– ఆర్.సి. కృష్ణస్వామిరాజు
భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది
‘‘నాలుగు నాటు కోడి గుడ్లు ఉంటే ఇస్తావా నారాయణక్కా?’’ అని అడిగినాడు ఆదిరాజు.
‘‘నాలుగు లేవు ఆదిరాజూ…రెండు ఉండాయి. ఇచ్చేదా!’’
‘‘మన పుత్తూరు కట్టు గట్టిగా అతుక్కోవాలంటే నాటుగుడ్లు అయితే బాగుంటుంది కదక్కా!’’
‘‘ఇప్పుడు మన ఊర్లో నాటు కోడిగుడ్లు ఎక్కడ దొరకతా ఉండాయి, అందరూ పౌల్ట్రీ ఫారం గుడ్లనే కదా వాడతా ఉండారు’’.
‘‘నిజమే అనుకో అక్కా. దొరికితే తీసుకెల్దామని.
మద్రాసు సిటీ ‘ఆవడి’లో ఒకాయనకు తొడకి కట్టు కట్టాలి. నాటు గుడ్లు దొరికితే బాగుణ్ణని అడిగినాను’’ అంటూ డబ్బులిచ్చి రెండు గుడ్లు తీసుకుని భద్రంగా ఇంటికి తీసుకెళ్లినాడు ఆదిరాజు.
అప్పటికే…
భార్య సంపూర్ణక్క బ్యాగు సర్దుతూ ఉంది.
పాత తెల్ల కాటన్ పంచె, దూది, సున్నం, పసుపు డబ్బాలు అందులో పెట్టి ఉంది.
కట్టు కట్టడానికి అవసరమైన వెదురు దబ్బల మూటను అటక మీది నుంచి దించినాడు.
ముందురోజే ‘మాతంగుడు’ వెదురు కొయ్యలను నిలువునా చెక్కి మూర కొలతతో దబ్బలు చెక్కి ఉన్నాడు. చూడటానికి అవి అచ్చం స్కేళ్లు మాదిరి ఉన్నాయి.
‘ఎంత నైపుణ్యం ఈ మాతంగుడికి?’ అని మెచ్చుకున్నాడు. వాటిలో కొన్ని మంచి దబ్బలను ఏరినాడు.
కట్టుకు అవసరమైన ఆకు పసరు ఉందో లేదోనని స్టీలు క్యారియర్ తెరిచి చూసినాడు. కొంచెమే కనిపించింది.
‘‘సంపూర్ణా…ఆకు పసరు అయిపోయి ఉంది. కొంచెంసేపు ఉండు. ముగ్గురాళ్లమిట్ట కాడికి పోయి ఆకు కోసుకుని వస్తాను’’ అని చెప్పి సరసరా వెళ్లినాడు.
ముగ్గురాళ్లు పరిచినట్లుగా ఉన్న నేల అది. కంపచెట్లు దట్టంగా ఉన్నాయి.
కటవ పక్కన పచ్చటి ఆకు పసరు చెట్లు నవ్వుతూ పలకరించాయి.
చెయ్యి పెట్టబోయాడు.
ఏదో కదలాడిన శబ్దం. ఉలిక్కిపడినాడు. పెద్ద పసిరిక పాము…. ఆకుపచ్చ రంగులో ఉండటం వల్ల గమనించలేదు. దొరికిన కర్రతో దాన్ని తరిమినాడు. అది సరసరా ఆకులమీదనే ఎగబాకుతూ వెళ్లిపోయింది.
‘హమ్మయ్య’ అని గాలి పీల్చుకున్నాడు.
‘చిత్తూరు జిల్లా, పుత్తూరు కట్టు అంటే చాలామంది… పేలికలు చుట్టి పైసలు దండిగా సంపాదిస్తా ఉండారని అనుకుంటారు. పడిలేస్తే కదా కష్టనష్టాలు తెలిసేది!’ అనుకుంటూ కావలసినన్ని ఆకులు కోసి సంచిలో వేసుకున్నాడు.
రెండు ఫర్లాంగుల దూరంలోని ఇంటికి మూడు నిమిషాల్లో నడిచినాడు.
భార్య చేతికి ఆకులిచ్చి సన్నికల్లు రాయి మీద బాగా నూరమని స్నానానికి వెళ్లాడు..
స్నానం చేసి గోడ గడియారం వైపు చూశాడు.
గంట పదవుతోంది.
దేవుని గదిలోకి వెళ్లి పుత్తూరు వైద్యం కనుగొన్న ‘పెద్దరాజు’ గారికి మనసులోనే కృతజ్ఞతలు తెలిపాడు.
పుత్తూరు గుండా మద్రాసు వెళ్లే సప్తగిరి రైలు వచ్చే టైం అయ్యిందని కావల్సినవన్నీ గబగబా సర్దుకున్నాడు.
‘‘ఏమండీ…నాలుగు ఇడ్లీలు తినిపోరాదా!’’ అడిగింది సంపూర్ణక్క.
‘‘నేనిక్కడ తింటా కూర్చుంటే రైలు నాకోసం స్టేషన్‌లోనే ఉంటుందా?’’ అంటూ కుడి చెప్పు, ఎడమ కాలుకి, ఎడమ చెప్పు కుడి కాలికి తగిలించుకుని అడుగులేయ బోయాడు.
‘‘చెప్పులన్నా సరిగ్గా వేసుకోండి!’’ అని చెప్పే సరికి పడిపోతున్నవాడల్లా టక్కున జాగ్రత్తపడి చెప్పులు సరిగ్గా వేసుకుని పరుగులు తీసినాడు.
* * *
చల్లగా గాలి వీస్తోంది.
రైల్లో కిటికీ పక్కన కూర్చుని పచ్చటి పొలాలు చూస్తున్నాడు ఆదిరాజు.
‘నన్ను పట్టించుకోలేదేమి?’ అని పొట్టలోని పేగులు ప్రశ్నించాయి.
‘రైల్లో దొరికే తిండి తినే మనిషి కాకపాయె…’ సంచిలోని నీళ్ల సీసా తీసి గుటగుట తాగి పొట్ట పేగుల్ని శాంతింపజేసినాడు.
సీసాను సంచిలో పెడుతూ ఉంటే… కుడి చేయి మీది పెద్ద గాటు కనిపించింది.
పదేళ్ల క్రితం జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది.
* * *
సాయంత్రం ఏడు గంటలయ్యింది.
హాల్ లో కూర్చుని టీవీ చూస్తున్నాడు ఆదిరాజు.
‘ట్రింగ్ ట్రింగ్’ మని ఫోన్ మోగింది.
లేచి ఫోన్ అందుకున్నాడు.
‘‘సార్…సార్… మాది గాజుల మండ్యం షుగర్ ఫ్యాక్టరీ పక్కన సూరప్పకశం గ్రామం. మా అన్న పొలం కాడ జారి పడినాడు. మీరు వచ్చి కట్టుకట్టాలి సార్’’
‘‘రేపు ఉదయం వచ్చి కడుతాలే! ఇంతరాత్రిలో బస్సు పట్టుకుని ఇరవై మైళ్లు రాలేను!’’ అని చెప్పి ఫోన్ పెట్ట బోయాడు.
‘‘సార్. ఈరోజైతే నేను ఊర్లో ఉంటాను. కట్టు కట్టడానికి సహాయ కారిగా ఉంటాను. రేపు అర్జెంటు పని మీద నెల్లూరు వెళ్లాల్సి ఉంది. దయచేసి రాగలరు. మీరు గాజులమండ్యంకి బస్సు ద్వారా చేరుకున్నారంటే నేను మిమ్మల్ని మోటార్ సైకిల్‌పై మా ఊరికి తీసుకుపోగలను. దయచేసి.. రానని చెప్పకండి సార్’’ అని ప్రాధేయపడుతున్నాడు.
పక్కనే ఉన్న భార్య సంపూర్ణక్క ‘‘వెళ్లి రండి.. పాపం…వాళ్లు ఎన్ని కష్టాల్లో ఉన్నారో!’’ అని చెప్పింది.
‘‘సరే వస్తా!’’ అని చెప్పి బ్యాగు సర్దుకుని రోడ్డు పైకి వెళ్లి బస్సు ఎక్కాడు.
అర్ధగంటలో గాజులమండ్యం చేరిపోయాడు.
ఫోన్ చేసిన అబ్బాయి బండి పెట్టుకుని సిద్ధంగా ఉన్నాడు.
ఆ అబ్బాయి వెనుక కూర్చున్నాడు.
బండి పొలాల గట్ల మీద సర్రున పోతోంది.
అమావాస్య ముందు రోజు కాబట్టి బాగా చీకటిగా ఉంది.
ఇంతలో…గబుక్కున బండి బ్రేకులు పడ్డాయి.
‘‘ఏమైంది బాబూ?’’ అని అడిగాడు.
‘‘పంక్చర్ లాగుంది కొంచెం దిగండి!’’ అన్నాడు.
అతడు టైరు చెక్ చేస్తూ ఉంటే ఆదిరాజు దూరంగా ఉన్న శేషాచలం కొండల వైపు చూస్తూ ఉన్నాడు.
ఎవరో…గొంతు చుట్టూ గుడ్డతో బిగిస్తున్నట్లు అనిపిస్తే వెనక్కి తిరిగాడు.
దాడి చేస్తున్నది మోటార్ సైకిల్ కుర్రాడు.
వాడిని గట్టిగా విదిలించి కింద పడేశాడు
సరుక్కున కత్తి పైకి తీశాడు కుర్రాడు.
మెడలోని చైను, చేతి ఉంగరాలు తీసి ఇమ్మన్నాడు.
చైను సులభంగా వచ్చేసింది. అయితే వేలి ఉంగరం ఒక పట్టాన రాలేదు.
‘‘ఎంతసేపు?’’ అంటూ ఆ కుర్రాడు కత్తితో చేతి మీద పొడిచాడు.
బెదిరిపోయాడు ఆదిరాజు
బలవంతంగా ఉంగరాన్ని లాగి అతడి చేతిలో పెట్టాడు.
అంతే… ఆ కుర్రాడు బండి స్టార్ట్ చేసి వేగంగా చీకటిలో కలిసిపోయాడు.
కళ్లు తిరిగి పడిపోయాడు ఆదిరాజు.
దారిలో వస్తున్న ఆటో డ్రైవర్ పోలీస్ స్టేషన్‌కి చేర్చాడు.
కేసు రాసుకుని ట్రీట్‌మెంట్ కోసం ఆదిరాజును హాస్పిటల్‌కి పంపిస్తూ ఎస్.ఐ ‘‘అలా ఎవరంటే వాళ్లు ఏ వేళంటే ఆ వేళ పిలిస్తే వెళ్లిపోవడమేనా?’’ అని అడిగాడు.
‘‘మా వృత్తే అంత సార్. రోగి ఏ ఇబ్బందిలో ఉన్నాడోనని పరుగులు తీస్తాం. వైద్యం పేరు చెప్పి ఇలా దొంగతనం చేస్తారని ఊహించలేము కదా’’ అని సమాధానమిచ్చాడు.
‘ఏండ్లు గడిచినా దొంగా దొరకలేదు, బంగారమూ దొరకలేదు. గాయం మాత్రం మిగిలింది’ అని అనుకుంటూ అలాగే.. నిద్రపోయాడు.
* * *
మద్రాసు సెంట్రల్ స్టేషన్ వచ్చింది.
చిన్నగా అడ్రెస్ పట్టుకుని ఆవడి వెళ్లాడు.
ఇంటి గుమ్మం ముందర నిలుచుని ఉన్న సుగంధి నమస్కారం చెప్పి లోపలికి తీసుకెళ్లింది.
మంచంపైన పడుకుని ఉన్న పడవట్టన్ మెల్లగా లేచి కూర్చున్నాడు.
మూడు రోజులముందు పని చూసుకుని వస్తూ ఉంటే వేగంగా వచ్చిన మోటార్ సైకిల్ గుద్దుకుని కింద పడిపోయానని, దెబ్బ తగిలిందనీ చెప్పాడు.
‘‘ఏమీ కాదు. మేము చేసేది ప్రకృతి వైద్యం. తక్కువ ఖర్చు, శ్రమలతో మీరు ఆరోగ్యవంతులవు తారు. మొత్తం మూడు కట్లు కట్టించుకోండి. కదలకుండా చూసుకోండి. అంతే…’’ అని ధైర్యం చెప్పాడు.
చెప్పులు తీసి పక్కన పెట్టి వైద్యానికి ఉపక్ర మించాడు.
‘‘మా ఇంట్లో చెప్పులు వేసుకోవచ్చు!’’ తమిళ భాషలో చెప్పింది సుగంధి.
‘‘ఈ వృత్తి నాకు దైవం. వైద్యం చేసేటప్పుడు నేను చెప్పులు వేసుకోను!’’ అన్నాడు.
భార్యాభర్తలిద్దరూ ఆశ్చర్యంగా చూశారు.
బల్లని దగ్గరిగా జరిపి దానిపైన ఆకు పసరు, గుడ్డు, పాత పంచె, దూది, వెదురు దబ్బలు,చిన్న కత్తెర, పసుపు,సున్నం డబ్బాలు పెట్టాడు.
చిన్నగా అదీ ఇదీ మాట్లాడుతూ టక్కుమని తొడని చేత్తోనే సరిచేశాడు.
‘అబ్బా’ అని అరిచాడు పడవట్టన్.
‘‘ట్రీట్‌మెంట్ అయిపోవచ్చింది…’’ అంటూ తొడ మీద ఆకు, గుడ్డు తెల్ల సొన కలిపి పూశాడు. దానిపైన దూది పరిచి సున్నం, పసుపు రాసాడు. దానిపైన వెదురు దబ్బలు పెట్టి పంచెను పేలికలుగా చించి చుట్టసాగాడు.
కన్నార్పకుండా చూస్తున్న సుగంధి ‘‘మీకు ఈ వైద్యం ఎలా అబ్బింది?’’ అని అడిగింది.
‘‘ఇది మేము కనిపెట్టింది కాదు. మా పూర్వికులు పశువులను తోలుకుని అడవికి వెళ్లేవారు. ఒకరోజు చిన్న దూడకు గాయమయ్యింది. అప్పటికప్పుడు ఏమి చేయాలో తెలియక, పక్కనున్న ఆకుల్ని కోసి ఆ దూడను దానిలో పెట్టుకుని ఇంటికి వచ్చేశారు. వైద్యం చేయించాలని రెండుమూడు రోజులు వైద్యుడి కోసం వెదికారు. సాధ్యం కాలేదు. జాగ్రత్తగా గమనించిన వారికి దూడకి గాయమైన చోట అతుక్కోవడం కనిపించింది. ఆశ్చర్యపోయారు. చిన్నగా మొదట పశువులకు, తర్వాత మనుషులకు ఈ ఆకుపసరు వైద్యం ప్రారంభించారు’’.
ఆసక్తిగా విన్న ఆమె వేడివేడి ఫిల్టర్ కాఫీ ఇచ్చింది.
తృప్తిగా తాగాడు.
పదిహేనవ రోజున వస్తానని చెప్పాడు.
ఆమె క్యాలెండర్ చూస్తూ ‘‘ఆరోజు భోగి పండుగ!’’ అని చెప్పింది.
‘‘అయినా వస్తాను. మాకు పండుగలు, ఆదివారాలు అంటూ సెలవులు ప్రత్యేకంగా ఉండవు’’ అని చెప్పాడు. తీసుకోవల్సిన జాగ్రత్తలు, కాళ్లకు వాడవలసిన తైలం గురించి తెలియజేశాడు.
సుగంధి అయిదువందలు చేతిలో పెడుతూ ‘‘మీరు వైద్యం చేసే ఆకు పేరేమి సార్!’’ అని అడిగింది.
నవ్వుతూ ‘‘అది చిదంబర రహస్యం’’ అన్నాడు.
‘‘పోనీ..ఆకు ఎలా ఉంటుంది సార్!’’ అని అడిగింది.
నవ్వుతూ ‘‘ఏమి చేసుకుంటావమ్మా ఆ ఆకుతో?’’ అంటూ ఆ ఆకు ఎలా ఉంటుందో చెప్పి బయలుదేరాడు.
రెండవ కట్టు రోజు-
చల్లటి ఏసీ గాలి మెల్లమెల్లగా వస్తోంది.
సుగంధి ‘‘సార్, మీ వైద్యాన్ని పెద్దపెద్దవాళ్లు తీసుకున్నారట కదా’’ అని అడిగింది.
ఆదిరాజు గర్వంగా ‘‘ఎన్టీయార్, కృష్ణంరాజు, చంద్రమోహన్, చలం, హలం, గిరిబాబు లాంటి సినీనటులు, భారత రాష్ట్రపతులు వి.వి.గిరి, నీలం సంజీవరెడ్డి లాంటి మహామహులు కూడా వైద్యం తీసుకున్నారు’’ అని చెప్పాడు.
‘‘అలాగా!’’ అని ఆశ్చర్యపోయింది సుగంధి.
‘‘సార్..ఏమీ అనుకోకపోతే మిమ్మల్ని వీడియో తీసుకోవచ్చా?’’ అని అడిగింది.
‘‘బంగారంగా!’’ అన్నాడు ఆదిరాజు.
‘‘ఒక్క నిమిషం!’’ అని చెప్పి పక్కనే ఉన్న దువ్వెనతో తల, మీసాలు దువ్వుకున్నాడు పడవట్టన్. తను కట్టిన తెల్లపంచె, తెల్ల జుబ్బా సర్దుకున్నాడు.
కట్టు కడుతున్నంతసేపూ వీడియో తీసింది సుగంధి.
మూడవ కట్టు కట్టే రోజు-
‘‘ఇది చివరి కట్టు. పదిరోజుల తర్వాత కట్టు విప్పివేయవచ్చు. అన్ని పనులూ చేసుకోవచ్చు’’ అంటూ కొన్ని చిన్నచిన్న ఎక్సర్‌సైజ్ లు నేర్పించాడు.
భార్యాభర్తలిద్దరూ చేతులెత్తి నమస్కరించారు. కాలు బాగవుతున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఆదిరాజుకు తిరునల్వేలి హల్వా తినిపించారు. తెల్లపంచె, తెల్ల తువ్వాలు బహుమతిగా ఇచ్చారు.
కుషీ అయినాడు ఆదిరాజు.
* * *
వారాలు గడిచాయి. నెలలు జరిగాయి. నాలుగు సంవత్సరాలు నడిచాయి.
కూతురు కస్తూరికి అన్నా యూనివర్సిటీలో ఇంజినీరింగ్ సీటు వచ్చిందని బాడుగ కారులో బయలుదేరాడు ఆదిరాజు. ముందు సీటులో తను, వెనుక సీటులో భార్య, కూతురు కూర్చున్నారు.
కారు ఆవడి గుండా వెళ్తోంది.
‘పచ్చి అమ్మాన్ కోయిల్’ సిగ్నల్ వద్ద ఆగింది.
‘‘నాన్నా…మన పుత్తూరు కట్టు’’ అని గట్టిగా అరిచింది కూతురు కస్తూరి.
‘‘అవునా..ఎక్కడ?
‘‘మన ఊరి వాళ్లు ఏమైనా ఇక్కడ క్యాంపు పెట్టారేమో…’’ అంటూ తల తిప్పి చూశాడు.
పెద్ద బోర్డులో ‘పురాతన పుత్తూరు వైద్యం ఇప్పుడు మన ఆవడిలో…’ అని అరవంలో, తెలుగులో, ఇంగ్లీషులో రాసి ఉంది. దాని కింద వరుసగా…. ఎర్ర అక్షరాలతో 247 వైద్యసేవలు, వందకి వంద శాతం విజయవంతమైన వైద్యం… అని కూడా ఉంది.
అందులోనే కట్టు కట్టుకున్న ఒక కుర్రాడి పెద్ద ఫోటో పెట్టి దాని పక్కన ‘పుత్తూరు కట్టు’ అని పెద్ద అక్షరాలు ఉన్నాయి.
‘ఎవరబ్బా మనకి తెలియకుండా ఇక్కడ, మన వైద్యం చేసే వాళ్లు..’ అనుకుంటూ కారు పక్కకి నిలబెట్టించాడు ఆదిరాజు.
ముందు గదిలో అందమైన రిసెప్షనిస్ట్ కూర్చుని ఉంది.
ఏసీ గాలులకు చలి వేసింది ఆదిరాజుకు.
‘‘మీకు మేము ఎలా సాయపడగలము?’’ చిరునవ్వులు చిందిస్తూ అడిగింది ఆమె.
హాస్పిటల్ అంతా తల తిప్పి చూస్తూ ఉన్న ఆదిరాజుతో ఆమె ‘‘ఇంటికి వచ్చి కూడా సేవలు అందించగలం. పేరు రిజిస్టర్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ ఫీజు అయిదు వందలు. మిగిలిన ఫీజు కేసును బట్టి డాక్టరు చెబుతారు ‘‘ అని వివరించింది.
లోపలి గదిలో ఎవరికో వైద్యం అందిస్తున్నాడు డాక్టర్.
చిన్నగా అద్దానికి అడ్డంగా ఉన్న స్క్రీన్ తొలగించి చూశాడు.
డాక్టర్ పడవట్టన్ కట్టు కడుతున్నాడు. సుగంధి పక్కనే ఉండి సహాయం చేస్తూ ఉంది.
‘అంటే…మన దగ్గర వైద్యం తీసుకున్న వ్యక్తి ఇప్పుడు వైద్యుడు అయిపోయాడన్నమాట’.
తలని ఐసుగడ్డల్లో పెట్టినట్లయ్యింది.
చిన్నగా అక్కడినుంచి కదిలి కారు ఎక్కి కూర్చున్నాడు.
వెనుకనే రిసెప్షనిస్ట్ గట్టిగా అరుస్తోంది ‘‘మీరు ఇదే వైద్యానికి పుత్తూరు వెళ్లి రావాలంటే రానూపోనూ ఎంతో ఖర్చు, శ్రమ ఉంటుంది. రండి…రిజిస్ట్రేషన్ చేసుకోండి’’
కారు వేగం పెరిగింది.
‘సినిమాలు, వస్తువులు కాపీ కొట్టడం చూశాము. వైద్యాన్ని కూడా కాపీ కొడుతారా…?
వస్తువులన్నీ నకిలీలు వస్తున్నాయని తెలుసు. ఇప్పుడు వైద్యం కూడా నకిలీ వస్తువు అయిపోయిందా… మేము ఎన్నో ఏళ్లుగా ఆ వైద్యం పైనే కృషి చేస్తూ రేయింబవళ్లూ రోగులకు సేవలందిస్తున్నామే…ఆ వైద్యంపై పూర్తి అవగాహన లేకుండా ఎవరంటే వాళ్లు ఇలా వైద్యం ప్రారంభిస్తే…రోగుల పరిస్థితి ఏమిటి?’ ఆదిరాజు మనసు బాధగా మూలిగింది.
కారు స్టీరింగ్ ముందరి లాఫింగ్ బుద్ధుడి బొమ్మ అటూఇటూ ఊగుతోంది.