పెహల్గావ్ సంఘటన తర్వాత భారత్ ఆరంభించిన ఆపరేషన్ సిందూర్‌లో, పాక్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్, వైమానిక దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టిన రష్యా తయారీ ఎస్-400, ‘సుదర్శనచక్ర’ గురించి ఎంత చెపుకున్నా తక్కువే. మే 7-8 రాత్రివేళల్లో పాకిస్తాన్ మనదేశం పై కనీసం 15 క్షిపణులను, వందలాది డ్రోన్‌లను ప్రయోగించింది. ముఖ్యంగా జమ్ము-కశ్మీర్, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాలోని 15 నగరా సైనిక స్థావరాలు లక్ష్యంగా ఈ దాడులు చేసింది. పరిస్థితిని గుర్తించిన మన భద్రతా బలగాలు వేగంగా ఎస్-400 ‘సుదర్శనచక్ర’ను తక్షణమే క్రియాశీలకం చేశాయి. దీంతో పాక్ ప్రయోగించిన ఏ ఒక్క క్షిపణి, లేదా డ్రోన్ భారత భూభాగంలోకి ప్రవేశించలేకపోయాయి. అన్నింటిని మధ్యలోనే ఈ ఎస్-400 వ్యవస్థ నిర్వీర్యం చేయడంతో ఒక్కసారిగా అవాక్కవడం పాక్ సైన్యం వంతైంది. ఎస్-400 సమర్థవంతమైన పనితీరు సర్వత్రా ప్రశంసలందుకుంది. కాగా ఈ రక్షణ వ్యవస్థ నిర్వీర్యం చేసిన క్షిపణులు, డ్రోన్‌ల శకలాలను అధికార్లు సమీకరించి ఫోరెన్సిక్ పరీక్షలకు పంపడం తర్వాతి పరిణామం.
తర్వాత పాకిస్తాన్ తన దాడులను ముమ్మరం చేస్తూ, ఎఫ్-16 వంటి అమెరికా అత్యాధునిక యుద్ధవిమానాన్ని రంగంలోకి దించింది. విచిత్ర మేమంటే అమెరికా ఎంతో గొప్పగా చెప్పుకుంటూ ప్రపంచ దేశాలకు అమ్మకాలు సాగించే ఈ ‘అత్యాధునిక’ యుద్ధ విమానాన్ని కూడా మన ‘సుదర్శన చక్రం’ తుత్తునియలు చేసింది. అంటే ఎఫ్-16లో ఉపయోగించే సాఫ్ట్‌వేర్ కూడా ఎస్-400 ముందు దిగదుడుపన్నది సత్యం. ఇక చైనాకు చెందిన జె.ఎఫ్-17 యుద్ధవిమానాల పరిస్థితి చెప్పాల్సిన అవసరమేలేదు. అవి అట్టపెట్టెల్లా కూలిపోయాయి. ఇంతటి సామర్థ్యాన్ని ప్రదర్శించిన ఎస్-400 రక్షణ వ్యవస్థను రష్యాకు చెందిన అల్‌మాజ్ అనటే సంస్థ అభివృద్ధి చేసింది. వీటిని కొనుగోలు చేసిన మనదేశం ‘‘సుదర్శనచక్ర’’ పేరుతో పాక్ సరిహద్దుల్లో మోహరిం చింది. భూమి ఉపరితలంనుంచి- ఆకాశంలోకి సుదూర లక్ష్యాలను ఛేదించే క్షిపణులను ప్రయోగించే సామర్థ్యమున్న ప్రపంచంలోని ఏకైక రక్షణ వ్యవస్థ ఎస్-400. ఇందులో ప్రతి స్క్వాడ్రన్‌కు ‘ఫేస్‌డ్ ఎర్రే రాడార్లు’, కమాండ్ సెంటర్లు, బహుళ రకాల క్షిపణులను అమరుస్తారు. 600 కిలోమీటర్ల దూరంలోని ప్రత్యర్థి వైమానిక, క్షిపణులను గుర్తించి 400 కిలోమీటర్ల లోపున వాటిని ధ్వంసం చేయడం ఈ ‘సుదర్శనచక్ర’ విశిష్టత. డ్రోన్లు, క్రూ యీజ్ క్షిపణులు, ఖండాంతర క్షిపణులు, స్టెల్త్ యుద్ధ విమానాల నుంచి ఇది చక్కటి రక్షణ కల్పిస్తుంది. ఇవేవీ కూడా ‘సుదర్శనచక్ర’ డేగకన్ను నుంచి తప్పించుకోలేవు. పాక్ ఘర్షణలో సరిగ్గా ఇదే జరిగింది.
ప్రస్తుతం భారత్ ఈ ఎస్-400 వ్యవస్థలను జమ్ముకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో తేలిగ్గా దాడులకు గురయ్యే సరిహద్దు ప్రాంతాల్లో మనదేశం మోహరించింది. వేగంగా కదలడం, ఇతర రక్షణ వ్యవస్థలతో తేలిగ్గా అనుసంధానమవడం దీని ప్రత్యేకత. పాకిస్తాన్‌కు చెందిన ఎయిర్ డిఫెన్స్ రాడార్లను ధ్వంసం చేసిన ఇజ్రాయిల్‌కు చెందిన ‘హార్పీ’ డ్రోన్లతో కూడా ఎస్-400 వ్యవస్థ తేలిగ్గా అనుసంధానం కావడం విశేషం. దీనివల్ల ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో భారత్ తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించింది. ముఖ్యంగా అతి క్లిష్టమైన, బహుళ ప్రవేశమార్గాల ద్వారా ఏకకాలంలో నిర్వహించిన దాడులను సమర్థవంతంగా నిరోధించ గలిగింది.
ఈ విధంగా ఎస్-400 మన గగతలాన్ని శత్రు దుర్భేద్యం చేయడమే కాదు, ప్రత్యర్థులు ముఖ్యంగా పాకిస్తాన్ మనోధైర్యాన్ని బలీయంగా దెబ్బతీసింది. గుర్తించడం, వెంటాడటం, ధ్వంసం చేయడం అనే దీనికున్న మూడు ప్రధాన లక్షణాల కారణంగా, పాకిస్తాన్ చేసిన ఎదురుదాడులన్నీ విఫలం కావడమే కాదు, భారత్ ఆధిపత్యం మరింత విస్పష్టంగా ప్రదర్శితమైంది. దీని ఫలితంగా యుద్ధ పరిణామం మొత్తం ఒకేసారి భారత్‌కు అనుకూలంగా మారింది. ఎస్-400 కారణంగా దక్షిణాసియాలో భారత్ మరింత పటిష్టమైన, శత్రు దుర్భేద్య దేశంగా రూపొందిందనే చెప్పాలి. ఈ యుద్ధం చైనాకు కూడా భారత్ సత్తా ఏంటో, తాను పాక్‌కు సరఫరా చేసిన రక్షణ వ్యవస్థలు ఎంత పనికిమాలినవో కూడా బాగా అర్థమైవుంటుంది. దీంతో రక్షణరంగంలో చైనా మార్కెట్లు కుప్పకూలే పరిస్థితి నెలకొంది. అంతేకాదు అమెరికా ఎఫ్-16 యుద్ధవిమానాన్ని కూడా మనదేశం కూల్చి వేయడంతో, మనవద్ద తయారవు తున్న రక్షణ పరికరాలు అత్యున్నత నాణ్యతా ప్రమాణా లతో పాటు, అత్యంత కచ్చితత్వంగా పనిచేస్తాయన్న సత్యం ప్రపంచానికి వెల్లడైంది. బహుశా రాబోయే కాలంలో మన రక్షణరంగ ఉత్పత్తుల మార్కెట్ మరింత విస్తరించే అవకాశాలూ లేకపోలేదు. ఒకరకంగా చెప్పాలంటే పాకిస్తాన్ మన నెత్తిన పాలు పోసింది.
– విఠల్