– గోపరాజు విశ్వేశ్వర ప్రసాద్‌

‌పౌర సవరణ చట్టం దరిమిలా దేశ రాజధానిలో జరిగిన విధ్వంసం, హింస, హత్యా కాండ యావద్దేశం వీక్షించింది. ఇందులో సామాజిక మాధ్యమాలు నిర్వహించిన ప్రమాదకర పాత్ర వెంటనే వెలుగులోకి వచ్చింది కూడా. ఈ ధోరణిని ఇంకా భావ ప్రకటనా స్వేచ్ఛలో భాగంగా చూడమని చెప్పడం ఆత్మహత్యాసదృశమే అవుతుంది. భారత రాజ్యాంగం 19వ అధికరణం భావప్రకటనా స్వేచ్ఛను కల్పిస్తుంది. ఇది ఏ దేశానికైనా, అందులోను ప్రజాస్వామిక వ్యవస్థకు అనివార్యమే. కానీ ఇటీవలి కాలంలో హక్కులకు, స్వేచ్ఛకు వస్తున్న వక్రభాష్యాల కారణంగా భావ ప్రకటనా స్వేచ్ఛకు పరిమితులు ఏర్పరచక తప్పని పరిస్థితులు ముందుకొచ్చాయి. సామాజిక మాధ్య మాల పేరుతో సాగుతున్న స్వేచ్ఛా విశృంఖలత్వం, విచ్చలవిడి తనం చూసినవారికి ఒక ముగు తాడు అవసరమన్న భావన కలిగితీరు తుంది. సామాజిక మాధ్యమాలే కాదు, చాలా మీడియా సంస్థలు సొంత అజెండాను, అసాంఘిక ఎజెండాను దేశం మీద రుద్దుతున్నాయి. దీనితో అమాయకులు బలవుతున్నారు. అశ్లీలత పెరిగిపోయింది. అదొక వ్యాపారమైంది.

పది వాక్యాల దొంగ సమాచారంతో, మార్ఫింగ్‌ ‌చేసిన చిన్న ఫొటోతో సమాజంలో ఎంతటి ఉద్రిక్తత లను సృష్టించవచ్చునో సామాజిక మాధ్యమాలను చూస్తే తెలుస్తుంది. అయితే వాటి వినియోగదారు లంతా ఇలా ఉన్నారని కాదు. కానీ ఎక్కువ మంది నిర్వాకం వల్ల విషమ పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ దేశంలో వ్యాట్సాప్‌కు 53 కోట్లు, యూట్యూబ్‌కు 44.8 కోట్లు, ఫేస్‌బుక్‌కు 41 కోట్లు, ఇన్‌స్టాగ్రామ్‌కు 21 కోట్లు, ట్విటర్‌కు 1.75 కోట్లు వినియోగదారులు ఉన్నారు. అంటే వీక్షకులు. ఇందులో ఏ కొద్దిమందో మానసిక రోగులు ఉంటే వారి పెడ ధోరణి వల్ల ఎంత నష్టం కలుగుతుందో చెప్పలేం. అలాంటి ఘోర నష్టం భారతీయ సమాజం ఎదుర్కొంటున్నది. ఇలాంటి అనుభవం చవిచూసిన దేశాలు ఇప్పటికే ఆంక్షల బాట పట్టాయి. కొత్తగా భారత్‌కు జాగ్రత్తలు తీసుకుంటున్నది. కేంద్రానికీ, ట్విటర్‌కు మధ్య మొదలైన రగడ నేపథ్యంలో భారత్‌కు వీటిని అదుపులో ఉంచడానికి అత్యవసరంగా ఆంక్షలు పెట్టింది. ఇవే కాదు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌, అమెజాన్‌ ‌ప్రైమ్‌ ‌వీడియో, నెట్‌ఫ్లిక్స్ ‌చేస్తున్న చేటు కూడా తక్కువేమీ కాదు. అమెజాన్‌ ‌ప్రైమ్‌వీడియో ఇచ్చిన తాండవ్‌ ‌సీరియల్‌ ‌సృష్టించిన వివాదం చిన్నదేమీ కాదు. హిందూ దేవతలను కించపరచడమే ధ్యేయంగా ఈ సీరియల్‌ ‌నడిచింది. అందుకే వేటు పడింది. కొన్ని సీరియల్‌లో చిత్రీకరించిన విచ్చలవిడి దృశ్యాలు కూడా కలకలం సృష్టించాయి. వీటన్నిటి మీద ప్రధానంగా వినిపిస్తున్న విమర్శ – భారతీయమైన సామాజిక విలువలను కించపరుస్తున్నాయి. మానవ సంబంధాలను పెడదారి పట్టిస్తున్నాయి.

 తొలిరోజుల్లో వార్తా పత్రికలు మాత్రమే ఉండేవి. కాలక్రమంలో ఎలక్ట్రానిక్‌ ‌మాధ్యమాలు వచ్చాయి. ఇటీవలి కాలంలో సామాజిక మాధ్యమాలు బాగా విస్తరించాయి. అదే సమయంలో వాటి దుర్వినియోగం కూడా అధికమైంది. వ్యక్తులు, వ్యవస్థలు, సంస్థలు, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా అసత్యాలు, అభూత కల్పనలు, ఆరోపణలతో ఈ మాధ్యమాలు ప్రజల్లోకి వెళ్లడం అధికమైంది. దీనికి  స్వేచ్ఛ అని పేరు పెడుతున్నాయి. వ్యక్తులు, వ్యవస్థలు, సంస్థలు, ప్రభుత్వాల లక్ష్యంగా పనిచేయడం పెరిగిపోయింది. రాజ్యాంగం ప్రజలకు ప్రాథమిక హక్కులు కల్పించిన మాట వాస్తవమే అయినప్పటికీ, వాటికి పరిమితులు ఉంటాయని, సహేతుక పరిమితులు తప్పనిసరని, అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని సర్వోన్నత న్యాయస్థానం వివిధ సందర్భాల్లో విస్పష్టంగా వ్యాఖ్యానించింది.

ట్విటర్‌, ‌ఫేస్‌ ‌బుక్‌, ‌వాట్సాప్‌ ‌వంటి సామాజిక మాధ్యమాలతో పాటు ఓటీటీ (ఓవర్‌ ‌ది టాప్‌)‌వంటి వేదికలకు మార్గదర్శకాలను నిర్దేశించడం ఈ నేపథ్యంలోనే జరిగింది. ఈ మేరకు మధ్యంతర మార్గదర్శకాలు, డిజిటల్‌ ‌మీడియా నైతిక స్మృతి -2021 పేరుతో ప్రత్యేకంగా ఓ గెజిట్‌ ‌నోటిఫికేషన్‌  ‌విడుదల చేసింది. మాధ్యమాలన్నీ మరింత జవాబు దారీతనంతో, పారదర్శకంగా వ్యవహరించాలని స్పష్టం చేసింది. ట్విటర్‌కు, కేంద్రానికి మధ్య వివాదం,  నిబంధనలను బేఖాతరు చేస్తూ ట్విటర్‌ ఇటీవలి కాలంలో ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వంపై విషం చిమ్ముతున్న సంగతి తేలికగా తీసుకోలేనిది. భావప్రకటనా స్వేచ్ఛ పేరుతో కొందరు ప్రముఖులు సామాజిక మాధ్యమాల్లో సర్కారుపై దుమ్మత్తి పోయడం పరిపాటైంది. అందుకే కేంద్రం కొరడా ఝళిపించింది. ఇకమీదట అన్ని సామాజిక మాధ్యమాలు స్వీయ నియంత్రణ పాటిస్తూ, మరింత పారదర్శకంగా, జవాబుదారీతనంతో వ్యవహరిస్తూ, వివిధ వర్గాల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి అంతర్గతంగా ప్రత్యేక యంత్రాంగాలను ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది. ఇవేమీ రాత్రికి రాత్రే ఉద్దేశపూర్వకంగా తీసుకువచ్చిన నిబంధనలు కావు. వివిధ కమిటీల నివేదికలు, సుదీర్ఘ అధ్యయనం అనంతరం సదుద్దేశంతో రూపొందిం చిన నిబంధనలు. గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు, ఎగువసభలో జరిగిన చర్చలు, ఆ సభ ఏర్పాటు చేసిన కమిటీ నివేదికల మేరకు 2018 డిసెంబరులోనే ముసాయిదా రూపొందించారు. ఇప్పటికీ సుప్రీంకోర్టు ఎదుట ఆరు వివాదాలు ఇందుకు సంబంంధించినవే ఉన్నాయి.

సామాజిక మాధ్యమాలను సోషల్‌ ‌మీడియా ఇంటర్మీడియరీ, సిగ్నిఫికెంట్‌ ‌సోషల్‌ ‌మీడియా ఇంటర్మీడియరీ పేరుతో రెండు విభాగాలుగా విభజించారు. ముందుగా ప్రతి సంస్థ భారత్‌లో ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. ప్రతి ఫిర్యాదును నిర్దేశిత 15రోజుల్లో పరిష్కరించాలి. రెండో దశలో స్వీయ నియంత్రణ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలి. విచారణల్లో ఆయా సంస్థలదే తప్పని తేలితే అందుకు క్షమాపణలు చెబుతూ స్క్రోలింగ్‌ ‌వేయాలి.

స్వీయ నియంత్రణ వ్యవస్థల తీరుతెన్నులకు సంబంధించి ఒక ప్రత్యేక పర్యవేక్షణ యంత్రాంగం కూడా ఏర్పాటవుతుంది. వినియోగదారుల పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలకు సంబంధించి నియమ నిబంధనలను పాటించాలి. అసభ్యత, అశ్లీలతో కూడిన సమాచారం, చిత్రాలు వీడియోలు, మార్ఫింగ్‌ ‌ఫొటోలపై ఫిర్యాదులు వస్తే వాటిని 24 గంటల్లోగా తొలగించాలి. ప్రముఖ సామాజిక మాధ్యమాలు భారత్‌లో నివసించే వ్యక్తినే ముఖ్యమైన ఫిర్యాదు అధికారిగా నియమించాలి. స్థానిక చట్టాలను అనుసరించే బాధ్యత ఇతనిదే. చట్టాలను అమలు చేసే వ్యవస్థలతో సమన్వయానికి భారత్‌లో నివాసం ఉండే వ్యక్తిని నోడల్‌ ‌కాంటాక్ట్ ‌పర్సన్‌గా నియమించాలి. మోసపూరిత, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తే అందుకు బాధ్యులైన తొలి వ్యక్తిని గుర్తించి వెల్లడించాల్సిన బాధ్యత ఆయా సామాజిక మాధ్యమాలదేనని నిబంధనలు నిర్దిష్టంగా తెలియ జేస్తున్నాయి. ఇలాంటి సమాచారం భారత్‌ ‌వెలుపల తయారైతే దాన్ని దేశంలో ఎవరు ప్రవేశపెట్టారన్న విషయాన్ని వెల్లడించాలి.

 దేశ సమగ్రత, సమైక్యత, సార్వభౌమాధికారం, శాంతిభద్రతలు, విదేశీ సంబంధాలు, అత్యాచారాలు, లైంగిక వేధింపులకు సంబంధించి తొలుత ప్రచారం చేసిన వ్యక్తుల వివరాలు వెల్లడించాలి. దోషం రుజువైతే అయిదేళ్ల శిక్ష విధిస్తారు. ప్రముఖ సామాజిక మాధ్యమాలన్నీ భారత్‌లో తమ చిరునామాలను ఆయా వెబ్‌ ‌సైట్లు, మొబైట్‌ ‌యాప్‌లలో వెల్లడించడం తప్పనిసరి. న్యాయస్థానాలు, ప్రభుత్వ యంత్రాంగాలు నిషేధించిన సమాచారాన్ని వెల్లడించరాదు. ప్రముఖ సామాజిక మాధ్యమాలకు సంబంధించి కొత్త నిబంధనలు మూడు నెలల్లో అమలవుతాయి. ఆ లోపు అవి సంబంధిత యంత్రాంగాలను ఏర్పాటు చేసుకోవాలి. సామాజిక మాధ్యమాల్లో ఏవి ప్రముఖమైనవన్న విషయాన్ని గర్తించడానికి కేంద్రం కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. 50 లక్షల మంది నమోదిత ఖాతాదారులున్న వాటిని ప్రముఖ సామాజిక మాధ్యమిక వేదికలు (సిగ్నిఫికెంట్‌ ‌సోషల్‌ ‌మీడియా ఇంటర్మీడియరీస్‌)‌గా గుర్తించనుంది. ప్రముఖ సామాజిక మాధ్యమాలుగా గుర్తించిన వాటికి అదనపు నిబంధనలు ఉంటాయి.

  ప్రభుత్వ తాజా నిర్ణయాన్ని విపక్షాలు ఎప్పటి మాదిరిగానే తప్పుపట్టాయి. ముఖ్యంగా ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్‌ ‌తీవ్రంగా ధ్వజమెత్తింది. పార్లమెంట్‌ ఆమోదం లేకుండానే కొత్త నిబంధనలు తీసుకురావడం అన్యాయం, అక్రమమని మండిపడింది.ప్రభుత్వ అధికారులకు అపరిమిత అధికారాలు కట్టబెట్టడం వల్ల అవి దుర్వినియోగమవుతాయని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అభిషేక్‌ ‌మను సింఘ్వీ విమర్శించారు. ఇవి సహేతుక పరిమితులు తప్ప, అపరిమిత అధికారాలు కావన్న వాస్తవాన్ని సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాదుల్లో ఒకరైన సింఘ్వీ విస్మరిస్తున్నారు. డేటా పరిరక్షణ చట్టాన్ని ఆమోదించలేదన్నారు. నియంత్ర ణకు సంబంధించిన నిబంధనలు రూపొందించి నప్పుడు పార్లమెంటరీ పరిశీలన అవసరమన్న ఉచిత సలహాను ఇచ్చారు. విపక్షం నుంచి ఇంతకు మించి ఆశించడం అత్యాశే అవుతుంది. ప్రభుత్వ విధానానలు వ్యతిరేకించడమే అజెండాగా పెట్టుకునే పార్టీలు దేశ ప్రతిష్టను దెబ్బతీసే శక్తుల పట్ల మౌనంగా ఉండటం ఆందోళన కలిగించే అంశం. అత్యవసర సమయాల్లో అంతర్జాల సమాచారాన్ని నిలిపేయడం కొత్తేమీ కాదు. హస్తం పార్టీ అధికారంలో ఉన్న సమయం (2009) నుంచే ఈ నిబంధన ఉన్న విషయం సింఘ్వీకి తెలియదని అనుకోలేం. 2004 నుంచి 2014 వరకు ఆ పార్టీ అధ్యక్షురాలు తెరవెనక సారథ్యంలో పదేళ్లపాటు మన్మోహన్‌ ‌సింగ్‌ ‌పాలించిన సంగతి తెలిసిందే.

   అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ ట్విటర్‌ ‌భారత్‌ ‌పట్ల ఒకింత పక్షపాత, మొండి వైఖరి అనుసరిస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని ఖాతాల నిలుపుదలకు సంబంధించి ట్విటర్‌, ‌కేంద్రం మధ్య తొలుత కొంత ప్రతిష్ఠంభన నెలకొంది. మొత్తం 1178 ఖాతాలను స్తంభింప జేయాలని ట్విటర్‌ ‌ను కేంద్రం ఆదేశించగా దాదాపు 500 ఖాతాలపైనే చర్యలు తీసుకుంటామంటూ అది సమాధానమిచ్చింది. వాటిని కూడా కేవలం భారత్‌ ‌లో మాత్రమే నిలిపి వేస్తామని మిగతా దేశాల్లో యథావిధిగాపని చేస్తాయని ప్రకటించడం గమనార్హం. సామాజిక కార్యకర్తలు, నాయకులు, పాత్రికేయులు హ్యాండిళ్లను నిలిపివేయబోమని ప్రకటించడం దాని మొండివైఖరికి నిదర్శనం. అలా చేయడం భారత చట్టాల ప్రకారం వారి భావవ్యక్తీకరణ స్వేచ్ఛను అడ్డుకోవడం అవుతుందని సుద్దులు వల్లించడం దాని తెంపరితనానికి నిదర్శనం. మూడు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పలు ఖాతాల్లో తప్పుడు సమాచారం వస్తుందంటూ సమాచార చట్టంలోని సెక్షన్‌ -69ఏ ‌కింద కేంద్రం ఫిబ్రవరి 4న ట్విటర్‌ ‌కు నోటీసులు జారీ చేసింది. పాకిస్తాన్‌, ‌ఖలిస్తాన్‌తో సంబంధాలున్న మొత్తం 1178 ఖాతాలను నిలిపి వేయాలని నోటీసుల్లో పేర్కొంది. ఆయా ఖాతాలను భారత్‌లో నిలిపివేస్తాం, ఇతర దేశాల్లో నిలిపివేయమన్న వాదన అర్థరహితం. సమాచారం వాస్తవం అయితే ఏ దేశంలో అయినా ఇవ్వడంలో ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండదు. అవాస్తవ సమాచారాన్ని ఇతర దేశాల్లోనూ ఇవ్వడం తప్పే అవుతుంది. స్వీడన్‌ ‌కు చెందిన యువ పర్యావరణ వేత్త గ్రెటా థన్‌బర్గ్, ‌బెంగళూరుకు చెందిన యువ పర్యావరణ ఉద్యమకర్త దిశా రవి వంటి వారి వయసు రెండు పదులకు మించదు. మూడు నూతన సాగు చట్టాలపై వారు సామాజిక మాధ్యమాల్లో స్పందించారు. గ్రెటాకు భారత్‌ ‌గురించి,  ఈ దేశంలోని వ్యవసాయ రంగం గురించి, రైతుల సమస్యలపై గల అవగాహన ఎంతవరకు అన్నది ప్రశ్నార్థకమే. ఇందుకు దిశా రవి మినహాయింపు ఏమీ కాదు. పోస్టింగుల ద్వారా ప్రచారాన్ని పొందడం, ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించడం ద్వారా గుర్తింపు పొందడం వీరి లక్ష్యమన్న విమర్శ లను తోసిపుచ్చలేం. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల శాంతియుత ఆందోళనను ప్రభుత్వం ఏనాడూ అణచి వేయలేదు. గణతంత్ర దినోత్సవం నాడు చోటుచేసుకున్న అవంఛనీయ ఘటనల తరవాతే సర్కారు జోక్యం చేసుకున్న సంగతిని గమనించాలి. గ్రెటాకు, దిశా రవికి ఇవేమీ తెలియని విషయాలు కావు. బెదిరింపులకు తలొగ్గబోనని, భారత రైతులకు తన మద్దతు కొనసాగుతుందని గ్రెటా తన స్థాయికి మించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం ఆమె అపరిపక్వతకు నిదర్శనం.

భారత్‌కు సంబంధించి వాట్సప్‌ అనుసరిస్తున్న గోప్యతా విధానంపై సుప్రీంకోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. ఐరోపా ప్రజలకు ఒకలా, భారత్‌ ‌ప్రజలకు మరోలా గోప్యతా విధానాలను వాట్సప్‌ అనుసరిస్తుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎ.‌బోబ్డే నాయకత్వంలోని ధర్మాసనం తప్పుపట్టింది. వాట్సప్‌ ‌దాని మాతృసంస్థ ఫేస్‌బుక్‌తో సమాచారం పంచుకోవడంపై నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన ఓ వ్యాజ్యంపై సర్వోన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. ఐరోపాలో సమాచార సంరక్షణ నియంత్రణలు ఉన్నాయని, భారత్‌ ‌లోనూ అలాంటి చట్టముంటే అనుసరించడానికి తమకు అభ్యంతరం లేదని ఆ సంస్థ తరఫున వాదించిన సీనియర్‌ ‌న్యాయవాది, కాంగ్రెస్‌ ‌ప్రముఖ నాయకుడు కపిల్‌ ‌సిబల్‌ ‌వితండ వాదం చేయడం గమనార్హం.

చట్టం ఉంటేనే నిబంధనలు పాటిస్తాం, లేదంటే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామనడం సరికాదు. అన్నింటికీ చట్టాలు ఉండవు. చాలా విషయాలు నైతిక విలువలు, సంప్రదాయాలు, పద్ధతుల ఆధారంగా నడుస్తుంటాయి. యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన సిబల్‌కు ఈ విషయాలు తెలియవనివి కావు. భారత్‌ ‌వంటి ప్రజాస్వామ్య దేశంలో స్వేచ్ఛ ఎంత అవసరమో, దానిపై సహేతుక ఆంక్షలు అంతే అవసరం. ఒకవేళ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించినా నిలువరించేందుకు విపక్షాలు, అన్నింటికీ మించి స్వతంత్ర న్యాయవ్యవస్థ దేశంలో ఉందన్న విషయాన్ని విస్మరించరాదు. సాగుచట్టాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం ప్రకటించిన విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి.

– వ్యాసకర్త : సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram