‌కంప్యూటర్లపై దృష్టికేంద్రీకరించింది. నానో యూరియా, నానో డీఏపీల కోసం పరిశోధనలు సాగిస్తూనే, సేంద్రియ వ్యవసాయానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్య మిస్తోంది. పారా ఒలింపిక్స్‌లో దివ్యాంగులు కూడా సగర్వంగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే తరుణం రావాలి. ఈ నేపథ్యంలోనే దివ్యాంగులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.

గత ప్రభుత్వాలకు భిన్నం

లక్ష్యాల సాధనలో ప్రభుత్వం గతానికి భిన్నంగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా శంకుస్థాపన చేసిన పనులు పూర్తయి, ఈ ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవడం విశేషం. స్వాతంత్య్ర అమృత్‌ ‌మహోత్సవ్‌లో భాగంగా దేశంలో 75 వేల అమృత్‌ ‌సరోవర్‌ల నిర్మాణ పనులు జరుగు తున్నాయి. మానవశక్తి, జలశక్తి సామర్థ్యాలు దేశ పర్యావరణాన్ని పరిరక్షించడానికి దోహదం చేస్తాయి. 18 వేల గ్రామాలకు విద్యుత్‌ ‌సదుపాయ కల్పన, జన్‌ధన్‌ ‌ఖాతాలు తెరవడం, బాలికల కోసం మరుగు దొడ్ల నిర్మాణం వంటి కార్యక్రమాలు నిర్దేశిత గడువు కంటే ముందే పూర్తికానున్నాయి.


ప్రధాని నోట.. 6 జీ మాట

‘ప్రపంచంలోనే అత్యంత వేగంగా 5 జీ విస్తరణ దేశంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు 700కు పైగా జిల్లాలకు ఈ 5 జీ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు మనం 6 జీ కోసం సిద్ధమవుతున్నాం. పునరుత్పాదక ఇంధన వనరుల కల్పన విషయంలో 2030 లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, 2021-22 నాటికే దాన్ని సాధించాం. 20 శాతం ఇథనాల్‌తో కూడిన పెట్రోల్‌ ‌మిశ్రమ వినియోగాన్ని కూడా గడువుకు ఐదేళ్ల ముందే సాధించాం. అదేవిధంగా 500 బిలియన్‌ ‌డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని కూడా లక్ష్యానికి ముందే దాటిపోయాం. 25 సంవత్సరాల క్రితం మనకు ఒక నూతన పార్లమెంట్‌ ‌భవనం కావాలన్న చర్చ జరిగింది. ఆ కల ఇప్పుడు సాకారమైంది. సైన్యంలో వన్‌ ‌ర్యాంక్‌-‌వన్‌ ‌పెన్షన్‌ ‌విధానం అమలవుతోంది. వరుస బాంబుపేలుళ్ల సంఘటనలు ఇప్పుడు గతం. నేడు దేశంలో శాంతి సుస్థిరతలు పరిఢవిల్లు తున్నాయి. దేశంలో ఉగ్రవాద దాడులు గణనీయంగా తగ్గిపోయాయి. నక్సల్‌ ‌ప్రభావిత ప్రాంతాల్లో కూడా నేడు శాంతి నెలకొనడం గమనార్హం. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా రూపొందాలనేది ప్రతి భారతీయుడి దృఢ సంకల్పం. దీన్ని సాధించడానికి ప్రతి ఒక్కరూ కంకణబద్ధులై శ్రమించాలి’.

మహిళలే మహారాణులు

పౌర విమానయాన రంగంలో ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో పనిచేసే మహిళా పైలెట్ల సంఖ్య అధికం. చంద్రయాన్‌, ‌మూన్‌ ‌మిషన్‌లను నిర్వహిం చేది అత్యధిక సంఖ్యాకులైన మహిళా శాస్త్రవేత్తలే. అసమతుల్య అభివృద్ధి వల్ల మనదేశం విపరీతంగా నష్టపోయింది. ప్రస్తుతం ప్రాంతీయ ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకొని అన్ని ప్రాంతాల సమతుల్యాభి వృద్ధికి ప్రభుత్వం కృషిచేస్తోంది. ప్రస్తుతం దేశంలో అన్ని రంగాలూ అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయి. హైవేలు, వాటర్‌ ‌వేలు, ఎయిర్‌ ‌వేలు, రైల్వేలు, ఐ-వేలు, ఇన్ఫర్మేషన్‌వేలు, ఈ విధంగా దేశం అభివృద్ధి పథంలో పయనించని రంగాలే లేవంటే అతిశయోక్తి కాదు. గత తొమ్మిదేళ్లుగా ప్రభుత్వం తీరప్రాంతాలు, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి విశేష కృషి చేస్తోంది. ఆయా ప్రాంతాల బలోపేతం కోసం ‘పర్వత మాల’, ‘భారత్‌ ‌మాల’ వంటి సామాజిక పథకాలను అమలుచేసింది. తూర్పు భారత దేశాన్ని గ్యాస్‌ ‌పైప్‌లైన్‌తో అనుసంధా నించే కార్యక్రమం పూర్తిచేసింది. మాతృభాషలో విద్యాభ్యాసాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ దిశగా సుప్రీంకోర్టు తన తీర్పులను ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంచడం పట్ల ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. దీనివల్ల కోర్టుకు హాజరయ్యే వ్యక్తికి తీర్పులు మాతృభాషలోనే అందుబాటులో ఉంటాయి. మాతృభాషకు ప్రాధాన్యం పెరుగుతుందనటానికి ఇది తార్కాణం. ఇంకొన్ని అంశాలు మోదీమాటలలోనే..

 ‘దేశ సరిహద్దు గ్రామాల్లో ‘వైబ్రెంట్‌ ‌బోర్డర్‌ ‌విలేజ్‌’ ‌కార్యక్రమాన్ని ప్రారంభించాం. జీ-20 సదస్సుకు మనం ‘ఒకే ప్రపంచం’, ‘ఒకే కుటుంబం’, ‘ఒకే భవిష్యత్తు’ అనే అంశాలను ప్రపంచం ముందుంచాం. ఇదే ఆలోచనతో మనం ముందుకెళుతున్నాం. ‘ఇంటర్నేషనల్‌ ‌సోలార్‌ అలయెన్స్’‌ను ముందుకు తెచ్చాం. నేడు ప్రపంచంలోని ఎన్నో దేశాలు ఇందులో భాగస్వామ్యం అవుతున్నాయి. జీవవైవిధ్య ప్రాధాన్యాన్ని తెలిపేందుకు ‘బిగ్‌ ‌క్యాట్‌ అలయన్స్’‌తో ముందుకొచ్చాం. భూతాపం, ప్రకృతి విపత్తుల కారణంగా మౌలిక సదుపాయాలకు కలిగే నష్టాల నివారణకు మనం ఇంకా ఎంతో చేయాల్సి ఉంది. ఇందుకోసం సీడీఆర్‌ఐ (‌కోయ్‌లేషన్‌ ‌ఫర్‌ ‌డిజాస్టర్‌ ‌రిసైలెంట్‌ ఇన్‌‌ఫాస్ట్రక్చర్‌)‌కు రూపకల్పన చేశాం. నేడు సముద్రాలు సంఘర్షణలకు కేంద్రాలుగా మారుతున్న తరుణంలో, సముద్ర ప్రాంతాల్లో శాంతి నెలకొల్పేందుకు ‘ప్లాట్‌ఫామ్‌ ఆఫ్‌ ఓషన్స్’‌ను ఏర్పాటు చేశాం. సంప్రదాయ వైద్యానికి ప్రాధాన్యతనిచ్చే క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ)‌కు చెందిన అంతర్జాతీయ కేంద్రాన్ని మనదేశంలో ఏర్పాటు చేసేలా కృషిచేశాం. ‘యోగ’, ‘ఆయుష్‌’ ‌ద్వారా ప్రపంచ ఆరోగ్యానికి మార్గం చూపాం’’.

2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా..

‘2047 నాటికి భారత్‌ ‌వందేళ్ల స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది. నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మన త్రివర్ణపతాకం సగర్వంగా వినువీధుల్లో ఎగరాలన్నది నా ఆకాంక్ష. దీన్ని సాధించాలంటే పారదర్శకత, నిష్కాపట్యం అత్యంత అవసరం. వివిధ సంస్థలు, కుటుంబాలు, పౌరులు ఈ సాధనకు అవసరమైన బలాన్నివ్వాలి. అంతేకాదు దేశంలో 30 ఏళ్ల లోపు యువకుల సంఖ్య అత్య ధికంగా ఉండటం కూడా మనకు గొప్ప వనరుగా ఉపయోగపడుతుంది’.

ముంచేస్తున్న మూడు రుగ్మతలు

దేశం ఎదుర్కొంటున్న దుస్థితికి మూడు రుగ్మతలు ప్రధాన కారణం. మొదటిది అవినీతి. అన్ని సమస్యలకు అవినీతే మూలకారణం. అన్ని రకాల అవకాశాలను దేశం కోల్పోవడానికి ప్రధాన కారణం ఇదే. అందువల్ల ప్రతిఒక్కరూ ఈ అవినీతి నుంచి భారత్‌ను విముక్తం చేసేందుకు కృషిచేయాలి. ఇక రెండవది కుటుంబ స్వార్థం. ఈ స్వార్థమే దేశంలోని ప్రజల హక్కులను కాలరాసింది. ఇక మూడో రుగ్మత సంతుష్టీకరణ. ఇది దేశ ప్రాథమిక ఆలోచనా విధానమైన అందరినీ కలుపుకొనిపోయే జాతి లక్షణాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. ఈ రుగ్మతలకు కారకులైన వారు ప్రతి దాన్నీ ధ్వంసం చేస్తూ వస్తున్నారు. అందువల్ల మనమంతా ఈ మూడు రుగ్మతలకు వ్యతిరేకంగా గట్టిగా పోరాటం సలపాలి. దళితులు, వెనుకబడిన వారు, పస్మందా వర్గాలు, గిరిజన సోదరులు, సోదరీమణులు అంతా కలి• •కట్టుగా ఈ మూడు రుగ్మతలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలి. అవినీతి అంటేనే అసహ్యం పుట్టే వాతావరణాన్ని సృష్టించాలి. ఒంటికి పట్టిన మురికిని వదిలించుకోవడానికి ఏం చేస్తామో అదేవిధంగా సమాజాన్ని కూడా అవినీతి మురికి నుంచి శుభ్రం చేయాలి. నైపుణ్యానికి, తెలివితేటలకు, సామర్థ్యాలకు ఈ ఆశ్రిత పక్షపాతం పెద్ద శత్రువు. వీటిని పైకి రానీయదు. అందువల్ల కుటుంబ స్వార్థం నుంచి ప్రజాస్వామ్యానికి విముక్తి కలిగినప్పుడే ప్రజలకు మేలు జరుగుతుంది. సామాజిక న్యాయానికి సంతుష్టీకరణ చెరుపు చేస్తోంది. అవినీతి, సంతుష్టీ కరణ అభివృద్ధికి ప్రధాన శత్రువులు. మరి 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్‌ను చూడాలనుకుంటే, అవినీతిని సమూలంగా పెకలించి వేయాల్సిందే.

ప్రతిక్షణం దేశం కోసమే

‘2014లో నేను మార్పునకు హామీ ఇస్తూ మీ ముందుకు వచ్చాను. నన్ను నమ్మి అధికారం కట్టబెట్టారు. ‘రిఫార్మ్’, ‘‌పెర్‌ఫార్మ్’, ‘‌ట్రాన్స్‌ఫార్మ్’ ‌ద్వారా మీలో మార్పు పట్ల విశ్వాసం కలిగించాను. 2019లో మళ్లీ నన్ను ఆశీర్వదించారు. 2047 నాటి కల సాకారం కావాలంటే రాబోయే ఐదేళ్లకాలం సువర్ణావ కాశం. వచ్చే ఆగస్ట్ 15‌న ఇదే ఎర్రకోట నుంచి దేశం సాధించిన విజయాలను మీ ముందుంచు తాను. మీరంతా నా కుటుంబంలోని వారు, నేను ఈ కుటుంబంలో భాగమన్న భావనే నా ఈ శ్రమకు కారణం. నేను మీతోనే జీవిస్తాను, మీ కోసమే పోరాడతాను. దేశ స్వాతంత్య్రం కోసం త్యాగాలు చేసిన వారి ఆశీస్సులు మనపైన ఉంటాయి. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడినవారు దేశం కోసం ప్రాణత్యాగానికి వెనుకాడలేదు. కానీ నేడు మనకు ప్రతిక్షణం దేశం కోసం జీవించే అవకాశం లభించింది’.

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram