జూన్‌ మొదటివారంలో జరిగిన యూరోపియన్‌ యూనియన్‌ పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాల మీద ప్రపంచం దృష్టి పెట్టక తప్పలేదు. యూరప్‌లో గడచిన రెండు దశాబ్దాలలో వస్తున్న గుణాత్మమైన మార్పును ఈ ఎన్నికలు ప్రతిబింబించాయి. అవి కాలచక్రాన్ని వెనక్కి తిప్పాలని చూస్తున్న ముస్లిం ఛాందసవాదానికి నిరసనగా ప్రజాభిప్రాయం బలపడుతున్నదని చెప్పిన ఫలితాలేనన్నది నిర్వివాదం. ఈ ఫలితాలు ప్రజాస్వామ్యానికి ఏ మాత్రం విలువనివ్వని ఇస్లాం మత సూత్రాలకీ, అన్ని ధోరణులకు, జీవన విధానాలకు చోటివ్వడానికి సిద్ధంగా ఉండే ఐరోపా ప్రజాస్వామిక పంథాలకూ మధ్య నానాటికీ పెరుగుతున్న ఘర్షణ వాతావరణాన్ని ప్రతిబింబించాయి. అంతిమంగా ముస్లిం ఛాందసవాదాన్ని నిరోధించడానికి ఏకైక అస్త్రం జాతీయ వాదమేనన్న ధోరణి పదునెక్కుతున్న వాస్తవాన్ని ప్రపంచం దృష్టికి తెచ్చాయి. ప్రజాస్వామ్యం ఇచ్చిన సెక్యులరిజం నీడలో పెరిగి, అంతిమంగా సెక్యులరిజానికే సమాధి కట్టే యోచనలో ఉండే ఒక ఉన్మాదానికి వ్యతిరేకంగా వెలువడిన తీర్పు. ముస్లిం వలసల పట్ల ఐరోపా దేశాలలోని రాజకీయ పార్టీల మధ్య పెరుగుతున్న విభేదాలను కూడా ఈ ఎన్నికల ఫలితాలు ప్రతిఫలించాయి. నేడు ముస్లింల వైఖరి పాశ్చాత్యులను విపరీతంగానే భయపెడుతున్నది. ఎంత భయపడేటంతగా అంటే, ముస్లింలు, ముస్లిం వలసలకు వ్యతిరేకంగా రాజకీయ పార్టీలు జాతీయవాదం ఆధారంగా ఏకమయ్యేటంతగా భయపెడుతున్నాయి. ముస్లిం వలసలు తమ అస్థిత్వానికీ, సాంస్కృతిక గుర్తింపునకు భంగం కలుగుతున్నదని పాశ్చాత్యులు భావించవలసి వస్తున్నది. పౌరసత్వం పొందిన ముస్లింల వైఖరి, పౌరసత్వం కోరుతున్న వలసవచ్చిన ముస్లింల వైఖరి రెండూ అసలు పౌరులను కలతపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో వెలువడిన ఈ ఫలితం ఆహ్వానించదగినది. ఆహ్వానించకతప్పనిదే కూడా. 

ప్రస్తుత యూరోపియన్‌ యూనియన్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో వివిధ దేశాల్లో జాతీయవాద పార్టీలు బాగా పుంజుకోవడం యూరప్‌ దేశాల్లో పెరుగుతున్న అభద్రతాభావాన్ని ప్రస్ఫుటం చేస్తోంది. గత ఎన్నో సంవత్సరాలుగా యూరప్‌ దేశాల్లో బలపడుతున్న జాతీయవాదం ప్రస్తుత ఎన్నికల్లో సునామీ సృష్టించనప్పటికీ, యూరప్‌ ఖండంలో తమ ప్రభావాన్ని స్పష్టంగా చూపగలిగింది. జూన్‌ 6-7 తేదీల్లో యూరోపియన్‌ యూనియన్‌ పార్లమెంట్‌కు జరిగిన ఎన్నికల్లో 27 యూరోపియన్‌ యూనియన్‌ దేశాలకు చెందిన 357 మిలియన్ల ఓటర్లు 720 మంది సభ్యులను ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో అందరి అంచనాలకు అనుగుణంగానే ఓటర్లు ఈసారి జాతీయవాద పార్టీల వైపు మొగ్గు చూపారు. ఈయూ పార్లమెంట్‌లో జాతీయవాద పార్టీలు ఏకంగా 131 స్థానాల్లో విజయం సాధించడం విశేషం. మొత్తం కౌంటింగ్‌ ముగిసే సరికి వీటి సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది.

 ఇటలీ, ఆస్ట్రియా, ఫ్రాన్స్‌ దేశాల్లో జాతీయవాద పార్టీలు స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించగా, జర్మనీలో గతంలో ఎన్నడూ లేనివిధంగా తమ స్థానాలను పెంచుకుంది. హంగరీ, నెదర్లాండ్స్‌, స్వీడన్‌, పోర్చుగల్‌ దేశాల్లో అందరూ ఆశించిన స్థాయిలో ఇవి తమ పనితీరును ప్రదర్శించలేకపోయాయి. మధ్యేవాద జాతీయపార్టీ యూరోపియన్‌ పీపుల్స్‌ పార్టీ (ఈపీపీ) పార్లమెంట్‌లో అతిపెద్ద పార్టీగా (189) అవతరించగా, మధ్యేవాద వామపక్షం సోషలిస్ట్స్‌ అండ్‌ డెమోక్రాట్స్‌ (135) రెండో స్థానంలో నిలిచింది. మధ్యేవాద ఉదరవాద (లిబరల్‌) పార్టీ అయిన ‘రిన్యూ’ (79) పట్ల ఓటర్లు తమ ఆగ్రహాన్ని ఓట్ల రూపంలో వ్యక్తం చేశారు. ఫలితంగా ఓట్ల శాతం బాగా తగ్గినప్పటికీ మూడోస్థానంతో సరిపెట్టుకుంది. అదేవిధంగా 2019లో ఎంతో ప్రభావం చూపిన గ్రీన్స్‌ పార్టీకి (53) ఈసారి ఓటర్ల మద్దతు చాలావరకు తగ్గడం గమనార్హం. అన్నింటి కన్నా ముఖ్యంగా ఫ్రాన్స్‌కు చెందిన మ్యారిన్‌ లే పెన్‌ నేతృత్వంలోని నేషనల్‌ ర్యాలీ ఏకంగా 31% ఓట్లు సాధించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ప్రస్తుత ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయెల్‌ మక్రాన్‌ నేతృత్వంలోని మధ్యేవాద పార్టీకంటే రెట్టింపు ఓట్లు సాధించడంతో ఆయన దేశంలో తక్షణ ఎన్నికలకు పిలుపునిచ్చారు. అదేవిధంగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ నాయకత్వంలోని అతివాద జాతీయపార్టీ బ్రదర్స్‌ ఆఫ్‌ ఇటలీ అత్యధిక ఓట్ల శాతం (29%) సాధించగా జర్మనీకి చెందిన జాతీయవాద పార్టీ ఆల్టర్నేటివ్‌ ఫర్‌ జర్మనీ (ఎ.ఎఫ్‌.డి) 16% ఓట్లతో దేశంలో రెండోస్థానంలో నిలిచింది.

పెరుగుతున్న అభద్రతాభావం

వివిధ యూరప్‌ దేశాల్లో నెలకొన్న అభద్రత నేపథ్యంలో జాతీయవాద పార్టీలకు ఓటర్లు తమ మద్దతు తెలిపినట్లు ఈ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. జాతీయవాద పార్టీలు యూరప్‌లో బలోపేతం కావడానికి చాలా కారణాలున్నప్పటికీ ప్రధానంగా చెప్పుకోవలసింది అక్రమ వలసలు. ముఖ్యంగా ముస్లిం దేశాల నుంచి అక్రమంగా ప్రవేశిస్తున్న వారివల్ల యూరప్‌ దేశాల్లో క్రమంగా శాంతిభద్రతలు దెబ్బతింటున్నాయి. దాడులు, హింసాకాండ క్రమంగా పెరగుతుండటం పట్ల యూరప్‌ సమాజాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అధికారంలో ఉన్న ప్రధాన పార్టీలు వీటిని అరికట్ట డంలో విఫలం కావడం, వలసదార్లకు అయినకాడికి ఉచితాలు ప్రకటించడం, బుజ్జగింపు చర్యలు వీరి ఆగడాలకు ప్రధాన కారణం. ఫలితంగా ఎన్నో దశాబ్దాలుగా యూరప్‌ రాజకీయాల్లో ఏమాత్రం ప్రాధాన్యం లేకుండా కొనసాగిన జాతీయ పార్టీలు క్రమంగా పుంజుకుంటూ ప్రస్తుత ప్రభావశీలక స్థితికి చేరడం అక్కడ నెలకొన్న సామాజిక అభద్రతకు రుజువుగా చెప్పుకోవాలి. 2019లో ‘‘గ్రీన్‌ వేవ్‌’’ యూరప్‌ మొత్తాన్ని ఊపేసింది. ఫలితంగా ఈయూ దేశాల పర్యావరణ అజెండా ఈ పార్టీలకు అనుగుణం గానే కొనసాగింది. అయితే ప్రస్తుత ఎన్నికల్లో ఇవి తమ ప్రాభవాన్ని కోల్పోవడం ఈయూ విధానాలపై ప్రభావం తప్పక చూపుతుంది. ఇక తాజా ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఈయూ పార్లమెంట్‌ గతంలో మాదిరి కాకుండా జాతీయవాద అంశాలకు ప్రాధాన్యం ఇవ్వక తప్పనిసరి. ప్రధానంగా ఇప్పటి వరకు ఆయా దేశాలు వలసల పట్ల అనుసరిస్తున్న ఉదారవాద విధానాలకు స్వస్తి పలికి ఈ నిబంధన లను మరింత కఠినతరం చేసే దిశగా విధానాల్లో మార్పులు వచ్చే అవకాశముంది. అంటే మొత్తంమీద ఈయూ రాజకీయ విధానాలు జాతీయ వాదానికి అనుకూలంగా మారవచ్చు. ఫలితంగా ఈయూ పార్లమెంట్‌ నియంత్రణ ఆయా దేశాలపై క్రమంగా తగ్గి, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ముఖ్యంగా వలసలు, ఉక్రెయిన్‌ యుద్ధం, పర్యావరణ సమస్యలపై ఆయా ప్రభుత్వాల నియంత్రణ మరింతగా పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

 పార్లమెంట్‌లో, యూరోపియన్‌ పీపుల్స్‌ పార్టీకి (ఈపీపీ) కుడిపక్క స్థానాలను ఆక్రమించే యూరోపియన్‌ కన్జర్వేటివ్స్‌ అండ్‌ రిఫార్మిస్ట్స్‌ (ఈసీఆర్‌`73), ఐడెంటిటీ అండ్‌ డెమోక్రసీ (ఐడీ`58) గ్రూపులు అతివాద జాతీయ పార్టీలుగా ఉన్నాయి. అనేక పార్టీలు భాగస్వాములుగా ఉన్న ఈ కూటములు వలసలను తీవ్రంగా వ్యతిరేకి స్తున్నాయి. వలసలను అరికట్టే విషయంలో ఏకాభిప్రాయం ఉన్నప్పటికీ, వీటిమధ్య మరికొన్ని అంశాల విషయంలో తీవ్ర విభేదాలున్నాయి. ఉదాహరణకు ఫ్రాన్స్‌కు చెందిన ఫ్రాన్సిస్‌ మెరైన లీ పెన్‌, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీల మధ్య ఉక్రెయిన్‌ యుద్ధం విషయంలో ఏకాభిప్రాయం లేదు. అందువల్ల కొన్ని అంశాలపై ఏకాభిప్రాయంతో ఉన్నప్పటికీ, జాతీయవాద పార్టీల బ్లాక్‌ పటిష్టమైన రీతిలో ఐక్యంగా ముందుకెళ్లాలంటే చాలా అడ్డంకులను అధిగమించక తప్పదు. అయితే జర్మనీకి చెందిన ‘ఆల్టర్నేటివ్‌ ఫర్‌ జర్మనీ’ జాతీయవాద పార్టీని ఐ.డి. గ్రూపునుంచి బహిష్కరించిన నేపథ్యంలో, మిగిలిన జాతీయవాద పార్టీల మధ్య సయోధ్య కుదిరే అవకాశాలు మెరుగయ్యాయనే చెప్పాలి.

మొత్తం 27 దేశాలతో కూడిన ఈయూ కూటమిలో, నెదర్లాండ్స్‌, జెఛియా, స్వీడన్‌, ఇటలీ, హంగరీ వంటి ఎనిమిది దేశాల్లో ప్రస్తుతం జాతీయ వాద పార్టీలు చాలా బలంగా ఉన్నాయి. ప్రస్తుతం ఇవి మెజారిటీ స్థానాలు సాధించిన యూరోపియన్‌ పీపుల్స్‌ పార్టీ (ఈపీపీ)తో తమ లక్ష్యాల విషయంలో బేరసారాలాడే స్థాయికి చేరుకోవడం విశేషం. ప్రస్తుతం ఈపీపీకి చెందిన ఉర్సులా ఓన్‌ డెర్‌ లియాన్‌ యూరోపియన్‌ కమిషన్‌ అధ్యక్షులుగా కొనసాగు తున్నారు. రెండోసారి ఆమె మళ్లీ ఎన్నికవ్వాలంటే పార్లమెంట్‌లో మెజారిటీ సభ్యుల మద్దతు తప్పనిసరి. మెజారిటీ సాధనంలో ఒకవేళ ఆమె జాతీయవాద పార్టీల కోర్కెలకు తలొగ్గినట్లయితే ఈపీపీ సంప్రదాయానికి భిన్నంగా జాతీయవాద విధానాల అమలుకే మొగ్గు చూపక తప్పదు.

కారణాలు అనేకం

గత కొద్ది సంవత్సరాలుగా యూరప్‌ దేశాల్లో జాతీయవాద పార్టీలకు క్రమంగా ప్రజాదరణ పెరగడానికి సైద్ధాంతిక, సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక కారణాలతో పాటు వలసలు కూడా ప్రధాన కారణంగా చెప్పాలి. విచిత్రమేమంటే ఐరోపా సమాఖ్య దేశాలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రధాన కారణం ‘వలసలే’ నని ఈ జాతీయ పార్టీలు ముక్త కంఠంతో చెప్పేమాట! 1980 నుంచి యూరప్‌ దేశాలు ముస్లిం వలస సమస్యను ఎదుర్కొనడానికి ప్రధాన కారణం, చుట్టుపక్కల దేశాలనుంచి కేవలం రెండు మూడు గంటల ప్రయాణంతో ముస్లింలు ఐరోపా దేశాలను చేరుకునే సదుపాయం ఉండటం! క్రమంగా యూరప్‌లో మసీదుల సంఖ్య పెరగడం, బురఖాలు ధరించిన మహిళలు వీధుల్లో తిరుగుతుండటం వంటి కొత్త మతపరమైన వాతావరణం యూరప్‌లోకి ప్రవేశించింది. యూరప్‌ ప్రజలు ఈ కొత్త మతాచారా లను జీర్ణించుకోలేకపోవడం, జాతీయవాద పార్టీల ఆవిర్భావానికి దారితీసింది. మొదట్లో స్పెయిన్‌, ఇటలీ, గ్రీస్‌ మరియు మాల్టా వంటి దేశాలు మిగిలిన యూరప్‌ దేశాల్లోకి వలస ప్రవాహాలకు ముఖ ద్వారాలుగా కొనసాగాయి. కానీ 1990 నాటికి ఇవి అక్రమ వలసదారుల ప్రధాన లక్ష్యాలుగా మారాయి. అయితే స్పెయిన్‌, ఇటలీలు వీరిని ‘రెగ్యులరైజ్‌’ చేశాయి. తర్వాత ఆయా దేశాలు వలసల నిరోధానికి ఎన్ని చర్యలు తీసుకున్నా అవి అప్రతిహతంగా కొనసాగాయి. ఫలితంగా ఇప్పుడు స్పెయిన్‌లో ఒక మిలియన్‌, ఇటలీలో అంతే సంఖ్యలో ముస్లింలు ఉన్నారంటే కారణం ఇదే. ప్రస్తుతం యూరప్‌ సమాజంలో ముస్లింలు, యూరోపియన్ల మధ్య పరస్పర అనుమానాలు పెరగడమే కాదు, యూరోపియన్‌ ముస్లింల పట్ల ఆయా సమాజాల్లో తీవ్ర వ్యతిరేతక వ్యక్తమవుతోంది. ముఖ్యంగా జాతీయ భద్రత, అంతర్గత భద్రత, సామాజిక వ్యవస్థ అస్తవ్యస్తమవుతున్నాయన్న అభిప్రాయాలు అంతర్గతంగా నిర్వహించిన సర్వేల్లో వ్యక్తమవుతోంది. మొత్తం 27 యూరప్‌ దేశాల్లో విస్తరించి ఉన్న దాదాపు 25 మిలియన్ల ముస్లిం వలసదార్ల సమస్య ప్రస్తుత యూరప్‌ సమాజంలో అస్థిరతకు దారితీయడమే కాకుండా, ఇందుకు పరిష్కారం లభించక తలలు పట్టుకొని కూర్చోవాల్సిన పరిస్థితి!

యూరప్‌లో ఎందుకీ మార్పు?

 సెక్యులర్‌ ప్రభుత్వాల మితిమీరిన బుజ్జగింపు రాజకీయాలు, యూరప్‌ ప్రజలు క్రమంగా జాతీయవాద పార్టీల వైపునకు మొగ్గు చూపడానికి ప్రధాన కారణం. ఇస్లామిక్‌ ఉగ్రవాదం కారణంగా తమ అస్తిత్వానికి భంగం వాటిల్లుతున్నదని అక్కడి ప్రజలు భయపడుతుండటంతో క్రమంగా అక్కడ జాతీయవాద పార్టీలు అధికారంలోకి రావడమో, పెద్ద పార్టీలుగా అవతరించడమో జరుగుతోంది. 2010కి ముందు ఈ దేశాల్లో మొత్తం పోలైన ఓట్లలో జాతీయవాద పార్టీల వాటా 3% కంటే తక్కువ. తర్వాతి కాలంలో స్వీడన్‌లో 12%కు, ఫిన్లాండ్‌లో 18%, హంగరీలో 19%కు పెరగడం ఆయా దేశాల సామాజిక వర్గాల్లో పెరుగుతున్న సాంస్కృతిక అభద్రతాభావానికి కొండగుర్తు. 1999లో స్థాపించిన యు.కె. ఇండిపెండెన్స్‌ పార్టీ 2015 సాధారణ ఎన్నికల్లో ఏకంగా 12.6% ఓట్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరచింది. ఎప్పుడైతే ప్రజల్లో సాంస్కృతిక పరమైన అభద్రత పెరుగుతుందో, జాతీయవాద పార్టీలకు ఓట్లశాతం పెరుగుతుందనే సత్యాన్ని ఈ పోలింగ్‌ సరళి వెల్లడిస్తోంది. డచ్‌ పార్లమెంటరీ ఎన్నికల్లో పీపుల్స్‌ పార్టీ ఫర్‌ ఫ్రీడమ్‌ కూడా గణనీయమైన పురోగతి సాధించింది. 2023 నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 150 పార్లమెంటరీ స్థానాల్లో 37 సీట్లను గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించింది. డచ్‌ పార్లమెంటరీ చరిత్రలో ఒక జాతీయవాద పార్టీ ఇన్ని స్థానాలు గెలవడం ఇదే ప్రథమం. ఈ పార్టీ అధినేత గ్రీట్‌ వైల్డర్స్‌ ముస్లింల వలసలను తీవ్రంగా వ్యతిరే కించడమేకాదు డచ్‌ సంస్కృతికి ఇస్లాం పెను ప్రమాదమంటూ భావించే వివాదాస్పద నాయకుడు. ఇటలీలో నార్తరన్‌ లీగ్‌ (ప్రస్తుతం దీనిపేరును లీగా నార్డ్‌గా మార్చారు. అంటే ‘‘లీగా నార్డ్‌ ఫర్‌ ఇండిపెండెంజా డెల్లా పడానియా’’), ఫ్రాన్స్‌లో నేషనల్‌ ఫ్రంట్‌, స్విట్జర్లాండ్‌లో డెమోక్రటిక్‌ యూనియన్‌ ఆఫ్‌ సెంటర్‌, ఇటీవలి కాలంలో తన ఓట్ల శాతాన్ని గణనీయంగా పెంచుకున్నాయి. ఇక అతివాద జాతీయవాద పార్టీలు డేనిష్‌ పీపుల్స్‌ పార్టీ, ఫ్రీడం పార్టీ ఆఫ్‌ ఆస్ట్రియాలు 2010కి ముందే ఆయా దేశాల్లో గట్టి పునాదిని ఏర్పరచుకున్నాయి. ఇక జర్మనీలో ఏర్పాటైన అతివాద జాతీయవాద పార్టీ ఏఎఫ్‌పీ, స్పెయిన్‌లో ఓక్స్‌ పార్టీలు కూడా ఆయా దేశాల్లో జరిగిన సాధారణ ఎన్నికల్లో గుర్తించదగిన స్థాయిలో ఓట్లశాతాన్ని పొందడం గమనార్హం. ముఖ్యంగా ఈ వలసల కారణంగా ఐరోపావాసులు తమ గుర్తింపును కోల్పోతున్నారన్న అంశాన్నే ప్రధానంగా తీసుకొని ఐరోపాదేశాల ఎన్నికల్లో ఇవి పోటీచేస్తున్నాయి. 2016లో ‘బ్రిగ్జిట్‌’ తర్వాత యూరప్‌ దేశాల్లో క్రమంగా జాతీయవాద పార్టీలకు ప్రజల మద్దతు పెరుగుతూ వచ్చింది. ఫలితంగా ఆస్ట్రియా, స్వీడన్‌, నార్వే, డెన్మార్క్‌, నెదర్లాండ్స్‌, స్విట్జర్లాండ్‌, ఇటలీ, ఫ్రాన్స్‌, హంగరీ, బ్రిటన్‌ వంటి దేశాల్లో జాతీయవాద పార్టీలు పార్లమెంట్‌, అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేశాయి. లా అండ్‌ జస్టిస్‌ పార్టీ (పోలెండ్‌), డేనిష్‌ పీపుల్స్‌ పార్టీ (డెన్మార్క్‌), ఫిడ్జ్‌ అండ్‌ జొబ్బిక్‌ పార్టీలు (హంగరీ), ఫ్రీడమ్‌ పార్టీ (ఆస్ట్రియా), సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ (స్వీడన్‌), ఫార్టీ ఫర్‌ ఫ్రీడమ్‌ (నెదర్లాండ్స్‌), గోల్డెన్‌ డాన్‌ పార్టీ (గ్రీస్‌), ఇండి పెండెన్స్‌ పార్టీ (యు.కె) ఇందుకు ఉదాహరణలు.

అదృష్టవశాత్తు ఉదారవాద శిబిరంలోని కొందరైనా ఇంత కాలానికి కళ్లు తెరుస్తున్నారు. సంస్కృతి, తమ అస్థిత్వాలకు సంబంధించిన స్థానికుల భయాలూ, ముస్లిం వలసలలోని వాస్తవి కతలూ ఇప్పుడు రెండూ పరిగణనలోనికి తీసుకో వలసినవేని వారు బాహాటంగా చెబుతున్నారు. ఆ పరిస్థితి భారతదేశంలో కూడా రావాలి.


అనివార్య ఘర్షణ

చిన్న చిన్న దేశాలు, ద్వీపాల సమూహంలా ఉండే ఐరోపా ఖండం చరిత్ర నిండా పెద్ద పెద్ద సమస్యలనే ఎదుర్కొన్నమాట నిజం. ఇందులో కొన్ని దేశాలు ప్రపంచం మీద పడి ఆయా దేశాలనూ, ఖండాలనూ కూడా అశాంతికి గురి చేసిన మాట కూడా వాస్తవమే. ఉదాహరణకు భారతదేశం. ఇక్కడికి వచ్చిన ఐరోపా దేశాలు మిగిల్చిన గాయాలు, మార్పులు, సంస్కరణల పేరుతో చేసిన విధ్వంసం జాడలు ఇంకా ఉన్నాయి. సాంస్కృతిక విలువల మీద వక్రభాష్యాలు చెప్పాయి. ఇప్పుడు ఇలాంటి స్థితిలో పలు ఐరోపా దేశాలు ఉన్నాయి. అయితే అవి ‘ఇస్లాం’, ఆ వర్గీయుల అతి పోకడలతో సామాజిక సాంస్కృతిక, మత సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఇస్లాంకు అనుగుణంగా పాశ్చాత్య దేశాల జీవన విధానం మారాలన్నదే ఇప్పుడు అక్కడ తక్కువ మంది ముస్లింలు చేస్తున్న పెద్ద అలజడి. దీనికి ఎప్పటిలాగే ఉదారవాదం పేరుతో స్థానికులలోనే కొందరు కొమ్ము కాస్తున్నారు. ఇప్పుడే ఇదే ఆ దేశాలను ఒక సామాజిక సంక్షోభం వైపు నెట్టింది. ఐరోపా దేశాలు అన్ని విధాలా స్వేచ్ఛను ఆకాంక్షిస్తాయి. అది ప్రజాస్వామ్యంతోనే సాధ్యమని విశ్వసిస్తాయి. కానీ విభిన్న సంస్కృతుల సమ్మేళనానికి చోటిచ్చే ప్రజాస్వామ్యానికీ, ఇస్లాంకీ పొసగదని అనేక మంది యూరోపియన్లు ఇప్పుడు గట్టిగా భావిస్తున్నారు. ఐరోపా దేశాలలోకి సాగుతున్న ముస్లిం వలసలు దీర్ఘకాలంలో పెద్ద బెడదగా కూడా మారతాయని అంచనా వేస్తున్నారు. అటు ఇస్లాంలోను ప్రజాస్వామిక చింతన ఉండదనీ, అతి తక్కువ దేశాలలోనే ప్రజాస్వామ్యం కొద్దిగా కనిపిస్తుందనీ వారు అంటారు. అసలు ముస్లింలు ప్రజాస్వామిక ఐరోపా దేశాలలో మంచి పౌరులుగా ఉండడం సాధ్యం కాదని తేల్చేస్తున్నవారు ఉన్నారు.

కొద్దిమందే ఉన్నా తమ మత ఆచారాలను అధిక సంఖ్యాల మీద రుద్దడంలో నిపుణలన్న అభిప్రాయం ముస్లింల మీద ఉంది. ఉదాహరణకి ఇంగ్లండ్‌. అక్కడి పాఠశాలలో ముస్లిం విద్యార్థులకు హలాల్‌ చేసిన ఆహారం ఇస్తారు. జంతువులను తమ మతాచారాల మేరకు వధించే హక్కును ప్రతిఘటనల మధ్య సాధించారు. పనిచేసే చోట ముస్లిం సంప్రదాయ వస్త్రధారణ విషయమూ అంతే. అభ్యంతరాలు ఉన్నా పనివేళలలో మినహాయింపు తెచ్చుకున్నారు. మిగిలిన సమాజంలో తమ సమానత్వం గురించి తీవ్రంగా పోరాడే ముస్లింలు తమ స్త్రీలకు మాత్రం సమానత్వం ఇవ్వడానికి ససేమిరా ఒప్పుకోరు. ఇంగ్లండ్‌లో ముస్లిం బాలుర కంటే బాలికలు తెలివైనవారని సర్వేలు చెబుతున్నాయి.

అయితే బాలికలను విశ్వవిద్యాలయ స్థాయి విద్యకు అనుమతించరు. తమ అభిప్రాయాల వరకు భావ ప్రకటనా స్వేచ్ఛను విశేషంగా కోరుకునే ముస్లింలే అవతలివారికి ఆ హక్కు ఉంటుందని కనీసం కూడా అనుకోరు. అందుకు మంచి ఉదాహరణ సల్మాన్‌ రష్దీ, రచనలు, జరిగిన దాడి. వారు నివసిస్తున్న దేశానికి ముస్లింల విధేయత పట్ల అనేక సందేహాలు ఉన్నాయి. దేశానికి విధేయులమని అంటూనే ఇరాన్‌ మీద దాడికి నిరసన తెలియ చేస్తారు. ఇంగ్లండ్‌లోనే ఫిన్స్‌బరీ మసీదు ఇమామ్‌ అక్కడి ముస్లిం ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వడం అవసరమని పిలుపునిచ్చాడు. ముస్లింలు ఏ దేశంలో ఉన్నారో, ఆ దేశ సార్వభౌమాధికారాన్ని గుర్తించడానికి నిరాకరించడమే, దానికి మత నిబంధనలను అడ్డం పెట్టడమే ఇప్పుడు ప్రపంచం వారి నుంచి ఎదుర్కొంటున్న సమస్య.


లండన్‌ లండనిస్తాన్‌ అవుతుందా?

యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో ఉగ్రవాద భయం గురించి ప్రపంచం మొట్ట మొదటిసారి 2010లో గుర్తించింది. అబ్దుల్లా ముత్తలాబ్‌ లండన్‌లో పాక్షిక ఉగ్రవాదాన్ని ప్రోత్సహించాడు. ఇది క్రమంగా అల్‌ ముహజిరౌన్‌ ఉగ్రవాద సంస్థ ఏర్పాటుకు దారితీసింది. ఆ తర్వాత క్రమంగా పశ్చిమ దేశాల్లో ఉగ్రవాద విస్తరణకు యు.కె. కేంద్రంగా మారుతున్నదన్న అంశం స్పష్టమవసాగింది. యు.ఎస్‌.లో 9/11 దాడులకు ముందే లండన్‌లో ఉగ్రవాద గ్రూపుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో ‘లండనిస్తాన్‌’ అనే పేరును చాలామంది వాడటం మొదలుపెట్టారు. లండన్‌ను న్యూయార్క్‌ టైమ్స్‌, వానిటీ ఫెయిర్‌, వీక్లీ స్టాండర్డ్‌ వంటి పత్రికలు ‘లండనిస్తాన్‌’గా పేర్కొనడంతో ఇది మరింత ప్రాచుర్యం పొందింది. బ్రిటన్‌ జర్నలిస్ట్‌ మెలానీ ఫిలిప్స్‌ ఏకంగా ‘లండనిస్తాన్‌: హౌ బ్రిటన్‌ ఈజ్‌ క్రియేటింగ్‌ టెర్రర్‌ స్టేట్‌ వితిన్‌’ పేరుతో 2006లో ఒక పుస్తకమే ప్రచురించాడు. నిజానికి లండనిస్తాన్‌ అనే పదాన్ని మొట్టమొదట వాడిరది ఫ్రెంచ్‌ పోలీసులు, ఇంటెలిజెన్స్‌ వర్గాలు. ఇస్లామిక్‌ తీవ్రవాదులపై అప్పట్లో ఫ్రెంచ్‌ పోలీసులు దాడులు చేసినప్పుడు వాళ్లు లండన్‌కు పారిపోయేవారు. అప్పుడు ఫ్రెంచ్‌ అధికార్లు, ఆవిధంగా పారిపోయి వచ్చినవారిని గుర్తించేందుకు సహకరించాల్సిందిగా, బ్రిటన్‌ అధికార్లను కోరినప్పుడు వారినుంచి సహకారం అందేది కాదు. ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవడంలో అధికార్ల నిర్లక్ష్య వైఖరితో విసిగిన ఫ్రెంచ్‌ పోలీసులు బ్రిటన్‌ రాజధానిని ‘లండనిస్తాన్‌’ అని పిలవడం మొదలు పెట్టారు. ఇదిలావుండగా తర్వాతికాలంలో బ్రిటన్‌ ప్రభుత్వాలు ఉగ్రవాద సంస్థలను నిషేధించడం, ఉగ్రవాదులపై చర్యలు తీసుకున్న నేపథ్యంలో యు.కె.లో రాడికలైజేషన్‌ అప్పటిస్థాయిలో లేనప్పటికీ, ఉగ్రవాద సమస్య పూర్తిగా తొలిగిపోలేదన్నది మాత్రం వాస్తవం.

లండనిస్తాన్‌ అన్న పేరు వచ్చినందుకు, సాదిక్‌ ఖాన్‌ మూడోసారి ఆ నగరానికి మేయర్‌ కావడానికి దగ్గరి సంబంధం లేకపోలేదు. లేబర్‌ పార్టీకి చెందిన ఖాన్‌ మూడోసారి ఆ నగరానికి మేయర్‌గా (మే 4న) ఎన్నికయ్యారు. మే 2వ తేదీన జరిగిన ఎన్నికలో 40.5 శాతం ఓటింగ్‌ మాత్రమే నమోదై, సాదిక్‌ ఓటమి తప్పదన్న ఊహాగానాల మధ్య తిరిగి వరసగా మూడోసారి ఆయనే గెలిచాడు.


ఈయూ న్యాయసాన్థం హంగేరి వ్యతిరేక తీర్పు

ఒక పక్క యూరోపియన్‌ యూనియన్‌ పార్లమెంట్‌ ఎన్నికలలో జాతీయవాద పార్టీల సభ్యులు ఆధిక్యం కనిపించినప్పటికీ ఈయూ తన పాత ధోరణినే ప్రదర్శించడం ప్రశ్నార్థకంగానే ఉంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన వారానికి (జూన్‌ 13న) యూనియన్‌ అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పు ఆశ్చర్యపరిచింది. శరణార్థుల ప్రవేశానికి సంబంధించి మారిన, సవరించిన నిబంధనలను గౌరవించనందుకు 200 మిలియన్‌ యూరోలు జరిమానాగా చెల్లించాలని న్యాయస్థానం తీర్పు చెప్పింది. అయితే కోర్టు నిర్ణయం ఆమోదనీయం కాదనీ, తీవ్రమైనదనీ హంగేరీ ప్రధాని విక్టర్‌ ఉర్బాన్‌ వ్యాఖ్యానించారు. హంగేరీ సరిహద్దులలో ఉండి ఆశ్రయం కోరుతున్న వారి పట్ల 2020 సంవత్సరంలో ఆమోదించిన నిబంధనలను అమలు చేయడంలో ఆ దేశం విఫలమైందని కోర్టు అభిప్రాయపడిరది. నిజానికి అక్కడి జాతీయవాద ప్రభుత్వం ఇదివరకే ఈ నిబంధనలను అమలు చేయడానికి నిరాకరించింది. అసలు 2020 నాటి ఆ తీర్పు, అందులోని నిబంధనలకు కాలదోషం పట్టాయని హంగేరీ వాదిస్తున్నది. ఈ అంశం మీద హంగేరీ ప్రధాని, ఈయూ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ నిరంతరం ఘర్షణ పడుతూనే ఉంటారు. అంటే ముస్లిం వలసలకు అనుకూలంగా ఈయూ యూనియన్‌ దేశాల మీద నిబంధనలను రుద్దుతున్న విషయం అర్ధమవుతుంది. ఈయూ న్యాయస్థానం లక్సెంబర్గ్‌లో ఉంది.

About Author

By editor

Twitter
YOUTUBE