అరకొర నిధులతో అభివృద్ధి ఎలా ?

అరకొర నిధులతో అభివృద్ధి ఎలా ?
  •  క్రీడారంగాన్ని విస్మరించిన ‘తెలుగు’ ప్రభుత్వాలు

తెలుగు రాష్ట్రాల్లో క్రీడారంగ అభివృద్ధి ఓ ప్రహసనంలా మారింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో గత నాలుగేళ్లలో క్రీడారంగం సాధించిన అభివృద్ధిని చూస్తే ఏమున్నది గర్వకారణం అనిపించకమానదు.

దేశ, రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో నేడు క్రీడలు కూడా ముఖ్య అంశంగా మారిపోయాయి. క్రీడారంగాన్ని విస్మరించిన ఏ దేశం ప్రగతి సాధించలేదని, క్రీడలు మినహా మిగిలిన రంగాల్లో సాధించిన అభివృద్ధి సంపూర్ణ ప్రగతి కానేకాదని ఐక్యరాజ్య సమితి సైతం చెబుతోంది.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో యువజన జనాభా, ప్రతిభాపాటవాలు పుష్కలంగా ఉన్నా క్రీడలకు మాత్రం ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఇస్తున్న ప్రాధాన్యం అంతంత మాత్రమే. కేరళలోని తిరువనంతపురం వేదికగా 2015లో ముగిసిన జాతీయ క్రీడల పతకాల పట్టికలో తెలంగాణ 12, ఆంధ్రప్రదేశ్‌ 18 స్థానాలలో నిలవడం చూస్తే మన సత్తా ఏ పాటిదో తెలిసిపోతుంది. ఈ పోటీల్లో తెలంగాణ 8 స్వర్ణాలతో సహా మొత్తం 29 పతకాలు సాధిస్తే, ఆంధ్రప్రదేశ్‌ 6 స్వర్ణాలతో సహా మొత్తం 16 పతకాలు మాత్రమే సాధించింది. కేరళ, మణిపూర్‌, హర్యానా లాంటి చిన్న రాష్ట్రాలు పతకాల పట్టికలో పైపైకి దూసుకుపోతుంటే తెలుగు రాష్ట్రాలు మాత్రం పాతాళానికి పడిపోతూ వస్తున్నాయి.

2017-18 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌ వార్షిక బడ్జెట్‌ లక్షా 56 వేల 999 కోట్ల రూపాయలు. అయితే ఇందులో క్రీడలు, టూరిజం, సాంస్కృతిక వ్యవహారాలకు కేటాయించింది మాత్రం 330 కోట్ల రూపాయలే. ఇక ఆంధ్రప్రదేశ్‌ క్రీడా ప్రాధికార సంస్థకు ఎంత కేటాయించారో! క్రీడా రంగ అభివృద్ధికి ఎంత కేటాయించారో! ప్రభుత్వ పెద్దలకే తెలియాలి. బ్యాడ్మింటన్‌ స్టార్లు కిడాంబీ శ్రీకాంత్‌, పీవీ సింధు, ఆర్చరీ మిక్సిడ్‌ టీమ్‌ ప్లేయర్‌ సురేఖ సాధించిన విజయాలను చూపుతూ క్రీడారంగంలో ఆంధ్రప్రదేశ్‌ ఎక్కడా లేని ప్రగతి సాధించినట్లుగా భ్రమ కలిగిస్తున్నారు.

తెలంగాణ దేశంలోనే అత్యధిక ధనిక రాష్ట్రాలలో ఒకటి. అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న రాష్ట్రం. అయితే క్రీడారంగ అభివృద్ధికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యం, కేటాయించిన నిధులు నామమాత్రంగానే ఉంటున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ వార్షిక బడ్జెట్‌ లక్షా 74వేల 453 కోట్ల రూపాయలు. ఇందులో క్రీడారంగానికి కేటాయించింది కేవలం 57 కోట్ల 89 లక్షల రూపాయలు మాత్రమే. ఇందులో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఉద్యోగుల వేతనాలు, పింఛన్లు, ఇతర ఖర్చుల కోసం 12 కోట్ల 89 లక్షల రూపాయలు కేటాయించారు. మిగిలిన 45 కోట్ల రూపాయలను ఇతర సహాయక గ్రాంట్ల కోసం ఉంచారు. అంతేకాదు వీటిలో 9 కోట్ల రూపాయలను క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు, ఆర్థిక సహాయం, క్రీడా సమాఖ్యల గ్రాంట్ల కోసం అని పేర్కొన్నప్పటికీ ఇప్పటి వరకూ రెండు విడతలుగా 4 కోట్ల 85 లక్షలు మాత్రమే విడుదల చేసి తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థకు మొండిచేయి చూపారు.

క్రీడారంగాన్ని బహుముఖంగా అభివృద్ధి చేస్తామని, భారీగా నిధులు కేటాయిస్తామని అధికార పార్టీ ఎన్నికలప్పుడు ఇచ్చిన వాగ్దానాన్ని విస్మరించడం పట్ల క్రీడావర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.

ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు రెండూ గోపీచంద్‌ అకాడమీ, సింధు, శ్రీకాంత్‌ల చుట్టూనే పరిభ్రమిస్తూ బతికేస్తున్నాయి. మిగిలిన క్రీడలను ఏమాత్రం పట్టించుకోవడంలేదు. క్రీడా సంఘాలకు అవసరమైన నిధులు ఇవ్వడం లేదు.

‘ఖేలో ఇండియా’ ను సద్వినియోగం చేసుకోవాలి

దేశంలో క్రీడారంగ అభివృద్ధి, 2024 ఒలింపిక్స్‌లో పతకాల సాధనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఖేలో ఇండియా పథకాన్ని సైతం తెలుగు రాష్ట్రాలు సద్వినియోగం చేసుకోలేకపోతున్నాయి. ఈ పథకంలో భాగంగా మొత్తం 19 రకాల క్రీడల్లో ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి ఎనిమిదేళ్ల శిక్షణతో పాటు ఆర్థికసాయం సైతం అందిస్తారు. ఎంపికైన క్రీడాకారుల శిక్షణ కోసం 3 లక్షల 80 వేల రూపాయలు, క్రీడాకారుల వ్యక్తిగత ఖాతాలో నేరుగా లక్షా 20 వేల రూపాయలు జమ చేస్తారు.

ఖేలో ఇండియా పథకం కోసం దేశవ్యాప్తంగా మొత్తం 734 మందిని ఎంపిక చేస్తే అందులో తెలంగాణ రాష్ట్ర క్రీడాకారులు నలుగురంటే నలుగురు మాత్రమే.

500 కోట్ల రూపాయల నిధులతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఖేలో ఇండియా పథకానికి తెలుగు రాష్ట్రాల క్రీడాకారులు తగిన సంఖ్యలో ఎంపిక కాలేకపోడానికి రాష్ట్ర ప్రభుత్వాలు, క్రీడాసంఘాల నిర్లక్ష్యం, చేతకానితనమే కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

సమగ్రాభివృద్ధిలో క్రీడలు కూడా ఓ ప్రధాన భాగమని తెలుగు రాష్ట్రాలు గుర్తించనంత వరకూ ఆటలు నీటి మూటలుగా మిగిలిపోక తప్పదు.

– క్రీడా కృష్ణ , 84668 64969

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *