భారతదేశంలో హిందువులు ఇప్పుడైనా నిద్ర లేవకపోతే, మైనార్టీలుగా మారే అవకాశం ఉంది. ఈ హెచ్చరిక చేసింది వేరెవరో కాదు సాక్షాత్తు అలహా బాదు హైకోర్టు. దానితో పాటుగా, మతసమ్మేళనాలు, సభల సమయంలో జరుగుతున్న మతాంతరీకరణల విషయంలో ఎవరూ జోక్యమూ చేసుకోకపోతే భారత్‌లోని మెజారిటీ జనాభా మైనార్టీకి దిగజారే అవకాశం ఉందని వ్యాఖ్యానించింది. ఒక మతాంతరీ కరణ కేసులో కైలాస్‌ అనే వ్యక్తికి బెయిల్‌ ‌నిరాకరిస్తూ న్యాయమూర్తి రోహిత్‌ ‌రంజన్‌ అగర్వాల్‌ ఈ ‌వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలలో సత్యాన్ని కాదనలేం. దేశాన్ని ముక్కలు ముక్కలు చేయాలని, హిందువులను కులాల వారీగా విభజించి పాలించాలన్నది ఎ.ఒ. హ్యూమ్‌ ‌స్థాపించిన కాంగ్రెస్‌పార్టీ లక్ష్యం. ఈ కుట్రలను అర్థం చేసుకోకుండా చిన్నచిన్న తాయిలాలకే మురిసి పోయో లేక మెకాలే లాంటి మేధావుల మాటలతో ప్రభావితమయ్యో హిందువులు కాంగ్రెస్‌, ‌దాని తోక పార్టీల బుట్టలో పడిపోయి సెక్యులరిజం పేరుతో మతాన్ని మంటకలుపుతున్నారు.
దక్షిణాదిలోనే కాదు ఉత్తరాదిలో కూడా మతాంతరీకరణ అత్యంత వేగంగా చోటు చేసుకుం టోందనడానికి అలహాబాదు హైకోర్టులో దాఖలైన వ్యాజ్యమే ఒక ఉదాహరణ. ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌ ‌గ్రామానికి చెందినవారిని కైలాస్‌ అనే వ్యక్తి వారికి వైద్య చికిత్స ఉచితంగా చేయిస్తామనే హామీతో ఒక మత సమ్మేళనానికి తీసుకువెళ్లి, క్రైస్తవంలోకి మతాంతరీకరించాడు. భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్‌ 365, ‌యుపి చట్టవిరుద్ధ మతమార్పిడి నిషేధ చట్టం, 2021లోని 3/5(1) కింద కైలాస్‌పై అభియోగాలపై కోర్టు విచారణ సందర్భంగా ఏకసభ్య ధర్మాసనం న్యాయమూర్తి అగర్వాల్‌ ‌దేశాన్ని అప్రమత్తం చేసే యత్నం చేశారు.
నిందితుడిపై బాధితుడి సోదరి ఆరోపణలు
కోర్టు పత్రాల ప్రకారం, ఫిర్యాదుదారు రామ్‌కలీ ప్రజాపతి సోదరుడు రామ్‌ఫల్‌ను కైలాస్‌ అనే వ్యక్తి ఢిల్లీలో జరుగుతున్న ఒక సామాజిక, సంక్షేమ సభకి హమీర్‌పూర్‌ ‌నుంచి తీసుకువెళ్లాడు. అతడితో పాటుగా గ్రామం నుంచి పలువురిని ఈ కార్యక్రమా నికి తీసుకువెళ్లి వారందరినీ క్రైస్తవంలోకి మార్చాడు. మానసిక సమస్యతో బాధపడుతున్న తన సోదరుడికి, చికిత్స చేయిస్తానని, ఒక వారంలో తిరిగి రావచ్చని కైలాస్‌ ‌హామీ ఇచ్చాడని రామ్‌కలీ తన ఫిర్యాదులో పేర్కొంది. ఒకవారం తర్వాత కూడా రామ్‌ఫల్‌ ‌తిరిగి రాకపోవడంతో, ఆమె కైలాస్‌ను దాని గురించి ప్రశ్నించింది. అతడి నుంచి సంతృప్తికరమైన జవాబు రాకపోవడంతో కైలాస్‌ ‌ఫిర్యాదు చేసింది. కాగా, రామ్‌ఫల్‌ను క్రైస్తవంలోకి ఎప్పుడూ మార్చలేదని, కైలాస్‌ అసలు ఆ కార్యక్రమానికే వెళ్లలేదని నిందితుడి తరుఫు న్యాయవాది వాదిస్తున్నాడు. బెయిల్‌పై ఉన్న సోనూ పాస్టర్‌ ఇటువంటి సమావేశాలు నిర్వహిస్తు న్నాడని కూడా ఆరోపించాడు. కాగా, నిందితుడిపై ఆరోపణలు తీవ్రమైనవి కావడంతో కోర్టు బెయిలు నిరాకరించింది. పైగా అతడు ప్రజలను మత మార్పిడికోసం ఇటువంటి సమావేశాలకు తీసుకువెడు తున్నాడని పలువురు వ్యక్తులు చేసిన ప్రకటనలు సూచించాయి.
‘మతమార్పిడులు ఇలాగే కొనసాగితే మెజారిటీ ప్రజలు మైనార్టీలుగా మారుతారు’
మతమార్పిడులు జరిగే మతపరమైన సభలను తక్షణమే నిలిపివేయాల్సిన అవసరం ఉందని న్యాయస్థానం ఉద్ఘాటించింది. ‘‘ఈ పక్రియను ఇలాగే కొనసాగనిస్తే, దేశంలోని మెజారిటీ జనాభా ఏదో ఒకనాడు మైనార్టీగా మారుతుంది. మతమార్పిడులు జరుపుతూ, భారత పౌరుల మతాన్ని మారుస్తున్న ఇటువంటి మత సభలను తక్షణమే నిలిపివేయాలి’’ అని జస్టిస్‌ అగర్వాల్‌ ‌వ్యాఖ్యానించారు.
మత ప్రచారం వేరు, మత మార్పిడి వేరన్న కోర్టు
రాజ్యాంగ ఆదేశాలను పట్టి చూపుతూ, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 25 ఆత్మప్రబోధ స్వేచ్ఛకు, ఏ మతాన్నైనా అవలంబించి, ఆచరించి, ప్రచారం చేసుకునే హక్కుకు హామీ ఇస్తుంది. అయితే, అది ఒక మతం నుంచి మరొక మతానికి వ్యక్తులను మార్చడానికి అది విస్తరించదు. ‘ప్రచారం’ అనే పదానికి అర్థం తన మతాన్ని ప్రోత్సహించడమనే తప్ప ఇతరులను తమ మతంలోకి మార్పిడి చేయడం కాదనే విషయాన్ని జస్టిస్‌ అగర్వాల్‌ ‌పట్టి చూపారు.
యుపిలో ప్రబలంగా మతమార్పిడులు సాగుతున్నాయన్న కోర్టు
ఉత్తర్‌‌ప్రదేశ్‌ ‌వ్యాప్తంగా చట్టవిరుద్ధంగా జరుగుతున్న మతమార్పిడుల పట్ల కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా ఎస్‌సి, ఎస్‌టి, ఆర్ధికంగా వెనుకపడిన నేపథ్యం నుంచి వచ్చినవారిని లక్ష్యంగా చేసుకుని ఇవి చోటు చేసుకుంటున్నాయని ఉద్ఘాటించింది. ‘‘ఎస్‌సి/ఎస్‌టి కులాలు, ఆర్ధికంగా పేదవర్గాలు సహా ఇతర కులాలను లక్ష్యంగా చేసుకొని చట్టవిరుద్ధంగా క్రైస్తవంలోకి మతాంతరీకరిస్తున్న విషయం పలు కేసుల సందర్భంగా ఈ కోర్టు దృష్టికి వచ్చింది, యుపి వ్యాప్తంగా ఇది జరుగుతోంది,’’ అని కోర్టు వ్యాఖ్యానించింది. మత ప్రచారాన్ని అనుమతించినా, భారత రాజ్యాంగమిచ్చిన స్వేచ్ఛను బలవంతపు మతమార్పిడులు బలహీన పరుస్తాయని కోర్టు ఉద్ఘాటించింది.

– ‌జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
YOUTUBE