ఏ కళారూపమైనా అణచివేత మీద ప్రజలలో స్పృహ కలిగించగలదు. నాటకం, బుర్రకథ, హరికథ, నృత్య ప్రదర్శన ఆ పని చేయగలవు. భక్తిరసమే ప్రధానంగా ఉండే హరికథ కూడా అలాంటి పాత్రను నిర్వహించింది. హరికథ అనే ఆ పక్రియ ద్వారా నిజాం రాజ్యవాసులలో చైతన్యం నింపిన కవి చందాల కేశవదాసు. హరికథలు చెప్పేటప్పుడు తెలంగాణలో విసునూరి దేశ్‌ముఖ్‌, ‌రజాకారులకు వ్యతిరేకంగా సందర్భానుసారంగా వ్యాఖ్యానిస్తూ వారి కంట్లో నలుసుగా మారారు. ఫలితంగా ఆస్తిపాస్తులు కోల్పోయారు. అటు సాహితీవేత్తగా, ఇటు తొలినాళ్ల టాకీల రచయితగా ప్రజ్ఞాపాటవాలు ప్రదర్శించారు. వృత్తిరీత్యా వైద్యులైనా వచ్చే అంతంత మాత్రం సంపాదనలో అత్యధిక భాగం ఆధ్యాత్మిక, గుప్తదానా లకే వినియోగించారు, చందాలవారు.

‘పరితాప భారంబు భరియింప తరమా

కటకట నేవిధి గడువంగ జాలుడు

పతి ఆజ్ఞను దాటగలనా

పుత్రుని కాపాడగలనా ।।పరి।।

ఈ విషము నేనెటులను

తనయుని ద్రావింపగలను?

ధర్మమును కాపాడుదునా?

తనయుని కావగగలనా – ।।పరి।।

(చందాల కేశవదాసు)

చందాల కేశవదాసు అష్టమూర్తి. ఎనిమిది రకాలుగా ప్రజ్ఞాశాలి. కవి, రచయిత, అష్టావధాని, హరికథా భాగవతార్‌, ‌భాగవత సప్తాహ నిర్వాహ కులు, రంగస్థల నటులు, నాటక దర్శకుడు, సినీ, నాటక రచయిత, ఆయుర్వేద వైద్యుడు. అన్నింటికీ మించి గొప్ప మానవతావాది. ఒకసారి పోలంపల్లి గ్రామంలో ‘కనకతార’ నాటకం ప్రదర్శింపజేసి, అలా వచ్చిన ఆరు వేల రూపాయలను ఆ ఊరిలో గ్రంథా లయ నిర్మాణానికి విరాళంగా ఇచ్చిన వదాన్యుడు.

తెలుగులో తొలి టాకీ చిత్రం ‘భక్త ప్రహ్లాద’కు పాటలు రాశారు. తెలంగాణాలోని ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం, జక్కేపల్లిలో జూన్‌ 20,1876‌న చందాల లక్ష్మీనారాయణ పాపయ్య మ్మల ద్వితీయ సంతానంగా కేశవదాసు జన్మించారు. లక్ష్మీనారాయణ దంపతుల మొదటి కుమారుడు వెంకట రామయ్య బ్రహ్మచారిగా జీవించారు. సాహిత్యం, కళాభిరుచిగల కేశవదాసు, ‘భక్తప్రహ్లాద, కనకతార’,‘శ్రీకృష్ణ తులాభారం’ చిత్రాలకు మాటలు, పాటలు రాశారు. ‘భలేమంచి చౌక బేరమున్‌ ‌పోయిన దొరకదు’ పాట ‘శ్రీకృష్ణ తులాభారం’ సినిమాకే వన్నె తెచ్చింది. అలాగే నాటకారంభంలో ఆలపించే సుప్రసిద్ధ కీర్తన..

‘పరాబ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానంద

పరంజ్యోతి పరాత్పర పతిత పావన స్వప్రకాశ        ।। పరా।।

వరదాయక సకలలోక వాంచిత ఫల నాప్రమేయ పాహీ

పాహీ-మాం -పాహీ – ।।పరా।।’ రాశారు.

సుప్రసిద్ధ వాగ్గేయకారుడు పాపట్ల కాంతయ్య వద్ద కేశవదాసు సంగీతంలోని మెలకువలు నేర్చు కున్నారు. గేయరచన, సంగీత కూర్పు, హరికథా గానంలో ఆరితేరారు. ఆయన 1930-33 మధ్య రాసిన జాతీయ గీతాలను నాటి ప్రముఖ సినీ గాయకుడు ఎస్‌.‌రాజేశ్వరరావు, ఆక•ల నరసింహ రావు పాడగా బెంగళూరులో రికార్డు చేశారు. హరికథా గానంతో వచ్చిన డబ్బుతో భద్రాచలంలో భక్తుల సౌకర్యార్థం బావి తవ్వించి, తిరువూరులో భోజన, విశ్రాంతి గదులను ఏర్పాటు చేశారు. కోదాడ మండలం తమ్మరలోని సీతారామచంద్రస్వామి ఆలయానికి గాలి గోపురం నిర్మించారు. కేశవదాసు సినిమాలకు రచన చేయడంతో పాటు కేశవ శతకం, బలి బంధనం, సీతా కల్యాణం, రుక్మాంగద, మేలు కొలుపు, జోలపాటలు మొదలైన రచనలు చేశారు. ఆయన ఆధ్వర్యంలో బాలభారత్‌ ‌సమాజం కనకతార, లంకాదహనం వంటి నా•కాలను ప్రదర్శించింది. ఆ తరువాత వాటిని సినిమాలుగా తీశారు.

‘శ్రీకృష్ణ తులాభారం’ సినిమాను అనేకసార్లు తీశారు. ఏ తరం వారైనా కేశవదాసు రాసిన పాటలనే వాడుకున్నారు. సురేష్‌ ‌ప్రొడక్షన్స్ ‌నిర్మాత డి.రామానాయుడు తీసిన (1966) సినిమాలో కేశవదాసు పాటలు వాడుకున్నారు కానీ పేరు వేయలేదు. దీనిపై కేశవదాసు కుమారుడు కృష్ణమూర్తి కాపీరైట్‌ ‌కింద ఖమ్మం జిల్లా న్యాయస్థానంలో దావా వేయగా శ్రీశ్రీ, దాశరథి,ఆరుద్ర సాక్ష్యం చెప్పారు. ‘‘భలే మంచి చౌక బేరము’’ ‘‘మునివరా తుదకిట్లు’’ ‘‘కొట్టు కొట్టండిరా’’ పాటలు, పద్యాలు కేశవదాసు రాసినవేనంటూ ఫిబ్రవరి 17, 1971న తీర్పు చెప్పింది.

కేశవదాసును గుప్త దాతగా చెబుతారు. తన ఇంటి నిర్మాణం కోసం దాచిన కలపను సీతారామ చంద్రస్వామి రథం తయారీకి వాడారట. సినిమా పూర్తి అయిన తరువాత కలకత్తా నుండి వస్తూండగా ఆ చిత్ర నిర్మాత కేశవ దాసు చేతిలో ఆరు వందల రూపాయలు పెట్టారట. ఆ వెంటనే తమ్మరలోని శ్రీరామునికి రెండు చామరాలు (విసన కర్రలు), గొడుగు కొనుగోలు చేసి సమర్పించారట. ఒంటిమిట్టలోని కోదండ రామస్వామి ఆలయాన్ని జీర్ణోద్ధర•ణ గావించారట. ఇలా గొప్ప రామభక్తునిగా కనిపిస్తారు.

కోదాడ దగ్గర గల తమ్మర గ్రామంలో సీతారామ చంద్రస్వామి దేవాలయంలో సప్తాహాలు ప్రారంభించి (1907లో) 108 సప్తాహాలు నిర్వహించారు. ఈ దేవాలయాన్ని తొలిసారి దర్శించినప్పుడు ఆశుకవితతో స్వామిని స్తుతించారు. ఆ దేవాలయ అర్చకుడు నరసింహాచార్యులుతో మైత్రి కుదిరింది. అక్కడే వైష్ణవ తత్వాన్ని నేర్చుకున్నారు. ఆయన్నే గురువుగా భావించి అవధానంతోపాటు అనేక సాహిత్య పక్రియలు నేర్చుకున్నారు.

దేవాలయాలలో ఉత్సవాలప్పుడు ఉత్సవ విగ్రహా లను దేవాలయం నుండి బయటకు తీసుకు వచ్చి గ్రామంలో ఊరేగించి తిరిగి దేవాలయంలో ప్రవేశ పెట్టడాన్ని ‘‘వేంచేపు’’ అంటారు. ఈ సందర్భంలో దేవాలయ అర్చకులు స్తోత్ర పాఠాలతో పాటు హెచ్చరిక పేరుతో పాటగా ఆలపిస్తారు. కేశవదాసు ఈ పక్రియను సంప్రదాయ పద్ధతిలో రాశారు.

హెచ్చరికా హెచ్చరికా / హెచ్చరికా రామ

సచ్చరితా ముని జన సం / చార హెచ్చరికా

  1. సీతామణి హృచ్చోరా / శ్రిత జన మందారా

          వాతాత్మజనుత నామా / వరదా హెచ్చరికా

  1. శాశ్వత జగదేక వీర / శాంత మయాకారా

          విశ్వంభర భారభరణ / విభవా హెచ్చరికా

  1. గాధేయ సవనరక్షకా / ఖండిత శివచాపా

          వేదాది నిఖిల సురగన / వినుతా హెచ్చరికా

  1. జనకరాజామాతా / జనక వాక్యపాలా

          వననిధి బందన సారస / వదనా హెచ్చరికా

తమ్మర, కోదాడ, హుజూర్‌నగర్‌, ‌బూరగడ్డ, సూర్యాపేట, దేవాలయాల ఉత్సవాల్లో ఈనాటికీ• గానం చేస్తున్నట్లు తెలుస్తున్నది.

సామాజిక భావాలు అధికంగాగల కేశవదాసు దేశంలోని స్వాతంత్య్రోద్యమ పరిస్థితులను బాగా ఆకళింపు చేసుకున్నారు. అందుకు తగినట్లుగానే తన మేధాశక్తితో ఉద్యమాన్ని కొన్ని దశలుగా విభజించి అహింసా పద్ధతులలో పోరాటం జరుపుతున్న వారిని తన రచనలలో ప్రశంసించారు. ‘జయతు జై’ అంటూ పాట రాసి, దానిని ఆకుల నరసింహారావు, ఎస్‌.‌రాజేశ్వరరావుతో పాడించి బెంగళూరులో సొంత ఖర్చులతో రికార్డు చేయించి విడుదల చేశారు. అనేక స్థానిక పోరాటాలలో స్వయంగా పాల్గొని ప్రజలను ఉత్తేజితులను చేశారు. తన నాటకాల్లో పాత్రలతో దేశభక్తిని బోధించే సంభాషణలు చెప్పించేవాడు.

‘‘దేశమాత దిగులేల’’ అనే దేశభక్తి గీతం (అలభ్యం) రాశారు. జిక్కేపల్లి దగ్గరగల రాజుపేటలో వెంకయ్య అనే దళితుడికి దాసుగారి హరికథలంటే అమిత ఇష్టం. అందుకోసం తిండిలేకపోయినా దూర ప్రాంతాలకైనా నడిచి వెళ్లేవాడట. ఆ విషయం తెలిసి తన ఇంటికి పిలిపించుకుని భోజనం పెట్టి ఆయన తినే వరకూ విసనకర్ర విసిరారట.

హరిదాసుగా నాటి తెలుగు సమాజంలో కేశవదాసుకు ఒక ప్రత్యేకస్థానం ఉండేది. పోలంపల్లి, దుబ్బాకపల్లి, ఖమ్మం, జక్కేపల్లి, కోదాడ, తమ్మర, జగ్గయ్యపేటలలో ఈయన హరికథకు జనాలు విపరీతంగా వచ్చేవారు. జగ్గయ్యపేటలో హరికథా గానానికి ప్రముఖ వయోలిన్‌ ‌విద్వాంసులు ద్వారం వెంకటస్వామినాయుడు వాద్య సహకారం అందించారు.

విసునూరి దేశ్‌ముఖుల గ్రామమైన కడివెండికి శివారు పల్లె సీతారాంపురం. ఇక్కడ ఆకుల వెంకయ్య గంపనెత్తిన పెట్టుకుని ఇంటింటికి తిరిగి కూరగా యలు అమ్ముకునేవాడు.అలా వచ్చిన ఆదాయంలో కొంత భాగాన్ని విసునూరి దొరకు, ఆయన గుమస్తాలకు ఇవ్వవలసి వచ్చేది. విసునూరి దేశ్‌ముఖ్‌ ‌తెలంగాణలో పరమ క్రూరుడనీ, దుర్మార్గుడనీ పేరు. అతనికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్య పరచాలని నిర్ణయించారు. ఆంధ్ర మహాసభవారు అందుకు హరికథా విశారదుడు కేశవదాసు ఏ కథ చెప్పినా మధ్యలో తెలంగాణలో జరుగుతున్న దోపిడీ విధానాన్ని, దానిని ఎదుర్కొనే మార్గాలు వివరించి ప్రజలను బాగా ఉత్తేజ పరిచేవారు. ఈ విషయం విసునూరి దేశ్‌ముఖ్‌కు తెలిసింది. అప్పటికే దేశ్‌ముఖ్‌ ‌రామచంద్రారెడ్డి మనుషులు దొడ్డి కొమరయ్యను చంపారు. సాయుధ పోరాటం మొదలైంది. మీర్‌ ఉస్మాన్‌ ఆలీఖాన్‌ ఇతేహాద్‌-ఉల్‌-‌ముస్లిమీన్‌ ‌నాయకుడు కాశీం రజ్వీకి అనధికార హక్కులను ఇచ్చాడు. వారు గ్రామాలపై పడి దోపిడీలు, మానభంగాలు, గృహ దహనాలకు యథేచ్ఛగా పాల్పడుతున్నారు. ఆంధ్ర మహాసభ సమైక్యంగా సత్యాగ్రహ పోరాటాలకు పిలుపు నిచ్చాయి. దాసు దానిలో భాగస్వాములయ్యారు.

కేశవదాసు ‘నరకాసుర వధ’ను హరికథగా చెప్ప నిశ్చయించుకున్నారు. నరకాసురుడు ఒక పెద్ద రాక్షసుడు, అతి భయంకరుడు. అయినా స్త్రీ శక్తి సమాయత్తమైతే, ప్రణాళిక ప్రకారం ఎదురు తిరిగి నిలబడి పోరాడితే ఎలాంటి వాడైనా ఓడిపోతాడు. ఈ కథ చెప్తూ స్త్రీశక్తి, వారి సహజ ఆలోచనా ధోరణి, సమైక్య పోరాటంతో రజాకారులపై తిరగబడితే తప్పక వారు కాలికి బుద్ది చెపుతారని ఉద్బోధిస్తున్నారు. అలా ప్రతీ ఊరిలోనూ నరకాసుర వధ కథ చెబుతున్నారు. ఏదో కిటుకుందని పోలీసు నిఘా పెట్టింది. ఆయన వాక్‌ ‌శుద్ధి ముందు ప్రజలు సమ్మోహితులయ్యేవారు. పోలీసులు కూడా శ్రద్ధగా వినేవారట. ఆయన రజాకారుల గురించి చెబుతున్నారనే విషయాన్ని చివరిగా గ్రహించారట. అప్పుడు చర్యలు తీసుకున్నారట.

రజాకారులు మరింత సైన్యాన్ని సమకూర్చుకుని ముమ్మరంగా దాడులు చేయడం ప్రారంభించారు. అందులో భాగంగానే 1948 జూలైలో జక్కేపల్లిలో బీభత్సం సృష్టించారు. కేశవదాసు ఇంటిని దోచుకున్నారు. ఆయన రచనా సంపద, వస్తు సామాగ్రి, ధనధాన్యాలు దోపిడీకి గురి అయ్యాయి. కట్టుబట్టలు తప్ప ఏమీ మిగల్లేదు. ఆ సంవత్సరం చివరిలో కేశవదాసు తన కుటుంబాన్ని జక్కేపల్లి నుండి ఖమ్మం మార్చారు. ఉన్న కొద్దిపాటి భూమిని నమ్మకస్తులకు అప్పజెప్పారు. అయితే ఖమ్మంలో తమ వైద్యవృత్తికి పెద్దగా అవసరం ఉండదని, ప్రజాసేవపైగల మక్కువతో ఖమ్మం దగ్గర్లో గల నాయకన్‌ ‌గూడెంలో 1950లో కాపుర పెట్టారు. ప్రజాసేవ చేస్తూ అదే గ్రామంలో 1956 మే 14న ఆయన పరమపదించారు.

– కాశింశెట్టి సత్యనారాయణ, విశ్రాంత ఆచార్యుడు

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram