– డా।। ఐ.వి.మురళీ కృష్ణ శర్మ, ఫోన్‌ 9949372280

‌నరేంద్ర మోదీని ఎదుర్కోలేమనే ‘ఇండీ’ కూటమి నేతలు బీజేపీని దక్షిణాదిన అడ్డుకుంటే ఎన్డీఏను కేంద్రంలో అధికారానికి దూరం చేయవచ్చనే ఆలోచనతో ఎన్నికలకు ముందే ప్రణాళికలు రూపొందించారు. మోదీ ప్రభుత్వంలో దక్షిణాదికి తీవ్ర అన్యాయం జరుగుతోందని, వివక్ష చూపిస్తున్నారని ఆరోపణలు చేశారు. వీటికి సమాధానంగా కేంద్ర ప్రభుత్వం రైల్వే, జాతీయ రహదారుల కల్పనలో దేశ వ్యాప్తంగా ఒకే విధంగా అభివృద్ధి చేయడం, సంస్థల ఏర్పాటులో, అన్ని రాష్ట్రాలకు రావాల్సిన కేంద్ర నిధుల విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించిన తీరును లెక్కలతో సహా నిరూపించడంతో ప్రతిపక్షాలు తమ బాణీని మార్చాయి.

మైనార్టీ ఓట్లే లక్ష్యంగా ‘ఇండీ’ కూటమి

మరొకవైపు ద్రవిడవాదంతో తమిళనాడు డీఎంకే ప్రధాన నేతలు సనాతన ధర్మంపై విషం కక్కుతూ తలాతోక లేని వాదనలు చేశారు. కేరళ వామపక్ష ప్రభుత్వం రాష్ట్రంలో సంఘ్‌ ‌పరివార్‌, ఇతర హిందూ సంస్థల, బీజేపీ కార్యకర్తలపై దాడులు జరిగినా చూసీచూడనట్టు వ్యవహరించింది. కర్ణాటకలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం హిందువులపై మతపరమైన దాడులు జరుగుతున్నా పట్టించుకోలేదు. తెలంగా ణలో కాంగ్రెస్‌ ‌సర్కార్‌ ఎంఐఏం అధినేత ఓవైసీ ప్రాపకం కోసం పాకులాడింది. ఈ రాష్ట్రతో పోలిస్తే ఆంధప్రదేశ్‌లో పరిస్థితులు కొంచెం భిన్నం. ఇక్కడ వైసీపీ ప్రభుత్వం అన్యమతస్తుల ఆగడాలను అడ్డుకోకుండా చోద్యం చూసింది. రాష్ట్రంలో బలమైన హిందూ సంఘాలున్నా అవి కలిసికట్టుగా సంఘటి తంగా లేకపోవడం ఇక్కడ బలహీనత.

భారత దక్షిణ భాగంలోని ఐదు రాష్ట్రాల్లోనూ ఎన్నికలు గట్టి సవాలు విసిరినా బీజేపీ మెరుగైన ఫలితాలు సాధించిందని గణాంకాలు నిరూపిస్తు న్నాయి. దక్షిణాదిన 2019, 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీ 29 స్థానాలే గెలిచింది. గత ఎన్నికల కంటే ఇప్పుడు ఒక్క సీటు కూడా అదనంగా గెలవని బీజేపీ మెరుగైన ఫలితాలు సాధించిందని చెప్పడానికి ప్రధాన కారణం ఆ పార్టీ ఐదు రాష్ట్రా ల్లోనూ గణనీయంగా ఓట్ల శాతాన్ని పెంచుకొని పార్టీ పునాదులను పటిష్ట పర్చుకుంది. పార్టీకి ఉనికే లేదని విమర్శలు ఎదుర్కొన్న కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రత్యర్థి పార్టీలకు ముచ్చెమటలు పట్టించింది.

మర్రి వృక్షం నీడ నుండి బయటకు

39 స్థానాలున్న తమిళనాడులో బీజేపీకి 2024 ఎన్నికలు ప్రత్యేకమైనవి. 2019 ఎన్నికల్లో ఒక్క సీటు కూడా బీజేపీ గెలవలేదు. ఈసారి రిక్తహస్తమే ఎదురయినా పార్టీ గణనీయంగా పుంజుకుంది. జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌, ‌వామపక్షాలు ఇక్కడ గెలవాలంటే ఈ రెండింటిలో ఏదో ఒక పార్టీ చెంతన చేరాలి. రాష్ట్రంలో డీఎంకే, అన్నాడీఎంకే మర్రి వృక్షాలు. ఈ నేపథ్యంలో గతంలో అన్నా డీఎంకేతో జతకట్టిన బీజేపీ ఇప్పుడు దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో చిన్నపార్టీలను కలుపుకొని సొంతంగా పోటీ చేసింది. అన్నామలై రాష్ట్ర చీఫ్‌గా బీజేపీ ఈ ఎన్నికల్లో డీఎంకేకు ముచ్చెమటలు పట్టించింది.

2019 లోకసభలో అన్నాడీఎంకేతో కలిసి పోటీ చేసిన బీజేపీ 3.6 శాతం, 2016, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 3 శాతం లోపే ఓట్లను పొంది, 2024లో సొంతంగా 11 శాతానికి పైగా ఓట్లను సాధించింది. మొత్తం ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో 18 శాతానికి పైగా ఓట్లను పొందింది. పొత్తులో భాగంగా 23 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ 9 స్థానాల్లో రెండో స్థానంలో నిలవడం గొప్పే.

కర్ణాటకలో ముప్పేట దాడి

కర్ణాటకలో 28 స్థానాలకు గాను బీజేపీ అత్యధిక సీట్లలో గెలిచింది. సంవత్సరం క్రితం జరిగిన ఎన్నికల్లో 38 శాతం ఓట్లనే సాధించిన బీజేపీ 2024లో 46 శాతం ఓట్లు పొందింది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్‌ ‌రాష్ట్రంలో 13 శాతానికి పైగా ఉన్న ముస్లిం ఓట్ల కోసం బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడింది. రాష్ట్రంలో పలు హిందూ సంస్థలపై దాడులు జరుగుతున్నా పట్టించుకోలేదు. హనుమాన్‌ ‌చాలీసా పారాయణ పెట్టుకున్న వారిపై దాడి చేసిన వారిని వదిలేసి బాధితులనే ఇబ్బంది పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. సున్నితమైన అంశాలతో ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టింది కాంగ్రెస్‌. ఐదు గ్యారెంటీల హామీలతో గద్దె ఎక్కిన కాంగ్రెస్‌ ‌రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు దిగజారినా ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వాటిని అమలు చేస్తున్నట్టు ప్రజల్లో భ్రమలు కలిగిస్తూ జనాకర్షణ పథకాలతో ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నించింది. కనీసం 15-20 స్థానాల్లో గెలవాలని కాంగ్రెస్‌ ‌విశ్వప్రయత్నాలు చేసినా, బీజేపీ పరిస్థితులకు ఎదురీదుతూ 17 స్థానాల్లో గెలిచింది. దాని మిత్రపక్షం జేడీ(ఎస్‌) ‌మరో రెండు స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్‌ 9 ‌స్థానాలతో సరిపెట్టుకుంది. 2019 ఎన్నికల్లో 51 శాతం ఓట్లతో 25 స్థానాలు పొందిన బీజేపీ ఎదుగుదలను అడ్డుకోవడానికి స్వయం ప్రకటిత మేధావులకు పలు ఎన్జీఓలు చాపకింద నీరులా పనిచేయడంతో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నష్టపోయింది. ఈ ముప్పేట దాడులను దృష్టిలో పెట్టుకొని బీజేపీ ఈసారి జేడీ(ఎస్‌)‌తో పొత్తు పెట్టుకొని కాంగ్రెస్‌ ‌సర్కారుకు గట్టి సవాలు విసిరి విజయం సాధించింది.

దేవభూమిలో బలపడిన బీజేపీ

దేవభూమిగా పిలిచే కేరళ బీజేపీకి, సంఘ్‌ ‌పరివార్‌కు మొదటి నుండి కొరకరాని కొయ్య. రాష్ట్రంలో ముస్లిం, క్రిస్టియన్‌ ‌మైనార్టీలు నిర్ణయాత్మ కంగా ఉండడంతో బుజ్జగింపు రాజకీయాలతో ఇక్కడ వామపక్షాలు, కాంగ్రెస్‌ ‌నేతృత్వంలోని కూటము ఆధిపత్యమే కొనసాగుతూ వచ్చింది. రాష్ట్రంలో 2011 అధికారిక జనాభా లెక్కల ప్రకారమే హిందువులు సుమారు 54 శాతంకు పైగా, ముస్లింలు 26 శాతంకు పైగా, క్రిస్టియన్లు 18 శాతంకు పైగా ఉన్నారు. ఈ లెక్కన రాష్ట్రంలో అనధికారికంగా ప్రస్తుతం మైనార్టీల సంఖ్య హిందూ జనాభాను దాటిపోయి ఉండచ్చు. హిందూ ఓట్ల బదులు గంపగుత్తగా మైనార్టీల ఓట్లు సాధిస్తే అధికారం ఖాయమనే వైఖరితో కాంగ్రెస్‌/‌యూడీఎఫ్‌, ‌వామపక్ష/ ఎల్‌డీఎఫ్‌ ‌హిందువులపై వివక్షను చూపిస్తూ పాలించసాగాయి.

రాష్ట్రంలో మైనార్టీల రాజకీయ ప్రభావం ఎంతో చెప్పుకోవాలంటే కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ ‌గాంధీ పోటీ చేసిన వయనాడ్‌ ‌పార్లమెంట్‌ ‌నియోజకవర్గమే పెద్ద ఉదాహరణ. ఇక్కడ ముస్లింలు 41 శాతం, క్రిస్టియన్లు 13 శాతం ఉండడంతో ఇది సురక్షిత స్థానమని భావించిన రాహుల్‌ ‌పోటీ చేసి గెలిచారు. నియోజకవర్గంలో ముస్లిం సంఘాల ఆధిపత్యం ఎంత ఉంటుందంటే స్వయాన రాహుల్‌ ‌పాల్గొన్న పార్టీ రోడ్‌ ‌షోలో కాంగ్రెస్‌ ‌జెండాలు ఎగరేయడానికి కూడా ఆ పార్టీకి మద్దతిచ్చిన ముస్లిం సంఘాలు అనుమతించలేదు.

యూడీఎఫ్‌, ఎల్‌డీఎఫ్‌ ‌కూటముల్లో ఎవరు అధికారంలో ఉన్నా హిందూ సంఘాలపై దాడులు నిత్యం జరగుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడమే మానేశాయి. అంతేకాక హిందువులంటే వివక్ష చూపే ఎల్‌డీఎఫ్‌ ‌సర్కార్‌ ‌హయాంలో హిందువుల ఆరాధ్య దైవమైన శబరిమలలై అయ్యప్పస్వామి దేవాలయం పుణ్యక్షేత్రాన్ని వివాదాస్పదం చేశారు. కమ్యూనిస్టు ప్రభుత్వ వైఖరిని ఆర్‌ఎస్‌ఎస్‌తో సహా పలు హిందూ సంఘాలు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుండడంతో అక్కడ నిత్యం యుద్ధమే. ఎంత మంది హిందూ సంఘాల కార్యకర్తలు బలిదానాలు చేశారో లెక్కేలేదు. ఇంతటి ఘర్షణ వాతావరణం మధ్య మొదటిసారి కేరళలో బీజేపీకి సంతోషకరమైన పరిణామాలు ఏర్పడ్డాయి.

2024 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 19 శాతం ఓట్లు సాధించిన బీజేపీ త్రిశూర్‌లో 74 వేలకు పైగా మెజార్టీతో గెలిచింది. 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో 13 శాతం, 2016 అసెంబ్లీ ఎన్నికల్లో 14 శాతం, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 12 శాతం ఓట్లు పొందిన బీజేపీ నేటి అననుకూల వాతావరణంలోనూ 2024లో 19 శాతంకు పైగా ఓట్లు పొందడం సాధారణ విషయం కాదు. 2019లో తిరువనంత పురంలో రెండో స్థానంలో నిలిచిన బీజేపీ ఇక్కడ 2024లో చివరి నిమిషం వరకు పోరాడి ఓడి పోయింది. ఈ పార్లమెంట్‌ ఎన్నికల్లో పట్టిన్‌మిట్ట, కన్నూర్‌ ‌నియోజకవర్గాల్లో బీజేపీ మూడో స్థానంలో నిలిచింది. మొత్తంమీద 2024 ఎన్నికల ఫలితాలతో కేరళలో బీజేపీ కూడా ప్రధాన పార్టీలలో ఒకటిగా అవతరించిందని చెప్పవచ్చు.

ఆంధప్రదేశ్‌లో సత్ఫలితాలు

ఆంధప్రదేశ్‌లో 2019 అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో నోటాతో పోటీపడి ఘోర పరాయాన్ని మూటగట్టుకున్న బీజేపీ ఈసారి టీడీపీ, జనసేన పార్టీలతో పొత్తు పెట్టుకొని సత్ఫలితాలను పొందింది. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన బీజేపీ మొత్తం 25 స్థానాల్లో పోటీ చేసి కనీసం ఒక్క శాతం ఓట్లు, ఒక్క ఎంపీ స్థానం కూడా పొందలేదు. ఆ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని 2024 ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్న బీజేపీ 6 పార్లమెంట్‌ ‌నియోజక వర్గాల్లో పోటీ చేసి 11 శాతం పైగా ఓట్లతో అనకాపల్లి, రాజమండ్రి, నర్సాపురం స్థానాల్లో గెలిచింది.

తెలంగాణలో రెట్టింపు స్థానాలు

తెలంగాణలో 2014లో టీడీపీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ అనంతరం ఒంటరి పోరుకు ప్రాధాన్యతనిచ్చి ప్రతి ఎన్నికల్లో బలాన్ని పెంచు కుంటూ వచ్చింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 6 శాతం ఓట్లతో ఒక్క సీటే గెలిచిన బీజేపీ, ఐదు నెలల వ్యవధిలో జరిగిన 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో 19 శాతం ఓట్లతో 4 స్థానాల్లో గెలిచింది. తర్వాత జరిగిన జీహెచ్‌ఎమ్‌సీ ఎన్నికలలో ఎవరూ ఊహించని విధంగా గణనీయమైన సీట్లు సాధించి, హుజురా బాద్‌, ‌దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీగా ఎదిగింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సంస్థాగత సమస్యలతో 13 శాతం ఓట్లతో 8 స్థానాలకే పరిమితమైంది. ఆరు నెలల వ్యవధిలో జరిగిన 2024 లోక్‌సభ ఎన్నికల్లో 35 శాతం ఓట్లతో 8 స్థానాల్లో గెలిచింది. బీఆర్‌ఎస్‌, ఎంఐఎం, ‌కాంగ్రెస్‌ ఎన్ని కుతంత్రాలు చేసినా గల్లీలో ఎవరున్నా, ఢిల్లీలో మోదీయే ఉండాలనే లక్ష్యంతో ప్రజలు తీర్పు ఇచ్చారు.

తెలంగాణలో రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో భంగపడిన బీజేపీకి రెండు పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ సానుకూల ఫలితాలు రావడం గురించి కొందరు ప్రశ్నలు లేవనెత్తారు. మోదీ చరిష్మాతో పాటు, జాతీయ అంశాల ఆధారంగా లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందనే వాదనలు ఉన్నాయి. పార్లమెంట్‌ ఎన్నికల్లో 35 శాతం ఓట్లు పొందిన బీజేపీకి ఇప్పుడు బీఆర్‌ఎస్‌ ‌బలహీనపడడం ఒక సదావకాశం. 8 స్థానాల్లో గెలిచిన పార్లమెంట్‌ ‌నియోజకవర్గాల పరిధిలోకి వచ్చే 56 అసెంబ్లీ సెగ్మంట్లలో కూడా పార్టీ బలోపేతానికి సంబంధిత ఎంపీలు కృషి చేస్తే సగం రాష్ట్రంలో పార్టీ పటిష్టపడి నట్లే.

గెలిచిన ఎనిమిది మంది ఎంపీలు, రెండో స్థానంలో నిలిచిన మరో ఏడుగురు ఎంపీ అభ్యర్థులతో పాటు ఇప్పటికే ఉన్న ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కూడా కలిసికట్టుగా సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేస్తే బీజేపీకి తెలంగాణలో అధికారం అందని ద్రాక్ష కాదు. తమ బలం పాలమీద పొంగు కాదని నిరూపించవచ్చు.

భారత దక్షిణ భాగంలో మరింత బలపడి ఉత్తరాది పార్టీ అనే మచ్చను చెరిపేసుకునేందుకు బీజేపీ ఈ ఐదు రాష్ట్రాల్లో ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తూ లోక్‌సభ ఎన్నికల్లో సానుకూల ఫలితా లను అందుకుంది. అన్ని రాష్ట్రాల్లో ఓట్ల శాతాన్ని గణనీయంగా పెంచుకుంటూ పార్టీ పునాదులను పటిష్టం చేసుకుంటున్న భారతీయ జనతా పార్టీ భారతీయులందరి పార్టీ అని నిరూపించుకునే రోజులు ఎంతో దూరంలో లేవు.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE