– రాజనాల బాలకృష్ణ, సీనియర్‌ ‌జర్నలిస్ట్

‌విశాఖ ఉక్కు (రాష్ట్రీయ ఇస్పాత్‌ ‌నిగం లిమిటెడ్‌- ఆర్‌ఎస్‌ఎన్‌ఎల్‌) ‌లాభాల్లో నడుస్తోందా, నష్టాల్లో నడుస్తోందా? సంస్థ నుంచి ప్రభుత్వ వాటాల ఉపసంహరణ లేదా ఆందోళనాజీవులు ముద్దుగా పిలుచుకుంటున్న ప్రైవేటీకరణ మంచిదా, ప్రభుత్వ రంగంలో కొనసాగించడం మంచిదా? వంటి విషయాలు కాసేపు పక్కనపెట్టి ఆలోచిస్తే ఇదొక నిరాధారమైన ఆందోళన. ఎందుకంటే, అసలు ఆర్‌ఎస్‌ఎన్‌ఎల్‌లో ప్రభుత్వ వాటాల ఉపసంహరణ గురించి గానీ, ప్రైవేటీకరణ ప్రతిపాదన గురించి గానీ కేంద్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయినా ఆలూ లేదు, చూలూ లేదు కొడుకు పేరు అదేదో అన్నట్లుగా ఎర్రజెండాలు, అధికార, ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కును అమ్మేస్తోందని ప్రజల్లో సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి రాజకీయ దురుద్దేశంతో బీజేపీ లక్ష్యంగా ఆందోళనలు చేస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న సమయంలో రాష్ట్రాన్ని పాలించిన, పాలిస్తున్న ప్రాంతీయ పార్టీల అరాచక పాలన నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు కలిసి ఆడుతున్న నాటకం విశాఖ ఉక్కు ఆందోళన. ఈ ఆందోళనల అసలు లక్ష్యం విశాఖ ఉక్కు పరిరక్షణ కాదు, ప్రాంతీయ, కుటుంబ పార్టీల పరిరక్షణ అనేది నిజం.

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ 2021-22 ‌బడ్జెట్‌లో ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ ప్రతిపాదన చేశారు. ఇందులో దాచింది ఏమీ లేదు. బడ్జెట్‌ ‌ప్రసంగంలో నిర్మల చెప్పిన మాటలను జాగ్రత్తగా గమనిస్తే ఎక్కడా విశాఖ ఉక్కు గురించి ప్రస్తావించలేదు. నిజానికి విశాఖ ఉక్కు పేరునే కాదు, ఎప్పటినుంచో ఆందోళనాజీవులు అదేపనిగా ఆందోళన చెందుతున్న జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) సహా దేశంలోని మరే ఇతర ప్రభుత్వ రంగ సంస్థ పేరును ఆమె ప్రస్తావించలేదు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో నాన్‌ ‌స్ట్రాటజిక్‌ ‌పబ్లిక్‌ ‌సెక్టార్‌ అం‌డర్‌టేకింగ్స్ (‌వ్యూహాత్మక ప్రభుత్వరంగ సంస్థ)ల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా 2 లక్షల 75 వేల కోట్ల రూపాయలు సమకూర్చుకోవాలనే ప్రతిపాదనను మాత్రమే సభ ముందుంచారు. అంతేగాని, ఫలాన ప్రభుత్వరంగ సంస్థ నుంచి ఇంత మొత్తంలో పెట్టుబడులను ఉపసంహరించుకుంటామనే ప్రతిపాదన ఏదీ ఆమె ప్రసంగంలో లేదు. దేశంలో మొత్తం 340 ప్రభుత్వ రంగ సంస్థలుంటే అందులో 300 వరకు నాన్‌ ‌స్ట్రాటజిక్‌ ‌సంస్థలున్నాయి. అందులో పెట్టుబడుల ఉపసంహరణకు ఎంపిక చేసిన సంస్థలు ఎన్ని ఉన్నాయో, అవేవో ఎవరికీ తెలియదు. ఒకవేళ ఆర్థికమంత్రి అలాంటి ప్రతిపాదన చేసినా అది బడ్జెట్‌ ‌ప్రతిపాదన మాత్రమే. బడ్జెట్‌ ఇం‌కా పార్లమెంట్‌ ఆమోదం పొందలేదు. ఆందోళనాజీవులకు నిజంగా విశాఖ ఉక్కు పరిరక్షణే ప్రధానమైతే రాజ్యసభ, లోక్‌సభల్లో తమ వాదనను బలంగా వినిపించవచ్చు. కానీ అలా చేయకుండా వీధుల్లో వీరంగం వేయడం ఎందుకో, ఎవరి కోసమో వేరే చెప్పనక్కర లేదు.

బడ్జెట్‌ ‌ప్రతిపాదన అనంతరం నిర్మల వాటాల ఉపసంహరణ పక్రియకు సంబంధించి కొంత వివరణ కూడా ఇచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థలలో వాటాల ఉపసంహరణ ఇలా అనుకుంటే అలా జరిగిపోదని.. అనేక వడపోతలు, సాధ్యాసాధ్యాలు చూసుకున్న తర్వాతనే అంతిమ నిర్ణయం ఉంటుందని వివరించారు. అయినా, దేశ వ్యతిరేక ఫోబియాతో బాధపడుతున్న ఆందోళనా జీవులు, అరాచకశక్తులు సెంటిమెంట్స్‌ను రెచ్చగొట్టే విధంగా ఆందోళన చేస్తున్నాయి.

నిజమే, విశాఖ ఉక్కు ఒక పరిశ్రమ మాత్రమే కాదు. తెలుగు ప్రజల స్వాభిమాన ఆకాంక్షకు, ఆత్మగౌరవానికి ప్రతీక. ఉభయ తెలుగు రాష్ట్రాలలోనే కాదు, దేశ విదేశాల్లో ఉన్న తెలుగువారందరికీ విశాఖ ఉక్కుతో ఒక విడదీయరాని బంధం ఉంది. 1960 ద్వితీయార్ధంలో మొదలైన ఉద్యమంలో ఉమ్మడి ఆంధప్రదేశ్‌లోని మూడు ప్రాంతాల ప్రజలు, ముఖ్యంగా యువత పాల్గొన్నారు. ‘విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు’ అనే నినాదంతో పెద్దఎత్తున ఆందోళనలు చేశారు. సుదీర్ఘకాలం పాటు జరిగిన ఈ ఆందోళనలో ముప్ఫయికి పైగా యువకులు ప్రాణత్యాగం చేశారు.

విశాఖ ఉక్కు ప్రస్థానాన్ని గమనిస్తే.. 1960వ దశకం ద్వితీయార్ధంలో ఉద్యమం మొదలైతే.. 1970 ప్రథమార్ధంలోగానీ అప్పటి ప్రధాని ఇందిరా ప్రభుత్వం దిగిరాలేదు. ఈలోగా అమృతరావు ఆమరణ నిరాహార దీక్ష, విద్యార్థుల బలిదానాలు, రాజకీయ రాయబారాలు, బేరసారాలు చాలా జరిగాయి. ఇందిరా ఆమోదం తెలిపినా ప్రాజెక్ట్ ‌నిర్మాణం 1980లలో గానీ ప్రారంభం కాలేదు. అటు తిరిగి ఇటు తిరిగి 1990లలో పీవీ నరసింహరావు చేతుల మీదుగా ఉక్కు ఉత్పత్తి ప్రారంభమైంది. అంటే, విశాఖ ఉక్కు పరిశ్రమ నుంచి ఉక్కు బయటకు రావడానికి సుమారు పాతికేళ్లకు పైగానే పట్టింది. ఉత్పత్తి ప్రారంభం అయిన తర్వాత అయినా పరిశ్రమ ప్రస్థానం సాఫీగా సాగిందా, అంటే అదీ లేదు. మూడు పదుల ప్రస్థానంలో కనీసం మూడుసార్లు మూత దాకా వెళ్లి  ప్రభుత్వాల చొరవతో బయటకు వచ్చింది. అదీగాక, విశాఖ ఉక్కు వాస్తవ రూపం దాల్చే సమయానికి భారత తొలి ప్రధాని జవహర్‌లాల్‌ ‌నెహ్రూ సోవియట్‌ ‌రష్యా ఆదర్శంగా చేపట్టిన ప్రభుత్వరంగ పారిశ్రామిక విధానంలోని డొల్లతనం బయటపడింది. చాలావరకు ప్రభుత్వ రంగ సంస్థలు తెల్ల ఏనుగులుగా, ఖజానాకు భారంగా మారాయి. ఈ నేపథ్యంలోనే అప్పటి ప్రధాని పీవీ నరసింహరావు ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. నెహ్రూ విధానాలను పక్కకు నెట్టి పబ్లిక్‌, ‌ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే విధంగా సరళీకృత ఆర్థిక విధానాలను అమలు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చి, పోయిన ప్రభుత్వాలన్నీ కూడా ప్రభుత్వరంగ సంస్థల పోషణ భారాన్ని తగ్గించుకుని సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా అడుగులు వేస్తున్నాయి. ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వానికి ముందు పదేళ్లు సోనియా డైరెక్షన్‌లో దేశాన్ని పాలించిన ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ‌ప్రభుత్వం, అదే విధంగా ఆంధప్రదేశ్‌ ‌సహా ఇతర రాష్ట్రాలలో అధికారంలో ఉన్న ప్రాంతీయ, కుటుంబ పార్టీలు ఓటుబ్యాంకు రాజకీయాలకు ఆర్థికవ్యవస్థను బలిచ్చాయి. దేశ భవిష్యత్‌ను పణంగా పెట్టి బుజ్జగింపులు, తాయిలాలతో దేశాన్ని అమ్మయినా అధికారాన్ని నిలుపుకునేందుకు సిద్ధమయ్యాయి. అదే పంథాలో ప్రస్తుతం ఆంధప్రదేశ్‌లో రాజకీయాలు సాగిస్తున్న టీడీపీ, వైసీపీలు విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ పేరిట వామపక్ష పార్టీలను, విశాఖ ఉక్కు విషాద చరిత్రకు మూలకారణం అయిన వామపక్ష కార్మిక సంఘాలను వెంటేసుకుని ఆందోళన పేరిట అరాచకాన్ని సృష్టిస్తున్నాయి.

ఆంధప్రదేశ్‌ ‌ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఒకరు పేర్కొన్నట్లుగా.. స్పష్టమైన ప్రణాళిక, ఆర్థిక వనరులు, ముడి పదార్థాల లభ్యత (ఇంతవరకు విశాఖ ఉక్కుకు ముడి ఇనుమును సరఫరా చేసే సొంతగనులు లేవు. సంస్థ మనుగడ పదే పదే ప్రశ్నార్ధకం కావడానికి ఇది కూడా ఒక కారణం) అన్నిటినీ మించి చిత్తశుద్ధి లేకుండా సెంటిమెంట్‌ ‌లేదా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ప్రారంభించే ప్రభుత్వ రంగ, ఆ మాటకొస్తే ప్రైవేటు రంగ పరిశ్రమ అయినా మనుగడ సాగించడం అయ్యే పని కాదు. అందుకే.. ఎన్నేళ్లు అయినా, ఎంతగా ఆక్సిజన్‌ అం‌దించినా విశాఖ ఉక్కుతో పాటుగా అనేక ప్రభుత్వ రంగ సంస్థలు తెల్లఏనుగుల ముద్ర నుంచి బయటకు రాలేకపోతున్నాయి. అలాగే, ఒక పరిశ్రమ స్థాపనలో విపరీత జాప్యం, అవకతవకలు చోటుచేసుకుంటే ఇక అంతే సంగతులు. అందుకు విశాఖ ఉక్కు ఒక సజీవ ఉదాహరణ. అయితే, విశాఖ ఉక్కు పరిరక్షణ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయం అయినా ఆర్థిక అంశాలతో పాటుగా, ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవడం అవసరం. అదేవిధంగా, రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలగకుండా చూసుకోవలసిన బాధ్యత కూడా కేంద్రంపై ఉంటుంది.

సత్యం గడప దాటేలోగా అసత్యం ప్రపంచాన్ని చుట్టి వస్తుందంటారు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. అది కూడా ఒక్క ఆంధప్రదేశ్‌లో, విశాఖ ఉక్కు విషయంలోనే కాదు, దేశమంతటా అరాచక శక్తులు అదే ప్రయత్నంలో ఉన్నాయి. కుట్రలు, కుతంత్రాలు సాగిస్తున్నాయి. దేశాన్ని అప్రతిష్ట పాల్జేసేందుకు దేశ, విదేశీ అరాచక శక్తులు అన్నీ ఏకమయ్యాయి. ఇందులో మరింత విషాదం ఏమంటే జాతీయ పార్టీలుగా చెప్పుకుంటూ ప్రాంతీయ, ఉప ప్రాంతీయ పార్టీలకు తోక పార్టీలుగా మనుగడ సాగిస్తున్న కాంగ్రెస్‌, ‌కమ్యూనిస్ట్ ‌పార్టీలు; రోజురోజుకు ఉనికిని, విశ్వాసాన్ని కోల్పోతున్న ప్రాంతీయ పార్టీలు అసత్యాన్ని ఆయుధంగా చేసుకుని దేశంలో అరాచకాన్ని సృష్టించే ప్రయత్నాలను ప్రోత్సహిస్తున్నాయి. అరాచక శక్తులతో చేతులు కలిపి రాజకీయ ప్రయోజనాలకు అర్రులు చాస్తున్నాయి.

ఒక దాని వెంట ఒకటిగా ఆ ప్రయత్నాలు విఫలమవుతూనే ఉన్నాయి. రఫేల్‌ ‌యుద్ధవిమానాల కొనుగోలు విషయంలో రాహుల్‌గాంధీ సాగించిన అసత్య ప్రచారం గత లోక్‌సభ ఎన్నికల్లో ఎలాంటి ఫలితం చూపిందో వేరే చెప్పనక్కర లేదు. అప్పటికే ఐసీయూలో ఉన్న కాంగ్రెస్‌ ‌పార్టీని రాహుల్‌ ‌సాగించిన అసత్య ప్రచారం దెబ్బ దింపుడు కళ్లెం వరకు తీసుకుపోయింది. అయినా ఆయన అసత్యాన్నే ఆయుధంగా చేసుకున్నారు. వ్యవసాయ చట్టాల విషయంలో చెప్పిన అబద్ధాన్నే మళ్లీ మళ్లీ చెపుతూ అసత్య ప్రచారాన్ని సాగిస్తున్నారు.

గతంలో దేశ రాజధాని ఢిల్లీలో సాగిన షాహిన్‌బాగ్‌ ఆం‌దోళన, ప్రస్తుతం అదే ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల పేరిట మధ్య దళారీలు, రాజకీయ బేహారులు, దేశవ్యతిరేక ఉగ్రవాద సంస్థలు ఉమ్మడిగా సాగిస్తున్న ఆందోళనల తీరుతెన్నులను, ఇప్పుడు రాష్ట్రంలో సాగుతున్న విశాఖ ఉక్కు ఆందోళన స్వరూప, స్వభావాలను పరిశీలిస్తే జెండాలు, నినాదాలు వేరైనా అందరి ఎజెండా ఒక్కటేనని స్పష్టమవుతుంది. అలాగే, అసత్యమే అందరి ఆయుధం. అసత్య ప్రచారం ఆధారంగానే ఆందోళనలు సాగుతున్నాయి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఈ ఆందోళనలన్నీ బుద్ధిజీవులుగా చలామణి అవుతున్న ఆందోళనాజీవులు. ఇవి దేశ వ్యతిరేక, అరాచక, వేర్పాటువాద శక్తులతో చేతులు కలిపి సాగిస్తున్న ఆందోళనలే తప్ప మరొకటి కాదు. వీరందరి లక్ష్యం ఒక్కటే. దేశంలో అల్లర్లు సృష్టించి జాతీయవాదాన్ని పలచన చేయడం. జాతీయవాదాన్ని ధైర్యంగా, ధృడంగా ముందుకు తీసుకుపోతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాకర్షణను పలచన చేయడం. ఇందుకు కారణం లేకపోలేదు. జాతీయంగానే కాదు, అంతర్జాతీయంగా కూడా మోదీ ప్రతిష్ట పెరుగుతోంది. మరోవైపు జాతీయవాద భావజాల వ్యాప్తి వేగంగా సాగుతోంది. దానితో పాటు, మోదీ పట్ల భారత ప్రజల విశ్వసనీయతను ప్రపంచ దేశాలు గుర్తిస్తున్నాయి, కీర్తిస్తున్నాయి.

అలాగే, దేశంలో మోదీ సారథ్యంలో బలపడుతోంది బీజేపీ మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా హిందూ జాతీయవాదం పూర్వ వైభవ స్థితికి చేరుతోంది. జాతీయవాద శక్తులు ఏకమవుతున్నాయి. అత్మనిర్భర్‌ ‌బాటలో దేశం అజేయశక్తిగా ఎదుగుతోంది. ఇది సహజంగానే పితృదేశ (చైనా) భక్తులకు, వామపక్ష అతివాద శక్తులకు, విదేశీ మానస పుత్రులకు, మతోన్మాద ఉగ్రవాదులకు, ఈ అందరికీ పుష్కలంగా నిధులు సమకూరుస్తున్న విదేశీ మిషనరీలకు, ఆ నిధులతో సాగుతున్న ప్రాంతీయ, కుటుంబ పార్టీలకు, ఇంకా అనేక మంది వ్యక్తులు, సంస్థలకు కంటగింపుగా, కడుపుమంటగా మారింది. అందుకే, ఢిల్లీ నుంచి విశాఖ దాకా అసత్య ప్రచారం ఆందోళనల రూపంలో సాగుతోంది.

జరుగుతున్న పరిణామాలను గమనిస్తే దేశ వ్యతిరేక శక్తులలో విద్వేషం ఏ స్థాయికి చేరిందో తెలుస్తుంది. ఇందుకు సంబంధించి అస్సాంలోని దుబ్రీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ‘ఎఐయుడిఎఫ్‌’ ‌లోక్‌సభ సభ్యుడు బద్రుద్దీన్‌ అజ్మల్‌ ‌చేసిన ప్రకటన ఒక చిన్న ఉదాహరణగా నిలుస్తుంది. త్వరలో జరగనున్న అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌పార్టీతో పొత్తుకు ఆయన చెప్పిన కారణం వింటే ఈ ఆందోళనాజీవుల అసలురంగు బయట పడుతుంది. అస్సాంలో అధికారంలో ఉన్న బీజేపీని గద్దె దించేందుకు తమ పార్టీ ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని ఆయన ప్రకటించారు. అందులో భాగంగానే కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకున్నామని బద్రుద్దీన్‌ ‌పేర్కొన్నాడు. ఈయనకు పాక్‌ అనుకూల ముస్లిం నాయకుడు అని పేరుంది. ఇలా దేశమంతటా హిందూ జాతీయవాద వ్యతిరేక ఇస్లామిక్‌, ‌క్రైస్తవ మతోన్మాద వ్యక్తులు అసత్య ప్రచారంతో అరాచకం సృష్టించేందుకు సాగిస్తున్న ప్రచారంలో భాగంగానే విశాఖ ఉక్కు పరిరక్షణ పేరిట సాగుతున్న ఆందోళనను కూడా చూడవలసి ఉంటుంది.

About Author

By editor

Twitter
Instagram