తెలుగు కథా రచయితల్లో ద్వితీయుడైనా, అద్వితీయుడైన కథా రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. గురజాడతో ఆరంభమైన కథానిక రచనను సుసంపన్నం చేసిన విశిష్ట రచయిత శ్రీపాద. తనదైన శైలిలో గురజాడ, గిడుగుల ప్రభావంతో వాడుక భాషలో రాసి మెప్పు పొందిన కథక చక్రవర్తి. బహుముఖ ప్రజ్ఞతో నాటకం, నాటిక, నవల, విమర్శ, స్వీయచరిత్ర వంటి పక్రియలన్నింటినీ స్పృశించినా, కథారచయితగా సుప్రసిద్ధులయ్యారు.
తొలి రచనగా మంతిప్రెగడ భుజంగరావు ‘వారకాంత’ చాటు ప్రబంధాన్ని నాటకీకరించి మల్లాడి సత్తిరెడ్డి ఆర్థికసాయంతో 1909లో అచ్చు వేశారు. ‘రాజరాజు’, ‘కలంపోటు’, ‘టీ పార్టీ’ వంటి నాటికలు రాశారు. గ్రాంథికవాదులైన విక్రమదేవవర్మ ‘రాజరాజు’ నాటకాన్ని అంకితం తీసుకున్నారు. విశ్వనాథ సత్యనారాయణ ‘రాజరాజు’ నాటక విశిష్టతను ప్రశంసిస్తూ భారతిలో (1925) వ్యాసం రాశారు. శ్రీపాద రాసిన ‘ఆత్మబలి’ మనో విశ్లేషణాత్మక నవలగా ప్రసిద్ధి పొందింది. ‘నీలాసుందరి’ పౌరాణిక నవల విమర్శకుల మెప్పు పొందింది. పాత్రికేయులుగా ‘ప్రబుద్ధాంధ్ర’తో ప్రతిభను నిరూపించుకున్నారు. మల్లిడి సత్తిరెడ్డి ‘రెడ్డిరాణి’ పత్రిక సంపాదకత్వ బాధ్యతలు కొన్నాళ్లు నిర్వహించారు. పద్య రచన పట్ల మక్కువతో ‘గీతామంజరి’, ‘మోహలేఖ’ వంటి ఖండకావ్యాలు రాశారు. అవధానాలు చేశారు.
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి (ఏప్రిల్ 23, 1891- ఫిబ్రవరి 25,1961) రామచంద్రాపురం తాలూకా పాలమూరు గ్రామంలో జన్మించారు. తెలుగు కవిత్వం, సాహిత్యం అంటే గిట్టని కుటుంబ వాతా వరణం. శ్రౌత స్మార్తాలు, జ్యోతిష్యం వారి కుల విద్యలు. కుటుంబ వాతావరణానికి అనుకూలంగా శ్రీపాద సంస్కృత పంచకావ్యాల్లో రఘువంశం, కుమార సంభవం, మేఘసందేశం చదువుకున్నారు. తెలుగు సాహిత్యం చదువుకోవాలన్న కోరిక బలీయంగా ఉన్నా, కుల విద్యలకు ఆటంకమని తండ్రి, చిన్నన్నలు అడ్డుకున్నారు. గురువులు, పెద్దల కంట పడకుండా ‘వీరేశలింగం కవుల చరిత్ర’ మూడోభాగం, పోలూరి వెంకట కృష్ణయ్యగారి ‘రోహిణీ సుధాకరం’ నాటకం మొదట చదివారు. శ్రీపాద మొత్తం 75 చిన్న కథలు రాశారు. ఇంకా చారిత్రక, జానపద కథలు రాశారు.
శ్రీపాద ‘కథానిక’ను చిన్నకథగానే భావించేవారు. వారి ఉద్దేశంలో చిన్నకథ రాయడానికి కథకుడు తన వాఙ్మయంలో ఎన్నో గ్రంథాలు చదివి గొప్ప కవుల పోకడలూ పలుకు బడులూ బాగా అవగాహన చేసుకుని ఉండాలి. చిన్నకథ చెప్పడానికెంతో వాక్శుద్ధి ఉండాలి. అది వినిపించడాని కెంతో నేర్పుండాలి. అది బోధపరచ డానికెంతో సంస్కారం ఉండాలి అని సూత్రీకరించారు. కథా రచయితకు వ్యుత్పన్నత, అభ్యాసం, నిశిత పరిశీలనా దృష్టి, సంస్కారం ఆవశ్యకాలన్న అభిప్రాయం అక్షర సత్యం. శ్రీపాద వారి కథలను స్థూలంగా 1) సంస్కరణాత్మక కథలు, 2) విషాదాంత ప్రణయ కథలు, 3) చారిత్రక కథలు, 4) జానపద కథలుగా వర్గీకరించవచ్చు.
శ్రీపాద కథల్లో ప్రబలంగా సంస్కరణ దృక్పథం ఉంటుంది. ప్రత్యేకించి మహిళాభ్యుదయ భావాలు న్నాయి. ఆయన కథల్లో అప్పటి సాంఘిక విరుద్ధాలైన వితంతు, రజస్వలానంతర వివాహాలున్నాయి. పరిణిత వయోపునస్సంథానాలు, బాల వితంతువుల అణచివేతపై తిరుగుబాటు ధోరణి, స్వతంత్రించి పునర్వివాహాలు చేసుకోవడాలున్నాయి. ఆడపిల్లలు స్వయంశక్తి శౌర్యాలు పెంపొందించుకోవడం, సాము గరిడీలు నేర్చుకోవడాలున్నాయి.
పెళ్లే ప్రధానంగా భావించకుండా, చదువుకొని స్వయంఉపాధిని కల్పించుకోవడం, వరుల నిర్ణయంలో పాలుపంచుకోవడం, చొరవ చూపడం, వరకట్నాన్ని తిరస్కరించడం భార్యభర్తను ప్రశ్నించ గలగడం, తండ్రీ కూతుళ్లు పరస్పర అవగాహనతో స్నేహపూర్వకంగా మెలగడం, వేశ్యల్లో కూడా గౌరవనీయులుంటారని గుర్తించడం, కొత్తకోడళ్లను ఆరడి పెట్టే అత్తలకు, విధవాడపడుచులకు బుద్ధి చెప్పడం వంటి మహిళాభ్యుదయ ప్రగతి స్ఫోరక భావాలెన్నో ఉన్నాయి. శ్రీపాద మహిళాభ్యుదయ దృక్పథం, ముందుచూపు ఒక శతాబ్ది ముందుగా ఉందంటే అతిశయోక్తి కాదు.
విషాదాంత ప్రణయ కథలు
శ్రీపాద వారి తొలికథ ‘ఇరువురమొక్క చోటికే పోదము’ తొలికథ. 1915 మార్చిలో ఆంధ్రపత్రికలో వెలువడింది. దీనిని సరళ గ్రాంథిక భాషలో రాశారు. ఇది విషాదాంత ప్రణయ కథ. ఇందులో కథన నైపుణ్యం, శిల్పం అంతగా లేవు. తరువాత కథల్లో ఈ లోపాన్ని సరిదిద్దుకొన్నారు.
ప్రణయ తపస్సు
తాను ప్రేమించిన బాల వితంతువును పరిస్థితుల ప్రభావం వల్ల మేనత్త రోకటి పోటుతో చంపుతుంది. ఆమె మరణాన్ని తట్టుకోలేక తానే అంత్యక్రియలు నిర్వహించి ఆమె సమాధి దగ్గర ప్రణయ తపస్సు, తల్లి సమాధి దగ్గర మాతృజపంతో కాలం గడిపే ప్రణయ తపస్వి భావోద్వేగ విషాదాంత కథ. శ్రీపాద రొమేంటిసిమ్ ప్రభావంతో రాశారు. శ్రీపాదవారి వితంతు వివాహ కథలన్నీ సుఖాంతాలు కాగా, ఈ కథ మాత్రమే బలవన్మరణపు విషాదాంతం.
ప్రణయ భంగం
శ్రీపాద ఈ కథను 1925 ఫిబ్రవరి ప్రబు ద్ధాంధ్రలో ప్రచురించారు. బాల వితంతువు ‘నరసు’ వినిపించిన విషాదాంత ప్రణయకథ. ఆమెను పునర్వివాహం చేసుకొనేందుకు ఎందరో యువకులు సిద్ధపడినా, ఆవిడ ఆస్తిలేని విధురుడైన జగ్గయ్య మావను చేసుకున్నది. పట్టుదలతో తనను ఆరాధిస్తూ మంచంలో ఉన్న అతడి సేవలో సంతోషిస్తుంది. అతడు కన్నుమూసినా తన జన్మ పునీతమైందని భావిస్తుంది.
సాంఘిక కథలు –
వితంతు వివాహ సంస్కరణలు
శ్రీపాదవారి సంస్కరణ దృక్పథానికి సంకేతాలుగా వీరేశలింగం ప్రభావంతో వితంతు వివాహాలు ప్రోత్సహించారు. ఆయన కథల్లో వీరేశలింగంగారిని ‘పాత్ర’గా ప్రవేశపెట్టారు. ‘రామలక్ష్మి’ కథలో కుహనా సంస్కర్త రంగారావు పన్నిన కుటిల వలయాన్ని వివేకంతో ఛేదించి తాను కోరుకున్న ‘సూర్యారావు అనే యువకుణ్ణి వివాహం చేసుకున్న వితంతు యువతి సాహస గాథ రామలక్ష్మి కథ.
‘వెలిపెడితే అల్లుడైనాడు’ కథలో యువ పండితుడు విశ్వనాథశాస్త్రికి వస్తున్న పేరు ప్రఖ్యాతులు చూడలేక పద్మనాభశాస్త్రి మాల యువతిని రక్షించాడన్న నెపంతో వెలివేయించాడు. పద్మనాభశాస్త్రి వితంతు కూతురు ‘నరసమ్మ’ విశ్వనాథశాస్త్రిని తీసుకొని లేచిపోయి పెళ్లి చేసుకొని తండ్రికి బుద్ధి చెప్పింది. తండ్రి తనను కొట్టి చంపుతా నంటే ‘నరసమ్మ’ సాహసంతో అర్ధరాత్రి ఇంట్లోంచి లేచివచ్చి విశ్వనాథ• శాస్త్రిని ప్రేమతో ప్రేరేపించి ‘ఎక్కడికైనా పోదాం పద’ అని ప్రయాణం కట్టించిన ఆమె సాహసానికి పర్యవసానమే పునర్వివాహం. శ్రీపాద కథల్లో స్త్రీ పాత్రలకుండే తెగింపు పురుష పాత్రల్లో అంతగా కనిపించదు. ఈ కథలో ‘నరసమ్మ’, రామలక్ష్మి కథలో రామలక్ష్మి పాత్రలే దృష్టాంతాలు.
‘అరికాళ్ల క్రింద మంటలు’ కథలో రుక్మిణి పదిహేడేండ్ల వితంతువు. ఇంట్లో వాళ్లంతా పనులన్నీ ఆవిడచేత చేయించేవాళ్లు. ఆవిడ చేయలేనంటే నిష్టురాలాడేవాళ్లు. కుటుంబసభ్యులంతా కలసి కూర్చోపెడితే బుద్ధి వస్తుందన్న నిర్ణయానికి వచ్చారు. ఆమె వాళ్ల రుక్మిణికి తల గొరిగించి ప్రయత్నాన్ని సహించలేక వితంతు వివాహాలు ప్రోత్సహిస్తున్న వీరేశలింగం గారి తోటకు జట్కావాడి సహాయంతో వెళ్లి పునర్వివాహం చేసుకుంటుంది. ఇంట్లో తల్లి కూడ ‘రుక్మిణి’కి సానుభూతి చూపించక అమానుషంగా ‘దొడ్లో గేదెతో సమానమై పోయాను’ అన్నప్పుడు, గేదెకు నీకూ సంబంధం మేమిటని ప్రశ్నిస్తుంది. వితంతు యువతి గేదె కంటే హీనంగా ఉందని ఆమె భావన.
అవినీతి నిరసన
శ్రీపాద అప్పటికే సంఘంలో ఉన్న అవినీతి, ఉద్యోగాల కోసం లంచం అడిగే స్థితిని ‘కలుపుమొక్కలు’ కథలో చిత్రించాడు. ఒక బీద బ్రాహ్మణుడు తన కొడుక్కు ఉద్యోగం కోసం ప్రెసిడెంటుగారి గుమస్తా వద్దకు వెళతాడు. అతడు అడిగిన లంచం ఇవ్వలేనంటాడు. చిట్టచివరి అస్త్రంగా ఒక వేశ్యను ప్రెసిడెంటుగారి వద్దకు తీసుకువచ్చేట్టయితే ఉద్యోగం ఇప్పిస్తానంటాడు. చివరకు ఏం చేయాలో తోచక ఒక వేశ్యను ప్రాధేయపడతాడు. ఆమె మొదట తిరస్కరించినా, అతడి బాధను గమనించి జాలితో అంగీకరిస్తుంది. సమాజంలో పెద్ద మనుష్యులుగా కనపడుతున్న వారం స్వార్థంతో ఎంత సంకుచితంగా మారతారో, మనం చులకనగా చూసే వేశ్య ఒక మంచి పనికోసం తన ఇష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించి మహోన్నత వ్యక్తిత్వం గల స్త్రీగా మారుతుంది.
అస్పృశ్యతా నిరసనలు
మత మార్పిడి ప్రోత్సాహాలు
శ్రీపాద తన కథల్లో ‘ఇలాంటి తవ్వాయి వస్తే’తో కులమత వివక్ష, అస్పృశ్యత, మత మార్పుల విషయంలో గ్రామంలో పెద్దలు – అగ్రవర్ణాల వాళ్లు ఏ విధంగా అసంబద్ధంగా, అమానుషంగా ప్రవర్తిస్తారో చూపించి, ఊరికి కొత్తగా వచ్చిన ఉపాధ్యాయుడు ‘కిరస్తానీ పంతులు’ ద్వారా మతం మార్పుల వల్ల ‘అస్పృశ్యులకు’ క్రిస్టియన్ మతం కల్పించలేని సాంఘిక గౌరవాన్ని మహమ్మదీయ మతంలోకి మారిన అస్పృశ్యుల్ని హిందువులు స్వీకరించి తమ పరిధిలోకి రానివ్వడం చిత్రించి అగ్రవర్ణాల వారికి కనువిప్పు కలిగించారు. పాఠకుల్లో ఆలోచన రేకెత్తించి చైతన్యం కలిగించారు. కులం కట్టుబాట్లకు జంకి పెళ్లి కోసం మతం మార్చుకున్న నిమ్న జాతి యువతీ యువకుల ప్రణయ వివాహ కథ ‘సాగర సంగమము’. శ్రీపాద 1931 అక్టోబర్ భారతిలో ప్రచురించారు. కులాతీత మతంగా ప్రసిద్ధి చెందిన క్రైస్తవ మతంలో చేరినవారు కూడా కులభేదాలు పాటించే యధార్థస్థితిని శ్రీపాద వాస్తవిక దృష్టితో చిత్రించారు.
నిరుద్యోగం-స్వయం ఉపాధి కథలు
నిరుద్యోగ సమస్య అప్పటికే సంఘంలో తాండవిస్తుంది. శ్రీపాద ఇతర సాంఘిక సమస్యలతో పాటు నిరుద్యోగ సమస్యను గూర్చి ‘తాపీమేస్త్రి రామదీక్షితులు బి.ఏ.’, ‘మార్గదర్శి’, ‘గుర్రప్పందాలు’ వంటి కథల్లో ప్రబోధాత్మకంగా చిత్రించారు. చదువుకున్న యువకులు అగ్రకులానికి చెందిన వారైనా, ఉద్యోగాల వేటలో పడి బాధపడేకన్నా, భేషజాలేవీ లేకుండా ఏదో ఒక వృత్తిని చేపట్టాలని, ఏదో ఒక వ్యాపారాన్ని ఇష్టంగా నిర్వహించాలనీ ప్రబోధిస్తూ రాసిన కథల్లో కథాశిల్పంతో, కథన శైలిలో అగశ్రేణిలో నిల్చే కథ ‘మార్గదర్శి’. ఒక ఉద్యోగానికి సిఫార్సు చేయమని అడగడానికి వచ్చిన యువకుడికి శ్రీపాద, ఇతరుల అనుభవాలను చెప్పి, ఉద్యోగాల వేటమానుకొని చిన్న వ్యాపారం మొదలుపెట్టమని, అవసరమైతే కొంత డబ్బు సహాయం చేస్తానని చెప్పాడు. ‘ఇంత చెప్పినా నీకింకా నౌకరీ వ్యామోహం పోదూ, పో? నా యెదుట నుంచోకు, వెళ్లిపో? అంటూ గద్దించాడు. చిన్న కథాంశాన్ని రచయిత గొప్ప కథగా మలిచాడు. ఉద్యోగాల వేట ఇతి వృత్తంతో రాసిన మరో కథ ‘గుర్రప్పందాలు’. ఇంటర్వ్యూలకు వెళ్లే యువకుల్ని ఎంత అసంబద్ధమైన ప్రశ్నలు వేస్తారో, జంతువుల్ని చేసి ఎలా అవమానపరుస్తారో వ్యంగ్యస్ఫోరక సంభాషణలతో చమత్కారంగా రచయిత అధిక్షేపించాడు. ‘తాపీమేస్త్రి రామదీక్షితులు బి.ఎ.’ కథలో పట్టభద్రుడైన రామదీక్షితులు ఉద్యోగం రాలేదని నిస్పృహతో ఉండ కుండా తాపీమేస్త్రి పని ద్వారా డబ్బు సంపాదిస్తున్న స్థితిని యువకులు ఆదర్శంగా తీసుకోవాలని ప్రబోధించారు.
దంపతులు అన్యోన్యత – సంఘర్షణ
శ్రీపాద కొత్త దంపతుల అన్యోన్యతను చిత్రించే కథలతోపాటు, దంపతుల నిత్య సంఘర్షణల కీచులాటలను కూడా చిత్రించారు. ‘నాటకం’ కథలో దంపతుల ఆత్మీయత, అన్యోన్యతలను గొప్పగా చిత్రించారు. ‘యావజ్జీవం హోష్యామి’, ‘షట్కర్మ యుక్తా’ వంటి కథల్లో భిన్న అభిరుచులూ, భేదాభి ప్రాయాలతో అనునిత్యం సంఘర్షించుకొనే దంపతుల మనస్తత్వాన్ని చిత్రించారు. భార్యభర్తలు ఒకరిపై ఒకరు ప్రేమ, గౌరవం లేకుండా, వివాహ మంత్రాల్లో చెప్పినట్లు యావజ్జీవం ఒకరికొకరు అంటిపెట్టుకొని ఉండాలనడం ఎంత హాస్యాస్పదమో, అసహజమో శ్రీపాద ఆనాడే గుర్తించి తాను స్త్రీపక్షం వహించారు.
పరాయి సంస్కృతీ నిరసన
అన్య భాషా సంస్కృతుల పట్ల కొందరు తెలుగు వారికి పెరుగుతున్న వ్యామోహాన్ని ‘శుభికే! శిర ఆరోహ’ అనే కథలో శ్రీపాద నిరసించారు. హిందీ భాషపట్ల, ఉత్తరాది రాష్ట్రాల వారి సంస్కృతి పట్ల ఆయనకెంతో విముఖత, బెంగాలీ ఉచ్ఛారణను, జీవనశైలినీ అనుకరిస్తూ, హిందూస్థానీ సంగీతాన్ని ప్రశంసిస్తూ, తెలుగు వారి పట్ల నిరసన వ్యక్తం చేస్తూనే, మేనరికం చేసుకోవడానికి వచ్చిన తల్లీ కొడుకులకు బుద్ధి చెప్పిన వ్యంగ్య ప్రధానమైన కథ. మన జాతి బాగు పడాలంటే కర్ణాటక సంగీతాన్ని ప్రోత్సాహించాలంటారు. ఆనాటి భావకవుల వింత ధోరణిని కూడా ‘క్షీర సాగర మథనం’ పెద్దకథలో అధిక్షేపించారు. జాతీయోద్యమంతో అంతర్భాగమైన ఖద్దరు ధారణనీ నిరసించారు. ‘సముద్రము నందలి మంచు కొండలు’ కథలో ఖద్దరులో జీవం లేదనీ, ఖద్దరు అనాగరిక చిహ్నమనీ అధిక్షేపించారు. వీరేశ లింగం గారి ప్రభావంతో ఖద్దరు ధారణని నిరసిం చిన శ్రీపాద ఆనాడు జాతీయోద్యమ అభిమానుల నిరసనకు గురయ్యాడు. శ్రీపాదవారు కథల్లో ‘రావులయ్య కథ’ (1924 రెడ్డిరాణి సంచిక) ఆత్మ విశ్వాసంతో కఠోర శ్రమతో రైతు కూలీగా చేరి కౌలు రైతుగా, స్వంత రైతుగా భూస్వామిగా, పారిశ్రామిక వేత్తగా అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి ఎందరికో ఆదర్శం. ఈ కథను మొన్న మొన్నటి వరకు విమర్శ కులు తొలిరైతు కథగా పేర్కొన్నారు.
శ్రీపాదవారి చారిత్రక కథలు
శ్రీపాద చారిత్రక కథల్లో ఒకటి రాచరికపు వెలమ స్త్రీల ఆత్మాభిమానం, శౌర్యానికి సంబంధించిన కథ ‘విమానం యెక్క బోతూనూ’-బొబ్బిలి యుద్ధం చరమదశలో బొబ్బిలి ప్రభువు రంగారాయుడు ఆదేశాన్ని ధిక్కరించిన రాణి మల్లమ్మదేవి వీరగాథ ఇది. చారిత్రక కథల్లో పూర్వ సంస్థానాలకు సంబంధించిన కథల్లో ‘వడ్లగింజలు’, ‘గులాబీ అత్తరు’ ప్రసిద్ధమైన కథలు. గులాబీ అత్తరు కథ నభూతో నభవిష్యతి. వడ్లగింజలు ఎంత పెద్ద కథో గులాబీ అత్తరు అంత చిన్న కథ. శిల్పదృష్ట్యా రెండు కథల్లో మౌలికాంశం ఒక్కటే. ‘గులాబీ అత్తరు’ కథలో కథానాయకుడైన అత్తరు సాయిబు ఢిల్లీ నుంచి వచ్చి రాజును దర్శించుకొని తన అత్తరు గొప్పతనాన్ని చెప్పాలనుకుంటాడు. రాజును చూడడం కుదరక నిరాశా నిస్పృహలతో అపురూపమైన అత్తరు సీసాని కోటగుమ్మం దగ్గర గోడకేసి పగలగొట్టాడు. అదే సమయంలో రాజు అశ్వారూఢుడై లోపలినుంచి రావడం, అత్తరు ఘాటుకు రాజు, అశ్వం మత్తుకు లోనై అర్ధనిమీలితులు కావడం కథలో కొసమెరుపు. గులాబీ అత్తరు గుబాళింపు నేటికీ పాఠకులకు అను భూతిని కలిగిస్తుంది. ఇతర భాషల్లోకి అనువదించ దగిన గొప్ప కథగా విమర్శకుల ప్రశంస అందుకుంది.
‘వడ్లగింజలు’ కథా పరిమాణంలో పెద్దదైనా కథాంశం చిన్నదే. రాజుని సందర్శించడానికి వచ్చిన చదరంగం శంకరప్ప ఆటగాడు సంస్థానంలో ప్రవేశించడానికి ఎన్నో అవరోధాలు, అడ్డంకులు కలిగించారు. చివరికి సహృదయుల సహకారంతో తెలివితో రాజుతో చదరంగం ఆడి గెలిచాడు. పారితోషికం ఏం కావాలో? కోరుకొమ్మన్నపుడు చమత్కారంగా చదరంగానికి 64 గళ్లు మొదట గడిలో ఒక వడ్ల గింజ, రెండో దానిలో దానికి రెట్టింపు చొప్పున వడ్లగింజలిస్తే చాలంటాడు. స్థూల దృష్టికి చాలా చిన్న కోరికనిపిస్తుంది. దివాన్జీతో రాజుగారు శంకరప్పగారు కోరిన వడ్లగింజలు లెక్క కట్టించాడు. దివాన్జీ కాగితంపై లెక్కించి శంకరప్ప గారి కోరిక తీర్చాలంటే పెద్దాపురం రాజ్యం చాలదు ప్రభూ! అంటాడు. ఆఖరికి సర్వలక్షణ సంపన్నమైన ఒక అగ్రహారాన్ని శంకరప్పకు సమర్పించాడు. శ్రీపాదవారు ఆసక్తికరమైన కథనంతో గొప్ప కథగా మలచి (1935 సెప్టెంబర్) ప్రబుద్ధాంధ్రలో ప్రచురించారు. ఈ కథలో శంకరప్ప చదరంగ ప్రావీణ్యం యుక్తి చాతుర్యం, రచయిత చమత్కార స్ఫూర్తికి నిదర్శనం. శ్రీపాదవారు ‘రాచపీనుగ తోడు లేనిదే చావదు’ అనే సామెతను నేపథ్యంగా చారిత్రక జానపద కథ రాశారు.
శ్రీపాద భాషా శైలి
శ్రీపాద తొలికథ ‘ఇరువురు మొక్క చోటికే పోదము’ కథ సరళ గ్రాంథిక భాషలో రాశారు. గిడుగు గురజాడల ప్రభావంతో వ్యవహారిక భాషలో తనదైన శైలిలో గోదావరి మాండలిక మాసంలో కథలు రాశారు. శ్రీపాద వారి తెలుగు నుడికారానికి సాహితీ లోకం ఎప్పుడూ రుణపడే ఉంటుంది. శ్రీపాద నాటక ప్రియత్వం ఆయన కథాశిల్పాన్ని ప్రభావితం చేసింది. శ్రీపాద తన కథలను ఎక్కువగా నాటక రూపానికీ, ముఖ్యంగా శ్రవ్య నాటక రూపానికి సన్నిహితంగా ఉండే విధంగా రూపొందించారు. రచయిత వ్యాఖ్యానం తక్కువగా, పాత్రల సంభాషణలే ఎక్కువగా ఉన్న కథలు ఎక్కువగా రాశారు. కొన్ని కథలు పూర్తిగా సంభాషణాత్మకాలు. కథారచనలో ఇటువంటి శిల్ప ప్రయోగాలు చేసిన తొలి కథా రచయత శ్రీపాద. ఆ కథల్లో తెలుగుతనం కోస్తాంధ్ర భాషయాసలో తొణికిసలాడుతుంటుంది. ఒక్కో చోట ఆయన భాషే శిల్పమవుతుంది. ఆయన కథల్లో శిల్పం వల్ల పాఠకుల విసుగు కలగకుండా చదివించే లక్షణం ఉంది. ఆయన కథల్లో ‘అపిదళతి వజ్రస్య హృదయమ్’ ‘యావజ్జీవం హోష్యామి’, ‘షట్కర్మయుక్తా’ కన్యాకాలే యత్నా ద్వరితా వంటి కథలకు ఔచిత్యమైన సంస్కృత భాషా శీర్షికలు పెట్టారు. ఆయన కథాశీర్షికలన్నీ ఔచిత్యాలే ‘పోలీస్’, ‘లీగల్ ఎడ్వైస్’ రెండు కథలకు మాత్రమే ఆంగ్ల శీర్షికలు పెట్టారు. కనక్ ప్రవాసి శ్రీపాద కథాశిల్పాన్ని వివరిస్తూ ‘తెలుగు కథని తెలుగు కథలా వ్రాయడం శాస్త్రి గారి కధనంలోని ప్రత్యేకత. ఎత్తుగడ, నిర్వహణ, ముగింపు అన్నిటా తెలుగుతనమే కాని అన్యవాజ్మయ ఛాయ కనబడదు’ అన్నారు.
శ్రీపాద కథలలో ప్రధానంగా కనిపించేది గ్రామీణ వాతావరణ చిత్రణ. గోదావరీ ప్రాంత బ్రాహ్మణ అగ్రహారాలను గూర్చి ఎక్కువగా ప్రస్తావిం చారు. తనకున్న మాండలిక జీవితానుభవాన్ని తన కథల్లో చెప్పారు. ఆయన కథల్లో సామాజిక స్పృహ స్పష్టంగా కనిపిస్తుంది.
పాత్రలు
శ్రీపాద ‘వీరేశలింగం’, గిడుగు రామమూర్తి వంటి వారిని పాత్రలుగా చేశారు. పురుష పాత్రల కంటే స్త్రీ పాత్రలు చిత్రణ పట్ల శ్రద్ధ చూపారు మహిళాభ్యుదయ దృష్టితో ఆనాటి సమాజాన్ని ఎదిరించి తిరుగుబాటు చేసిన స్త్రీ పాత్రలే ఎక్కువగా ఉన్నాయి. శ్రీపాద ఆధునిక కథాసాహిత్యంలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకొన్న గొప్ప రచయిత. అభ్యుదయ కధకుడిగా, గౌతమి కథకుడిగా, మహిళా భ్యుదయ వాదిగా, శిల్పవంతమైన చమత్కారమైన కథలు రాసి పాఠకుల హృదయాల్లో నిలిచి పోయారు. ఆయన అనుభవాలూ జ్ఞాపకాలులో చెప్పినట్లు ఆయన కథలు కళ్లకు వెలుగునిస్తాయి. బుద్ధికి పదును పెడతాయి మనసుకు ఉత్సాహం కలిగిస్తాయి. ‘నవీనాంధ్ర కథకుల్లో ఘనాపాఠీ’గా జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి వ్యాఖ్యానించారు.
డా।।పి.వి.సుబ్బారావు
9849177594,
విశ్రాంత అధ్యాపకుడు