-‌డి.అరుణ

పత్రికా స్వేచ్ఛ గురించి, జర్నలిస్టుల భద్రత గురించి ప్రపంచ దేశాలకు ఉపన్యాసాలు ఇవ్వడమే కాదు, పత్రికా స్వేచ్ఛ సూచీని, ర్యాంకింగ్‌లను ఇచ్చి కించ పరిచే అమెరికా, వికీలీక్స్ ‌వ్యవస్థాపకుడు జూలియన్‌ అస్సాంజే విషయంలో మాత్రం అవేవీ తనకు వర్తించవన్నట్టుగా ప్రవర్తించడం దాని కాప్యం తెలిసిన వారెవరినీ ఆశ్చర్యపరచదు. అహంకారంతో విర్రవీగిపోతున్న అమెరికాకు ఎంత పెద్ద గుమ్మడికాయ అయినా కత్తిపీటకు లోకువే అన్న విషయాన్ని ఈ శతాబ్దపు తొలి దశకంలో రుజువు చేస్తూ ‘వికీలీక్స్’ ‌పేరుతో అమెరికా రహస్య రక్షణ పత్రాలను, ఇరాక్‌, అఫ్ఘాన్‌ ‌యుద్ధంలో వారి అత్యాచారాలను వెలుగులోకి తెచ్చిన వ్యక్తి జూలియన్‌ అస్సాంజే. నాటినుంచే అతడిని పట్టుకొని, శిక్షించేందుకు వేట మొదలైనా, అతడు లొంగకపోవడం, జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తల ఒత్తిడితో పాటుగా గత కొద్ది కాలంలో ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథొనీ ఆల్బనీస్‌ ‌జోక్యం చేసుకొన్న కారణంగా అంతిమంగా రాజీకి వచ్చి అతడిని వదిలివేసేందుకు అమెరికా అంగీకరించడంతో అతడు యుకె జైలు నుంచి స్వదేశం చేరుకున్నాడు.

అస్సాంజేను ఇక విడుదల చేయాలని ఆస్ట్రేలియా పార్లమెంటు సభ్యులందరూ పార్టీల కతీతంగా డిమాండ్‌ ‌చేయడంతో పాటుగా అమెరికా లోని ఎంపీలతో లాబీయింగ్‌ ‌చేయడంతో అస్సాంజేకు పెద్ద శిక్ష వేయకపోయినా, కనీసం అతడు తన తప్పు ఒక్కటైనా ఒప్పుకోవాలనే షరతు అమెరికా పెట్టింది. తమ దేశ పౌరుడు కాకపోయినా, తమ దేశ రహస్యాలను బయటపెట్టినందుకు అస్సాంజేపై అమెరికాకు కక్ష ఉండడం సహజమే అయినప్పటికీ, భావవ్యక్తీకరణ స్వేచ్ఛ సహా అన్ని రకాల స్వేచ్ఛలలో ఉదారవాదులమని చెప్పుకునే అమెరికా, తన విషయానికి వచ్చేసరికి నీతులన్నీ ఎదుటివారికి చెప్పేందుకే కానీ తమకు కాదు అన్నట్టు వ్యవహ రించింది. అస్సాంజే జైల్లో ఉన్నప్పటికీ వికీలీక్స్ ‌క్రియాశీలకంగానే ఉంది.

వికీలీక్స్

‘‌వికీలీక్స్’ ‌పేరు విననివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. కానీ, అదేం హఠాత్తుగా పుట్టింది కాదు. ఆస్ట్రేలియాకు చెందిన అస్సాంజేకు చిన్న వయసులోనే హ్యాకింగ్‌ ‌విద్య అబ్బడం, తనకు కంప్యూటింగ్‌ ‌చేయడంలోగల సహజ ఆసక్తిని గుర్తించడంతో సరిపెట్టుకోకుండా, పెం•గాన్‌, ‌నాసాలలో సురక్షిత వ్యవస్థలను కూడా తెరవడం వంటివి చేసేవాడు. ‘మెండాక్స్’ అన్న హ్యాకింగ్‌ అలియాస్‌తో అతడు చేస్తున్న కార్యకలాపాలతో అధికారులు అప్రమత్తమై, అతడిపై అప్పుడే నిఘావేశారు. 1991లోనే, అంటే సరిగ్గా ఇరవై ఏళ్ల వయస్సులోనే ఆస్ట్రేలియా అధికారులు 31 ఆరోపణలతో అతడిపై సైబర్‌ ‌క్రైమ్‌కు సంబంధించిన కేసు పెట్టినప్పటికీ, అతడు అనేక ఆరోపణలలో తన తప్పును ఒప్పుకోవడంతో చిన్న జరిమానాతో బయట పడ్డాడు. కానీ సత్యాన్ని వెలికితీయాలన్న తపనను నియంత్రించుకోలేక మరొక దశాబ్దన్నర తర్వాత అంటే 2006లో విజిల్‌ ‌బ్లోయర్‌ ‌వెబ్‌సైట్‌గా వికీలీక్స్‌ను ప్రారంభించాడు. కొంతకాలం గ్వాంటె నామో బే జైలుకు సంబంధించిన అమెరికా మిలటరీ ఆపరేషన్‌ ‌మాన్యువల్‌ ‌నుంచి, చర్చ్ ఆఫ్‌ ‌సైంటాలజీ (మానవాతీత శక్తులపై పరిశోధన చేసే సంస్థ) అంతర్గత పత్రాలవరకు రహస్యంగా ప్రచురిస్తూ వచ్చాడు. వికీలీక్స్ ‌ప్రారంభించిన రెండు మూడేళ్లకే అమెరికా రక్షణ విభాగం, విదేశాంగ విభాగానికి సంబంధించిన రహస్య పత్రాలను గుట్టలుగుట్టలుగా అస్సాంజే బయటపెట్టడంతో నాటి ప్రపంచ పెద్దన్న అమెరికా ఉలిక్కిపడింది.

గ్వాంటెనామో ఫైల్స్

అయితే, 2010 నుంచి వికీలీక్స్ ‌సాగించిన సమాచార విస్ఫోటనంతో అమెరికా పునాదులు కదిలిపోయాయి. ఇందులో 2007-2011 కాలానికి సంబంధించి ‘గ్వాంటెనామో ఫైల్స్’ ‌పేరిట వెలుగులోకి వచ్చిన సమాచారం అక్కడ జరుగుతున్న అత్యాచారాలను బయటపెట్టింది. జెనీవా కన్వెన్షన్లను ఉల్లం ఘిస్తూ గ్వాంటెనామోబే జైలులో దాదాపు 800మందికి పైగా 14 ఏళ్లలోపు పిల్లల నుంచి 89 ఏళ్ల వృద్ధులపై జరిగిన అత్యాచారాలను వెల్లడించింది. చిత్రహింసలు పెట్టి మరీ సమాచా రాన్ని సేకరించడంలో నైపుణ్యం సాధించిన చైనా, ఉజ్బెకిస్తాన్‌, ‌లిబియా సహా పలు ప్రాంతాలకు చెందిన వారిని అక్కడ జైలులో ఉన్నవారిని ప్రశ్నించేందుకు ఆహ్వానించేవారట! అంతేకాదు, తీవ్రవాదులు తమ దాడులలో ఉపయోగించారని చెప్పే 1980ల నాటి కాసియో వాచ్‌ను కలిగి ఉన్నారన్న సాకుతో అనేకమంది అమాయకులను అమెరికా అరెస్టు చేసింది. హింసను తట్టుకోలేక నిర్బంధంలో ఉన్నవారు ఇచ్చే సమాచారంపై అమెరికా అతిగా ఆధారపడేదని, నిరాహార దీక్ష చేస్తే దానిని స్వచ్ఛందంగా పూర్తి ఉపవాసమని, ఆత్మహత్యా యత్నాన్ని స్వీయ ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నారని అభివర్ణించే పరిభాషను వాడాలనే నిబంధన ఉందనే విషయాలు విన్నవారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

ఇరాక్‌, అఫ్ఘాన్‌ ‌యుద్ధ సత్యాలు

ఇక ప్రపంచాన్ని 2007 నుంచి 2011వరకు కుదిపేసిన సమాచారం మాత్రం ఇరాక్‌ ‌యుద్ధ వివరణలే. వికీలీక్స్ 2010‌లో, అక్టోబర్‌ 22‌న ఇరాక్‌పై జరుగుతున్న యుద్ధానికి సంబంధించిన అనేక సత్యాలను బహిర్గతం చేస్తూ దాదాపు నాలుగు లక్షల యుఎస్‌ ‌సైనిక పత్రాలను బయటపెట్టింది. ముఖ్యంగా, అక్కడ మరణించిన 109,000మందిలో 66,081మంది సాధారణ పౌరులే ఉన్నారు. సాధారణ పౌరులపై అనుమానం వచ్చినప్పుడు వారిని హింసించేందుకు కాంట్రాక్టర్లను ఎలా నియ మించుకుందో బయటపెట్టింది.

ఇరాక్‌ ‌పోలీసులు పౌరులపై హింస, అత్యాచారం, హత్యలకు పాల్పడు తుంటే మిత్రదేశాల సైన్యాలు వాటిని చూసీ చూడనట్టు వదిలేయడాన్ని మించి నేరం ఉండదు కదా? ఈ పత్రాలు వెలుగులోకి వచ్చిన తర్వాత ఇరాక్‌ ‌నుంచి అమెరికా తన సైనిక దళాలను వెనక్కి పిలిపించుకోవలసి వచ్చింది. ముఖ్యంగా 2007లో బాగ్దాద్‌ ‌శివారు ప్రాంతంలో ఇద్దరు రాయిటర్స్ ‌జర్నలిస్టులతో సహా లెక్కలేనంతమంది పౌరులపై అమెరికా మిలటరీ నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరుపు తున్న వీడియో అమెరికాను కూడా కుదిపివేసింది.

ఇక అఫ్ఘాన్‌లో జరుగుతున్న యుద్ధపు గుట్టును కూడా వికీలీక్స్ ‌బయటపెట్టింది. అఫ్ఘానిస్తాన్‌- అమెరికా యుద్ధానికి సంబంధించి యుఎస్‌ ‌సైన్యపు అంతర్గత నివేదికలు మొత్తం 91,000ని బయట పెట్టింది. అందులో వెలుగులోకి వచ్చిన విషయా లలో మరణించిన అమాయక పౌరుల సంఖ్యను తక్కువచేసి చూపడంతో పాటు, యుఎస్‌ ‌కాంట్రాక్టర్లు అఫ్ఘానిస్తాన్‌లో వేశ్యవృత్తిలో ఉన్న మగపిల్లలను రహస్య కార్యకలాపాలకు ఎలా ఉపయోగించు కున్నారో ఉన్నాయి. అమెరికా ఎంత కృషి చేసినా తాలిబాన్ల బలం పెరిగిపోతోందన్న వాస్తవాన్ని వికీలీక్స్ ‌పత్రాలు ధృవీకరించాయి.

కేబుల్‌గేట్‌

అమెరికాలోనూ, ప్రపంచ దేశాలలోనూ భూకంపాన్ని సృష్టించినది మాత్రం ‘డిప్లొమాటిక్‌ ‌కేబుల్స్’ ‌పేరుతో 1979 నుంచి మొదలై 2010 దాటేవరకూ విడుదలైన 250,000 పత్రాలు బయటపెట్టిన సమాచారం. ఇప్పటికీ, స్నోడెన్‌ ‌వంటివారు కొంత సమాచారాన్ని బయటపెడు తున్నారు. వీటి ద్వారా, విదేశీ ప్రభుత్వాల వ్యవహారా ల్లోనూ, ప్రపంచ సంస్థల్లోనూ అమెరికా జోక్యం వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా నాటి విదేశాంగ మంత్రిగా ఉన్న హిల్లరీ క్లింటన్‌ ‌మిత్ర దేశాలు, ఐక్యరాజ్య సమితిపై గూఢచర్యం చేయవలసిందిగా జారీచేసిన రహస్య ఉత్తర్వులు, ఐక్యరాజ్యసమితి నిర్ణయాలను, చర్యలను ప్రభావితం చేయడంలో భాగంగా అక్కడి అధికారులపై గూఢచర్యం, టునీసియా, ఈజిప్టు, యెమెన్‌, ‌సౌదీ అరేబియా, పాకిస్తాన్‌లలో నాటి నియంతలకు మద్దతు ఇచ్చిందనే విషయాలు ప్రపంచానికి తెలిశాయి. ఇందులో భాగంగానే, ఈ ప్రభుత్వాలకు ఆర్ధిక, సైనిక సహాయాన్ని అమెరికా ఇచ్చింది. ముఖ్యంగా, ‘ఐఎస్‌ఐఎస్‌’‌ను సృష్టించింది ‘సిఐఏ’ననే విషయాన్ని వెలుగులోకి తెస్తూ 5000 కేబుళ్లను వికిలీక్స్ ‌విడుదల చేసింది.

 ఇతర దేశాల ఎన్నికలలో జోక్యం యూఎస్‌కు కొత్తకాదు

పలు దేశాలలో ఎన్నికలను యూఎస్‌ ఎలా ప్రభావితం చేసిందన్న విషయాలు, తన ప్రయోజ నాలకు అనుగుణంగా ఉన్న విధానాలను అనుసరించ మని విదేశీ ప్రభుత్వాలపై ఒత్తిడి, అంతర్జాతీయ అణు ఇంధన ఏజెన్సీ (ఐఎఇఎ) సహా పలు అంతర్జాతీయ సంస్థలను తన ప్రయోజనాలను సాధించుకునేందుకు ఎలా ప్రభావితం చేసిందో వికీలీక్స్ ‌బయటపెట్టింది. ‘అరబ్‌ ‌స్ప్రింగ్‌’ ‌తిరుగుబాటు వచ్చేందుకు ఎలా చిచ్చు పెట్టిందో బయటపడిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా అమెరికా దౌత్య సంబంధాలలో సంక్షోభం ఏర్పడింది.

బోనులో సిఐఎను ..

అనంతరకాలంలో వికీలీక్స్ ‌సిఐఏ వాడుతున్న హ్యాకింగ్‌ ‌పరికరాలు, పద్ధతులపై సమాచారాన్ని ప్రచురించింది. దీనిద్వారా యూఎస్‌, ఐరోపా కంపెనీల ఆపిల్‌ ఐఫోన్‌, ‌గూగల్‌ ఆం‌డ్రాయిడ్‌, ‌మైక్రోసాఫ్ట్ ‌విండోస్‌ ‌సహా అనేక ఉత్పత్తులను సీఐఏ ఆయుధీకరించగలదని కూడా బయటపెట్టింది. అలాగే, స్మార్ట్ ‌టీవీలు వంటి వాటిని కూడా హ్యాక్‌ ‌చేసి, నియంత్రించేందుకు సీఐఏ పరికరాలను అభివృద్ధి చేసింది. కార్లు, ట్రక్కులు సహా రీమోట్‌ ‌కంట్రోల్‌ ‌ద్వారా వాహనాలను నియంత్రించగలిగే ప్రమాదకర సాంకేతికతలను సీఐఏ అభివృద్ధి చేసిందనే సమాచారాన్ని తెలిపింది. అలాగే, ఎన్నిక లలో సిఎన్‌ఎన్‌, ‌వాషింగ్టన్‌ ‌పోస్ట్ ‌వంటి పత్రికలతో యుఎస్‌ ‌డెమొక్రాటిక్‌ ‌నేషనల్‌ ‌కమిటీ ఎలా కుమ్మక్కైందో తెలిపింది.

వికీలీక్స్ అనంతర పరిణామాలు

కాగా, 2010లో తనపై వచ్చిన లైంగిక అత్యాచార ఆరోపణలను అస్సాంజే నిరాకరించి నప్పటికీ, స్వీడెన్‌ ‌దర్యాప్తు ప్రారంభించింది. తర్వాత రెండేళ్లకు అస్సాంజే రాజకీయ ఆశ్రయం కోసం లండన్‌లోని ఈక్వెడార్‌ ‌రాయబార కార్యాలయం తలుపుత్టడం, వారు అంగీకరించడం జరిగి పోయాయి. ఏడేళ్ల తర్వాత 2019లో బ్రిటిష్‌ ‌పోలీసులు అమెరికా తరఫున అస్సాంజేను అరెస్టు చేసి ఈక్వెడార్‌ ఆ‌శ్రయాన్ని ఉపసంహరించుకున్న తర్వాత తమ నిర్బంధంలోకి తీసుకోవాలని యూఎస్‌ను కోరారు.

2022లో యూ•కే హోంమంత్రి అప్పగింత ఉత్తర్వులపై అస్సాంజే అప్పీల్‌కు వెళ్లారు. మరొక రెండేళ్ల తర్వాత జూన్‌ 2024‌లో అతడు యుకె జైలు నుంచి ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లేందుకు అనుమతిస్తూ అమెరికా అస్సాంజేతో ప్లీ డీల్‌ ‌చేసుకోవడంతో, అతడు స్వేచ్ఛావాయువులు పీల్చుకునే అవకాశం లభించింది.

పత్రికా స్వేచ్ఛపై చర్చ

అమెరికా చేస్తున్న అన్యాయాలను తన కర్తవ్యానికి కట్టుబడి నిజాయతీగా వెలుగులోకి తెచ్చిన జర్నలిస్టుగా జూలియన్‌ అస్సాంజే సామాన్యులలో మంచి పేరు అయితే తెచ్చుకున్నాడు కానీ, అందుకు భారీగా వ్యక్తిగత మూల్యాన్ని చెల్లించుకున్నాడు. తన కుటుంబం నుంచి పూర్తిగా దశాబ్దానికిపైగా దూరంగా ఉండటమే కాదు, జైలులో ఏకాంతవాస శిక్షను అనుభవించాడు. ఒకవేళ అతడిని అమెరికాకు పంపించి ఉంటే, వారి చర్య ప్రపంచవ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛపై, ఆ భావనపై విస్తృత ప్రభావాలు చూపి ఉండేదని పలువురు సీనియర్‌ ‌జర్నలిస్టుల భావన. రహస్య విషయాలను, దౌత్యపరమైన కేబుళ్లను బయటకు తెచ్చి ప్రచురించడాన్ని అమెరికా ప్రభుత్వం దానిని దేశద్రోహంగా పరిగణిస్తూ అతడిపై  18 నేరపూరిత ఆరోపణలను చేసింది. దీనిని విచారించి శిక్షవేస్తే ఇందుకు 175 సంవత్సరాల జైలుశిక్ష పడే అవకాశం ఉంది.

కాగా, గతంలో అస్సాంజేకు సహకరించిన ఐదు అంతర్జాతీయ మీడియా సంస్థలు, రహస్య పత్రాలను ప్రచురించినందుకు ఉన్న కేసును ఎత్తివేయవల సిందిగా యూఎస్‌ ‌ప్రభుత్వాన్ని కోరాయి. రెండేళ్ల కింద ‘ది న్యూయార్క్ ‌టైమ్స్, ‌ది గార్డియన్‌, ‌లీ మాండే, ఎల్‌ ‌పయస్‌, ‌దేర్‌ ‌స్పీగెల్‌’ ‌ప్రతినిధులు రాసిన లేఖలో వాటిని ప్రచురించడం నేరం కాదంటూ వాదించారు.

‘ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని సున్నితమైన సమాచారాన్ని సేకరించడం, బయట పెట్టడం అన్నది జర్నలిస్టుల రోజువారీ పనిలో కీలక భాగం, ఒకవేళ ఆ పనిని నేరపూరితం చేస్తే, ప్రల వ్యక్తీకరణ, ప్రజాస్వామ్యాలు గణ నీయంగా బలహీనపడతాయి’ అని ఆ లేఖ హెచ్చరిం చింది.

అనేకమంది ప్రముఖులు కూడా పత్రికా స్వేచ్ఛకు దుర్దినాన్ని ఈ ప్లీడీల్‌ ‌తప్పించిందని అభిప్రాయ పడినప్పటికీ, అందులోని షరతుల పట్ల అభ్యంతరా లను వ్యక్తం చేశారు. అతడు అనుభవించిన జైలు శిక్షను అతడు చేసిన ఈ నేరానికి శిక్షగా పరిగణించ డమంటే, ఒక జర్నలిస్టు నిజం బయటపెట్టినందుకు శిక్షించడమే కదా అని ప్రశ్నిస్తున్నారు.


భారత్‌ ‌గురించి..

భారత ప్రభుత్వానికి చెందిన అనేకమంది అధికారులు క్రియాశీలంగా, పరోక్షంగా 1984 సిక్కుల హననానికి ప్రోత్సాహాన్నిచ్చినట్టు కేబుళ్లు బయటపెట్టాయి. ఇందుకు కేవలం అవకాశవాదం, ద్వేషమే కారణమని అందులో రాబర్ట్ ఓ ‌బ్లేక్‌ ‌పేర్కొన్నారు.
దక్షిణ భారతదేశంలో ఓటుకు నోటు సంస్కృతి గురించి, ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఆనాడే న్యూస్‌పేపర్‌లో డబ్బులు పెట్టిన కవర్లు ఉంచి మరీ పంచిన విషయాన్ని కేబుళ్లు బయటపెట్టాయి. ఈ పద్ధతి కారణంగా అనేక ఎన్నికలలో డబ్బు ఎక్కువ ఖర్చు చేసినవారి పక్షానే సానుకూల ఫలితం వచ్చిందని తెలిపాయి.
2007లో అమెరికా రాయబారులు, రాహుల్‌ ‌గాంధీ రాజకీయ అనుభవం లేనివాడని, పదే పదే తప్పులు చేశాడని పేర్కొన్నారు. కాగా, క్రమంగా యుఎస్‌తో అతడి సంబంధాలు మెరుగుపడ్డాయి. 2010లో పంపిన ఒక కేబుల్‌ అతడు నిర్ణయాత్మ కంగా స్థిరపడుతున్నట్టు వర్ణించింది.
2008 ముంబై ఉగ్రదాడుల విషయంలో కాంగ్రెస్‌పార్టీ అసలు నేరస్థులను వదిలేసి, 2009 సార్వత్రిక ఎన్నికలలో భారతీయ ముస్లిం సమాజాన్ని సంతృప్తిపరిచేందుకు తన ప్రధాన రాజకీయ ప్రత్యర్ధి భారతీయ జనతాపార్టీని లక్ష్యంగా చేసుకొని కుట్ర సిద్ధాంతాలను ప్రచారం చేసిందనే విషయాన్ని కేబుళ్లు పేర్కొన్నాయి. కాంగ్రెస్‌పార్టీ తనకు లాభం లేదా ప్రయోజనం కలుగుతుందనుకుంటే తన పాత కుల/మత ఆధార రాజకీయాలు చేసేందుకు వెంటనే దిగజారేందుకు సిద్ధంగా ఉంటుందని ఈ ఘటన రుజువు చేస్తుందని ఒక కేబుల్‌ ‌పేర్కొంది.
అలాగే, ప్రస్తుత ప్రతిపక్ష పార్టీ నాయకుడు, కాంగ్రెస్‌ ‌పార్టీ నాటి అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అప్పటి భారత్‌కు అమెరికా అప్పటి రాయబారిగా ఉన్న టిమోతీ.జె రోమర్‌తో మాట్లాడుతూ,ముస్లిం తీవ్రాదం కన్నా హిందూ అతివాదులు దేశానికి ప్రమాదకరమని చెప్పడాన్ని పట్టి చూపింది. అలాగే, పాక్‌కు చెందిన లష్కర్‌-ఎ- ‌తొయబా (ఎల్‌ఇటి) గురించి రాయబారి రాహుల్‌ను అడిగినప్పుడు భారతీయ ముస్లిం జనాభాలో కొందరి మద్దతు దానికి ఉందనేందుకు రుజువులున్నాయని చెప్పినట్టుగా కూడా పేర్కొంది.
ముంబై దాడుల ఏడునెలల అనంతరం ఎల్‌ఇటి గుజరాత్‌ అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీని హత్య చేసేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నట్టు తెలిపింది.
అంతేకాదు, నరేంద్రమోదీపై అంచనాలను ఇస్తూ, మోదీ తననుతాను అవినీతిరహిత, ప్రభావవంతమైన పాలకుడిగా, వాణిజ్య సంస్కృతి పాతుకుపోయిన రాష్ట్రంలో వ్యాపారం చేయడాన్ని సులభతరం చేయడమే కాదు, శాంతిభద్రతలను ఎటువంటి గడబిడలు లేకుండా నిర్వహిస్తూ, హిందూ మెజారిటీ ప్రయోజనాలను కాపాడే రాజకీయ నాయకుడిగా స్థిరపరచుకున్నట్టు ముంబైలోని యుఎస్‌ ‌కాన్సుల్‌ ‌జనరల్‌ ‌మైకెల్‌ ఓవెన్‌ 2 ‌నవంబర్‌ 2006‌లో అమెరికాకు తెలియబరచడాన్ని బయటపెట్టింది. మోదీకి అమెరికా 2005లో వీసా ఇచ్చేందుకు నిరాకరించిన అనంతరం తాను ఆయనను కలవా లనుకుంటున్నట్టు కూడా ఆయన ఈ సంద ర్భంలో పేర్కొన్నారు. ఆ కాలంలో సౌదీ అరేబియా భారత్‌లో వాహబిజాన్ని ప్రోత్సహించేందుకు మిలియన్ల డాలర్లను కుమ్మరించడాన్నే కాదు, బాలీవుడ్‌కు అండర్‌వరల్డ్‌తో ఉన్న లింకులను వికీలీక్స్ ‌బయట పెట్టింది.
అలాగే, అమెరికా కాన్సుల్‌ ‌జనరల్‌కు తాము మరో రెండు ఆటంబాంబులను తయారు చేస్తున్న విషయాన్ని కాంగ్రెస్‌ ‌నాయకుడు కమల్‌నాథ్‌ ‌బయటపెట్టడాన్ని కూడా పట్టి చూపింది.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE