భారత రాజ్యాంగం సమాఖ్య వ్యవస్థకు పట్టం కట్టింది. ఈ విధానంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసిమెలసి పనిచేయాలి. పరస్పరం సహకరించుకోవాలి, గౌరవించుకోవాలి. పార్టీలపరంగా, సిద్ధాంతాలపరంగా, విధానాలపరంగా ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ సమన్వయంతో ముందుకు సాగాలి. రాజ్యాంగ పరంగా రాష్ట్రంలో గవర్నర్‌ ‌కేంద్ర ప్రతినిధి పాత్రను పోషిస్తారు. మరింత స్పష్టంగా చెప్పాలంటే కేంద్రంలో రాష్ట్ర ప్రతినిధిగా, రాష్ట్రంలో కేంద్ర ప్రతినిధిగా ఆయన వ్యవహరిస్తారు. జాతీయస్థాయిలో రాష్ట్రపతి పాత్రను రాష్ట్రంలో గవర్నర్‌ ‌పోషిస్తారు. రాష్ట్రపతిని దేశానికి ప్రథమ పౌరుడిగా గౌరవిస్తారు. అదేవిధంగా రాష్ట్రంలో గవర్నర్‌ ‌ప్రథమ పౌరుడిగా వ్యవహరిస్తారు. దీనిని బట్టి రాజ్యాంగం గవర్నర్‌కు ఎంత ప్రాధాన్యం ఇచ్చిందో అర్థమవుతుంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ అధికారిక సమావేశాల్లో ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని తన గవర్నమెంట్‌ (‌మై గవర్నమెంట్‌)‌గా సంబోధిస్తారు. ఇంతటి కీలకమైన పదవి కాబట్టే గవర్నర్‌కు అధికారిక ప్రోటోకాల్‌ (‌గౌరవ మర్యాదలు) ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాలన్నీ రాష్ట్ర ముఖ్యమంత్రులకు తెలియనివి కావు. కానీ కొందరు ముఖ్యమంత్రులు ఉద్దేశ పూర్వకంగానే గవర్నర్లను విస్మరిస్తూ, వారి పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు.

మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌ ‌ముఖ్యమంత్రులు ఉద్ధవ్‌ ‌ఠాక్రే, మమతా బెనర్జీ తమ రాష్ట్రాల గవర్నర్ల పట్ల అమర్యాదకరంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు బలంగానే వినిపిస్తున్నాయి. వారికి తెలిసే, కావాలని కించపరుస్తున్నారన్న ఆరోపణలను కొట్టిపారేయలేం. తాజాగా మహారాష్ట్ర గవర్నర్‌ ‌భగత్‌సింగ్‌ ‌కోశ్యారీ పట్ల ఆ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఆశ్చర్యపరిచింది. ప్రథమ పౌరుడి ప్రయాణ విషయంలో అసంబద్ధంగా వ్యవహరించి అప్రతిష్టను మూటగట్టుకుంది. ఫిబ్రవరి పదో తేదీన గవర్నర్‌ ‌కోశ్యారీ డెహ్రాడూన్‌ ‌వెళ్లేందుకు ముంబయిలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వ విమానంలో ఆశీనులయ్యారు. కొద్దిసేపటి తర్వాత పైలెట్‌ ‌వచ్చి విమానం బయలు దేరడానికి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేదని చెప్పారు. దీంతో కోశ్యారీ మరో ప్రైవేట్‌ ‌విమానంలో డెహ్రూడూన్‌కు బయలుదేరారు. ప్రథమ పౌరుడి పర్యటనకు సంబంధించి గవర్నర్‌ ‌కార్యాలయం ముందుగానే సమాచారం అందించినా రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే ఉదాసీనంగా వ్యవహ రించిందన్న ఆరోపణలను తోసిపుచ్చలేం. దీనిపై ముఖ్యమంత్రి ఠాక్రే వివరణ పొంతన లేకుండా ఉంది.

గవర్నర్‌ ‌కోశ్యారీది వ్యక్తిగత పర్యటన ఏమీ కాదు. పూర్తి అధికారిక పర్యటనే కావడం గమనార్హం. ఉత్తరాఖండ్‌ ‌రాష్ట్రంలోని ముస్సోరీలో గల లాల్‌ ‌బహదూర్‌ ‌శాస్త్రి జాతీయ పోలీసు అకాడమీలో ఆయన 122వ బ్యాచ్‌ ‌శిక్షణ అధికారుల సమావేశానికి అధ్యక్షత వహించాల్సి ఉంది. ఇంతటి ముఖ్య కార్యక్రమానికి హాజరయ్యే గవర్నర్‌ ‌ప్రయాణానికి రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా ఏర్పాట్లు చేయాల్సి ఉంది. అలాంటిదేమీ లేకపోగా ఆకుకు అందకుండా… రీతిలో మాట్లాడటం గవర్నర్‌ ‌పట్ల ప్రభుత్వ చులకన భావానికి నిదర్శనం. కోశ్యారీ ఆషామాషీ నేత కాదు. సొంత రాష్ట్రంతో పాటు జాతీయ రాజకీయాల్లో తల పండిన నేత. ఉత్తరాఖండ్‌ ‌ముఖ్యమంత్రిగా, ఆ రాష్ట్ర విపక్షనేతగా, భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా పనిచేసిన సీనియర్‌ ‌నాయకుడు. శాసనసభ్యుడిగా, శాసనమండలి సభ్యుడిగా, లోక్‌సభ, రాజ్యసభ సభ్యులుగా దేశంలోని నాలుగు చట్టసభల్లో పనిచేసివ విశేష అనుభవం గడించిన నేత. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన మహారాష్ట్రతోపాటు పక్కనే ఉన్న గోవాకు తాత్కాలిక గవర్నరుగా అదనపు బాధ్యతలు నిభాయిస్తున్నారు.

పైకి రాష్ట్ర ప్రభుత్వం మసిపూసి మారేడుకాయ చందాన ఏదో వివరణ ఇస్తున్నప్పటికీ గవర్నరును అవమానించడం వెనక తెరవెనక వేరే కారణం ఉందన్న వాదన వినపడుతోంది. శాసనమండలికి గవర్నర్‌ ‌కోటాలో రాష్ట్ర ప్రభుత్వం 12 మందిని నామినేట్‌ ‌చేయాల్సి ఉంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆయన వద్దకు ప్రతిపాదనలు పంపింది. దాన్ని గవర్నర్‌ ‌కావాలనే ఉద్దేశపూర్వకంగా తొక్కి పెట్టారన్నది ప్రభుత్వం వైపు నుంచి వినిపిస్తున్న అభియోగం. అందువల్లే ప్రథమ పౌరుడి పట్ల అనుచితంగా వ్యవహరించారన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఇందులో సత్యమెంతో ఎవరికీ పూర్తిగా తెలియదు. ఇదే నిజమైతే ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రభుత్వానికి రాజ్యాంగ పరంగా అనేక మార్గాలు ఉన్నాయి. అంతేతప్ప ఇంత ‘చిల్లర’గా వ్యవహరించాల్సిన అవసరం లేదు. ఈ స్థాయికి రాష్ట్ర ప్రభుత్వం దిగజారాల్సిన అవసరం లేదు. వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేనేలేదు. తన ప్రతిపాదనను గవర్నర్‌ ‌నిర్దిష్ట గడువులోగా ఆమోదించాలన్న నిబంధన లేదు. అంతమాత్రాన ఈ విషయంలో ఆయన ఏమీ సర్వ స్వతంత్రుడు కారు. ఆయనకూ కొన్ని పరిమితులు ఉన్నాయి. తన ప్రతిపాదనను పునఃపరిశీలించా ల్సిందిగా గవర్నర్‌ను కోరే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అప్పుడు దానిని ఆమోదించడం మినహా ప్రథమ పౌరుడికి మరోమార్గం లేదు. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకుపోవచ్చు. ఏ గవర్నరూ అంతటి పరిస్థితి తెచ్చుకోరు. ఇలాంటి చట్టపరమైన, రాజ్యాంగపరమైన ప్రత్యమ్నాయాలను విస్మరించి దిగజారుడు రాజకీయాలకు తెరలేపడం ఉద్ధవ్‌ఠాక్రే వంటి సీనియర్‌ ‌నేతకు తగని పని. రాష్ట్ర ప్రోటోకాల్‌ ‌వ్యవహారాల మంత్రి, శివసేన రాష్ట్ర యువజన విభాగం చీఫ్‌ అయిన ఆదిత్యఠాక్రే గవర్నర్‌ ‌ప్రయాణ ఏర్పాట్లపై మౌనాన్ని వీడలేదు. ఇది రాష్ట్ర ప్రభుత్వం, విమానయాన శాఖకు సంబంధించిన వ్యవహారమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ ‌కుమార్‌ ‌పేర్కొనడం విచిత్రంగా ఉంది. యావత్‌ అధికార యంత్రాంగానికి అధినేత అయిన ఆయన ఆ విధంగా స్పందించడం సరికాదు. మాజీ ముఖ్యమంత్రి, విపక్షనేత, భాజపా అగ్రనేత దేవేంద్ర ఫడణవీస్‌ ఈ ‌ఘటనను తీవ్రంగా ఖండించారు. రాజ్యాంగాధినేత అయిన గవర్నర్‌ ‌పట్ల హుందాగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం చిల్లర రాజకీయాలకు పాల్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న మొన్నటి వరకు సంకీర్ణ సర్కారులో కీలకమైన శాసనసభ స్పీకరుగా పనిచేసి, ఇటీవల రాజీనామా చేసి రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నానా పటోలే సైతం ఈ విషయంలో ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు.

గవర్నరుకు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య గల వివాదానికి స్పీకర్‌ అం‌శం కూడా ఒక కారణమన్న వాదన వినపడుతోంది. ఉద్దవ్‌ ‌ఠాక్రే నాయకత్వంలోని మహా వికాస్‌ అఘాఢి (ఎంవీఏ) ప్రభుత్వంలో శివసేన, శరద్‌ ‌పవార్‌ ‌సారథ్యంలోని నేషనలిస్ట్ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ (ఎన్‌సీపీ), కాంగ్రెస్‌ ‌భాగస్వాములు. ఒప్పందంలో భాగంగా శివసేనకు సీఎం, పవార్‌ ‌పార్టీకి డిప్యూటీ సీఎం పోస్టులు లభించగా మూడో పెద్ద పార్టీ అయిన కాంగ్రెస్‌కు కీలకమైన స్పీకర్‌ ‌పోస్టు లభించింది. విదర్భ ప్రాంతానికి చెందిన పార్టీ ఓబీసీ నాయకుడు నానా పటోలే సభాపతి బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర కాంగ్రెస్‌కు కొత్తరక్తం ఎక్కించే పక్రియలో భాగంగా ఆయనకు పార్టీ అధిష్టానం పీసీసీ పగ్గాలు అప్పగించింది. ఖాళీ అయిన స్పీకర్‌ ‌పదవికి ఎన్నిక నిర్వహించాలని కోరుతూ గవర్నర్‌ ‌కోశ్యారీ నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ విషయాన్ని ప్రభుత్వం పెడచెవిన పెడుతూ వచ్చింది. మార్చి నుంచి కీలకమైన అసెంబ్లీ బడ్జెట్‌ ‌సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. స్పీకర్‌ ఎన్నికకు సంబంధించి సంకీర్ణ సర్కారులో ఇంకా ‘రాజకీయంగా’ లెక్కల చిక్కులు పూర్తిగా తొలగిపోలేదు. అందుకే సర్కారు జాప్యం చేస్తోంది. డిప్యూటీ స్పీకర్‌తోనే సభను నడిపించాలన్న ఆలోచనా చేస్తోంది. సంకీర్ణ సర్కారులో మూడో భాగస్వామి అయిన కాంగ్రెస్‌ ‌తనకు లభించిన పదవులతో సంతృప్తిగా లేదు. తనకూ డిప్యూటీ సీఎం పదవి కావాలని పార్టీ కొంతకాలంగా డిమాండ్‌ ‌చేస్తోంది. ఇప్పటికే శివసేన, పవార్‌ ‌పార్టీకి చెందిన ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉన్నారు. తాజాగా కాంగ్రెస్‌ ‌కొత్త డిమాండ్‌తో సంకీర్ణ సర్కారులో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ నేపధ్యంలో స్పీకరును ఎన్నుకోవాలన్న గవర్నర్‌ ‌లేఖ ప్రభుత్వ పెద్దల్లో అసహనానికి ఒక కారణమన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఒక్క మహారాష్ట్రలోనే కాదు, తూర్పు రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్లో ఆ రాష్ట్ర గవర్నర్‌ ‌జగదీప్‌ ‌ధనకర్‌ ‌పట్ల ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సర్కారు కూడా అనుచితంగా వ్యవహరిస్తోంది. గవర్నరును ప్రథమ పౌరుడిలా కాకుండా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్ర ప్రభుత్వం పరిగణిస్తోంది. చీటికిమాటికి గిల్లి కజ్జాలకు దిగుతోంది.

ఉద్యమాలకు సంబంధించి ప్రముఖుల ట్వీట్ల విషయంలోనూ మహారాష్ట్ర సర్కారు అనుచితంగా వ్యవహరిస్తోంది. రైతుల ఉద్యమాలపై ట్వీట్లు చేయాల్సిందిగా కొందరు ప్రముఖులపై ఒత్తిళ్లు వచ్చాయన్న ఆరోపణలపై నిఘా విభాగం దర్యాప్తు చేపట్టనున్నట్లు రాష్ట్ర హోంమంత్రి అనిల్‌ ‌దేశ్‌ముఖ్‌ ‌ప్రకటించడం వివాదాస్పదమైంది. ప్రముఖుల ట్వీట్ల వెనక భాజపా ప్రమేయం ఉందంటూ కాంగ్రెస్‌ ‌చేసిన ఆరోపణలపై హోంమంత్రి ఆగమేఘాలపై స్పందించారు. సచిన్‌ ‌టెండూల్కర్‌, ‌లతా మంగేష్కర్‌ ‌వంటి ప్రముఖులు ఇటీవల కాలంలో కేంద్రానికి మద్దతుగా ట్వీట్లు చేసిన విషయం తెలిసిందే. బ్యాడ్మింటన్‌ ‌క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌, ‌బాలీవుడ్‌ ‌ప్రముఖుడు అక్షయ్‌ ‌కుమార్‌ ‌ట్వీట్లు చేశారు. వీరిపై కేంద్రం ఒత్తిడి తెచ్చి తనకు అనుకూలంగా ట్వీట్లు చేయించిందని కాంగ్రెస్‌ ఆరోపించింది. ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడు నానా పటోలే ఆరోపణ చేయగా తగుదునమ్మా అంటూ రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం ఆశ్చర్యంగా ఉంది. ఇది పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛపై దాడిగా పేర్కొనవచ్చు.

వివిధ సామాజిక అంశాలపై తమ అభిప్రాయా లను వెలిబుచ్చే స్వేచ్ఛ, హక్కు ఎవరికైనా ఉంటుంది. ఇది రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటనా స్వేచ్ఛ. దీనిపై దర్యాప్తు చేయడానికి మహారాష్ట్ర సర్కారు ముందుకు రావడం అనాలోచిత చర్య. సమాజంలోని ఆయా రంగాల ప్రముఖులకు సమస్యలపై స్పందించే హక్కు ఉంటుంది. కేంద్రం చెబితే ట్వీట్లు చేయాల్సిన అవసరం వారికి లేదు. వారేమీ చిన్నపిల్లలు, అమాయకులు కారు. తమ తమ రంగాల్లో నిష్ణాతులు. వేరొకరు చెబితేగానీ వాస్తవాలు తెలుసుకోలేనంత స్థితిలో వారు లేరు. అన్నింటికీ మించి వారిపై కేంద్రం ఒత్తిడి చేయించిందన్న ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవు. విదేశీ ప్రముఖులు చేసే అరాచక ట్వీట్లను ప్రశంసిస్తున్న మహా సర్కారు, దేశం కోసం నిలిచే జాతీయవాదుల గొంతు నొక్కేందుకు ప్రయత్నించడం అనుచితం. అత్యున్నత భారత పురస్కారాలను అందుకున్న ప్రముఖుల విషయంలో అసలు ‘దర్యాప్తు’ అనే పదమే ఉచ్చరించడం తగనిపని.

ఈ విషయాన్నే సూటిగా ప్రశ్నించారు భాజపా జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్‌ ‌నడ్డా, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌. ఈ ‌ప్రశ్నలకు ప్రభుత్వ పెద్దల వద్ద సరైన సమాధానం కరవైంది. అందుకే నంగినంగిగా మాట్లాడుతోంది. విషయాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ విషయంలో తొందరపాటుగా వ్యవహరిస్తే రాష్ట్రసర్కారు అందుకు తగిన మూల్యం చెల్లించక తప్పదు.

– పూర్ణిమాస్వాతి, వ్యాసకర్త: సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram