పాలించే రాజుకు శౌర్య, సాహసాలే కాదు మేధోపరమైన పరిణతి ఉన్నప్పుడు వారు చరిత్రలో శాశ్వతంగా మిగిలిపోతార నేందుకు ఉదాహరణ ఛత్రపతి శివాజీ. ఆయన పేరు మనసులోకి రాగానే, మనకు మొదటగా గుర్తుకు వచ్చేది ఆయన శౌర్యం, యుద్ధ వ్యూహాలే. అయితే, ఆయన చేపట్టిన విధానాలు మరాఠా సామ్రాజ్యవ్యాప్తంగా సమాజాన్ని పెనుమార్పుకు లోను చేశాయి. ముఖ్యంగా వ్యవసాయ, సాంస్కృతిక విప్లవాలు సమాజంలో చోటు చేసుకున్నాయి. 

దార్శనికుడు, శౌర్యానికి, అసాధారణమైన పాలనా సామర్ధ్యాలు, లోతైన వ్యూహాలకు ప్రాచుర్యం పొందిన ఛత్రపతి శివాజీ మహారాజు పట్టాభిషేక మహోత్సవం జూన్‌ 6‌న జరిగింది. ఆయన సింహాస నాన్ని అధిష్టించిన 350వ సంవత్సరమిది. అనేక మంది స్వాతంత్య్ర సమరయోధులకు స్ఫూర్తిగా నిలవడమే కాదు, విస్తృత స్థాయిలో చూసినప్పుడు దేశ తొలి స్వాతంత్య్ర సమరయోధులలో ఒకరిగా నిలిచిన శివాజీ గొప్పతనాన్ని బ్రిటిష్‌కాలంలో వలస పాలకులు కావాలనే విస్మరించడం ఒక విషాదం. స్వాతంత్య్రానంతరం కూడా, రాజకీయాల కోసం ఛత్రపతి వారసత్వం పట్ల అదే అలసత్వాన్ని చూపారు.

శివాజీ చేసిన సేవలు విస్మరించలేనంత గొప్ప వన్న నిర్వివాదమైన వాస్తవాన్ని పక్కన పెడితే, మనం ఆయనను అనేక కారణాల వల్ల గుర్తుంచుకోవాలి. దూరదృష్టి, సమ్మిళితత్వంపై అవధారణ, •దునైన మేధస్సుతో పాటుగా వ్యూహాత్మక ఆలోచన, దౌత్యపరమైన పద్ధతులను అనుసరించిన ఆదర్శ నాయకుడు.

ఆయన ఎదుర్కొన్న సంఘర్షణ ప్రభావం చారిత్రికంగా కేవలం మహారాష్ట్రకే పరిమితం కాలేదు. కేవలం ఒక శతాబ్దానికే మితం కాలేదు. ఆ ప్రభావం శతాబ్దాల తరబడి కొనసాగింది, రానున్న కాలం లోనూ కొనసాగనుంది. సాధారణంగా ఛత్రపతి శివాజీని ఆయన శౌర్య, సాహసాలకు మాత్రమే గుర్తు చేసుకుంటుంటారు. కానీ, వీటి ఆవల ఆయన తన జీవితకాలంలో 17వ శతాబ్దపు సమాజాన్ని అనేక పరివర్తనలకు లోనుచేసిన విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. అనేకమంది చరిత్రకారులు ఆయనను ఐదు ప్రధాన విప్లవాలకు నాంది పలికిన ఒక విప్లవ నాయకుడిగా అభివర్ణిస్తారు. వాటిని మనం అర్థం చేసుకోవడం అవసరం. వీటిలో వ్యవసాయ విప్లవం, ఆర్ధిక విప్లవం, సామాజిక విప్లవం, సైనిక విప్లవంతోపాటుగా అత్యంత కీలకమైన సాంస్కృతిక మైన విప్లవం ఉంది.

శివాజీ మహారాజు, రాజమాత జీజాబాయి పూణె వచ్చిన సమయానికి ఆ ప్రాంతమంతా ఆదిల్‌షాహీ పాలనలో తీవ్ర వినాశనాన్ని ఎదుర్కొని ఉంది. యువ శివాజీని తీసుకుని, రాజమాత అక్కడకు వచ్చిన తర్వాత, ఆమె పుణె, ఆ చుట్టుపక్కల ప్రాంతాలను ప్రతీకాత్మకంగా బంగారు నాగలితో దున్నించింది. ఇది కేవలం ఒక సూచన కాదు. వారిరువురూ కలిసి రైతులకు, వ్యవసాయదారులకు తమ భూమిని ఎటువంటి భయాలు లేదా ఆందోళనలు లేకుండా సాగు చేసుకోమనే సందేశాన్ని సంకేతాత్మకంగా ఇచ్చారు. శాపగ్రస్తమైన భూమిగా పరిగణించిన భూమిలో, ఆకాంక్షించడాన్ని మర్చిపోయిన సమాజంలో శివాజీ బంగారు నాగలితో వారిలోని నిస్సహాయతను తొలగించి, ఆ భూమి సారాన్ని పునరుజ్జీవింపచేశాడు. దీని ద్వారా ఆయన తన దేశపౌరులకు, ‘‘ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. మీ కోసం నేనున్నాను,’’ అనే సందేశాన్ని అందించారు. విశేషంగా కీలకమైన ఈ చర్య, వారిలో ఆశ, ఆత్మవిశ్వాసం, దృఢనిశ్చయమనే విత్తనాలను నాటింది.

ఇది అత్యంత ముఖ్యమైన చర్య. ఎందుకంటే, ఆదిల్‌షాహీల పాలనలో రైతులు 60శాతం పన్ను కట్టవలసి వచ్చేది. ఇది వారిని తీవ్ర ఇబ్బందులకు లోను చేసింది. వీటికి తోడుగా సహజ, మానవ నిర్మిత విపత్తుల చెప్పలేని కాఠిన్యం, రైతులు తమ భూమిని తాము సాగు చేసుకునేందుకు సాహసించలేక పోయేలా చేసింది. చరిత్ర రికార్డుల ప్రకారం కేవలం 30 నుంచి 40 శాతం భూమి మాత్రమే సాగులో ఉండేది. వ్యవసాయదారులకు రాయితీలు ఇచ్చి, ప్రోత్సహించేందుకు ఛత్రపతి శివాజీ పాలనా యంత్రాంగం సాగు చేసుకునే ప్రతి రైతుకు ఉచితంగా కొంత ఆహారధాన్యాలతో పాటుగా ఉచితంగా విత్తనాలను, వ్యవసాయ పనిముట్లను ఇవ్వడం ప్రారంభించింది. మొదటి ఐదేళ్ల పాటు ఆయన పన్నును రద్దు చేశాడు. ఐదేళ్లలో పరిస్థితి ఎంతగా మెరుగుపడిందంటే, నూటికి నూరుశాతం వ్యవసాయ భూమిని సాగులోకి తెచ్చారు. ఆరవ సంవత్సరం నుంచి ఆయన వారు ఉత్పత్తి చేసిన ధాన్యంలో 33శాతం ప్రభుత్వ ధాన్యాగారంలో జమచేసేలా పన్నును నిర్ణయించాడు. ఆయన సృజనాత్మక ఆలోచన, సున్నితమైన పద్ధతి కారణంగా వ్యవసాయం చేయడం ఆకర్షణీయంగా మారడమే కాదు, రైతులు సంపన్నులయ్యారు.

రైతుల సంపన్నత పర్యవసాన ప్రభావాన్ని చూపింది. అది, నేడు మనం సంప్రదాయ చేతివృత్తి పనివారు, హస్తకళాకారులుగా చెప్పుకునే నాటి ‘12 బలూతేదార్ల’ ఆర్ధిక శ్రేయస్సుకు దారి తీసింది. వ్యవసాయకంగా ఆర్ధిక సుస్థిరతను సాధించిన తర్వాత వ్యవసాయ సాధనాలు, పరికరాలు, పనిముట్ల కోసం నిరంతర డిమాండ్‌ ‌గ్రామీణ ప్రాంతాలలో ఉత్పత్తిని ప్రేరేపించింది. దీనిద్వారా కమ్మరి, వడ్రంగి, చెప్పులు కుట్టేవారు సహా పలు వృత్తుల వారికి పనిని లభ్యమైంది. అనేక ఉపాధి అవకాశాలకు ద్వారాలు తెరిచిన ఆర్ధిక విప్లవం వంటిది ఇది అని చెప్పవచ్చు. ఇది ఒకరకమైన సామాజిక విప్లవానికి కూడా మార్గాన్ని సుగమం చేసింది. సాధారణంగా, అనేక కులాలు, వర్గ సమూహాలుగా చీలిపోయి ఉన్న సమాజం, ఛత్రపతి శివాజీ మహారాజ్‌ ‌పాలనపై నిర్భయంగా ఆధారపడవచ్చని, మెరుగైన జీవితాన్ని ఆకాంక్షించవచ్చని గుర్తించింది. శాంతి, భద్రతల హామీ ప్రభుత్వంపై ప్రల విశ్వాసాన్ని పునరుద్ధరించింది. వ్యవసాయ ఆధారిత కార్మిక, చేతిపనులకి చెందిన 18 భిన్న కులాలు సంపదను, ఆత్మగౌరవాన్ని సాధించేందుకు అధికారాన్ని పొందినట్టు భావించాయి. ఇదే, నిబద్ధత, అంకితభావం గల సైనికులతో సామాజికంగా సమీకృత సైన్యమైన ‘మవాలాస్‌’ (‌శివాజీ సైనికులు) ఏర్పాటుకు దారి తీసింది. ఎటువంటి అధికారిక నియామకాలు లేకుండా, ఎల్లవేళలా సంసిద్ధంగా ఉండే ఈ సైన్యం స్వచ్ఛందంగానే పని చేసినప్పటికీ, అది సంఘటితంగా ఉండేది. ఏదైనా యుద్ధం జరుగబోతోందన్నప్పుడు, అందరూ తమ పనిని వదిలేసి, కర్తవ్యభావంతో ఛత్రపతి శివాజీ మహారాజ్‌ ‌పిలుపునకు స్పందించేవారు. ఇది అసమానమైనది.

ఛత్రపతి శివాజీ లెక్కలేనన్ని, అసమానమైన యుద్ధాలు చేయవలసి వచ్చింది. సాహసవంతులైన కొన్ని వందలమంది సైనికులతో కూడిన అతడి సైన్యం ఎప్పుడూ వేల సంఖ్యలో సైనికులు గల బలమైన మొగలు సైన్యాన్ని ఎదుర్కొనవలసివచ్చేది. ఒక తెలివైన సేనాధిపతిగా, శివాజీ తరచుగా గెరిల్లా యుద్ధ వ్యూహాలను (మరాఠాలో గనిమి కవా అనే) అనుసరించేవాడు. నేర్పుగల యుక్తిపరుడైన అతడు, అనంతరం శత్రువుపై మరింత బలంగా దాడి చేసేందుకు వూహాత్మకంగా కొంతకాలం పాటు తిరోగమించడానికి ఎప్పుడూ సందేహించలేదు. అతడు అనేక యుద్ధాలు చేశాడు, వాటిలో ఎక్కువగా తనకు అనుకూలమైన షరతులతో, తాను ఎంపిక చేసుకున్న ప్రదేశంలో చేశాడు. అందుకు మంచి ఉదాహరణ ప్రతాప్‌గఢ్‌ ‌యుద్ధమే. ఆ యుద్ధంలో అతడు ప్రదేశాన్ని, యుద్ధ సమయాన్ని కూడా ఎంపిక చేశాడు. అతడి యుద్ధ తంత్రంలో దీనిని అత్యుత్తమమైనదిగా చెప్పవచ్చు.

ఛత్రపతి శివాజీ మహారాజ్‌కు స్వరాజ్‌ అన్న భావన స్వీయ పాలనకు మాత్రమే పరిమితమైనది కాదు. ఇందులో స్వ-ధర్మ (వ్యక్తి తన విధుల పట్ల స్వీయచైతన్యంతో ఉండడం), స్వ-భాష (మాతృభాష) అన్న భావనలు కూడా మిళితమై ఉంటాయి. ప్రాచుర్యం పొందిన వలస భావనల నుంచి వారిని విముక్తం చేసేందుకు అతడికి మార్గదర్శనం చేసిన ప్రాథమిక సూత్రాలు ఇవి. ఆ రోజుల్లో, మరాఠీ సహా దేశీయ భాషల్లోకి అనేక పర్షియన్‌, అరబిక్‌ ‌పదాలను చొప్పించారు. అతడి పాలనా కాలంలో వాటికి పర్యాయంగా దేశీయ పదాలను రూపొందించి, ప్రవేశపెట్టిన ఘనతను ఛత్రపతి శివాజీ మహారాజ్‌కు ఇవ్వవలసిందే. నిజానికి, ‘మరాఠీ రాజ్య వ్యవహార్‌ ‌కోశ్‌’ ‌పేరుతో మరాఠీ పదాల డిక్షనరీ (నిఘంటువు)ని సృష్టించడం అన్నది అతడు అందించిన ముఖ్య సేవలలో ఒకటిగా చెప్పవచ్చు. ఇది అతడు మలచిన సాంస్కృతిక విప్లవం.

అత్యంత అనూహ్యమైన, అస్థిరమైన రాజకీయ వాతావరణంలో, ప్రతిదానిని ప్రారంభించేందుకు అతడు రిస్కు తీసుకొని, తన అసమానమైన దార్శనికతతో న్యాయం, ఆత్మగౌరవం, నిబద్ధత, త్యాగం, సౌభాత్రం, సమానత్వం, మహిళల పట్ల గౌరవం, న్యాయపాలన వంటి విలువలను స్థాపించాడు. ఛత్రపతి శివాజీ ముందు కాలంలో ఆక్రమణదారులు మనను తేలికగా పరాజితులను చేసేవారు. ఒక సమాజంగా మనం పదే పదే పరాజయం పాలవడానికి అలవాటుపడ్డాం. పరాజయం, భ్రష్టత, ఆత్మగౌరవం లేకపోవడమనే విషాన్ని మౌనంగా మింగడం అన్నది మన జాతీయ అలవాటుగా మారింది. ఈ పరాజయ మనస్తత్వాన్ని సవాలు చేసేందుకు సాహసించి, స్థిరంగా ఎవరైనా 17వ శతాబ్దంలో నిలబడ్డారంటే అతడు ఛత్రపతి శివాజీ మహారాజ్‌ ‌తప్ప మరొకరు కాదు.

– (ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌/ 19.06.2024)

 -వినయ్‌ ‌సహస్రబుద్ధె

About Author

By editor

Twitter
YOUTUBE