చదివింది వైద్యవిద్య.

ప్రదర్శనలిచ్చింది నాట్యకళాకారిణిగా.

అధికార బాధ్యతలు చేపట్టింది జాయింట్‌ ‌పోలీస్‌కమిషనర్‌గా.

మూడింటా మిన్నగా ఉన్న, ఉంటున్న ఆ ఒక్కరూ ఆర్తీ!

ఆమె కోసం ప్రత్యేక వ్యవస్థనే రూపొందించింది అక్కడి ప్రభుత్వం.

అది మహారాష్ట్ర. ఆ ధాటి మహిళ స్వరాష్ట్రం ఉత్తరప్రదేశ్‌!

ఇం‌టలెజెన్స్ ‌విభాగం. పోలీసుశాఖలో…

కేంద్ర హోమ్‌ ‌వ్యవహారాల మంత్రిత్వశాఖ నిర్వహణలో ఉంటుందీ బ్యూరో.

ఆంగ్లంలో సంక్షిప్తంగా ఐబీ. అంతర్గత భద్రత చూస్తుంది. కౌంటర్‌ ఇం‌టెలి జెన్స్‌ను నిర్వహిస్తుంది.

స్థూలంగా ‘సెంట్రల్‌ ‌స్పెషల్‌ ‌బ్రాంచ్‌.’

‌దేశీయంగా నిఘా యంత్రాంగాన్ని పర్యవేక్షిస్తారు సూపర్‌ ‌సీనియర్‌ ఉన్నతాధికారులు.

రీసెర్చ్ అం‌డ్‌ అనాలిసిస్‌ ‌వింగ్‌ది కీలకపాత్ర.

మహారాష్ట్ర పోలీసుల ‘ఇంటెలిజెన్స్’‌కు సరికొత్తగా నేతృత్వం వహిస్తున్నారు ఆర్తీసింగ్‌. ఆమె కీలక విధి- ‘స్లీపర్‌ ‌సెల్‌’ ‌గుట్టుమట్లు కనిపెట్టడం.

దారుణాలకు పాల్పడుతుంటారు ఉగ్రవాదులు. హింసలోనే పుట్టి, పెరిగి, అంతమవుతుంటారు. అదొక ఉన్మాద స్థితి. రహస్యమే అంతా.

ఉగ్రవాదుల ‘సెల్‌’ ‌మరీ భయంకరం.

ప్రభుత్వాలు ఊరుకోవు. అణువణువూ జల్లెడపడతాయి. భద్రతా బలగాలను రంగంలోకి దించి తాట తీస్తుంటాయి.

జమ్ముకశ్మీర్‌ ‌దురంతం తర్వాత ఉగ్రవాదం మీద మరింత బలోపేతంగా ఉక్కుపాదం మోపింది భారత ప్రభుత్వం.

అక్కడేకాక- హరియాణా, పంజాబ్‌, ‌గుజరాత్‌, ఆ ‌మాటకొస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ డేగ కళ్ల నిఘా విస్తరించింది.

‘ఆపరేషన్‌ ‌సిందూర్‌’ ‌నేపథ్యంలో – ఉగ్రవాదుల స్లీపర్‌ ‌సెల్స్‌ను నామరూపాలు లేకుండా చేయడానికి బరిలోకి దిగింది కేంద్రం. పారాహుషార్‌ అం‌టూ రాష్ట్రాలన్నింటినీ అలర్ట్ ‌చేసేసింది.

అందులో భాగమే మహారాష్ట్రలో తాజాగా ఇండియన్‌ ‌పోలీస్‌ ‌సర్వీస్‌ ఉన్నతాధికారుల బదిలీలూ, పదోన్నతులూ.

అక్కడ నూతనంగా ఆరో జాయింట్‌ ‌కమిషనర్‌ ‌పదవి ఏర్పాటైంది. అందులో నియమితులైన మొట్టమొదటి మహిళామణి ఆర్తీ. జేసీ ఆఫ్‌ ‌పోలీస్‌ (ఇం‌టెలిజెన్స్).

అదే మహారాష్ట్రలో ఇప్పుడు ఒక్కసారిగా అనేకమంది డిప్యూటీ ఇనస్పెక్టర్‌ ‌జనరల్స్‌కు బదిలీలయ్యాయి. పలువురు పోలీస్‌ ‌సూపరింటెండెంట్‌లకు పదోన్నతులు వచ్చాయి.

వీటన్నింటికీ మించి… ఆర్తీకి ప్రత్యేకించి కేటాయించిన పదవీ, హోదా.

ఆమెది 2006 బ్యాచ్‌. ‌మహారాష్ట్ర కేడర్‌.

‌తను పుట్టింది అతి సాధారణ కుటుంబంలో. మధ్యతరగతి కష్టాలన్నీ అనుభవాలే. సవాళ్లు రావడం, వాటిని దీటుగా ఎదుర్కోవడం, విజయాలు సాధించడం… తొలి నుంచీ అలవాటే.

ఆర్థికంగా బాధలు. సమాజపరంగా స్థితిగతులు. ఏవి ఎలా ఉన్నా, నిలబడి గెలవడమే తెలుసు ఆమెకి.

ఎన్ని అడ్డంకులొచ్చినా అదిరేదీ, బెదిరేదీ లేదు. వెనకడుగు అనేది తన నిఘంటువులో లేని పదం.

మొదట్లో వైద్యవృత్తి మీదనే మక్కువ ఎక్కువ. అందుకే ఆ దిశగా కొనసాగింది చదువంతా.

ఉన్నత పాఠశాల, కళాశాల విద్యలయ్యాక – బనారస్‌ ‌హిందూ యూనివర్సిటీలో చేరారు. అందులోని మెడికల్‌ ‌సైన్సెస్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్నత విద్య సాగించారు.

అన్నింటా మంచి మార్కులు, అటు తర్వాత కొంతకాలం గైనకాలజిస్టుగా చేశారు. వృత్తిపరంగా ఎంతోమంది అతివలను చూశారు. మాట్లాడారు. వైద్యసేవ చేశారు. వివిధ సందర్భాల్లో వారి భావోద్వేగాలు గమనించారు.

ఎన్నెన్ని సమస్యల అడ్డుగోడల స్త్రీలోకానికి!

ఈ తరుణంలోనే గుర్తుకొస్తోంది కవిత.

‘బతుకే నీకు బరువైతే ఆ భారం దించుకో

బరువేదైనా గురితో ఓ నలుగురితో పంచుకో

అలుపేలేక అవలీలగా ఏ గెలుపూ రాదులే!

నమ్ముకో ధైర్యాన్ని

మెరుపులే పిడుగులై ఉరుముతున్నా

ఉరకలు వేసే కిరణం జీవితం!’

ఆడపిల్లలకు అండదండగా నిలవాలంటే పోలీస్‌శాఖే తక్షణ పరిష్కారమని అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. పరీక్షల్లో నెగ్గి శభాష్‌ అనిపించుకున్నారు. డాక్టర్‌ ఆర్తీసింగ్‌, ఐపీఎస్‌.

‌పోలీస్‌ అధికారిణి అయినా అవరోధాలు ఆగిపోలేదు. సంఘ వ్యతిరేక ముఠాలు చుట్టుముట్టాయి. వాటి పని పట్టడంలో బిజీ అయ్యారామె.

ఆమెకు మొదటగా బాధ్యతలు కేటాయించింది గడ్జిరోలి ప్రాంతంలో! మహారాష్ట్రలోనిది. దట్టమైన అటవీ ప్రదేశం. తీవ్రవాదులు సంచరించే స్థలం. అదిగో- అక్కడ పోలీస్‌ అధికారిణిగా ఉన్నపుడు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి.

ఇది పదిహేనేళ్ల నాటి మాట. అప్పట్లో ఎన్నికల సమయం. ఆ వ్యవస్థమీద కనీస విశ్వాసంలేని తీవ్రవాదం ఎప్పటిమాదిరే బెదిరింపులకు దిగింది. శాంతిభద్రతలను పరిరక్షించే పోలీసులనే ఉసురుతీసింది. అప్పుడంతా భయభ్రాంతం!

అయినా వెనుకంజవేయలేదు ఆర్తి.

ప్రతి సవాల్‌ అన్నట్లు ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లకు అన్ని విధాలా వెన్నుదన్ను అయ్యారు. తీవ్రవాదుల రహస్య వ్యవహారాల గుట్టురట్టు చేశారు. సింహగర్జన చేశారు.

మేటివ్యూహం, ధాటి ఆచరణంతో తీవ్రవాదంపై మీద విరుచుకుపడ్డారు. హింసోన్మాదుల ఆటకట్టించారు.

మారణాయుధాలు పోలీసుల స్వాధీనమయ్యాయి. పోలీసుల చర్యకు తీవ్రవాద అదిలింపులు పటాపంచలయ్యాయి.

‘నడిస్తే నా అడుగులు

మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు

ఎత్తితే నా చెయ్యి

మండే అగ్నిజ్వాల’ అనేలా పోలీస్‌ ‌విక్రమానికి తోకముడిచింది హింసావాదం. ఆ తీవ్రవాద ప్రాంతాన శాంతియుతంగా ముగిశాయి ఎన్నికలు. ఆద్యురాలూ, బాధ్యురాలూ ఆర్తీసింగ్‌.

‌మహారాష్ట్రలో, అమరావతిలో అక్కడ కొంతకాలం దౌర్జన్యం చెలరేగింది. సరిగ్గా అప్పుడే అక్కడున్న ఆమె శక్తిరూపిణి అయ్యారు. పౌరుల ప్రాణాలకు రక్షణఛత్రమయ్యారు.

మరో సందర్భంలో హింసాయుత సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఆర్తి సారధ్యాన ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం రంగంలోకి దూకి, పరిస్థితి మొత్తాన్నీ అదుపులోకి తెచ్చింది.

నాసిక్‌, ‌మాలెగావ్‌ ‌ప్రాంతాల్లోనూ పనిచేశారామె. ఎక్కడ పనిచేసినా – నేరగాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. యువతీ యువకులతో పౌర పరిరక్షణ బృందాలను ఏర్పాటుచేసి, వాడవాడలా కదం తొక్కించారు. శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతమూ కలగకుండా, ఎప్పటికప్పుడు సత్వర చర్యలు తీసుకున్నారు.

ఎన్నెన్నో విజయాలు, పురస్కృతులు ఆమెను ప్రభావశీల వ్యక్తి / శక్తిగా రూపుదిద్దాయి. అనేకానేక పురస్కారాలు లభించేలా జీవితాన్ని ఇంకెంతో శోభాయమానం చేశాయి.

సామాజికంగా కూడా ప్రత్యక్ష సేవా కార్యక్రమాల్లో ముందున్నారు ఆర్తి. వ్యక్తిగత వృత్తి జీవితాల మధ్య చక్కని సమతుల్యం సాధించారు. ఇక ఇప్పుడు నవీన బాధ్యతల స్వీకర్తగా…

కలలు, కళల గురించి విధుల స్వీకార వేదికపైన మాట్లాడారు.

‘అందరం కలలు కంటాం. నిజం కావాలని కోరుకుంటాం. ఎన్నింటినో ఆశిస్తాం. కొన్నింటినే ఫలప్రదం చేసుకోగలం. నా కోరికల్లో ఒకటి నాట్యకళాకారిణిగా కొన్ని ప్రదర్శనలనైనా ఇవ్వడం. ఇప్పటికే కొన్నింటిని సఫలం చేసుకున్నాను. మిగతా వాటినీ ఫలవంతం చేసుకోగలను. ఆ నమ్మకం నామీద నాకు ఉంది.

ఇప్పటి ఈ బాధ్యతలన్నీ కత్తిమీద సామువంటివని నాకు తెలుసు. అన్నీ తెలిసి ఎంచుకున్న పోలీసు ఉద్యోగం నాది. దేనికైనా సంసిద్ధంగా ఉండటమన్నది నా రక్తంలోనే ఉంది. సుకుమార నాట్యాన్ని, కఠినతర రక్షక ఉద్యోగాన్ని సమన్వయం చేసుకోగలను. వైద్య పరిజ్ఞానం, అనుభవం ఉన్నాయి కాబట్టి ఆ రంగంలోని సేవానిరతినీ ఈ నూతన విధులకు జోడిస్తాను నేను.

ఇక – నిఘా అనేది మాటలకు అందదు. రాతల్లో ఒదగదు. చేతలతో మాత్రమే సాధ్యమవుతుంది. ఎంతో తెలివుందని అనుకుంటారు తమలో తామే తీవ్రవాదులూ, ఉగ్రవాదులూ! అది ప్రాణాల్ని హరించే దుర్మార్గపు తెలివి. దాని పనిపడతాం మేమంతా. పోలీసు వ్యవస్థనంతటినీ ఏకమార్గాన నడిపించి, నిఘా యంత్రాంగాన్ని పటుతరంగా మలచి, హింసోన్మాదుల కుట్రలూ, కుతంత్రాలను నేలమట్టం చేస్తాం. మహిళ అనుకుంటున్నారేమో… నేను కాళిక. దురాగతాలను, వాటి వెనక ఉన్న కుటిలత్వాలను మట్టుపెడతాం. అధికారబృందం, సిబ్బంది సహాయ సహకార సమన్వితాలతో సాగుతుంది మా పనంతా. సామాన్య ప్రజలను సతాయించే ఎటువంటి తంత్రాన్ని అయినా రూపురేఖలు లేకుండా చేయగలదు మా పోలీసుశాఖ.’

ఈ మాటల ఈటెలే ఆర్తి దృఢ సంకల్పాన్ని చాటి చెప్తున్నాయి. హింస పలాయనం చిత్తగించక తప్పదని ముందుగానే హెచ్చరిస్తు న్నాయి. అవును మరి, మహిళ కాదు… ఆమె కాళిక!

జంధ్యాల శరత్‌బాబు

సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE