లోకాః సమస్తా సుఖినోభవంతు..’ మన సనాతన భారతీయ ధర్మంలో ఆశీర్వచన శ్లోక వాక్యం ఇది. సమస్త లోకానికి శుభం చేకూరాలని మన మహర్షులు వేల సంవత్సరాల క్రితమే కోరుకున్నారు. ప్రపంచం బాగుంటేనే, దేశం బాగుంటుంది. ప్రతిఒక్కరూ సుఖశాంతులతో జీవించాలనే విశాల భావన మన దేశానిది. ఈ సాంప్రదాయ పరంపరకు కొనసాగింపే భారత ప్రభుత్వం చేపట్టిన ‘వ్యాక్సిన్‌ ‌మైత్రి ఇన్షియేటివ్‌’ ‌కార్యక్రమం. కరోనా మహమ్మారిపై పోరులో భాగంగా భారతదేశం ప్రపంచవ్యాప్తంగా 20 దేశాలకు 22.9 మిలియన్ల డోసుల వ్యాక్సిన్‌ను అందిస్తోంది. ఇందులో 6.47 మిలియన్‌ ‌డోసులు ఉచితంగానే పంపుతోంది. అంతర్జాతీయంగా దౌత్య సంబంధాలను మెరుగుపరచుకోవడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్రమోదీ ఈ మహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు.

ప్రపంచ మానవాళి చరిత్రలోనే దారుణ అధ్యాయం ‘కరోనా మహమ్మారి’ చైనాలో పుట్టిన ఈ ప్రమాదకర కొవిడ్‌-19 ‌వైరస్‌ ‌కేవలం వారాల వ్యవధిలోనే అత్యంత వేగంగా అన్ని దేశాలకూ సోకి అతలాకుతలం చేసేసింది. 2020ను విషాద సంవత్సరంగా మార్చింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకూ 10 కోట్ల 95 లక్షల 71 వేల 327 మంది కరోనా బారినపడితే, 24 లక్షల 15 వేల 411 మంది మృత్యువాత పడ్డారు (ఫిబ్రవరి 15, 2021 నాటికి). ఇప్పటి వరకూ వచ్చిన వ్యాధులను గమనించినట్లయితే తక్కువ సమయంలో ఎక్కువ దుష్ప్రభావాన్ని చూపించింది కరోనా మాత్రమే. అయితే సంతోషకర విషయం ఏమిటంటే కేవలం ఏడాది కాలంలోనే ఈ మహమ్మారిని ఎదిరించే టీకాలను శాస్త్రవేత్తలు తయారు చేశారు.

ప్రపంచ వ్యాప్తంగా 140 ఔషధ పరిశోధనా సంస్థలు కరోనా టీకా అభివృద్ధి కోసం సిద్ధం కాగా, అందులో 11 సంస్థలు మానవ ప్రయోగాలకు అనుమతిని సంపాదించాయి. ఇందులో కొన్ని అందుబాటులోకి కూడా వచ్చేశాయి. వీటిలో ప్రముఖంగా వినిపించిన పేర్లు.. అమెరికాకు చెందిన మోడెర్నా, ఫైజర్‌-‌బయోటెక్‌, ‌బ్రిటన్‌కు చెందిన ఆక్స్‌ఫర్డ్-ఆ‌స్ట్రాజెనెకా, రష్యాకు చెందిన స్పుత్నిక్‌-‌వి, ఎపివాక్‌ ‌కరోనా, కోన్విడీసియా, చైనా- కరోనా వాక్‌, ‌బీబీఐబీపీ-కోర్వి, మన దేశానికి చెందిన భారత్‌ ‌బయోటెక్‌ ‌కంపెనీలు ఉన్నాయి.

కరోనా వ్యాక్సిన్‌ ‌కోసం అగ్రదేశాలు భారీగా పెట్టుబడి పెట్టాయి. ఈ నేపథ్యంలో టీకాలు అందుబాటులోకి వస్తే మొదట ఈ దేశాలు దక్కించుకుంటాయని, పేదదేశాలకు అంత త్వరగా అందడం కష్టమేనని ఐక్యరాజ్య సమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థలతో పాటు పలువురు విశ్లేషకులు భావించారు. వీరి అనుమానాలకు తగ్గట్టే కొన్ని కంపెనీలు వ్యాక్సిన్‌ ‌ధరను భారీగానే నిర్ణయించాయి. ముఖ్యంగా కరోనాకు పుట్టిల్లు చైనా కూడా వ్యాక్సిన్‌ ‌తయారుచేసి ప్రపంచ దేశాల మీదకు వదిలి సొమ్ము చేసుకోవాలని ఉబలాటపడింది. ఇలాంటి కష్ట కాలంలో ప్రపంచ దేశాలకు భారత్‌ ఓ ఆశాకిరణంలా కనిపించింది. ఎందుకో తెలుసా? తక్కువ ఖర్చు, నాణ్యమైన, సురక్షితమైన వ్యాక్సిన్‌ అం‌దించే సత్తా భారత్‌కు మాత్రమే ఉంది.

ఔషధాల తయారీ, ఎగుమతుల్లో అగ్రస్థానంలో ఉన్న దేశాల్లో భారత్‌ ‌కూడా ఒకటి. 2019లో భారత్‌ 201 ‌దేశాలకు జెనరిక్‌ ‌మందులు విక్రయించింది. ప్రపంచంలో వ్యాక్సిన్‌ ఉత్పత్తి, సరఫరా చేసే దేశాల జాబితాలో కూడా భారత్‌ ‌ప్రస్తుతం అగ్రభాగంలో ఉందని ఇంటర్నేషనల్‌ ‌మార్కెట్‌ ఎనాలసిస్‌ అం‌డ్‌ ‌కన్సల్టింగ్‌ (ఐఎంఎఆర్‌సీ) గ్రూప్‌ ‌నివేదిక చెబుతోంది. జనరిక్‌ ‌డ్రగ్స్, ‌వ్యాక్సిన్లను భారీ స్థాయిలో ఉత్పత్తి చేసే దేశాల్లో భారత్‌ ‌కూడా ఒకటి. ఆరు ముఖ్యమైన టీకాలతో పాటు ఇతర చిన్న టీకాల తయారీకి భారతదేశం కేంద్రంగా నిలిచింది.

భూటాన్‌కు చేరుకున్న భారత వ్యాక్సిన్‌

పోలియో, నిమోనియా, రోటావైరస్‌, ‌బీసీజీ, మీజిల్స్, ‌రుబెల్లా వంటి అనేక వ్యాధులకు టీకాలు ఇండియాలోనే తయారవుతాయి. భారత్‌ ఒక్కటే యునిసెఫ్‌కు 60 శాతం మేర వ్యాక్సిన్లు తయారుచేసి అందిస్తోంది. భారత్‌లో క్లినికల్‌ ‌ట్రయల్స్ ‌ఖర్చు తక్కువ. మిగతా దేశాలతో పోలిస్తే ఉత్పత్తి వ్యయం కూడా తక్కువే. అందుకే వ్యాక్సిన్‌ల తయారీలో మిగతా అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలతో పోలిస్తే భారత్‌కు చాలా మంచిపేరుంది. 2019 నివేదిక ప్రకారం భారత వ్యాక్సిన్‌ ‌మార్కెట్‌లో గ్లాక్సో స్మిత్‌క్లైన్‌ అతిపెద్ద కంపెనీగా ఉంది. తర్వాత స్థానంలో సినోఫీ ఎవెంటిస్‌, ‌ఫైజర్‌, ‌నోవార్టిస్‌, ‌సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇం‌డియా నిలిచాయి.

వ్యాక్సిన్ల తయారీలో మన దేశం ప్రపంచానికి పవర్‌ ‌హౌస్‌ ‌లాంటిది అయితే, అందులో హైదరాబాద్‌కు మరింతగా గుర్తింపు ఉంది. కరోనా టీకాను ప్రపంచంలో ఏ మూల అయినా తయారు చేయవచ్చు. కానీ భారత్‌ ‌సహకారం లేకుండా దానిని భారీగా ఉత్పత్తి చేయడం అసాధ్యం. ఆఫ్రికా, యూరప్‌, ఆగ్నేయాసియా, ఏ భాగంలో అయినా ప్రపంచంలోని వ్యాక్సిన్లలో 60 శాతం భారత్‌ ‌నుంచే సరఫరా అవుతున్నాయి. ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్‌ అతిపెద్ద ఉత్పత్తిదారుల్లో భారత్‌ ఒకటిగా మారింది. వ్యాక్సిన్ల ఉత్పత్తిలో భారత ఫార్మా కంపెనీలకు ఉన్న చరిత్ర కారణంగా ప్రపంచ దేశాలు భారత్‌నే ప్రధానంగా నమ్మకున్నాయి.

మన దేశంలో కరోనా వ్యాక్సిన్‌ ‌పరిశోధనల పురోగతి, వ్యాక్సిన్‌ ‌తయారీ, సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు గత ఏడాది డిసెంబర్‌ ‌మాసంలో 64 దేశాల రాయబారులు, హైకమిషనర్లు వచ్చారు. ఈ పర్యటనకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ నేతృత్వం వహించింది. వీరంతా హైదరాబాద్‌ ‌జినోమ్‌ ‌వ్యాలీలోని భారత్‌ ‌బయోటెక్‌, ‌బయోలాజికల్‌-ఇ ‌సంస్థలను సందర్శించారు. ప్రపంచంలోని వివిధ దేశాలకు అందే టీకాల్లో జీనోమ్‌ ‌వ్యాలీలోనే 33 శాతం ఉత్పత్తి అవుతున్నాయి. ఇక్కడ తయారీ ఖర్చు తక్కువ. అందుకే ప్రజలకు తక్కువ ధరకు టీకా ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉదాహరణకు రోటావైరస్‌ ‌వ్యాక్సిన్‌ ‌తయారీలో మొదటి స్థానం భారత్‌దే. విదేశాల్లో దీని ధర 65 డాలర్లు ఉంటే. ఇక్కడ ఒక డాలర్‌ ‌మాత్రమే ఉంది.

మేడిన్‌ ఇం‌డియా వ్యాక్సిన్లు

మనదేశంలో ఆరు సంస్థలు కొవిడ్‌ ‌టీకాను రూపొందించేందుకు పూనుకున్నాయి. రెండు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. ఇందులో ప్రధానమైనది భారత్‌ ‌బయోటిక్‌ ‌కంపెనీ-ఐసీఎంఆర్‌ ‌సంయుక్తంగా రూపొందించిన ‘కోవాగ్జిన్‌’; ఆక్స్‌ఫర్డ్-ఆ‌స్ట్రాజెనెకా తన ‘కొవిషీల్డ్’ ‌వ్యాక్సిన్‌ను సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇం‌డియాలో ఉత్పత్తి చేస్తోంది. భారత ప్రభుత్వం ఈ రెండు వ్యాక్సిన్ల వినియోగానికి అవసరమైన అనుమతులు ఇచ్చేసింది. దేశంలో కొత్తగా మరో 18 వ్యాక్సిన్లు సిద్ధమవుతున్నాయి.

కొద్ది వారాల క్రితం ప్రధాని మోదీ కొవిడ్‌ ‌టీకా అభివృద్ధిని పరిశీలించేందుకు హైదరాబాద్‌లోని భారత్‌ ‌బయోటెక్‌, అహ్మదాబాద్‌లోని జైడస్‌ ‌బయోటిక్‌ ‌పార్క్, ‌పుణెలోని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌లను సందర్శించారు. హైదరాబాద్‌ ‌జీనోమ్‌ ‌వ్యాలీలోని భారత్‌ ‌బయోటెక్‌ ‌ప్లాంట్‌కు వచ్చారు. ఇండియన్‌ ‌కౌన్సిల్‌ ఆఫ్‌ ‌మెడికల్‌ ‌రీసెర్చ్ (ఐసీఎంఆర్‌)‌తో కలిసి సంస్థ ఈ వ్యాక్సిన్‌ అభివృద్ధి చేస్తోంది. అక్కడి శాస్త్ర వేత్తలు టీకా పురోభివృద్దిని ప్రధాని మోదీకి వివ రించారు. వ్యాక్సిన్‌ ‌ట్రయల్స్‌లో సాధించిన పురోగతికి గాను శాస్త్రవేత్తలను మోదీ అభినందించారు.

మోదీ ప్రత్యేక చొరవ

అమెరికా, యూరప్‌ ‌దేశాలతో పోలిస్తే మన దేశంలో కరోనా తీవ్రత చాలా భయానకంగా ఉంటుందని ముందుగానే అంచనా వేశారు. అయితే సంఖ్యల విషయాన్ని పక్కన పెడితే ఇంత పెద్ద జనాభా ఉన్న దేశంలో మహమ్మారిని చాలా మేరకు కట్టడి చేయగలిగామనే చెప్పాలి. ఈ ఘనత నిస్సందేహంగా మన ప్రధాని నరేంద్ర మోదీకి ఇవ్వాల్సిందే. దేశంలో కొవిడ్‌ ‌ప్రవేశించినప్పటి నుంచి ప్రధానమంత్రి ప్రతి రోజూ పరిస్థితిని సమీక్షిస్తూ.. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు, రాష్ట్రాలకు దిశా నిర్దేశం చేస్తూ వచ్చారు. మరోవైపు దేశీయంగా రూపొందుతున్న వ్యాక్సిన్ల తయారీని కూడా స్వయంగా పరిశీలించారు.

దేశీయంగా కొవిడ్‌ ‌టీకా అభివృద్ధితో పాటు పంపిణీపై వివరించేందుకు డిసెంబర్‌ ‌మాసంలో ప్రధాని నరేంద్ర మోదీ వివిధ రాష్ట్రాల ముఖ్య మంత్రులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌ ‌చాలా చౌకధరలో నాణ్యమైన, సురక్షితమైన వ్యాక్సిన్‌ అం‌దించేందుకు సిద్ధమవుతోంది. అందుకోసమే ప్రపంచమంతా మన దేశంవైపు ఆతృతగా ఎదురు చూస్తోందని ప్రధాని తెలిపారు. ఇతర దేశాలతో పోలిస్తే వ్యాక్సినేషన్‌ ‌పక్రియలో భారత్‌కు మంచి అనుభవం ఉంది. మన ఆరోగ్య కార్యకర్తలు సమర్థంగా టీకా పంపిణీ చేయగలరు. భారత్‌కు అతి పెద్ద, మంచి అనుభవజ్ఞులతో కూడిన, పారదర్శకమైన నెట్‌వర్క్ ఉం‌దని వెల్లడించారు.

రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్‌

‌భారత్‌ ‌కన్నా ముందుగా బ్రిటన్‌, అమెరికాల్లో కొవిడ్‌ ‌వ్యాక్సినేషన్‌ ‌మొదలైంది. కానీ ఆలస్యంగా మొదలైన భారత్‌లోనే ఇది జోరుగా సాగుతోంది. మన దేశంలో అన్ని రకాల అనుమతులు పూర్తి చేసుకున్న తర్వాత ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జనవరి 16న దేశవ్యాప్తంగా కొవిడ్‌ ‌వ్యాక్సినేషన్‌ ‌ప్రారంభమైంది. చాలా పకడ్బందీగా, జోరుగా టీకాలు వేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే అమెరికా, బ్రిటన్‌ ‌కంటే ఇండియాలోనే త్వరగా వ్యాక్సిన్లు వేస్తున్నారు.

భారత్‌లో కరోనా వ్యాక్సినేషన్‌ ‌డ్రైవ్‌ ‌మొదలైన 10 రోజుల్లో 16.2 లక్షల మంది దాకా హెల్త్ ‌కేర్‌ ‌వర్కర్లకు టీకాలు వేశారు. భారతదేశంలో 6 రోజుల్లో 10 లక్షల మందికి టీకాలు ఇవ్వగా, అమెరికాలో ఇందుకు 10 రోజులు పట్టింది. బ్రిటన్‌లో 18 రోజులు పట్టింది. ఫిబ్రవరి 15 నాటికి భారత్‌లో కరోనా టీకా కార్యక్రమం కింద ఇప్పటివరకు 82,85,295 మందికి టీకాలు అందించినట్లు కేంద్రం వెల్లడించింది. ఫలితంగా భారత్‌ ‌కంటే ముందే వ్యాక్సినేషన్‌ ‌ప్రారంభించిన అమెరికా, బ్రిటన్‌ ‌కంటే భారత్‌ ‌ముందుంది.

వ్యాక్సిన్‌ ‌మైత్రి ఇన్షియేటివ్‌

ఓ ‌వైపు దేశ ప్రజలకు కరోనా వ్యాక్సిన్‌ను అందిస్తూనే, మరోవైపు ప్రపంచ దేశాలకు కూడా సరఫరా చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రశంస లందుకుంటోంది భారత్‌. ‌ప్రపంచ దేశాలన్నీ కరోనా వ్యాక్సినేషన్‌ ‌మొదలుపెట్టాయి. కొన్ని దేశాలు సొంతంగా వ్యాక్సిన్‌ను తయారు చేసుకోగా మెజారిటీ దేశాలు మాత్రం దిగుమతి చేసుకుంటున్నాయి. చాలా దేశాలు భారత్‌ ‌తయారుచేసిన వ్యాక్సిన్‌ను తీసుకునేందుకు ముందుకు వస్తున్నాయి.

వ్యాక్సిన్‌ ‌మైత్రి ఇన్షియేటివ్‌ (Vaccine Maitri initiative) పేరుతో జనవరి 21 నుంచి విదేశాలకు భారత్‌ ‌వ్యాక్సిన్లను సరఫరా చేస్తోంది. అంతర్జాతీయ దేశాలతో సత్సంబంధాల రీత్యా భారత్‌ ‌పలు దేశాలకు వ్యాక్సిన్‌ను ఉచితంగానే సరఫరా చేస్తోంది. కొన్ని దేశాలు మాత్రం వ్యాక్సిన్‌ను ధన రూపేణా కొనుగోలు చేస్తున్నాయి.

భారత్‌ ఇప్పటికే 23 మిలియన్ల డోసులు అంటే 2 కోట్ల 30 లక్షల డోసులను ప్రపంచంలోని 20 దేశాలకు పంపించింది. ఇప్పటివరకు పంపిన డోసుల్లో 6.47 మిలియన్ల డోసులను ఉచితంగా అందించగా, 16.5 మిలియన్ల డోసులను కమర్షియల్‌ ‌రూపంలో సరఫరా చేసింది. భారత్‌ ‌నుంచి గ్రాంట్ల రూపంలో వ్యాక్సిన్‌ అం‌దుకుంటున్న దేశాల్లో పొరుగు దేశాలతో పాటు, పశ్చిమ ఆసియా దేశాలు ఉన్నాయి. వాటిలో బంగ్లాదేశ్‌ (2 ‌మిలియన్ల డోసులు), నేపాల్‌ (1 ‌మిలియన్‌ ‌డోసులు), భూటాన్‌ (1,50,000 ‌డోసులు), మాల్దీవులు (1,00,000 డోసులు), మారిషస్‌ (1,00,000 ‌డోసులు), సీషెల్స్ (50,000 ‌డోసులు), శ్రీలంక (5,00,000 డోసులు), బహ్రెయిన్‌ (1,00,000 ‌డోసులు), ఆఫ్గానిస్తాన్‌ (5,00,000 ‌డోసులు), ఒమన్‌ (1,00,000 ‌డోసులు), బార్బడోస్‌ (1,00,000 ‌డోసులు), డొమినికా (70,000 డోసులు) ఉన్నాయి.

మరోవైపు కమర్షియల్‌ ‌ప్రతిపాదన వ్యాక్సిన్‌ను బ్రెజిల్‌ (2 ‌మిలియన్ల డోసులు), మొరాకో (6 మిలియన్ల డోసులు), బంగ్లాదేశ్‌ (5 ‌మిలియన్‌ ‌డోసులు), మయన్మార్‌ (2 ‌మిలియన్ల డోసులు), ఈజిప్టు (50 వేల డోసులు), అల్జీరియా (50 వేల డోసులు), దక్షిణాఫ్రికా (1 మిలియన్‌ ‌డోసులు), కువైట్‌ (2 ‌లక్షల డోసులు), యూఏఈ (2 లక్షల డోసులు) భారత ప్రభుత్వం అందజేస్తుంది. తాజాగా మెక్సికో దేశానికి 8 లక్షల 70వేల కరోనా వ్యాక్సిన్‌ ‌డోసులను భారత్‌ ‌పంపించింది. ఆఫ్రికా, లాటిన్‌ అమెరికాలోని పలు దేశాలకు కూడా త్వరలోనే మరిన్ని డోసులను పంపించబోతోంది.

భారత్‌కు ప్రపంచ దేశాల ప్రశంసలు

భారత ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు కొవిడ్‌ ‌వ్యాక్సిన్‌ను ఉచితంగా అందించడాన్ని ప్రపంచ దేశాలు ప్రశంసిస్తున్నాయి. ప్రపంచ దేశాలకు సహాయం చేసేందుకు భారత్‌ ‌తమ ఫార్మా రంగాన్ని ఉపయోగించుకోవడంపై యూఎస్‌ ‌స్టేట్‌ ‌డిపార్ట్‌మెంట్‌ అభినందించింది. లక్షల కొద్దీ వ్యాక్సిన్‌ ‌డోస్‌లను విదేశాలకు బహుమతిగా ఇవ్వడాన్ని ప్రశంసించింది. భారత్‌ ‌నుంచి వ్యాక్సిన్‌ ‌షిప్‌మెంట్‌ అం‌దిన తర్వాత బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ ‌బొల్సొనారో ఆంజనేయుడి ఫొటోతో భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. వ్యాక్సిన్లను సంజీవనిగా ఆయన అభి వర్ణించారు. కరోనా మహమ్మారి అంతానికి యావత్‌ ‌ప్రపంచం చేస్తున్న కృషికి భారత్‌ ‌నాయకత్వం వహిస్తున్న తీరు అమోఘమని బిల్‌ ‌గేట్స్ ‌ప్రశంసలు గుప్పించారు. ప్రపంచంలోనే అతిపెద్ద టీకా ఉత్పత్తి దారుగా భారత్‌ ‌నిర్ణయాత్మక చర్యను కొనసాగిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ ‌జనరల్‌ ‌టెడ్రోస్‌ అధ్నామ్‌ ‌ఘ్యాబ్రియోసిస్‌ ‌ప్రధాని మోదీని అభినందించారు.

చైనా వ్యాక్సిన్‌ ‌మీద అనుమానాలు!

కరోనా పుట్టిల్లు చైనాలో, అన్ని దేశాలకంటే ముందే వ్యాక్సిన్‌ అం‌దుబాటులోకి వచ్చింది. తమ దేశీయ అవసరాల కన్నా ఎక్కువ స్థాయిలో ఉత్పత్తి చేసి ప్రపంచ దేశాలకు సరఫరా చేసేందుకు ప్రణాళికలు సిద్ధంచేసింది. కానీ పాకిస్తాన్‌ ‌తప్ప ఏ దేశం కూడా చైనా నుంచి వ్యాక్సిన్‌ ‌దిగుమతి చేసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని సంస్థలు తమ వ్యాక్సిన్‌ల ప్రయోగ దశల వివరాలు, వాటి సమర్థతపై ఎప్పటికప్పుడు నివేదికలు వెల్లడించాయి. కానీ చైనా మాత్రం తమ వ్యాక్సిన్‌ల పనితీరుపై మాత్రం ఎలాంటి బహిరంగ ప్రకటన చేయలేదు. దీంతో వ్యాక్సిన్‌ ‌పనితీరు, సామర్థ్యంపై అక్కడి ప్రజల్లోనే అనుమానాలు వ్యక్తం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

– క్రాంతిదేవ్‌ ‌మిత్ర, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram