మే 22 హనుమజ్జయంతి సందర్భంగా
జీవనవేదం శ్రీమద్రామాయణ మహాకావ్యంలో భక్తుడిగా, భగవత్ స్వరూపుడిగా నిలిచిన అనర్ఘరత్నం హనుమ. రుద్ర, వాయు అంశలతో జన్మించడం వల్ల దైవశక్తి, మానవావతారుడు, ధర్మమూర్తి శ్రీరాముని సేవించడం వల్ల ధార్మిక నరశక్తి, జన్మతః వానరం కనుక జంతుశక్తితో మహా పరాక్రమశాలిగా ఎదిగిన సర్వ సమర్థుడు. సూర్య భగవానుడి శిష్యుడిగా చదువు నుంచి రావణ సంహారం, శ్రీసీతారామ పట్టాభిషేకం వరకు ఆయన పాత్ర అనన్య సామాన్యం. ఆరు కాండలతో విరాజిల్లే రామాయణంలో అయిదవది సుందరకాండలో మనసును రంజింప చేసే గుణసుందరుడు హనుమ. సీతాన్వేషణకు సముద్ర లంఘనం నుంచి లంకాపురి దహనం వరకు ఆయన వీరవిహారానికి ఇది నెలవులా కనిపిస్తుంది.
శ్రీరామ కార్యసాధన కోసమే ఆంజనేయుడు రుద్రాంశతో వైశాఖ బహుళ దశమి నాడు అవతరిం చాడని శౌనక, పరాశర సంహితలు పేర్కొంటు న్నాయి. త్రిపురాసుర సంహారంలో విష్ణువు అందించిన సహకారానికి కృతజ్ఞతగా శివుడే హనుమగా అవతరించాడని వానరగీత చెబుతోంది. ఆంజనేయుడు దాస్యభక్తికి ప్రథమోదాహరణ. రోమరోమంలో రామనామాన్ని లిఖించుకున్న భక్తితత్పరుడు. సీతారాములను హృదయ కవాటంలో నిలుపుకున్న స్వామిభక్తి పరాయణుడు. రామనామం వినిపించినచోట వినయాంజలితో నిలుచుండి పోతాడట. స్వయంగా హనుమద్రామాయణం రాశారు. ‘రాముడికి చేటు కలిగిస్తే దేవాసురులను ఎవరిని వదలిపెట్టను’ లంకలో హెచ్చరించడం స్వామిభక్తికి నిదర్శనం. ధర్మరక్షణకు, శరణార్థులను ఆదుకునేందుకు అవసరమైతే తన దైవాన్నే ఎదిరించగల ధీరుడు. అది ధర్మాగ్రహమే తప్ప ధిక్కారణ ధోరణి కాదని పెద్దలు చెబుతారు. అనితర కార్యసాధకుడు, పట్టుదలకు మారుపేరు. ‘దేనికీ నిరాశ చెందరాదు. చేపట్టిన పని సఫలం కావడానికి ఆద్యంతమూ శక్తి మేరకు పాటుపడాలి. అవకాశాలు మూసుకుపోయినప్పుడు మరింత అప్రమత్తతో ప్రత్యామ్నాయం అన్వేషించాలి’ అన్నది హనుమత్ సందేశం.
‘హనుమ సంభాషణ తీరునుబట్టి ఆతను రుగ్వేద, యజుర్వేద, సామవేదాల్లో విద్వాంసుడని, నవవ్యాకరణాలను శ్రద్ధగా అధ్యయనం చేశాడని అనిపిస్తోంది. తన సుదీర్ఘ సంభాషణలో ఒక అపశబ్దం కూడా దొర్లలేదు. కంఠస్వరం శ్రావ్యం. మాట తీరు సంస్కారవంతం. ఇలాంటి మంత్రి లభించినప్పుడు రాచకార్యం సఫలం కాకుండా ఎలా ఉంటుంది?’ హనుమను మొదటిసారి చూచిన రాముడు తమ్ముడు లక్ష్మణుడితో అన్నాడు. ‘హనుమ గురించి వింటే శత్రువులు సయితం మెత్తబడకతప్పదు’ అన్న రాముడి ప్రశంస లాంటిదే రావణుడి నోటి నుంచీ వెలువడింది. ‘ఓ వానరా! వీరత్వంలో కొనియాడ దగిన శత్రుడవు’ అని ప్రశంసించాడు లంకేశ్వరుడు.
చిన్నపాటి సమస్యలకే ఆత్మహత్యలు/బలిదానాలకు పాల్పడే వారికి ఆంజనేయుడి ధీరత్వం స్ఫూర్తి దాయకం కావాలి. ‘సీతమ్మ జాడ తీయలేని నేను బతికి ఉండి ఏం ప్రయోజనం’ అని అనుకొని, అంతలోనే ‘క్షణికావేశంలో తీసుకొనే నిర్ణయాలు విపరీత పరిణామాలకు దారితీస్తాయి. అందరి నమ్మకాలను వమ్ము చేసిన వాడిని అవుతాను’ అనే ఆత్మపరిశీలనతో చేపట్టిన కార్యం విజయవంతంగా ముగించాడు. పతీవియోగం దుఃఖంతో ఆత్మాహుతికి సిద్ధపడిన సీతమ్మకు స్వానుభూతితో ధైర్యం చెబుతాడు.
హనుమ అమిత పరాక్రమశాలి అయినా ఏలిక కాదలచలేదు. సుగ్రీవునికి సచివుడిగా, రామబంటుగా ఉండేందుకే ఇష్టపడ్డాడు. అలా అత్యుత్తమంగా సేవలు అందించాడు. బాధ్యత గల వ్యక్తిగా అభిప్రాయాలు వ్యక్తం చేయడంలో, నిక్కచ్చిగా వ్యవహరించడంలో వెనుకాడలేదు. వాలి వధానంతరం పట్టాభిషిక్తుడైన సుగ్రీవుడు, సీతాన్వేషణ మాట మరచినప్పుడు ‘ప్రభూ! రాముడి వల్ల మీకు రాజ్యం వచ్చింది. మిత్రుడికి సహకరించడంలో (మితద్రోహం) జాప్యం తగదు. రాజు ధనాగారాన్ని కాపాడుకున్నట్లుగా మిత్ర సంపదను కాపాడుకుంటూ, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. రాముడి నుంచి వర్తమానం, హెచ్చ రికలు రాకముందే సీతాన్వేషణకు ఉపక్రమించండి’ అని హితవు పలికాడు.
సర్వ విద్యా కోవిదుడు, భ••విష్యద్బ్రహ్మత్వాన్ని సంపాదించిన మహా తవస్వి అయినప్పటికీ నిగర్వి. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండడం ఆయన గొప్ప లక్షణం. ‘వానరులలో నీవు తప్ప ఎవరు సముద్రాన్ని దాటి ఇలా లంకకు రాగలరు?’ అని ప్రశ్నించిన జానకితో ‘అమ్మా! నాతో సమానశక్తిగలవారే కాదు… నన్ను మించిన అమిత బలశాలారు వానర సమూహంలో ఉన్నారు. అందరి కంటే చిన్నవాడినైనా నన్ను నీ జాడ కోసం పంపారు’ అని విన్నవించారు.
‘హనుమను ఉత్తమ దూతకు నిదర్శనంగా చెబుతారు. దూతలను మూడు రకాలుగా విగడించు కుంటే..యజమాని అప్పగించిన పనిని నెరవేర్చకపోగా చెడగొట్టేవాడు మూడవ (అథమ) కోవకు చెందిన వారు కాగా, అప్పగించిన పనిని నెరవేర్చేవారు రెండవ (మధ్యమ) శ్రేణికి చెందినవారు. స్వీకరించిన బాధ్యతలను పరిపూర్ణంగా నిర్వర్తిస్తూనే, మెరుగైన ఫలితాలు సాధించేందుకు సందర్భానుగుణంగా నిర్ణయాలు తీసుకొనేవారు ప్రథమ (ఉత్తమ) శ్రేణికి చెందిన వారుగా చెబుతారు. సీతమ్మ జాడ నెపంతో లంకలోని అనుపానులు తెలుసుకొని మరీ వచ్చాడు.
తులసీదాస్ రచించిన ‘హనుమాన్ చాలీసా’ హిందూ బంధువులకు నిత్య పారాయణ స్త్తోత్రం. ‘జ్ఞానగుణాలకు సాగరంలాంటి హనుమకు జయం. ముల్లోకాలను ఉజ్జ్వలింప చేసే కపిరాజుకు జయం’ అంటూ ‘చాలీసా’ ప్రారంభించాడు. సర్వసలక్షణ సమన్వితుడైన పావనిని ‘అన్నిటా నేరుపరి హనుమంతుడు/పిన్ననాడె రవినంటె పెద్ద హనుమంతుడు’,‘ఒక్కడే ఏకాంగ వీరుడుర్వికి దైవమౌనా/ యెక్కడా హనుమంతుని కెదురు లోకము’అని పదకవితా పితామహుడు అన్నమాచార్య అర్చించారు.
డా।। ఆరవల్లి జగన్నాథస్వామి
వ్యాసకర్త : సీనియర్ జర్నలిస్ట్