వారేమనుకుంటున్నారు!?

వారేమనుకుంటున్నారు!?

కశ్మీర్‌ లోయలో యువత ఏమనుకుంటోంది? వారి మనోభావా లేమిటి? ఆర్టికల్‌ 370, కశ్మీరియత్‌, వేర్పాటువాదం, ఉగ్రవాదం, ఇస్లామిక్‌ ఉన్మాదం వంటి అంశాలపై కశ్మీరీ జనమానసం ఏమంటోంది?

తమాషా ఏమిటంటే గుప్పెడు మంది హురియత్‌ నేతలు, వేర్పాటును నమ్ముకున్న రెండు ప్రాంతీయ పార్టీలు, ఏకే 47 భుజాన మోసే ఉగ్రవాదులు, మైకులు పెట్టి మోతలు మోగించే కొందరు మీడియా వీరులు కశ్మీర్‌ గురించి మాట్లాడే గొంతుకలై పోయారు. కానీ సగటు కశ్మీరీ గుండె గొంతుక ఏమంటోంది?

కశ్మీర్‌ జన మానసంపై ‘అబ్జర్వర్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌’ అనే సంస్థ 2017 సెప్టెంబర్‌-నవంబర్‌ మధ్య ఒక విస్తత సర్వే నిర్వహించింది. బుర్హన్‌వానీ సంఘటన తరువాత ఈ సర్వే జరిగింది. ముఖ్యంగా ఉగ్రవాద, వేర్పాటువాద ప్రభావిత క్షేత్రమైన కశ్మీర్‌ లోయలో 16 నుంచి 30 ఏళ్ల వయసున్న యువకుల అభిప్రాయాలనే తెలుసుకున్నారు. కశ్మీర్‌ యూనివర్సిటీ, ఇస్లామిక్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, అవంతిపురా, సెంట్రల్‌ యూనివర్సిటీల విద్యార్థుల అభిప్రాయాన్ని ఈ సర్వేలో తెలుసుకున్నారు. ఈ సర్వే నిర్వహించినది ఐజాజ్‌వానీ అనే కశ్మీరీ పరిశోధకుడు. అంటే ఇది కశ్మీరీ యువత మనోగతం అన్న మాట. ఈ సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

కశ్మీరియత్‌ను మత మౌఢ్యం మింగేస్తున్నదా? అన్న ప్రశ్నకు కశ్మీరీ ముస్లిం యువకుల్లో 41.6 శాతం మంది అవునని సమాధానం చెప్పారు. అంటే కశ్మీర్‌ యువతలో దాదాపు సగం మంది ఇస్లామిక్‌ మత మౌఢ్యం వల్ల కశ్మీరియత్‌ ధ్వంసం అవుతోందని భావిస్తున్నారు. 31.2 శాతం మంది కాదని భావిస్తున్నారు. అంటే మూడో వంతు యువత మాత్రమే ఇస్లామిక్‌ మత మౌఢ్యాన్ని వెనకేసుకువస్తున్నారు. తమ ప్రాణమానాలకు, ఆస్తులకు రక్షణ లేనందుకే కశ్మీరీ హిందువులు శరణార్థులు కావలసి వచ్చిందని 38.2 శాతం మంది భావిస్తున్నారు. కశ్మీరీ హిందువులపై దాడులు అవాస్తవమని, ఇదంతా అప్పటి గవర్నర్‌ జగ్‌మోహన్‌ కుట్ర అని భావించేవారు 41.4 శాతం మంది. అంటే రెండింటికీ మధ్య 3 శాతం మాత్రమే తేడా. కానీ కశ్మీర్‌ నుంచి కేవలం కశ్మీరీ హిందూ శరణార్థులకు వ్యతిరేక కథనాలే వెలువడుతుంటాయి.

ఇక ప్రభుత్వ పరిపాలన విషయానికి వస్తే 63.8 శాతం మంది ప్రభుత్వ పాలన దరిద్రంగా ఉన్న కారణంగానే కశ్మీర్‌ లోయలో అశాంతికర పరిస్థితులు నెలకొన్నాయని అంగీకరిస్తున్నారు. అంతేకాదు అవినీతి వల్లే ప్రజల్లో అలజడి పెరుగుతోందని 64.4 శాతం మంది భావిస్తున్నారు. దీనర్థం జమ్మూ కశ్మీర్‌లో అవినీతి, పాలనా రాహిత్యం వల్లే అశాంతి నెలకొంటోంది. సమర్థవంతమైన పాలన ఉంటే పరిస్థితులు చక్కదిద్దవచ్చు. కేవలం 47 శాతం మంది యువతీయువకులు మాత్రమే ఆర్టికల్‌ 370 కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తుందని భావిస్తున్నారు. గమనించాల్సిన విషయం ఏమిటంటే 14 శాతం మంది ఆర్టికల్‌ 370 వల్ల మిగతా భారత దేశానికి, కశ్మీర్‌ మధ్య అగాథం ఏర్పడుతోందని, పొరపొచ్చాలు వస్తున్నాయని భావిస్తున్నారు. ఇంకొక అయిదు శాతం మంది ఆర్టికల్‌ 370 వల్ల కశ్మీర్‌లో అవినీతి పెరుగుతోందని అంటున్నారు. అంటే దాదాపు 19 శాతం మంది ఆర్టికల్‌ 370ని తమదైన కారణాలతో వ్యతిరేకిస్తున్నారు. 41.2 శాతం మంది నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పీడీపీ వంటి పార్టీలు ఆర్టికల్‌ 370ని తమ తమ స్వార్థప్రయోజనాల కోసం ఉపయో గించుకుంటున్నారని అభిప్రాయపడుతున్నారు. 5.8 శాతం మంది కశ్మీరీ ముస్లిం యువకులు ఆర్టికల్‌ 370ని రద్దు చేయాలని కోరుకుంటున్నారు.

ఈ సర్వే వల్ల స్పష్టమవుతున్నది ఒక్కటే. కశ్మీరీ యువత అవినీతి రహిత పాలనను కోరుకుంటు న్నారు. స్వచ్ఛమైన, పారదర్శకమైన, సమర్థవంతమైన పాలనను కోరుకుంటున్నారు. ఆర్టికల్‌ 370ని రాజకీయ పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారు. ఆర్టికల్‌ 370 విషయంలో కనీసం 19 శాతం మంది యువతీయువకులు పునరాలోచనకు సిద్ధంగా ఉన్నారు.

ఈ వాస్తవాన్ని రాజకీయ పార్టీలు, కుహనా సెక్యులరిస్టు మేధావులు, వేర్పాటువాదులు ఎందుకు గుర్తించడం లేదు? వారు గుర్తించరని కాదు, వారికి ఈ విషయాలు కచ్ఛితంగా తెలుసు. కానీ ఈ అభిప్రాయాలు వినిపించకుండా ఉండాలనేదే వారి తాపత్రయమంతా!!

– రాకా సుధాకర్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *