శంకర భగవత్పాదులు స్థాపించిన కంచి కామకోటి పీఠం చరిత్రలో కొత్త ఆధ్యాయం ఆరంభమైంది. 2,500 సంవత్సరాలుగా భారతీయ ఆధ్యాత్మిక చింతనను, సంపదను సంరక్షిస్తున్న, అద్వైత సిద్ధాంత ఔన్నత్యాన్ని వ్యాప్తి చేస్తున్న కంచి మఠం మరొక మైలురాయిని అధిగమించింది. ‘నగరేషు కాంచి’ అని మహాకవి కాళిదాసు వర్ణించిన ఆ మహా పుణ్యక్షేత్రంలో, 108 దేవళాల నిలయంలో అక్షయ తృతీయ (ఏప్రిల్ 30) శుభ ముహూర్తంలో ఉత్తరాధికారికి బాధ్యతలు అప్పగించారు. కామాక్షి అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని పంచగంగ (కోనేరు) తీర్థంలో స్నానమాచరించి, రుగ్వేద పండితుడు దుడ్డు సత్య వేంకట సూర్య సుబ్రహ్మణ్య గణేశ శర్మ సన్యాస దీక్ష స్వీకరించారు. ఎంతో సంప్రదాయబద్ధంగా, మహా వైభవోపేతంగా జరిగిన ఈ ఉత్సవంలో 70వ పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామివారు ఉత్తరాధికారిగా శ్రీ శంకర సత్య చంద్రశేఖరేంద్రస్వామి వారి పేరు ప్రకటించారు. ఇది ఆ మహోన్నత పీఠం చరిత్రలోనే కాకుండా, భారతీయ ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సామాజిక ప్రస్థానంలో మహిమాన్విత క్షణం. మహత్తరమైన రోజు. ఈ చారిత్రక ఘట్టం కామాక్షి అమ్మవారి ఆలయంలోనే జరిగింది. 2,534వ శంకర జయంతి పర్వదినాన కంచి పీఠం ఉత్తరాధికారి ప్రకటన జరగడం నిజంగా విశేషం.
ఉత్తరాధికారి బాధ్యత స్వీకరించే ఆ దృశ్యాన్నీ, అప్పగించే ఆ వేడుకనూ వీక్షించడానికి రెండు రోజుల ముందు నుంచే వేలాదిగా భక్తులు కంచికి చేరుకోవడం మొదలయింది. ముహూర్తం వేళకు కామాక్షి కోవెల కిక్కిరిసిపోయింది.ఉత్తరాధికారి బాధ్యతకు ఎంపికై, అప్పటికే మాధ్యమాల ద్వారా హిందూ సమాజానికి పరిచయమైన ఆ యువకుడి ప్రసన్నవదనం, ఆ ముఖంలోని దివ్యత్వం అందరినీ తన్మయులను చేశాయి. పంచగంగలో స్నానం చేసి వచ్చి, అన్నీ త్యజించి సన్యాసి అయ్యారు ఉత్తరాధికారి. సన్యాస దీక్ష తరువాత ‘హర హర శంకర జయ జయ శంకర’ నినాదాలు మిన్నంటుతుండగా పరివ్రాజకునికి అత్యంత ముఖ్యమైన దండాన్ని అప్పగించే కార్యక్రమం నిర్వహించారు విజయేంద్ర సరస్వతి స్వామివారు. ఉత్తరాధికారి ప్రకటన లేదా శిష్యునిగా స్వీకరణ కార్యక్రమం ఏప్రిల్ 22న ప్రారంభమైంది. అక్షయ తృతీయ వరకు ఆ ‘పూర్వాంగ క్రియలు’ నిర్వహించారు. అందులో భాగంగానే కామాక్షి అమ్మవారికీ, శంకర భగవత్పాదుల సన్నిధిలోనూ ప్రత్యేక పూజలు చేశారు. శ్రీసత్యచంద్రశేఖరేంద్ర సరస్వతి అంటూ గురుపరంపరలో కొత్త స్వామిని భాగస్థుని చేశారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన సాధుసంతులు, పండితులు, ప్రముఖుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.
‘ఎవరికి ధనం అవసరమవుతుందో వారికి అక్షయ తృతీయ పుణ్యకాలంలో ప్రజలు దానం చేస్తూ ఉంటారు. కానీ ఈ రోజు ఆ తల్లిదండ్రులు వారి కుమారుడిని పీఠానికి అర్పించారు. అలా సనాతన ధర్మసేవకు, వేదమాత సేవకు, దేశసేవకు వెల కట్టలేని ఈ దానం చేశారు’ అని విజయేంద్ర సరస్వతి స్వామి వ్యాఖ్యానించారు. ఇక నుంచి తమ గురువుల (విజయేంద్ర సరస్వతి స్వామి)తో కలసి సత్యచంద్ర శేఖరేంద్రస్వామి ముముక్షువులకు మార్గదర్శనం చేస్తారని, అద్వైత వేదాంతాన్ని రక్షించడంతో పాటు, ఆ మహోన్నత తత్త్వాన్ని బోధించడంతో పాటు చిరకాలం నుంచి పీఠం ఆచరిస్తున్న సంప్రదాయా లను రక్షించడంలోనూ తనదైన పాత్ర నిర్వహిస్తారని కూడా విజయేంద్ర సరస్వతి స్వామి ప్రకటించారు.
ఉత్తరాధికారి ఎంపిక విధానం
మానవ జీవితంలో సన్యాస దీక్ష అత్యంత ప్రముఖమైనది. ఇది పరమ పవిత్ర కార్యం. అలాగే కొందరికి మాత్రమే దక్కే అవకాశం. దీనిని చతుర్థాశ్రమం అంటారు. మరొక్కటి కూడా చెప్పుకోవాలి. సన్యసించడం వేరు…ప్రతిష్ఠాత్మక పీఠానికి అధిపతి కావడం వేరు. కంచి కామకోటి పీఠానికి అధిపతి కావడం అంటే ఏమిటి? ఊహించడం కూడా సాధ్యం కాదు. అందుకు ఎంతో త్యాగ•నిరతి, విద్వత్తు, దీక్ష, పట్టుదల, అంకితభావం అన్నిటికి మించి మాతాపితరుల అనుమతి అత్యంత అవసరం. జీవితాన్ని ధర్మం కోసం అర్పించడమే అందులో ఉంటుంది. తన కుమారుడు కాబోయే జగద్గురువు అనే భావన ముందు, భవబంధాలు స్వల్పం. ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప దక్కని ఈ భాగ్యం సాక్షాత్తు భగవత్ ప్రసాదం అన్న భావనే ఉత్తరాధికారి కన్నతల్లి ముఖంలో కనిపించింది. భారతీయ సన్యాసాశ్రమంలో మరొక విశిష్టత ఉంది. ఉత్తరాధికారి అయినా, తరువాత పీఠాధిపతి అయినా, లోకం మొత్తం ఆయన పాదాల చెంత మోకరిల్లుతుంది. కానీ మాతృమూర్తిని ఆ సంప్రదాయం నుంచి మినహాయించారు. ఇదీ, తల్లికి భారతీయత ఇచ్చిన సమున్నత స్థానం.
సమాజాన్ని సంపూర్ణ జ్ఞానమార్గంలో నడిపించడం ద్వారా సనాతన ధర్మ పరిరక్షణ కోసం వర్తమాన పీఠాధిపతి ఉత్తరాధికారిని/వారసుడిని ఎంపిక చేస్తారు. పరివ్రాజకత్వం అంటే కఠిన నియమాల మధ్య జీవనం. అనేక నిబంధనలు ఉంటాయి. ఎన్నో జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. పీఠం ఉత్తరాధికారిగా ఎంపికయ్యే వారి కుటుంబం నేపథ్యాన్ని సునిశితంగా పరిశీలించి, పరిగణనలోకి తీసుకుంటారు. వారిది వేదాధ్యయన వంశం/కుటుంబమా? వైదిక సంప్రదాయం కలిగిన వారేనా? ఎంపికకు ఉద్దేశించిన వ్యక్తిలో సత్వగుణ పాళ్లు ఎన్ని? జాతకపరంగా కేతువు సన్యాసి భావాలను ఎంతవరకు కలిగిస్తాడు? వంటివాటితో పాటు ప్రస్తుత పీ•ఠాధిపతికి వారసుడి సమర్థతపై కలిగే అభిప్రాయం, ఆయనలోని దైవిక స్వభావంపై అంచనాలు ఎంపికకు దోహదం చేస్తాయి. ఆ ప్రకారమే శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి తమ ఉత్తరాధికారిని నిర్ణయించారని చెబుతారు.
సన్యాస దీక్ష
సశాస్త్రీయంగా ఉత్తరాధికారి నియమాక పక్రియ వారం రోజుల ముందే ప్రారంభం కాగా, ప్రధాన ఘట్టాన్ని శ్రీ విశ్వావసు వత్సర అక్షయ తృతీయ నాడు ఘనంగా నిర్వహించారు. మంగళ వినాయక సన్నిధి సమీపం(కామాక్షి ఆలయం) లోని పంచగంగ పుష్కరిణి వద్ద వేకువ జామున సుమారు ఐదు గంటల సమయంలో సన్యాసదీక్ష స్వీకరణ పక్రియ మొదలైంది. పూర్వాశ్రమంలో శ్రీ గణేశ్‌ద్రావిడ్ తల్లిదండ్రులతో సిద్ధంగా ఉండగా, విజయేంద్ర సరస్వతి మంగళవాద్యాలు, మంత్రోచ్చరణల మధ్య దీక్షాస్థలికి చేరుకున్నారు. పండితులు విఘ్నేశ్వరపూజ, ఉదకశాంతి, పుణ్యాహవాచనం నిర్వహించిన తరువాత కాబోయే ఉత్తరాధికారి ‘తృష్ణీ’ స్నానం ఆచరించారు.
పంచగంగలో ఉత్తర దిశగా నిలిచి, యజ్ఞోపవీతం సహా శరీరం మీద ఉన్న అన్నింటిని త్యజించిన తరువాత విజయేంద్ర సరస్వతి స్వామి స్వయంగా సన్యాస దీక్షకు అవసరమైన వస్త్రాలను ఉత్తరాధికారికి అందించారు. అవి చంద్రమౌళీశ్వర స్వామి పాదాల చెంత ఉంచి పూజించి తెచ్చినవి. ఉత్తరాధికారి వాటిని సవినయంగా స్వీకరించి, కళ్లకు అద్దుకున్నారు. ఉత్తర దిశగానే హిమాలయాలు ఉన్నాయి. గంగ ఉన్నది. వాటితో ఆది శంకరులకు అవినాభావ సంబంధం ఉంది. అందుకే ఉత్తరదిశగా (పంచ పదంగత్వ) అడుగులు వేశారు. రెండు చేతులు పైకెత్తి.. పంచభూతాల సాక్షిగా, కామాక్షి అమ్మవారి సాక్షిగా తాను సన్యాస దీక్షను స్వీకరిస్తున్నట్టు ప్రమాణం చేశారు. ‘ఓం భుః సన్యస్తం మయ.. ఓం భువః సన్యస్తం మయ.. ఓం సువః సన్యస్తం మయ.. ఓం భూర్భువుస్సువః సన్యస్తం మయ’ అంటూ మంత్రోచ్చాటన చేశారు.ఆపై కాషాయ వస్త్రాలు ధరించి సన్యాస దీక్షలో దర్శనమిచ్చిన ఉత్తరాధికారిగా సత్య చంద్రశేఖరేంద్ర స్వామిని తొలిసారి దర్శించుకున్న భక్తజనం అక్షరాలా తన్మయులయ్యారు. ఆకాశంలో ఒక సూర్యభగవానుడు ఉండగా, జనం మధ్య మరొక సూర్యోదయం అయినట్టే ఉందని వ్యాఖ్యాత పేర్కొనడం విశేషం. తరువాత తనకు మంత్రోపదేశం చేయవలసిందని ఉత్తరాధికారి గరుడాసనంలో కూర్చుని గురుదేవులను అభ్యర్థించారు (ఆసనం విజయేంద్ర సరస్వతి స్వామి వేసి చూపించారు). ఆపై ఎర్రని వస్త్రంలో చుట్టి తెచ్చిన సాలగ్రామాన్ని ఉత్తరాధికారి శిరస్సున ఉంచి విజయేంద్ర సరస్వతి స్వామి అభిషేకించిన ఘట్టం అద్భుతం. వెనుక వేద పండితులు పురుషసూక్తం చదివారు.
దండ ప్రదానం
తరువాత జరిగినదే అత్యంత ముఖ్య ఘట్టం దండ ప్రదానం. పరివ్రాజకుల వామభుజం మీద ఉండే దండం మహిమాన్వితమైనది. ‘లోకానుగ్రహార్ధం దండాది గృహాణా’ అన్నారు. అంతేకాదు, ‘ఇంద్ర హస్తే యథా వజ్రం/ శూలం హస్తే హరస్య చ/ విష్ణు హస్తే యథా చక్రం/ తథా దండోభవాద్యమే’ అన్న శ్లోకాన్ని అప్పుడు శిష్యుడి చేత గురువు చెప్పించారు. అంటే ఇంద్రుడి చేతిలో వజ్రాయుధం, తినేత్రుడి చేతిలోని త్రిశూలం, విష్ణువు చేతిలోని చక్రం ఎంత శక్తిమంతమో, ఒక పరివ్రాజకుని భుజం మీద ఉండే దండం అంతే శక్తిమంతమని అర్ధం. తరువాత ఆసనాన్ని అందించే కార్యక్రమం జరిగింది. గురువులు దర్భాసనానికి బదులు పీఠాన్నే విజయేంద్ర ఉత్తరాధికారికి అప్పగించారు. స్ఫటిక రుద్రాక్షమాలను మెడలో అలంకరించారు. ‘మమ హృదయంతే దదామి’ (నా హృదయాన్ని నీకు అందిస్తున్నాను) అనే మహా మంత్రోపదేశం తరువాత ‘శ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి శంకరాచర్య స్వామి’అని యోగనామం నిర్దేశించి, మూడుమార్లు ప్రకటించారు. దీనితో కామాక్షి కోవెల మొత్తం హర్షధ్వానాలతో ప్రతిధ్వనించింది. పూర్వాశ్రమంలోని పేరులో ఎంతో కొంత భాగం సన్యాస దీక్ష తరువాత కూడా మిగలడం అత్యంత అరుదు. ఆది శంకరాచార్య తరువాత మళ్లీ ప్రస్తుత ఉత్తరాధికారి యోగనామంలో, పూర్వాశ్రమ నామ భాగం (సత్య) కొనసాగడం గమనార్హం. ఇదే మాటను విజయేంద్ర స్వామి కూడా ప్రస్తావించారు. అన్నవరం స్వామిలో కూడా సత్య ఉన్నది అని గుర్తు చేశారు.
అనంతరం పూర్ణకుంభ స్వాగతం, భారీ ప్రదర్శన నడుమ ఆచార్య ద్వయం కామాక్షి అమ్మవారి ఆలయానికి చేరింది. చిన్నస్వామి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి జగద్గురువు శంకర భగవత్పాదుల సన్నిధిలో పరివట్టం, ప్రసాదం అందచేశారు.
చరిత్రాత్మక పీఠం
శ్రీ కంచి కామకోటి పీఠం లేదా కంచి మఠం సనాతన ధర్మ కేంద్రం. కంచి శక్తిపీఠం కూడా. ఇక్కడ వెలసిన కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో కామకోటి పీఠం శతాబ్దాలుగా సనాతన ధర్మ రక్షణకు అంకితమైనది.
సనాతన ధర్మ రక్షణ కోసం కంచి పీఠం చేస్తున్న సేవలను ఏమని చెప్పగలం! అటు భారతీయ ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని కాపాడుతోంది. ఆపన్నులను వివిధ సామాజిక సేవలతో ఆదుకుంటున్నది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కంచి పీఠం జాడ దర్శనమిస్తుంది. జమ్ముకశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లోని ఆది శంకర ఆలయ నిర్వహణే కాదు, దేశంలో అనేక ఆలయాల బాధ్యతను కూడా స్వీకరించింది. ఈశాన్య భారతంలోని అస్సాం వరకు ఎన్నో చోట్ల వేద పాఠశాలలు నిర్వహిస్తున్నది. ఆలయాల జీర్ణోద్ధరణకు దశాబ్దాలుగా పాటు పడుతున్నది. ఆసుపత్రులు, విద్యాలయాల ద్వారా పీఠం విద్య వైద్య సేవలు అందిస్తున్నది. ఉన్నత విద్య కోసం కంచిలోనే విశ్వవిద్యాలయం నెలకొల్పింది.
భారతదేశ సమైక్యత కోసం కంచి పీఠాధిపతులు అందించిన సేవలు చిరస్మరణీయమైనవి. ఈ పీఠం వ్యవస్థాపకులే సాక్షాత్తు ఆది శంకరులు. ఆయన దేశమంతా కాలినడకన పర్యటించారు. నాలుగు గొప్ప మఠాలు స్థాపించారు. దైవభక్తికీ, దేశభక్తికీ నడుమ ఉన్న బంధం ఎంత పవిత్రమైనదో తెలిసినవారు కాబట్టే మళ్లీ 68, 69 పీఠాధిపతులు ఆది శంకరుల వారి మాదిరిగానే భారతయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రల ద్వారా లక్షలాది మంది భారతీయులను చైతన్య పరిచారు. 70వ పీఠాధిపతి గ్రామీణాభివృద్ధి పట్ల విశేష శ్రద్ధాసక్తులు చూపుతూ ఉంటారు. సనాతన ధర్మం మీద, ఆచార వ్యవహారాల మీద ఆయనకు ఎంత నిష్ట నియమం ఉన్నాయో, గౌరవ ప్రపత్తులు ఉన్నాయో; ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, విజ్ఞానం భారతీయ సమాజానికి చేరడం గురించి కూడా అంతే ఆసక్తి ప్రదర్శిస్తారు వారు. సేద్యాన్ని వృద్ధి చేసుకోవడానికి, గోసంతతి పెంపునకు, ఇందుకు మన పురాతన భారతీయ విధానాల వినియోగం అనే మూడు కోణాలు కంచి పీఠానికి అలంకారాలుగా భాసిల్లుతున్నాయి. అందుకే ఈ మూడు కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తున్నది. 70వ పీఠాధిపతుల ఈ సేవలు వారికి ముందు మఠాధిపతి సూచించిన బాటలో సాగినవే.
అయోధ్య ఆలయ నిర్మాణానికి ఎదురైన సమస్యలను పరిష్కరించడానికి 69వ పీఠాధిపతులు విశేష చొరవ చూపిన సంగతి జాతికి తెలుసు. రామాలయం నిర్మాణం వారి స్వప్నం. కానీ 70వ పీఠాధిపతుల ఎదుట రామాలయం ఆవిష్కృతమైంది. రామచంద్ర ప్రభువును పునఃప్రతిష్ఠించుకున్నాం. కంచి పీఠానికీ, అయోధ్యకూ అవినాభావ సంబంధమే ఉంది.
మాధ్యమాల పుణ్యమా అని ఉత్తరాధికారి నియామక క్రతువును జాతీయ అంతర్జాతీయ భక్తకోటి కనులారా వీక్షించగలిగారు. ఇదొక అపూర్వ అవకాశం. బహుశా అది ఇటీవలి తరాలకి లభించిన మాట వాస్తవం. ఈ తరాలకి అరుదైన అదృష్టం. పీఠాన్ని ముగ్గురు గురువులు (చంద్రశేఖరేంద్ర సరస్వతి, జయేంద్ర సరస్వతి, విజయేంద్ర సరస్వతి) సేవించే దృశ్యాన్ని దర్శించే అవకాశం కూడా ఈ తరాలకే దక్కింది. ప్రస్తుత పరిస్థితులలో ఉత్తరాధికారి నియామకం, ఆ పక్రియను దేశ ప్రజానీకం వీక్షించడం అత్యవసరమే. ఇటీవలి కాలంలో అయోధ్యలో శంకుస్థాపన, బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు హిందూ సమాజంలో ఎంత కదలిక తెచ్చాయో, కంచి ఉత్తరాధికారి నియామకం కూడా అంతే చైతన్యవంతం చేసిందన్నది నిర్వివాదాంశం.
హరహర శంకర..జయజయ శంకర…
నడిచే దేవుడు
శంకరభగవత్పాదులతో అనుగ్రహంతో కాంచీపురి పీఠ స్థాపన పరమాద్భుత చారిత్రక ఘట్టం కాగా, 68వ పీఠాధిపతి పరమాచార్యులు పూజ్యశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారితో ఉజ్జ్వలమై ఉన్నత స్థితికి చేరింది. దేశంలో మత, జ్ఞాన పరమైన అంశాలకు మార్గదర్శకత్వం అందించారు. 13వ ఏట సన్యసించి 87 వసంతాల పాటు పీఠాధిపతిగా కొనసాగి, ‘నడుస్తున్న దేవుడు’గా మన్ననలు అందుకున్న మహనీయులు. అంత సుదీర్ఘకాలం పీఠాధిపత్యం వహించడం హిందూ మత చరిత్రలోనే అపురూప, అపూర్వ సంఘటన. హిందూ సమాజంలో అఖండ గౌరవం పొందిన మహనీయులు. నిరాడంబర జీవితం, మౌనం, సన్యాస ధర్మానికి చూపిన నిబద్ధత వల్ల జీవిత కాలంలోనే ‘జీవన్ముక్తుడు’గా కీర్తి పొందారు. ఆయనే లేకపోతే పెరియార్ వంటి వైదిక వ్యతిరేకుల మధ్య సనాతన ధర్మం ఎలా నిలబడేదో అనిపించకమానదు.
ఉత్తరాధికారి పూర్వాశ్రమం
ఆంధప్రదేశ్‌లోని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పిఠాపురానికి చెందిన దుడ్డు సత్యవేంకట సూర్య సుబ్రహ్మణ్యం గణేశ్ ద్రావిడ్ (24) తండ్రి ధన్వంతరి శర్మ అన్నవరం శ్రీ వీర వేకట సత్యనారాయణ స్వామి ఆలయ వ్రత పురోహితులు. తల్లి అలమేల్మంగ గృహిణి. సోదరి చదువుతున్నారు. వారి పూర్వికులూ వేద పండితులే. 2006లో వేదాధ్యయనం ప్రారంభించిన ద్రావిడ్ రుగ్వేద యజుర్వేద సామవేదాలతో పాటు షడంగాలు, దసోపనిషత్తులపై లోతైన అధ్యయనం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలోని వేద పాఠశాల, ద్వారకా తిరుమల, కంచి పీఠంలో వేదాధ్యానం చేశారు. బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో రుగ్వేద పండితునిగా సేవలు అందించారు. వేదాధ్యయన సమయంలో రుగ్వేదంలో ‘సలక్షణ ఘనాపాఠి’ బిరుదు పొందారు. రుగ్వేద ఘన మంత్రాలను జపించవలసిందిగా యువ వేద విద్యార్థులను ప్రోత్సహించేవారు. ఘనాపాఠి అంటే వేద జపంలో నిష్ణాతులు కాగా, ‘సలక్షణ ఘనాపాఠి’ అంటే వేద సంప్రదాయంలో గొప్ప పండితుడు. వారు ‘వర్ణక్రమం’, ఉచ్చారణ, వేదవ్యాకరణంలో ప్రవీణులు.
డా।। ఆరవల్లి జగన్నాథస్వామి
సీనియర్ జర్నలిస్ట్