జల, తేజ, వాయు, ఆకాశ, పృథ్వి

ఈ ఐదూ కీలక మూలకాలు. ప్రథమ స్థాయి, ప్రధాన పాత్ర నిండిన ‘పంచభూతాలు’ అని మనందరికీ తెలుసు. ఇవే విశ్వసృష్టికి మూలాధారాలు. ప్రాణశక్తి నిస్తుంది నీరు. ఉద్దీపన రగిలిస్తుంది అగ్నితేజం. మహాచలన ఉత్తేజం గాలి. ‘ఉన్నది ఏదో అది’గా గోచరిస్తుంది గగనం. భౌతిక పదార్థ మూలస్థానం నేల. సమస్తానికీ మొదలూ తుదీ ఇవే. సర్వవ్యవస్థకీ గురురూపాలు.

మనకు ఆరోగ్యం, ఆనందం ఈ ఐదింటిలోనే. అందుకే ‘ఆరోగ్య ఆలయం’లోని ఐదు భవంతులకూ ఇవే పేర్లు!

ఆహారంతోనే ఆరోగ్య భాగ్యం. సహజ ఆరోగ్యం మన సొంతం. చక్కని ఆరోగ్య అలవాట్లు అంటూ ఉంటే, మన రోజువారీ పనులను వీటితో మాత్రమే సమన్వయం చేసుకుంటే ప్రతీ ఒక్కరం భాగ్య వంతులమే అంటుంది మంతెన సత్యనారాయణరాజు మార్గదర్శకత్వంలోని ఈ ప్రకృతి సుందర స్థలం.

సరికొత్తగా మందులు వాడాల్సిన అవసరం లేకుండా చేస్తుందీ కేంద్రం, ప్రకృతి జీవనాన్ని, అదే రీతి వైద్య విధానాన్ని మేళవించే ఆ డాక్టరు గారు, సహజయోగ పద్ధతిని సాధకులకు అలవరచడం ద్వారా ఆయన శ్రీమతి డాక్టర్‌ ‌విశాల దశాబ్దాల సేవలందిస్తున్నారు. ‘ఆరోగ్య అభిలాషులారా!’ అని ఆదరంగా పిలుస్తూ, ఆరోగ్య యోగభాగ్య సాధకులుగా తీర్చిదిద్దుతోందీ దేహాలయం.

ప్రకృతి ఒక శబ్ద స్వరూపం. అంతకుమించి నిత్య చైతన్య స్వభావ భరితం, ధర్మం, భావం, సత్వం, గుణం, అందం, చందం అన్నీ ఇందులోనివే, శాస్త్రంగా, విద్యగా, వైద్యరీతిగా తరతరాల చరిత కలిగి ఉంది. ధార్మిక సంస్థ నిర్వహణలోని ఇది క్రమానుగతంగా ఆరోగ్య రహస్యాల పరిశోధననూ కొనసాగిస్తూ వస్తోంది. నవ్య జీవన సూత్రాలను విశదీకరిస్తూ, ఆచరణకు తెచ్చి మంచి ఫలితాలను కనబరుస్తూ, మేలిమి ఆశ్రమంగా ప్రభావాన్ని విస్తరిస్తోంది.

తెలుగునాట గుంటూరు ప్రాంతాన, వెంకట పాలెం సమీపాన, అమరావతి కరకట్ట రోడ్డున ఉన్న ఇది ‘విజయవాడ ఆరోగ్యాలయం’గా ప్రశస్తం. పదిహేను రోజుల / నెలరోజుల / అంతకుమించిన రోజుల పరంపరలో ప్రత్యక్ష అనుభవం పొందిన వారికి నవీన అనుభూతిని కలిగిస్తుందనడం అక్షర సత్యం. ఆహార, ఆరోగ్య తీరు తెన్నులు ఎవరికి వారికే అనుభవైక వేద్యాలు.

ఏ మనిషైనా మొట్టమొదట కోరుకునేదేమిటి? ఆరోగ్యంగా ఉండాలని, దీనికి ఒక క్రమబద్ధ దినచర్య అవసరమన్నదీ ప్రకృతి ఆశ్రమ నినాద విధానం. నిత్యమూ యోగాసనాలు, వ్యాయామాలు, జీవనశైలి తరగతుల హాజరీ ఎంత అత్యవసరమో ఇక్కడే తేట తెల్లమవుతుంది. ఎవరు ఎక్కడి నుంచి అయినా ఫోన్‌ ‌చేసి వైద్య సూచనలను ఉచితంగా పొందవచ్చనేది సంస్థ సేవానిరతికి అసలు సిసలైన ఉదాహరణం. రోజూ ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది వరకూ సమాచారం (98480 21122) తెలుసుకో వచ్చని ప్రకటించడంలో, ఆచరణలో సైతం అంతే ప్రపత్తి ప్రతి ఫలిస్తుంది.

ఈ ఆరోగ్య ఆశ్రమ ప్రాంగణంలోకి చేరుకోగానే:

చెడు కనకు, అనకు, వినకు

అనే మూడు బొమ్మ సందేశాలు కనిపిస్తాయి. వాటి పై భాగంలో ఉంటుంది మరింత ముఖ్య హితవచనం ‘చెడు తినకు’ అని.

మనం తినే ప్రతీ ఆహారపదార్థం 1. తేలికగా అరిగేలా ఉండాలి. 2. త్వరగానూ అరిగిపోవాలి, 3. ఆ ఆహారంలో ఎక్కువగా పోషక పదార్థాలు నిండాలి. 4. ఎక్కడైనా తినడానికి అనువుగా ఉండటం మరీ ముఖ్యం. ఇవన్నీ కలిగి ఉండేవి పండ్లు మాత్రమే కదా.

‘తింటే కూరలు ఎక్కువ; వ్యాధులు రావడం తక్కువ’ అనేది ఇంకో ప్రధాన సూత్రం. కూరగాయల్లో విటమిన్లు, పీచు పదార్థాలు, ఖనిజ లవణాలు ఎక్కు ఉంటాయని అందరికీ తెలిసినా, నిత్యమూ క్రమ బద్ధంగా అనుసరించే వారు ఎందరు? కూరల్లోని క్యాలరీస్‌ (‌శక్తి) తక్కువ కావడంవల్ల, ఆ కూరలను పొట్ట నిండా తిన్నా బరువు పెరగం అని ఎంత మందికి తెలుసు? నోరు మొదలు దిగువ వరకు ఉండే పేగులను కూర పదార్థాలే శుభ్రపరుస్తా యని తెలిసి కూడా అంతగా ఆచరించని వారికి ఇంకెలా చెప్పాలి? ఉప్పు, నూనె, ఘాటు మసాలాలు లేనప్పుడే కూరను ఎక్కువగా తినగలమని తెలిసి కూడా పెద్దగా పట్టించుకోని వారిని మనమేం చేయగలం?

ఇవన్నీ తెలియనివారెవరూ లేరు. తెలిసి పద్ధతిగా ఆచరించేవారు ఎక్కువగా కనిపించరు, తెలిసీ తెలియని తత్వమే పలు తరహాల అనారోగ్యాలకు దారి తీస్తుందని… ఆస్పత్రుల్లో కిటకిట చూస్తే అర్థమవుతుంది.

వ్యాధులు నివారణకన్నా నిరోధకం అన్ని విధాలా మిన్న.

ముందు జాగ్రత్తలు తీసుకుంటే – ‘చేతులు కాలిన తర్వాత…’ అనే పరిస్థితి తలెత్తదు. కొన్ని వ్యాధులు ‘చాపకింద’… తీరున దాపురిస్తాయి. వాటి నుంచి బయట పడటం కనాకష్టం. అసలు వ్యాధి నిరోధక శక్తి అంటే ఏమిటో, అది వెరగాలంటే ముందుగానే మనం ఏం చేయాలో సూచించే సచిత్ర బోర్డులు ప్రాంగణంలో పలుచోట్ల కనిపిస్తుంటాయి. ప్రతీ భవంతిలోనూ, గదులన్నిం టిలోనూ, గోడల మీద చిత్రఫలకాలు అప్రమత్తం చేస్తూనే ఉంటాయి. ప్రతి నిత్యమూ, నిర్ణీతంగా మంచినీరు తాగితే ఎంత ఉత్తమమో తెలిపే ఫలకాలూ అనేకం ఉన్నాయక్కడ. నిల్వపచ్చళ్లు, నూనెలో దేలిన పదార్థాలు ఇంకెంత హాని కలిగిస్తాయో హెచ్చరించే ఏర్పాట్లూ ఉన్నాయి.

మన శరీరానికి సహకరించాల్సింది మనమే. అప్పుడే అది మనల్ని కాపాడుతుంది. కాదూ కూడదంటూ ఇష్టాను సారం వ్యవహరిస్తే రాపాడు తుంది అనేది ఆరోగ్యా లయంలో కనిపించే మరో హెచ్చరిక.

ఇక ఉత్తేజం కలిగిస్తాయన్న భ్రమతో మనం సేవించే పానీయాలు (శీతలం, ఉషం.. రెండూ) అష్టకష్టాలకూ కారకాలవుతాయి. పొట్ట పేగుల్లోని రాజగురు ఉత్పత్తిని ఆ పదార్థాలు తగ్గించివేయడంతో, వ్యాధులూ, బాధలూ చుట్టు ముడుతాయన్నదీ హెచ్చరికే! ఆకలిని చంపేసే, నిద్రపట్ట కుండా చేసేవాటి జోలికి పోవద్దు. అటువంటి వాటిని తక్షణం మానివేయడమే ముద్దు అనీ నచ్చచెప్తుందీ ఆశ్రమం.

ఇదే ఆవరణలో పాంచభౌతిక చికిత్సలనూ నిర్వర్తిస్తారు. శరీరాన్ని చల్లబరిచే మట్టి స్నానం, చర్మసంబంధ ఇబ్బందు లను తగ్గించే వేపపదార్థ స్నానం, సహజ సిద్ధ ఆవిరి స్నానం (అరటి ఆకు వినియోగంతో), ఎముకలకు పటుత్వం ఇచ్చే విటమిన్‌ ‌డీ చికిత్స… ఇందులో కొన్ని. రక్త ప్రసరణకు దోహదపడే ఇసుక స్నానం, అదే కోవలో మానసిక ఒత్తిడిని నియంత్రించగలిగే, సూర్యరశ్మితో శరీర అవయవాలకు సత్తువనిచ్చే, నిద్రలేమిని అదుపుచేసే, ముఖాన్ని కాంతివంతం చేసేందుకు ఉపకరించే స్నానచికిత్సలనూ సాధకులకు అందిస్తున్నారిక్కడ. వీటితో ఎంత ఉపశమనం కలుగుతుందన్నది ఎవరికి వారికి త్వరలోనే అనుభవానికి వస్తుంది. ఇదంతా ఆరోగ్య సేవా పక్రియ.

వయసుకు మించిన బరువు పెరగడమన్నది మరొక విషమ సమస్య. ఇందుకు చిన్నవీ, పెద్దవీ ఎన్నో కారణాలున్నాయి. సరిదిద్దుకుని బరువు తగ్గించుకోగలగడం అనేది మన చేతుల్లోనే ఉంటుం దంటుంది వైద్యశాస్త్రం. ఈ ప్రకృతి చికిత్స నిలయం లోని సూచక ఫలకం ప్రకారం ‘వ్యాయామం చేస్తే కొవ్వు కరుగు’ ఆరోగ్యమే ఆనందం, మీ ఆరోగ్యం మీ చేతుల్లో, ఆరోగ్య సప్తపది, శరీరాన్ని లోపల శుభ్రపరచడం ఎలా? ఆహారం – ఆలోచన, పరిపూర్ణ ఆరోగ్యానికి సంపూర్ణ ఆహారం, ఆసనాలు ఆరోగ్యానికి శాసనాలు, ప్రకృతి విధానం – మధుమేహ నిదానం, రోగాలురాని రుచులు… ఇలా డాక్టర్‌ ‌మంతెన వెలువ రించిన పుస్తకాలనేకం ఇప్పటికే ఎంతో ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇప్పటికీ ఉంటున్నాయి.

అధిక బరువును ఆరోగ్యకరంగా తగ్గించటం ఎలా? పొద్దుపోయి తినడంవల్ల అనర్థాలు, రోగం రాని ఆహారం, ఆరోగ్యం ఎలా వస్తుంది? ఆరోగ్యానికి మంచి అలవాట్లు, పరిపూర్ణ ఆరోగ్యానికి ప్రకృతి జీవన విధానం, ఉపవాస ధర్మం, నీరు – మీరు, జబ్బులను తగ్గించే వంటలు, లంఖణం పరమౌషధం, సాధారణ సమస్యలు-చక్కని చిట్కాలు, ఏది అపోహ, ఏది నిజం? ప్రాణాయామం-సుఖజీవన యానం… ఈ అన్నింటితోపాటు ‘సుఖజీవన సోపానాలు’ అంటూ అనేక పుస్తకాలను ముద్రించి ప్రజలందరికీ అందజేస్తూ ఆరోగ్య అవగాహన కలిగిస్తున్నారు మంతెనవారు.

ఆశ్రమ సంబంధంగా ఛారిటబుల్‌ ‌ట్రస్టు స్థాపించి రెండు దశాబ్దాలు దాటింది. ప్రాంగణ మంతా చెట్లు, పండ్లు, ఆహ్లాదకర వాతావరణంతో నిండి ఉంటుంది. ‘సంపూర్ణ ఆరోగ్యాన్ని సంరక్షిం చండి’ అంటూనే ‘సర్వదా ఆరోగ్య ఐశ్వర్యాన్ని అనుభ వించండి’ అనే భరోసానూ ఇక్కడ కల్పిస్తున్నారు. సూక్ష్మీకరిస్తే –

  1. సిరిసంపదలు ఎన్ని ఉన్నా ఆరోగ్యమే మిన్న ఆ అన్నింటికన్నా.
  2. సంప్రదాయంలోని మంచిని ఎంచు- ఆధునిక తను దానికి సమన్వయించు.
  3. నిత్యకృత్యాలతో ఇమిడిన వ్యాయామం – జీవితమంతా ఆరోగ్యమయం
  4. శ్రమకు తగిన తిండి తిను – తిండికి తగిన విధంగా శ్రమించు.
  5. అవసరాలకు, కోరికలకు అంతరం – తెలిసి మసలుకోవాలి అందరం.
  6. ఆరోగ్యవంతులే మహాభాగ్యశాలురు.
  7. ప్రకృతి ఒడిలో నేర్చుకొనేదే విద్య – ప్రకృతితో మమేకమైనదే వైద్యం.

వైద్య విధానాల్లో దేని విలువ దానిదే. దేని ధర్మం దానికి ఉంది, ఉంటుంది. అవి ఒకదానికి మరొకటి పరిపూరకాలు.

సృష్టిలోని సమాహార స్వరూపాన్ని చూడగలిగే శక్తియుక్తులు మనలో నిండాలి. ఏదైనా అనారోగ్యం కలిగితే, మనకు నచ్చిన వైద్య విధానాన్ని కాదు; మనకు అవసరమైన విధానాన్ని అనుసరించాలన్నది ప్రకృతి వైద్యశాస్త్ర సూత్రీకరణ.

యోగసాధన ఎంతైనా అవసరం. తెల్లవారక ముందే నిద్రలేవడం, పొద్దుపోకముందే నిద్రించడం ఆశ్రమ సాధకులకు నిత్యకృత్యం. కృష్ణానదీ తీరాన పరమ ప్రశాంత పరిసరాల్లో ఉదయాన్నే వ్యాయా మాలు చేస్తారు. పండ్లు, ఇతర ఆహారాలకు ప్రాధాన్య మిస్తారు. ఇక్కడి నిర్వాహకుల్లో ముఖ్యులైన డాక్టర్‌ ‌భైరి శ్రీనివాస్‌ ‌పలు రచనలు చేశారు, చేస్తున్నారు. కీళ్ల వ్యాధులకు నివారణ మార్గాలు, సుఖనిద్ర, మరెన్నో వెలువరించాయన. ‘ఆలోచన రహస్యం’ పేరిట నూతన పుస్తకాన్ని త్వరలో వెలువరిస్తున్నారు.

ఏడాది పొడవునా కొనసాగే ఆరోగ్య సాధన కార్యక్రమాలు నిర్వహణతోపాటు ప్రతీ నిత్యమూ సహజ రాజయోగ ప్రసంగాలు శారీరక, మానసిక, భావోద్వేగ నియంత్రణల సమతుల్యతను సాధించ గలుగుతున్నాయి. ఆశ్రమ నిర్మాణం, పాలనా నిర్వాహ కత్వం, సిబ్బంది సేవానిరతి ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తుంది ఎవరికైనా.

అప్పట్లో ఊరూరా పర్యటిస్తూ తమ అనుభవా లను ప్రజలకు వివరిస్తూ యోగా – ప్రకృతి వైద్య అధ్యయనాన్ని పరిపూర్ణంగా చేసిన అనుభవం నిర్వాహక ప్రముఖులది. అందుకే ‘ఆరోగ్య ఆలయం’ నిరంతర సేవలతో, పరిశోధన ఫలితాల అమలుతో పేరు సార్థకం చేసుకుంటోంది.

ఆ ఆశ్రమ పెద్దలన్నట్లు ‘ఎవరి ఆరోగ్యం వారి చేతుల్లోనే’.

-జంధ్యాల శరత్‌బాబు

సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE