ఆపరేషన్‌ ‌సిందూర్‌ ‌పాక్‌ ఉ‌గ్రవాద గుండెల్లో ప్రచండ యుద్ధభేరి. కల్నల్‌ ‌సోఫియా, వింగ్‌ ‌కమాండర్‌ ‌వ్యోమిక, భారత నరనారీ హృదయ మందిరాల్లో కొలువు దీరిన ధీరనారీమణులు. వీర శూరత్వాల్లో ఇద్దరూ ఇద్దరే! సమర చరిత్రలో ప్రత్యక్ష నాయికలు. ఆడపిల్ల నుదుటి సిందూరాన్ని పరమ కర్కశంగా తుడిచేసిన హింసోన్మాదాన్ని అంతే భీకరంగా అంతం చేస్తామని నిరూపిస్తున్న అత్యంత సాహసోపేత సంగ్రామ శక్తి వీరిద్దరిదీ. అందుకే – భరతమాత ముద్దు బిడ్డలనీ, తుపాకిస్థాన్‌ ‌పాలిటి యమదూతలనీ ఒక్క భారత్‌ ‌మాత్రమే కాదు..నిఖిల ప్రపంచమూ అక్షరాభిషేకం చేస్తోంది. మనసా వాచా కర్మణా శాంతిని కోరుకునే ప్రతి దేశమూ ఈ ఇద్దరినీ ఒక్కరిగానే పరిగణిస్తోంది. ‘ధైర్యసాహసాలు’గా నామకరణం చేసేసింది. నాటికీ, నేటికీ అనుసంధాన ధీరత.ముష్కర మూక పని పట్టాల్సి వస్తే – అతివలది సూర్యప్రతాపం. చూపు అగ్నిజ్వాల. నరకాసుర వధ ఘట్టంలో… వాడి సేనమీద విరుచుకు పడింది దివ్య అస్త్రం. పేరు ‘శతఘ్ని! సుదర్శన చక్ర ఆయుధ ప్రయోగమూ అప్పుడే. సంధానిస్తే – ఈ ఇద్దరు అతివల్లో (సోఫియా, వ్యోమిక) ఒకరు శతఘ్ని. మరొకరు సుదర్శన చక్ర విశేషం.

‘సిందూరం తుడిచేసిన దురాగత వాదాన్ని ఉక్కుపాదంతో తొక్కిపెట్టాం. మన సాయుధ సేన గర్జన పాక్‌ ‌సైనిక ప్రధాన కార్యాలయం ఉన్న రావల్సిండినే వణికించింది. ఎంతో కచ్చితత్వంతో లక్ష్య సాధన పూర్తిచేసింది మన వాయుసేన. శత్రు యుద్ధ విమానాల కూల్చివేత, స్థావరాల పేల్చివేత తిరుగులేని విధంగా సాగింది’ అని ప్రకటించింది భారత ప్రభుత్వం. ‘ఉగ్రవాదం మీద భారీ పోరులో తొలి నుంచీ వ్యూహాత్మక రీతినే అనుసరించాం. ఉగ్రవాదులతోపాటు భారత వ్యతిరేక శక్తుల అంతు చూసేదాకా ఇదే ఏకైక విధానం’ అనడంలో మహా సంకల్ప దీక్ష. పాకిస్థాన్‌, ‌దాని ఆక్రమిత కశ్మీరులోని ఉగ్రవాద ‘శిక్షణ’ శిబిరాల జాబితాను భారత ప్రభుత్వం, సాయుధ దళ బృంద నాయకత్వం బయట పెట్టింది. మనం మెరుపు వేగంతో దాడులు చేపట్టిన స్థావరాల వివరాలనూ వెల్లడిచేసింది. కేవలం పాతిక నిమిషాల్లో అంతా సంపూర్తి చేశామంది.
ఆ సమాచార వెల్లడింపు కర్త సోఫియా!
‘పాకిస్తాన్‌లోని సైనిక స్థావరాలు, అక్కడి పౌరుల మౌలిక సదుపాయాల మీద చర్యలు కాదు మా ఉద్దేశం. ఉగ్రవాదాన్ని నిర్మూలించడమే మా ఏకైక లక్ష్యం’ అని వ్యోమిక విస్పష్టంగా ప్రకటించారు.
పాకిస్తాన్‌ ‌తన పౌరవిమానాలను రక్షణ కవచాలుగా వాడుకుంటోందని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి వెల్లడించారు. మన పర్యాటక ప్రదేశాలు, ప్రార్థనా మందిరాలపైన కన్నేసిందని అందరి దృష్టికీ తెచ్చారు. ఇదంతా జరుగుతున్నపుడు ఆ సూపర్‌ ‌సీనియర్‌ ఉన్నతాధికారి విక్రమ్‌ ఇరు వైపుల ఉండి సమాచార, ప్రచార, ప్రసార సాధనాల ముందు మెరుపులు మెరిపించారు మహిళా సైనిక మహోన్నత అధికారిణులు.
కల్నల్‌ ‌సోఫియా ఖురేషి స్వస్థలం ఉత్తరప్రదేశ్‌ ‌రాజధాని లఖ్‌నవూ (లక్నో). తండ్రి సివిల్‌ ఇం‌జినీరు, తల్లి విశ్వవిద్యాలయ అధ్యాపకురాలు. సోఫియా పాఠశాల చదువు సొంత ఊర్లోనే. కాన్పూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ‌టెక్నాలజీ నుంచి ఎలక్ట్రానిక్స్, ‌కమ్యూనికేషన్‌ ఇం‌జనీరింగ్‌లో పట్టభద్రత. మిలిటరీ కమ్యూనికేషన్స్‌లో నిపుణత, సైబర్‌ ‌వార్‌ ‌ఫేర్‌కి సంబంధించి ఎంతో ప్రావీణ్యత గడించారు.
సైన్యం పరంగా సాంకేతిక సామర్థ్యాల వినియోగంలో సోఫియాకు పూర్తి పట్టు ఉంది. ఆధునికీకరణ పక్రియను ఏ మేర ప్రయోజనకరంగా మలచుకోవాలో సంపూర్ణ అవగాహనా ఉంది. నేషనల్‌ ‌డిఫెన్స్ ‌కాలేజీలో అతిథి అధ్యాపకురాలిగా మరెంతో అనుభవం. ఐక్యరాజ్యసమితి శాంతిపరిరక్షణ వ్యవస్థలో సమస్త భారతీయ బృందానికీ నాయకత్వం వహించారు. సోఫియా మెట్టినిల్లు కర్ణాటకలోని కొన్నూరు. భర్త తాజుద్దీన్‌ ‌కల్నల్‌. ఆ ‌కుటుంబానికి గుజరాత్‌లోని వడోదరతో బాంధవ్యముంది. జమ్మూప్రాంతలో విధులు నిర్వర్తించే భాగంగా ఝాన్సీ పరిసరాల్లో తాజుద్దీన్‌తో పరిచయమై, పరిణయంగా మారింది. ఆ జంట జమ్ము కశ్మీర్‌తోపాటు పంజాబ్‌, ‌తమిళనాడు ప్రాంతాల్లోనూ సేవలు అందించింది.
నిజానికి సోఫియా విజయపరంపర ఐదేళ్ల క్రితమే అభివ్యక్తమైంది. అప్పట్లోనూ ఆమె పేరు ఆ సందర్భాన్ని అనుసరించి మారుమ్రోగింది. సైనిక రంగానికి సంబంధించి, వనితలకు కూడా శాశ్వత కమిషన్‌ ‌సదవకాశం కలిగించాలన్నది ఆమె విజ్ఞాపన. అది మహిళా సైనికాధికారులు పరమోన్నత న్యాయస్థానం తలుపులు తట్టేలా చేసింది. ఆమె సేవలను, ఆమె విన్నపాలను పరిశీలించిన న్యాయస్థానం… అతివలూ ఆర్మీలో పర్మినెంట్‌ ‌కమిషన్‌కు అర్హులని తేల్చి చెప్పింది. అంతకుముందు వరకు ఉండిన పరిస్థితి వేరు. మార్పు తెచ్చింది ఆమే!
సేవాదళంలో అధికారిణుల సేవలను ఎక్కువగా షార్ట్ ‌సర్వీస్‌ ‌కమిషన్‌కే పరిమితం చేస్తుండేవారు. అదేమంటే – వారి శారీరక స్వభావరీతులను, సామాజిక జీవన వాతావరణ స్థితిగతులను కారణంగా చెప్తుండేవారు. ఆ వాదనలు సరికాదని ‘సుప్రీం’ ప్రస్ఫుటం చేసింది. గతంలో ఏర్పాటైన మల్టినేషనల్‌ ‌మిలిటరీ ఎక్సర్‌సైజ్‌లోని భారతదళానికి అప్పటి లెప్టినెంట్‌ (ఆర్మీ సిగ్నల్‌ ‌కోల్‌)‌గా సోఫియా నాయకత్వం వహించడాన్ని ప్రస్తావించింది. అంటే – నాడు భారతీయ ముదితగా అంతటి బాధ్యతను స్వీకరించిన మొదటి వ్యక్తి ఆమే నన్న మాట.
ఐక్యరాజ్య సమితి (ఐరాస)శాంతి సంఘంలో విధులను స•ర్వసమర్థంగా నిర్వహించిన నాయకురాలు కూడా సోఫియానే! ప్రధానంగా కాంగోలో ఆమె పని తీరు ఎందరి ప్రశంసలనో అందుకుంది.
విమానదళం ఫ్లయింగ్‌ ‌బ్రాంచ్‌ ‌హెలికాప్టర్‌ ‌పైలట్‌గా విశిష్ట అనుభవశీలి వ్యోమికా సింగ్‌. ‌పాఠశాల, కళాశాల స్థాయుల్లో ఎన్‌సీసీ కేడెట్‌గా అనేకానేక ప్రయోగాలకు ఆద్యురాలు. భాగ్యనగరం దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్- అకాడమీలో సమగ్ర శిక్షణ అందుకుంది. ఇరవై ఏళ్ల నాడే పైలట్‌గా నియామకం. చేతక్‌, ‌చీతా తరహా హెలికాప్టర్లను దీటుగా నడిపి కీర్తిని ఆర్జించారు•. వేల గంటలు విమానాలు నడిపారు. ఏ మారుమూల వైమానిక సదుపాయం అవసరమైనా ‘నేనున్నా’ అంటూ ముందు నిలిచారామె. దరిదాపు ఐదేళ్ల కిందట అరుణాచలప్రదేశ్‌లో ప్రత్యేక బాధ్యత చేపట్టి ‘భళీ’ అనిపించుకున్నారు.
ఆజాదీకా అమృత్‌ ‌మహోత్సవాలు నిత్యస్మరణీయాలు. హిమాచలప్రదేశ్‌లోని కీలక పర్వతం మౌంట్‌ ‌మణిరంగ యాత్రలో ముఖ్యభూమిక వ్యోమికాదే! ఇరవై వేలకు పైగా అడుగుల ఎత్తు గల పర్వతపైకి నాలుగేళ్ల క్రితం త్రివిధ దళాల మహిళా పర్వతారోహకుల యాత్రా పక్రియ ప్రారంభమైంది. అది పలు సవాళ్లతో నిండిన సాహసపర్వం. అది చీఫ్‌ ఆఫ్‌ ఎయిర్‌స్టాఫ్‌ ‌గుర్తించి ప్రశంసించిన సందర్భం.
వ్యోమికా కుటుంబీకుల్లో ఎవరికీ సాయుధ దళ నిర్వహణ అనుభవం లేదు. ఉత్సాహం, దీక్ష, పట్టుదల – ఈ త్రివిధ ఆయుధాలతోనే ముందుకు చొచ్చుకొచ్చిన సాహసికురాలు ఆమె. పాఠశాల చదువు మొత్తం దేశ రాజధానిలోని విద్యాలయంలో సాగింది. అనంతర కాలంలో పరిశోధన, ప్రయోగాలతో కొనసాగిందామె విద్యాభ్యాసం.ఇద్దరు సోదరీమణులున్నారు ఆమెకు. వారిలో ఒకరు భారత విమానదళంలోని అధికారిని ఏరికోరి వివాహం చేసుకున్నారు. దేశభక్త భావన అణువణువునా ఉండటమన్నది వ్యోమికా సహజసిద్ధ లక్షణం.
పైలట్‌ ‌కావాలన్నది వ్యోమికా తీరిన కల. 2019లో ఫ్లయింగ్‌ ‌బ్యాచ్‌ ‌పరంగా శాశ్వత కమిషన్‌ ‌హోదా ఆమె వశమైంది. ఆధునిక ఆయుధ వ్యవస్థను రూపొందించి పరిరక్షించడంలో తనకు తానే సాటి.
నవ వధువు పండంటి జీవితాన్ని కుప్పకూల్చిన పాక్‌ ఉ‌గ్రవాదం భరతం పట్టే పని గురించి… నిత్య నవీన సమధికోత్సాహ ప్రతీకలైన ఇద్దరు నారీమణులు మాటల తూటాలు పేల్చారు. వారిలోని వింగ్‌ ‌కమాండర్‌ ‌వ్యోమికా ప్రతీ అక్షరం ధాటిని ప్రతిఫలించింది. బాల్యం నుంచే తనది ఢీకొనే తత్వం!
ఆమె తల్లిదండ్రుల మాటల్లో …. ‘చదువులు, ఆటలు, పాటలు, పోటీలు అన్నిట్లోనూ ముందున నిలిచేది వ్యోమికా. పోటీ తత్వంతో ముందడుగు వేస్తూ ఎప్పటికప్పుడు సవాల్‌ ‌విసురుతుండేది. ఆత్మవిశ్వాసానికి అర్థం ఆమె నుంచే తెలుసుకోవాలి ఎవరైనా!’
ఆ అన్నీ ఇప్పటికీ వ్యోమికాకు వర్తిస్తాయి. ఎప్పుడూ ముందే ఉండటం, పోరాడి గెలవాలన్న ఉక్కు సంకల్పం, ఎటువంటి స్థితి ఎదురైనా అదరని బెదరని నైజం. ఇన్ని విలక్షణతలు ఉన్న అతివ- సాటి వనితాలోకానికి ప్రేరణ కాక ఇంకేమవుతుంది?
ధీరవనితా! సాహస అతివా!
మీ గాథలే స్ఫూర్తి చరితలు.
సోఫియా! వ్యోమికా!
భారత విక్రమత్వానికి ప్రతీకలు మీరే
ముష్కర సంహారకాండకు సమర ధ్యానం మీదే!
జాతికి మీతో ఘనత
జయజయహో భారతమాతా!

జంధ్యాల శరత్‌బాబు
సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE