పాకిస్తాన్‌లోని ఉగ్రవాదుల మీద భారత్ సేనలు దాడి చేయడం విచారకరమని, ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో రెండు దేశాలు కూడా సంయమనం పాటించాలని మే 7న చైనా వ్యాఖ్యానించింది. ఏ రూపంలో ఉన్నప్పటికీ ఉగ్రవాదాన్ని చైనా ఖండిస్తుందని ఆ దేశ విదేశ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి బీజింగ్‌లో చెప్పారు. మే 7 వేకువన భారత్ దాడుల సంగతి తెలిసిందని ఇవి విచారకరమణ చైనా అభిప్రాయపడింది. ప్రస్తుత పరిస్థితుల పట్ల తాము ఆందోళనగా ఉన్నామని తెలియచేసింది. పాకిస్తాన్, భారత్ ఇరుగు పొరుగు దేశాలని, ఈ రెండూ పాకిస్తాన్‌కు ఇరుగు పొరుగు అని చైనా గుర్తు చేసింది. విస్తృత ప్రయోజనాలను దృష్టింలో ఉంచుకుని శాంతిని, సుస్థిరతను నెలకొల్పాలని అభిప్రాయపడింది.
పాకిస్తాన్ మీద దాడికి భారత్ అన్ని కోణాల నుంచి ఆలోచించక తప్పదు. అందులో ఒక ముఖ్య కోణం- పాకిస్తాన్‌కు చైనాతో ఉన్న బంధం. ఆక్రమిత కశ్మీర్‌లో కొంత భాగం పాకిస్తాన్ చైనాకు దానం చేసేసింది కూడా. అయినా పాక్‌లోని ఎంపిక చేసుకున్న లక్ష్యాల మీద మే 7వ తేదీ భారత్ దాడి చేసినప్పటికీ, ఆ దాడితో పాకిస్తాన్ విలవిలలాడు తున్నప్పటికీ చైనా కేవలం పైపై ఖండనలకే ఎందుకు పరిమితమయింది? గట్టిగా చెప్పాలంటే చైనా పాక్ అనుకూల విధానం ఏమాత్రం పని చేయలేదన్నంతగా వాతావరణం కనిపిస్తున్నది. దీనికి కారణాలను దౌత్య నిపుణుడు, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ విశ్లేషించారు.
‘‘ఇవాళ్టి ట్రంపియన్ (డొనాల్డ్ ట్రంప్) భారీ సుంకాల ప్రపంచం’లో భారత మార్కెట్ చైనాకు అత్యవసరం’’ అని దేవ రహస్యం బయటపెట్టారు. నిజానికి చైనా విదేశాంగ విధానం అంటే స్వప్రయోజ నాలు తప్ప మరేదీ ఉండదన్నది జగమెరిగిన సత్యం. అందులో ఇరుగు పొరుగు దేశాల మేలు, అంతర్జాతీయదౌత్య సంబంధాలకు ఎలాంటి విలువ ఉండదు. ఆ విషయంలో పాకిస్తాన్ అయినా ఒకటే, శ్రీలంక అయినా చైనాకు ఒకటే. అవి మునుగుతున్నా, తనకు లాభం లేదనుకుంటే చైనా మొహం చాటేస్తుంది. భారత్‌తో అంత శత్రుత్వం ఉన్నా, ప్రయోజనం ఉంటే కొన్ని చోట్ల మౌనం వహిస్తుంది చైనా. ఏప్రిల్ 22 పెహల్గావ్ దుర్ఘటన, తరువాత ఉద్రిక్తతలు, మే 7 తరువాత పరిణామాలు అన్నీ చైనాకు తెలుసు. అయినా స్పందించవలసినంతగా స్పందించలేదు. చైనాకు కూడా పాకిస్తాన్ వైపు మాట్లాడడానికి తగిన సానుకూలత లేదు.
ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతలను బట్టి కొన్ని ప్రపంచ దేశాలు సంయమనం పాటించాలని కోరుతు న్నాయి. ఇది మామూలే. అణ్వాయుధాలు కలిగిన భారత్-పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరగరాదని ప్రతి ఒక్కరు ఆశించడం సహజం. ఉగ్రవాదం రక్షించుకునే హక్కు భారత్‌కు ఎంత ఉన్నదో అర్ధం చేసుకున్న దేశాలు మాత్రం రష్యా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్. అవి తనను తాను రక్షించుకునే హక్కు భారత్‌కు ఉందని స్పష్టంగానే చెబుతున్నాయి. సూత్రబద్ధంగానే అయినా అమెరికా 9/11 దాడుల తరువాత గట్టి పదాలతోనే ఖండించింది అని శశిథరూర్ వివరించారు.
చిత్రంగా చైనా మాత్రం సూటిగా పాకిస్తాన్ అనుకూల వైఖరిని తీసుకోలేదని థరూర్ అన్నారు. కేవలం సలహా మాత్రమే ఇచ్చిందని గుర్తు చేశారు. ఇరుగు పొరుగు అయిన పాక్ భారత్ మధ్య సుహృద్భావ వాతావరణం ఉండాలని, తనకు ఇరుగు పొరుగు అయిన ఈ రెండు దేశాలు చైనాతో కూడా సఖ్యంగా ఉండాలని మాత్రమే సూచించింది. దీనికి ప్రత్యేకమైన కారణం ఒక్కటే- ఇప్పుడు ట్రంప్ సృష్టించి పెట్టిన సుంకాల ప్రపంచంలో భారత్ వంటి మార్కెట్ చైనాకు అత్యవసరమన్న సంగతి మరువరాదని థరూర్ విశ్లేషించారు. ఇది వరకు ఎన్నడూ లేనంత స్థాయిలో భారత్ మార్కెట్ అవసరం నేడు చైనాకు ఉందని చెప్పారు. అయితే ఒకటి వాస్తవం. దాడులు యుద్ధం స్థాయికి చేరితే మాత్రం చైనా పాకిస్తాన్ వైపే నిలబడుతుంది. అందుకే యుద్ధం రాకుండా ఉండేందుకు నిర్మాణాత్మకంగా ప్రయత్నిస్తుందని ఆయన అన్నారు.
ఉత్తర, పశ్చిమ భారత ప్రాంతాలలోని సైనిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవాలన్న పాకిస్తాన్ ఆశయాన్ని భారత సైనిక దళాలు తుంచి వేశాయి. పాకిస్తాన్ క్షిపణులను, డ్రోన్లను కౌంటర్ యూఏఎస్ గ్రిడ్, వైమానకి రక్షణ వ్యవస్థలు విఫలం చేశాయని అధికార వర్గాలు చెప్పాయి. దీనికి ప్రతీకారంగానే భారత సైనిక దళాలు లాహోర్ సహా పాకిస్తాన్‌లోని పలు రక్షణ వ్యవస్థ రాడార్లను లక్ష్యం చేసుకున్నాయి. పాకిస్తాన్ దాడుల గురించి ప్రశ్నిస్తూ, ఆ దాడులలో చైనా జెట్‌లు కూడా ఉన్నట్టు వచ్చిన సమాచారం గురించి ఏమంటారని అడిగితే, ఆ విషయం తమ దృష్టికి రాలేదని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ వ్యాఖ్యానించింది.
భారత్-పాకిస్తాన్‌ల మధ్య తాజాగా నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో జరిగిన భద్రతా సమితి సమా వేశంలో కూడా పాకిస్తాన్‌కు ఎదురు గాలే వీచిందని థరూర్ తెలియచేశారు. లష్కర్ ఏ తాయిబా, ఇతర ఉగ్రవాద సంస్థల గురించి పాకిస్తా న్‌ను పలు దేశాలు నిలదీయడం, పాకిస్తాన్ ఉగ్ర మూకలకు ఆశ్రయం ఇస్తున్న సంగతి గురించి ప్రశ్నించడం ఇందుకు నిదర్శనమని ఆయన చెప్పారు.
– జాగృతి డెస్క్