– డా. త్రిపురనేని హనుమాన్‌ ‌చౌదరి, ఐటి రంగ నిపుణులు, సలహాదారు

కేంద్ర ప్రభుత్వ రంగంలోని విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రయివేటీకరించాలన్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఆంధప్రదేశ్‌లో పలు కార్మిక సంఘాలు ఉద్యమాన్ని మహావేశంతో చేపట్టాయి. ఇప్పుడు కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా, ఆ నిర్ణయంలోని బాగోగులను బట్టి కాకుండా, పూర్వాపరాలతో పనిలేకుండా అధికారంలో ఉన్న పార్టీని వ్యతిరేకించే ఇతర పార్టీల సిద్ధాంతాలూ, ఆశయాలూ ఆధారంగానే నిరసనలు, ఉద్యమాలు జరుగుతున్నాయి. అందుకే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదాన్ని మరొకసారి రంగం మీదకు తెస్తూ ఆరంభమైన ఈ ఉద్యమం ఎంతవరకు సమంజసమో అంచనా వేయవలసిన అవసరం కనిపిస్తున్నది. వాస్తవాలూ, ఉచితానుచితాలూ తెలుసుకోవలసిన అవసరమూ ఒకటి ఉంది.

మొదట కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న 247 కార్పొరేషన్ల స్థితిని గమనిద్దాం. కమ్‌‌ట్రోలర్‌ అం‌డ్‌ ఆడిటర్‌ ‌జనరల్‌ (CAG) 2018-19 ‌నివేదిక ప్రకారం 77 కంపెనీలు  రూ. 1, 40, 307,55 కోట్ల నష్టాలను మూటగట్టాయి.  వీటి నికర విలువ (Networth) (-) రూ. 83,394.28 కోట్లు. ఈ 77 కార్పొరేషన్‌లలో ఆరు లిస్టెడ్‌ ‌కంపెనీలు. వీటి నికర విలువ రూ. (-)  రూ.38,860 కోట్లు. ఇందులో అగ్రగామి ఎయిరిండియా, దీని నికర విలువ రూ.(-) రూ.  24,893 కోట్లు. కేంద్ర ప్రభుత్వ కంపెనీల మొత్తం లాభంలో 73% 63 కంపెనీల ద్వారా వచ్చింది. ఆ 63 కంపెనీలలో పెట్రోలియం, లిగ్నైట్‌, ‌పవర్‌ ‌కంపెనీల నుండి ఆ లాభం వచ్చింది. ఇవి ప్రభుత్వ గుత్తాధిపత్యంలో ఉన్నాయి. వీటికి పోటీ లేదు. పెట్రోలియం, సహజ వాయువులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ కంపెనీలు 13 ఉన్నాయి. ప్రభుత్వానికి వచ్చే లాభంలో 41% ఈ 13 కంపెనీల నుంచే వస్తుంది. 157 కంపెనీలు రూ.37,312 కోట్ల నష్టాలు చూపించాయి. ఈ గణాంకాలను గమనిస్తే ప్రభుత్వరంగ సంస్థలు గుత్తాధిపత్యం ఉంటేనే లాభాలు గడించగలుగుతాయనీ ప్రయివేటు కంపెనీలతో పోటీపడితే నష్టాలలోకి వెళ్లి పోతాయనేది విశదమవుతుంది. ఈ సత్యం అందరి చేతులలో ఉన్న టెలిఫోన్‌ ‌వ్యవస్థను గమనించినట్లైతే మరింత తేలికగా అర్థమవుతుంది. ఎప్పుడైతే టెలిఫోన్‌ ‌వ్యవస్థ కేవలం ప్రభుత్వాధీనంలో  కాక, ప్రయివేట్‌ ‌కంపెనీలకు కూడా అవకాశం ఇచ్చారో, అప్పటి నుంచి ప్రభుత్వ టెలిఫోన్‌ ‌కంపెనీలు బీఎస్‌ఎన్‌ఎల్‌,ఎం‌టీఎన్‌ఎల్‌  ‌నష్టాల ఊబిలో కూరుకుపోయి, జీతాలు ఇవ్వలేని స్థితికి దిగజారాయి.

ప్రభుత్వం ఇన్ని కంపెనీలను స్థాపించడం ఒకప్పుడు నిర్వివాదంశంగానే చూశారు. స్వాతంత్య్రం వచ్చిన మొదటి 25 సంవత్సరాలలో దేశంలో పారిశ్రామికాభివృద్ధికీ, ఉపాధి కల్పనకూ కావలసిన పెట్టుబడులు ప్రయివేటు రంగం నుంచి రాలేదు. అభివృద్ధికి, పరిశ్రమల స్థాపనకు, వాటి నిర్వహణకు కావలసిన శాస్త్రసాంకేతిక నిపుణులు, ఇంజనీర్లు, నిర్వహణా నిపుణులు తగు సంఖ్యలో ఆనాడు లేరు. ఈ విషయాలలో ఎంతో కొంత సామర్థ్యం కలిగినవారు ప్రభుత్వ ఉద్యోగులే. అందుకే కేంద్ర ప్రభుత్వం, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పారిశ్రామికాభివృద్ధికీ, వాణిజ్యానికీ వందల కొలది కంపెనీలు స్థాపించాయి. అప్పటి పరిస్థితులలో దీనికి ప్రత్యామ్నాయం లేదు. కానీ, 1975 తరువాత నుంచి దేశంలో శాస్త్రసాంకేతిక నిపుణులు, ఇంజనీర్లు, నిర్వహణా నిపుణులు  కావలసినంతమంది, వేలకొలదీ కళాశాలల నుంచి తయారవుతూ వచ్చారు. దేశ అవసరాలకు మించి వీరు వస్తున్నారు. అమెరికా, యూరప్‌ ‌దేశాలకు కూడా వారు పెద్ద సంఖ్యలో వెళుతున్నారు. పీవీ నరసింహారావు పుణ్యమా అని 1992 నుంచి సరళీకృత ఆర్థిక విధానం అమలులోకి వచ్చింది. దేశ సంపత్తి, సంపద ఘనంగా పెరుగుతోంది. అందువల్ల పెట్టుబడుల కొరత బాగా తగ్గింది. ప్రయివేటు కంపెనీలు వేల సంఖ్యలో ప్రతి రంగంలోనూ పుట్టుకు వచ్చాయి. ప్రభుత్వరంగ సంస్థలలో నిష్ణాతులైనవారు తమ అనుభవాన్ని ఉపయోగించుకుని ప్రయివేటు రంగంలో కంపెనీలు  ప్రారంభించారు.  దీనికి సాక్ష్యం హైదరాబాద్‌లో ఐడిపిఎల్‌. ‌ప్రభుత్వరంగ సంస్థలో ఎదిగిన సైంటిస్ట్‌లు ప్రయివేటు రంగంలో ఫార్మసి కంపెనీలు పెట్టారు. అదేవిధంగా ఐటీ రంగంలో, ఇతర రంగాలలో వందల కొలది అద్భుతమైన కంపెనీలు పుట్టుకొచ్చి, ప్రపంచ స్థాయిలో ఖ్యాతిని ఆర్జిస్తున్నాయి.

సారాంశం : స్వాతంత్య్రం వచ్చిన మొదటి 20-25 ఏళ్లలో తగిన సంఖ్యలో మేధావులను ఉత్పత్తి చేసిన భారతదేశం ప్రభుత్వరంగ సంస్థలలోనే కాక ప్రయివేటు రంగంలో మంచి కంపెనీలు స్థాపించి, వివిధరకాల ఉత్పత్తులు చేస్తూ, లక్షల, కోట్లమందికి ఉపాధి కల్పించే సామర్థ్యాన్ని పెంచుకుంది. ఒకప్పటి అత్యవసర పరిస్థితులలో స్థాపించుకున్న ప్రభుత్వరంగ సంస్థలు, ప్రయివేటు రంగ సంస్థలతో పోటీపడలేక, నష్టాల ఊబిలో కూరుకుపోతున్నాయి.

ఇక ఉక్కు రంగాన్నీ పరిశీలిద్దాం. భారతదేశంలో పప్రధమంగా ఉక్కు ఉత్పత్తి చేసిన ఘనత నాటి బ్రిటిష్‌ ‌ప్రభుత్వానికి గాని, స్వాతంత్య్రానంతర తొలి ప్రభుత్వాలకు గాని దక్కదు. భారతదేశంలోని జంషెడ్‌పూర్‌లో మొదటిసారి ఉక్కు కర్మాగారాన్ని టాటాలే స్థాపించారు. తరువాత మైసూర్‌ ‌ప్రభుత్వం (నేటి కర్ణాటక) ఆధ్వర్యంలో, సర్‌ ‌మోక్షగుండం విశ్వేశ్వరయ్య దూరదృష్టితో భద్రావతి స్టీల్‌ ‌ఫ్యాక్టరీ ఆవిర్భవించింది. ఆ తరువాతే కేంద్ర ప్రభుత్వ అధీనంలో రౌర్కేలా, దుర్గాపూర్‌, ‌బొకారో, విశాఖ ఉక్కు కర్మాగారాలు ఆరంభమైనాయి. ఇక్కడ ఒక్కమాట గుర్తుచేసుకోవాలి. టాటా స్టీల్‌ ‌కంపెనీ ఆది నుంచి, అంటే ఒక శతాబ్దం నుంచీ లాభాలతోనే నడుస్తోంది.

2020-అక్టోబర్‌ -‌డిసెంబర్‌ ‌త్రైమాసికంలో టాటా స్టీల్‌ ‌రూ. 4000 కోట్లకి పైగా లాభాలు గడించింది. మరే ఇతర ప్రయివేట్‌ ‌స్టీల్‌ ‌కంపెనీకి నష్టం రావడం లేదు. మరి ప్రభుత్వరంగంలోని ఉక్కు సంస్థలే ఎందుకు నష్టాలను అనుభవిస్తున్నాయి? కేప్టివ్‌ ‌మైన్స్ (ఒక సంస్థ కోసమే ఉద్దేశించిన గనులు) ఉన్న ప్రభుత్వ స్టీల్‌ ‌కంపెనీలు కొన్ని నష్టాలలో ఎందుకు  ఉన్నాయి? ఒకప్పుడు కేప్టివ్‌ ‌మైన్స్  ‌లేకపోయినా, నవరత్నాలలో ఒకటిగా రాణించిన విశాఖ స్టీల్‌ ఎం‌దుకు నష్టాలలోకి పోతోంది? ఇలా నష్టాలలోకి పోతుంటే, నష్టాలను నివారించడానికి తీసుకున్న చర్యలేమిటి? తీసుకున్నా కూడా అవి ఎందుకు విఫలమయినాయి? ఈ విషయాన్నే వెల్లడించవలసిన బాధ్యత కంపెనీది కాదా? కేవలం ప్రభుత్వాన్ని విమర్శించడంతోనే సరా?

విశాఖ ఉక్కులో 20,000కి పైగా శాశ్వతోద్యోగులు, 18వేలకి పైగా కాంట్రాక్టు శ్రామికులు ఉన్నారు. ఇంత సంఖ్యలో ఉన్నా, వారి ఉత్పాదకత ఎంత? ఇంత ఉత్పత్తికి ప్రైవేటు కంపెనీలలో ఎంతమందిని వినియోగించు కుంటున్నారు? విశాఖ ఉక్కుకు కేప్టివ్‌ ‌మైన్స్ ఇస్తే లాభాలు గడించగలదా? ఆంధప్రదేశ్‌ ‌ప్రభుత్వం కడపలో స్టీల్‌ ‌ఫ్యాక్టరీ పెట్టాలని ఉబలాటపడుతోంది కదా! ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు  ధైర్యోత్సాహంతో,  కేంద్ర ప్రభుత్వం పెట్టకపోతే పోయింది, నా రాష్ట్ర ప్రభుత్వమే కడపలో స్టీల్‌ ‌ఫ్యాక్టరీ నిర్మిస్తుందని భూమిపూజ కూడా చేశారు. తరువాత వచ్చిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అంతకన్నా రెట్టింపు ఉత్సాహంతో మరోసారి కడప స్టీల్‌ ‌ఫ్యాక్టరీకి భూమిపూజ చేశారు. ఇంత ధైర్యం, సాహసం, సమర్థత ఉన్న రాష్ట్ర ప్రభుత్వం విశాఖ స్టీల్‌ ‌ప్లాంట్‌ని కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు బదిలీచేయని అడగకూడదా? ఇతర ఫ్యాక్టరీలకు కేప్టివ్‌ ‌మైన్స్ ఇచ్చినట్టుగా మాకు కూడా ఇవ్వమని అడిగి సాధించవచ్చు కదా? ధర్మపోరాటాలు, నిరుపమానమైన సంక్షేమ పథకాలు చేపట్టిన ఆంధప్రదేశ్‌ ‌ప్రభుత్వం, ఆ పార్టీల నాయకులు, తమ సామర్థ్యాన్ని నిరూపించడానికి విశాఖ స్టీల్‌ ‌ప్లాంట్‌ని తమకు ఇవ్వవలసిందని ఉద్యమించివచ్చు కదా?

మంచి సందర్భం కాబట్టి కార్మిక సంఘాల సామర్థ్యాన్ని కూడా పరిశీలిద్దాం. ప్రభుత్వ అసమర్థతను, యజమాన్యం నిర్లిప్తతను సతతం విమర్శిస్తున్న కార్మిక సంఘాల వారి మహానేతల ఒక ప్రతిజ్ఞ చెయ్యాలి. ‘‘ఈ ఉక్కు కర్మాగారాన్ని  మాకు అప్పగించండి, కేప్టివ్‌ ‌మైన్స్ ఇవ్వండి. మేము ఈ కంపెనీని నిర్వహిస్తాం, లాభాల బాటలోకి తీసుకువస్తాం’’ అని చెప్పవచ్చు కదా? బాధ్యత, సమర్థత, ఆత్మవిశ్వాసం ఉన్న కార్మిక సంఘాల నాయకులు కలసి కేంద్ర ప్రభుత్వానికి   సవాల్‌తో కూడిన ఈ హామీ ఇవ్వవచ్చు కదా!

చివరిగా, సోషలిజానికి కట్టుబడిన చైనా, వియత్నాం చివరకు క్యూబా కూడా ప్రభుత్వరంగ సంస్థలకు పోటీగా ప్రైవేటు రంగ సంస్థలను తీసుకువచ్చి, క్రమేపీ తమ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్నారు. పోటీ తత్త్వాన్ని పెంచుతున్నారు. సమర్థత పెరిగే కొద్దీ ఒకనాటి సిద్ధాంతాలూ, ప్రణాళికలూ ఎల్లకాలం ఉండేటట్లు చేస్తే, దేశానికీ, ప్రజలకూ నష్టమే వాటిల్లుతుంది. కాలాన్ని బట్టి పెరుగుతున్న విజ్ఞానాన్ని బట్టి సమాజంలో, ప్రభుత్వ స్థితులలో మార్పులు వస్తాయి. ఆ మార్పులను అడ్డకుంటే అరిష్టమే తప్ప ప్రయోజనం ఉండదు. ఇలాంటి దృక్పథంతోనే చైనా కమ్యూనిస్టు పార్టీ సైతం కమ్యూనిజానికీ•, సోషలిజానికీ• తన దేశీయమైన భాష్యం చెబుతూ, ఆర్థిక పారిశ్రామిక, వ్యవస్థను తీర్చిదిద్దుకుంటున్నది.

About Author

By editor

Twitter
YOUTUBE