ఆగష్టు 30 రక్షాబంధన్‌

ప్రతి ఒక్కరూ తమ జీవన సమరంలో నిమగ్నమై సాగిపోతున్నపుడు ఆశయ విస్మరణ జరుగకుండా మన ధర్మ, సంస్కృతులకు ఆధారమైన విద్యను, విజ్ఞానాన్ని గుర్తుచేసేదే రక్షాబంధన్‌ ఉత్సవం. సంస్కృతి, సంప్రదాయాలకు నష్టం వాటిల్లినపుడు, మనందరం ఐక్యంగా దానికి రక్షకులమై నిలబడాలని గుర్తుచేస్తూ ‘ధర్మరక్షణలోనే నా రక్షణ కూడా ఉంద’ని కర్తవ్య బోధ చేసేదే ఈ పండుగ.

ఎవరైనా ధార్మిక క్రతువు చేస్తున్నప్పుడు తమ ముంజేతికి ఎర్రటి కంకణం కట్టుకోవడం సనాతన హిందూ ఆచారం. ఇది దీక్షాధారణ. ఈ ఎర్రటి కంకణాన్ని ధరించడం వలన ఆ వ్యక్తిలో వ్యాధి నిరోధక శక్తి పెరగడంతో పాటు అన్నిరకాల దుష్ప్ర భావాలు దరిచేరకుండా కాపాడుతుందని భావిస్తారు. ఈ కంకణ ధారణ ప్రాచీన కాలం నుంచీ ఉన్నట్లు పురాణాల కథనం. బలిచక్రవర్తికి చిరంజీవత్వాన్ని ప్రసాదిస్తూ వామనుడు ఈ పవిత్ర కంకణాన్ని (రక్షను) కట్టినట్లు ప్రతీతి. రక్షను ధరించిన వ్యక్తికి తన కర్తవ్యం పదే పదే గుర్తుకు వస్తుంది.

ఇంతటి ప్రాశస్త్యం కలిగిన రక్షాబంధన్‌ ‌పండుగ మైత్రీ భావానికి గొప్ప ప్రతీక. పాశ్చాత్య దేశాల్లో సోదర భావనను ప్రబోధిస్తారు. అయితే మన దేశంలో ఇంకాస్త ముందుకెళ్లి అందరిలో ఒకే ఆత్మను దర్శించ మని చెప్పారు మన పూర్వులు. భగవద్గీత కూడా ‘నీ పక్కవాడిని కూడా నీ వలె చూసుకో (ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యో-ర్జున సుఖం వా యది వా దుఃఖ్‌ ‌స యోగీ పరమో మతః।।, 6:32) అని బోధించింది. సోదర భావంలోనైనా కించిత్‌ ‌మాత్రం కలహాలు రావచ్చు. అందరిలో ఆత్మ ఒకటే అని గ్రహిస్తే ఈర్ష్యాద్వేషాలకు తావు లేదు. అలాంటి ఆత్మౌపమ్య స్థితిని ఈ పండుగ మనకు అలవాటు చేస్తున్నది. ఇదే ఈ పండుగ సందేశం.

వ్యక్తుల మధ్య అన్యోన్యభావం ఏర్పడినప్పుడు ఆ సమాజంలో ఐకమత్యం, సమష్టి భావన వెల్లి విరుస్తుంది. విదేశీ పాలన కింద నలిగిన మనం కాలక్రమంలో ఈ భావాన్ని మరిచాం. నేను, నీవు వేరు కాదు అనే భావన మరచి ఆ స్థానంలో నేను, నా సంపాదనే ముఖ్యమైంది. అందరితో కలిసి నేను ఎందుకుండాలి? అనే వ్యక్తివాదం పెరిగింది. ఇక అక్కడి నుండి మన సమాజంలో వికృతులు ఏర్పడి వాటి ఫలితాలను చవిచూడాల్సి వస్తున్నది. స్వాతంత్య్రం లభించి 76 సంవత్సరాలు దాటినా దేశంలో అందరికీ ఒకే చట్టాన్ని (యూసీసీ) అమలు చేసుకోలేని దుస్థితి తయారైంది. మత విశ్వాసాల చుట్టూ తిరుగుతూ ఉండే సమస్యలను పరిష్కరించా లంటే రాజకీయ సంకల్పం ఉండాలి. అవసరమైతే పార్లమెంటులో చట్టాలు చేయాలి. రాజ్యాంగాన్ని సవరించాలి. అదీ కాకుంటే కోర్టులు ఇచ్చిన ఆదేశా లను శిరసావహించాలి. మొత్తానికి పరిష్కారమైతే చూడాలి. అదృష్టవశాత్తు ఇప్పుడు జరుగుతున్నది అదే. వందేళ్లకు పైగా న్యాయస్థానాలలోనే ఉండి పోయిన అయోధ్యలో వివాదాస్పద కట్టడం, స్థల వివాదం మీద నవంబర్‌ 9, 2019‌న సుప్రీంకోర్టు తన తుది తీర్పును ప్రకటించింది. తీర్పు తమ వైపు వచ్చిందన్న భావనను గాని, అందుకు సంబరాలు చేసుకోవడం గాని హిందువులు చేయలేదు. తమకు అయోధ్య పట్ల అత్యంత బలమైన మత విశ్వాసం ఉన్నప్పటికీ ఒక సివిల్‌ ‌దావాలో గెలుపుగానే వారు భావించారు. జమ్ముకశ్మీర్‌ ‌రాష్ట్రాన్ని అదుపు చేయడం భారత్‌కు సాధ్యం కాదనుకునే పరిస్థితులు తలెత్తిన సమయంలో ఆగస్ట్ 5, 2019‌న కేంద్ర ప్రభుత్వం 370 అధికరణాన్ని రద్దు చేసింది. ఈ అధికరణమే రద్దయితే దేశం బూడిద అయిపో తుందని బెదిరించిన వారు కూడా ఉన్నారు. కానీ దాని రద్దుతో కశ్మీర్‌ ‌శాంతించింది. ప్రజలు ఆనందించారు. టీవీ చర్చలలో ముల్లాలు, హిందూ ఉదారవాదులు చెప్పినట్టు అగ్నికీలలు ఎగసిపడలేదు, సరికదా ముస్లిం మహిళలు మిఠాయిలు పంచుకుని హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు. సాధారణ ముస్లిం దీనిని స్వాగతించా డని చెప్పడానికి రుజువు – ఆ అన్ని సందర్భాలలోను దేశం ప్రశాంతంగా ఉంది. ఇదే తరహాలో రాజ్యాంగానికి పునాది, సుప్రీంకోర్టు కూడా ఇదివరకే అమలు చేయాలని ఆదేశించిన ఉమ్మడి పౌరస్మృతిని కూడా అమలులోకి తీసుకు రావాలని భారత ప్రభుత్వం సంకల్పించింది.

డాక్టర్‌ అం‌బేడ్కర్‌, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్‌, ‌జస్టిస్‌ ‌కృష్ణయ్యర్‌, ‌వైవీ చంద్రచూడ్‌, ‌జస్టిస్‌ ‌చిన్నపరెడ్డి వంటి ఎందరో ఉమ్మడి పౌరస్మృతి తక్షణావసరమని నిర్ద్వంద్వంగా వెల్లడించారు. అయినా క్షమార్హం కానంత జాప్యం జరిగింది. ఇంకా జాప్యం చేయించే ప్రయత్నం నిరంతరాయంగా జరుగుతున్నది. బీజేపీ ఏం చేసినా మతం పేరుతో అడ్డుకోవాలన్న కుట్ర ఇందులోకి వచ్చి చేరింది. కానీ యూసీసీలో కేవలం మతాన్ని చూపించడం విజ్ఞత కాదు. పైగా ఉద్దండ న్యాయనిపుణులు చెప్పిన మాట – అది స్త్రీలకు న్యాయం చేస్తుందనే. దేశ సమైక్యతను బలోపేతం చేస్తుందనే. అందరికీ సమాన హక్కులు అన్న రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టేదేననే. ఇది చరిత్రాత్మక సందర్భం. సుప్రీంకోర్టు ఆశయానికి గండి కొట్టకూడదు. ఇది ఇవాళ్టి మనందరి కర్తవ్యం కూడా.

ఒకే చట్టం పరిధిలో ఉండేలా సమాజ మన స్తత్వం రూపొందాలి. సమాన పౌరచట్టం గురించి చర్చించడం మొదలు పెట్టగానే కొందరిలో అసహనం మొదలవుతుంది. దీనిని హిందూ, ముస్లిం విభేదంగా చిత్రీకరిస్తారు. అందరికీ ఒకే చట్టాన్ని ఆమోదిస్తే అన్ని పరంపరల్లోనూ కొంతలో కొంత మార్పులు వస్తాయి. హిందువుల పరంపరల్లోనూ మార్పులు సంభవిస్తాయి. దీన్నంతటినీ దృష్టిలో పెట్టుకుని ఏదో ఒక చట్టం కోసం సమాజంలో మానసిక సంసిద్ధత తెచ్చేందుకు ప్రయత్నం జరగాలి. వాస్తవంగా దేశ ఏకాత్మతకు ఉమ్మడి పౌరచట్టం బలాన్నిస్తుంది, అది కూడా ఏకత్వం కోసమే. దానిని అమలు చేయడం ద్వారా సమాజంలో మేము వేరే వర్గం అనే భావన బలం పుంజుకోలేదు. ఈ విషయాలను మన రాజ్యాంగ ఆదేశిక సూత్రాలు ఏనాడో పేర్కొన్నాయి. దాన్ని ప్రభుత్వం ఆ దిశలో అమలు చేయాలి, చేస్తున్నది కూడా.

ఇక మణిపూర్‌ ‌విషయానికి వస్తే.. మణిపూర్‌ ‌వివాదంలో విదేశీ శక్తులు తల దూర్చాయన్నది స్పష్ట మవుతోంది. కొందరు విదేశీ మిషనరీలు ఇక్కడికి వచ్చి సమస్యను మరింత పెంచడానికి ప్రయత్నిం చారు. కానీ ప్రభుత్వంవారి ప్రయత్నాలను తిప్పి కొట్టింది. దాంతోవాళ్లు భారత్‌లో క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయంటూ ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం మొదలుపెట్టారు. కుకీ క్రైస్తవులపై మాత్రమే దాడులు జరుగుతున్న మాట వాస్తవమైతే మెయితీలకు చెందిన చర్చ్‌లపై కుకీలు ఎందుకు దాడులు చేస్తు న్నారు? అలాగే మెయితీ క్రైస్తవులు కుకీ చర్చ్‌లను తగుల బెట్టారు. దీనిని బట్టి ఇది రెండు తెగల మధ్య ఘర్షణే అని, హిందువులు,క్రైస్తవుల మధ్య గొడవ కాదని స్పష్టమవుతోంది కదా! వేర్పాటువాద సంస్థల జోక్యం ఇరువైపులా పెరిగిపోవడంతో ఘర్షణ పెరిగింది. సాధారణ ప్రజానీకం, ముఖ్యంగా మణిపూర్‌ ‌ప్రజలు, శాంతియుతంగానే జీవిస్తారు. వేర్పాటువాద సంస్థలు, కొన్ని విదేశీ శక్తుల జోక్యం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. చైనా వంటి దేశాల హస్తం కూడా ఇందులో ఉందని వార్తలు వస్తూనే ఉన్నాయి.

ఈ గొడవలకూ, ఆర్‌ఎస్‌ఎస్‌కు సంబంధం లేదని క్రైస్తవ కుకీ నాయకులు కూడా వివిధ ఇంటర్వ్యూలలో స్పష్టం చేశారు. కరణ్‌ ‌థాపర్‌ ‌వంటి జర్నలిస్టుకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో కుకీ నాయకులు ఈ విషయం చెప్పారు. ఇది రెండు తెగల మధ్య గొడవ అని, దీనికి ఆర్‌ఎస్‌ఎస్‌తో ఎలాంటి సంబంధం లేదని అటు కుకీలు, ఇటు మెయితీలు కూడా చెబుతున్నారు. అయితే కొందరు పనిగట్టుకొని మీడియాలో అలాంటి ప్రచారం చేస్తున్నారు. కానీ స్థానికులలో ఎవరూ ఈ ఆరోపణ చేయడం లేదు. పైగా ఆ రాష్ట్రంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ‌నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల పట్ల కుకీలతో పాటు మెయితీలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మణిపూర్‌లో ఉద్రి క్తతలను శాంతపరచడానికి ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్థలైన వనవాసీ కల్యాణ పరిషత్‌, ‌సేవాభారతి వంటివి అనేక చోట్ల శరణార్థ శిబిరాలను నిర్వహిస్తు న్నాయి. 270 సహాయ కేంద్రాల్లో మొత్తం 70 వేల మంది తల దాచుకుంటున్నారు. అంతేకాదు, ఈ సంస్థల ప్రతినిధులు శాంతియుతంగా సమస్య లను పరిష్కరించుకోవాలని ఇరు వర్గాలకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

యూసీసీ, మణిపూర్‌ ‌వంటి సమస్యలే కాదు. దేశంలో ఇంకా ఇలాంటివి ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇవి ఒకరోజు ఉద్యమం చేస్తేనో, ఘర్షణ లకు దిగితేనో పరిష్కారం కావు. ప్రజలలో ఒకరి పట్ల మరొకరికి ఆత్మీయతా అనురాగాలను పెంచి తద్వారా సమస్యలకు పరిష్కారం గురించి అవగాహన కల్పించి వాటిని దూరం చేయవచ్చు.

హిందూ సమాజ ఉన్నతికి ఆర్‌ఎస్‌ఎస్‌ ‌బాటలు

ఆర్‌ఎస్‌ఎస్‌ ‌గత 98 సంవత్సరాలుగా సమా జంలో మనమందరం ఒకటే అనే ఆత్మీయ భావన (ఆత్మవత్‌ ‌సర్వభూతేషు)తో పనిచేస్తున్నది. ఈ కారణంగా విదేశీ పాలన ద్వారా మన సమాజంలో ఏర్పడిన వికృతులను క్రమేపీ ఒక్కొక్క దానినీ తొల గించుకుంటూ హిందూ సమాజ ఉన్నతితో పాటు ప్రపంచశాంతికి బాటలు వేసే దిశగా సంస్థ ప్రయా ణంసాగుతున్నది. చంద్రగుప్త చాణక్యులు, మహారాణా ప్రతాప్‌, ‌భామాషాప్‌లు, శివాజీ, రామ దాసు, హరిహర విద్యారణ్యులు వంటివారు హిందూ ధర్మరక్షణ కోసం, మన ధర్మాన్ని వికసింపజేయడం కోసం పడిన కష్టాలు, వారి పోరాటాలు మనలో ఎంతో చైతన్యాన్ని కలిగిస్తాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌కూడా వారి బాటలోనే పయనిస్తోంది.

ఈ మహాపరంపరలో ఒక ఆత్మీయభావం ఏర్పడుతుంది. ‘ఈ దేశం నాది,ఈ ధర్మం నాది, ఈ చరిత్ర నాది, ప్రజలంతా నా సోదరులు’ అనే దివ్యాను భూతి కలుగుతుంది. దీని రక్షణ, పోషణ భారం, వికాస కార్యం నా పైనే ఉన్నాయనే భావన స్ఫురించి, మనల్ని కర్తవ్యోన్ముఖుల్ని చేస్తుంది. ఆ భావన స్ఫురించిననాడు ఈ మహాదీక్షలో కలిసి ప్రయాణం చేస్తున్న వాళ్లంతా నా వాళ్లు అనే భావన సహజంగా జనిస్తుంది. మనం ఒకటే. ఒకే అనుభూతులు గల సమూహం మనది. మన హృదయ స్పందన ఒకటే. మన ఐక్యతలోనే మన వికాసం ఉన్నదనే భావనే మనలో అమృతాన్నినింపి, మనం సమాజానికి సంజీ వనిగా పని చేయగల శక్తినిస్తుంది. అదే భావనతో ‘నీవు నాకు రక్ష, నీకు నేను రక్ష, మనం ఈ సమా జానికి, ధర్మానికీ రక్ష. ఈ సమాజం, ధర్మం మనకు రక్ష’ అనే గొప్ప విషయాన్ని ఈ రాఖీ పూర్ణిమనాడు మననం చేసుకోవలసిన అవసరం ఉంది.

రాష్ట్రీయ స్వయంసేవక సంఘం రాఖీ పండుగను సమాజంలో సౌభాత్ర భావనను, ఐక్యతను, ఏకీకృత శక్తిని తిరిగి పెంపొందించడానికి ఆచరింపచేస్తున్నది. ఈ పండుగ మనలో ఐక్యతను మరింత పెంపొం దించాలని, సమాజాభివృద్ధికి బాటలు వేయాలని ఆశిద్దాం.

About Author

By editor

Twitter
Instagram