ఈసారి ఎన్నికలు చిత్రవిచిత్రమైన ఫలితాలను ఇవ్వడాన్ని మనందరం చూశాం. వాస్తవానికి ప్రజాస్వామ్యమంటే అదే. ప్రజలు తమకు కావలసిన నాయకుడిని ఎన్నుకొని, తమ అభిమతమేమిటో తెలియచేశారు. అయితే, పంజాబ్‌ ‌కశ్మీర్‌లలో తీవ్రవాదులు, వేర్పాటువాదులు జైలు నుంచే పోటీ చేసి భారీ మెజారిటీలతో ఎన్నిక కావడమే ఆందోళనకరమైన విషయం. వరుసగా అమృత్‌పాల్‌ ‌సింగ్‌, ‌సరబ్‌జిత్‌ ‌సింగ్‌ ‌ఖల్సా, షేక్‌ అబ్దుల్‌ ‌రషీద్‌లకు వచ్చిన పోస్టల్‌ ‌బ్యాలెట్‌ ఓట్లను గమనించినప్పుడు వేర్పాటువాదులకు, తీవ్రవాదులకు ఉన్న మద్దతు వెన్ను జలదరింపచేస్తుంది. పెద్ద ఎత్తున ప్రభుత్వోద్యోగులు కూడా వీరికి ఓట్లు వేశారన్న విషయం తెలిసినప్పుడు వ్యవస్థ ఎంత కుళ్లిపోయి ఉన్నదో కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. అందునా, భారతదేశ అంతర్గత, బహిర్గత భద్రతకు కీలకమైన రాష్ట్రాలు పంజాబ్‌, ‌కశ్మీర్‌లలో ఈ రకమైన ఫలితాలు వెలువడడం  ఆందోళనకరమైన విషయం. ఫలితాలకు తోడుగా,  చండీగఢ్‌ ‌విమానాశ్రయంలో భద్రతా దళాలలో పని చేస్తున్న ఖలిస్తానీ సానుభూతిపరురాలు కుల్వీందర్‌ ‌కౌర్‌ ‌తాజాగా ఎంపీగా గెలిచిన కంగనా రనౌత్‌ను ఆమె ఎప్పుడో రైతు ఉద్యమంపై చేసిన వ్యాఖ్యలకు చెంప పగులకొట్టడంతో ఖలిస్తాన్‌ ‌సమస్య మరింత ప్రముఖంగా తెరపైకి వచ్చింది. గతంలో కూడా ప్రధాని పంజాబ్‌లో పర్యటించినప్పుడు ఆయన పర్యటనకు సరైన భద్రతను కల్పించకపోవడమే కాదు, ఆయనను ఒక బ్రిడ్జిపైన నలువైపుల నుంచి అల్లరి మూకలు వచ్చి దిగ్బంధనం చేయడం ద్వారా ఒక సందేశాన్ని పంపామని వారు భావించారు.  కేంద్రం అప్పుడే ఏదో ఒక కఠిన చర్య తీసుకుని ఉంటే, పరిస్థితి ఇంతకాదా వచ్చేది కాదేమో!

చిత్రమైన విషయమేమిటంటే, దివంగత ప్రధాని ఇందిరాగాంధీని హత్య చేసిన బాడీగార్డ్ ‌బియాంత్‌ ‌సింగ్‌ ‌కుమారుడు సరబ్‌జిత్‌ ‌సింగ్‌ ‌ఖల్సా. అటువంటి వాడిని కూడా పంజాబ్‌ ‌ప్రలు ఆ స్థాయిలో ఓట్లు వేసి గెలిపించడం ఆందోళన కలిగించే విషయం. ఇక కశ్మీర్‌కు చెందిన షేక్‌ అబ్దుల్‌ ‌రషీద్‌ ‌నేషనల్‌ ‌కాన్ఫరెన్స్‌కు చెందిన ఒమర్‌ అబ్దుల్లాను ఓడించాడంటే సంతోషపడిపోనవసరం లేదు. ఎందుకంటే, అతడు కూడా వేర్పాటువాది. వారి కార్యకలాపాల కోసం విదేశాల నుంచి వచ్చే నిధులను లాండరింగ్‌ ‌చేసి అందించేవాడు. అటువంటి వాడిని కశ్మీరీలు ఎన్నుకున్నారంటే కంగారనిపించక మానదు.

బాలీవుడ్‌ ‌పెద్ద మనసు

ముఖ్యంగా, కుల్వీందర్‌ ‌కౌర్‌ను సీఐఎస్‌ఎఫ్‌ ఉద్యోగం నుంచి సస్పెండ్‌ ‌చేసినట్టు వార్తలు రాగానే, విశాల్‌ ‌దద్లానీ అనే ప్రముఖ సంగీతదర్శకుడు ఆమెకు తాను ఉద్యోగం ఇస్తానంటూ ప్రకటించడం కూడా ప్రమాద ఘంటికలను మోగించే విషయమే. అతడు ఆ పని తెలిసి చేసినా, తెలియక చేసినా, తమ బాధ్యతలు ఉల్లంఘించి ఎటువంటి దాడి చేసినా తమకు ఉపాధి సమస్య ఉండదని కుల్వీందర్‌ ‌వంటి వారు భావించే అవకాశం ఉంటుంది. దేశ భద్రతను, గౌరవాన్ని కాపాడేందుకు నియమితులైన సిబ్బందే ఇటువంటి ఘటనలకు పాల్పడటం అత్యంత తీవ్రమైన పరిణామం. ఎలాగూ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోదన్న విషయం ప్రపంచానికి తెలిసిందే కనుక కేంద్రమే రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దవలసిన సమయం ఆసన్నమైంది. మరింత ఆలస్యం జరిగితే పరిస్థితి చేయిదాటిపోవచ్చు. దేశం కోసం తమ ప్రాణాలర్పించడానికి కూడా సిక్కులు వెనుకాడరనే భావన మనకు కలగడానికి కారణం సైన్యంలో వారు అందించే సేవలే. అలాంటిది నేడు సీఐఎస్‌ఎఫ్‌కు చెందిన ఒక ఉద్యోగి ఇలా ప్రవర్తించిందంటే,  వేర్పాటువాద విషం ఇందులోకి కూడా పాకుతోందా? అనే అనుమానం రాకమానదు.

తన రాజకీయ ప్రయోజనాల కోసం సున్నితమైన, పాకిస్తాన్‌తో సరిహద్దు రాష్ట్రం పంజాబ్‌లో ఇందిరాగాంధీ పెంచిపోషించిన వేర్పాటువాదపు విష వృక్ష వేళ్లను పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్‌ఐ, ‌సహా వివిధ దేశాలు పోషిస్తూ వచ్చాయి. దీనితో ఈ వ్యవహారం చిక్కుముడిలా తయారైంది. పంజాబీలలో నిద్రాణ స్థితిలో ఉన్న ఈ భావనను ఆప్‌ ‌వంటి జాతీయతా భావన లేని పార్టీలు ప్రోత్సహిం చడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. తాను భారతదేశ ప్రధానమంత్రిని కాకపోతే, పంజాబ్‌ను దేశం నుంచి విడదీసి ఖలిస్తాన్‌ ‌ప్రధానమంత్రిని అవుతానంటూ ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) అధ్యక్షుడు అర్వింద్‌ ‌కేజ్రీవాల్‌ ‌తన పార్టీ ఎన్నికల రాజకీయాలలోకి వచ్చిన తొలి రోజుల్లోనే వ్యాఖ్యానించినప్పుడు ఎవరూ దానిని తీవ్రంగా తీసుకోలేదు. తమ పార్టీ ఏర్పడిన తొలి రోజుల నుంచే ఆప్‌ ‌ఖలిస్తానీలతో సత్సంబంధాలను కొనసాగిస్తూ వస్తోంది. ఈ విషయం పలు సందర్భాల్లో బయటకు వచ్చింది కూడా.

హరిత విప్లవం ద్వారా అత్యంత లబ్ధి పొందిన పంజాబ్‌ను దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాలలో ఒకదానిగా పరిగణించేవారు. అయితే, పంట దిగుబడి పెంచడం కోసం విచ్చలవిడిగా పురుగుమందులు, హైబ్రిడ్‌ ‌రకం విత్తనాలను వాడటం వల్ల అక్కడి నేలసారాన్ని కోల్పోవడమే కాదు, అధిక పురుగుమందుల వాడకం కారణంగా వారిలో అనారోగ్య పరిస్థితులు ఏర్పడ్డాయి. వీటన్నింటికీ తోడు నిరుద్యోగ సమస్య కూడా యువతను ఇటువంటి అతివాదుల పట్ల ఆకర్షితు లయ్యేలా చేస్తోంది.

రైతులందరికీ లబ్ధి చేకూర్చాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్‌ ‌రైతులు పెద్ద ఎత్తున ఢిల్లీలో ఉద్యమించి, నగరాన్ని దిగ్బంధనం చేసినప్పుడు వారికి అవసరమైన మంచినీరు, విద్యుత్తు వంటివి ఆప్‌ ‌ప్రభుత్వం సమకూరుస్తున్నా మీడియా సహా ఎవరూ వారిని గట్టిగా ప్రశ్నించలేదు. చివరకు కేంద్ర ప్రభుత్వమే దిగి వచ్చి ఆ చట్టాలను ఉపసంహరించు కుంటున్నట్టు ప్రకటించింది. ఈ చర్యను బలహీనతగా వారు జమకట్టేసుకున్నారు.అందుకే గత అసెంబ్లీ ఎన్నికలలో ఆప్‌పార్టీ ఘన విజయం సాధించి అధికారాన్ని కైవసం చేసుకోవడం ఎవరినీ ఆశ్చర్య పరచలేదు.

నేపథ్యం

తన రాజకీయ అవసరాల కోసం ఇందిరాగాంధీ పెంచి పోషించిన భింద్రన్‌ ‌వాలే చెయ్యిదాటి పోవడంతో, అతడిని నిర్వీర్యం చేయక తప్పని పరిస్థితులు ఆమెకు ఏర్పడ్డాయి. సిక్కులకు అత్యంత పవిత్రమైన అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయాన్నే తన నివాసంగా చేసుకొని, అరాచకాన్ని సృష్టిస్తున్న భింద్రన్‌వాలేను అదుపులో పెట్టేందుకు ‘ఆపరేషన్‌ ‌బ్లూస్టార్‌’ ‌పేరుతో ఆ ఆలయంలోకి సైన్యాన్ని పంపడం సిక్కులకు తీవ్ర ఆగ్రహాన్ని కలుగచేసింది. భింద్రన్‌ ‌వాలే అయితే మరణించాడేమో కానీ సిక్కుల మన స్సులో ఆమె పట్ల వ్యతిరేకత ముద్రించుకు పోయింది.

యుకె సహాయ సహకారాలు?

1984లో ఇందిరాగాంధీ ఆపరేషన్‌ ‌బ్లూస్టార్‌కు ప్రణాళిక వేసేందుకు నాటి యుకె ప్రధాని మార్గరేట్‌ ‌థాచర్‌ ‌ప్రభుత్వ తోడ్పాటు ఉందంటూ వచ్చిన ఆరోపణలలో వాస్తవావస్తావాలను నిర్ధారించమంటూ వేసిన కమిటీ ప్రకారం, ఒకరకంగా థాచర్‌ ‌ప్రభుత్వం కనుసన్నల్లోనే ఆపరేషన్‌ ‌బ్లూస్టార్‌ ‌జరిగింది! ప్రభుత్వ రహస్య నిబంధనలు, ప్రయోజనాలకు దెబ్బ అన్న పేరుతో అనేక వాస్తవాలను బయిటపెట్టకుండా తొక్కివేశారని తేలింది. ఆ సమయానికి చెందిన భారతకు సంబంధించిన విదేశాంగ కార్యాలయ ఫైళ్లను పూర్తిగా లేక పాక్షికంగా సెన్సార్‌ ‌చేశారని తేల్చింది.

సాయం కోసం భారత అధికారులు యుకె వద్దకు వచ్చినప్పుడు దాని పరిణామాలు ఎలా ఉంటాయో విదేశాంగ కార్యాలయానికి తెలుసుట! స్వర్ణదేవాలయంపై దాడికి వారం ముందు, అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంలోకి వెళ్లేందుకు తోడ్పడింది యుకె ప్రభుత్వమేననే విషయం బయటకి వస్తే అది ప్రమాదకరంగా పరిణమిస్తుందని నాటి దౌత్యవేత్త బ్రూస్‌ ‌క్లెగ్‌హార్న్ అభిప్రాయపడ్డారు. బ్రిటిష్‌ ‌ప్రత్యేక వైమానిక దళానికి చెందిన ఒక అధికారి  భారత ప్రత్యేక దళాల యూనిట్‌తో కలిసి పర్యవేక్షణకు వచ్చి వెళ్లిన వెంటనే నగరంలోకి కమెండో దళం వచ్చిందని విశ్వసించి, అప్పటివరకూ శాంతి చర్చల్లో పాల్గొంటున్న భారత సిక్కులు వాటి నుంచి వెనక్కి తగ్గారు. తిరిగి వారు చర్చలకు రాకపోవడంతో 1984 జూన్‌లో భారతీయ సైన్యం స్వర్ణదేవాలయం లోకి దూసుకుపోవడం, నాలుగు నెలలు తిరగకుండా నాటి ప్రధాని ఇందిరాగాంధీని ఆమె సిక్కు బాడీ గార్డులు హత్య చేయడం, అనంతరం సిక్కుల ఊచకోత జరిగిపోయినట్టుగా నమోదైందని అక్కడి పత్రాలు పేర్కొన్నాయి.

ఇందిర హత్య తదనంతర పరిణామాలు

ఆ ఆగ్రహమే ఆమె మరణానికి కారణమైంది. ఆమెకు వ్యక్తిగత బాడీ గార్డులుగా ఉన్న సత్వంత్‌ ‌సింగ్‌, ‌బియాంత్‌ ‌సింగ్‌లు ఇందిరను ఆమె నివాసం లోనే కాల్చి చంపారు. తదనంతర పరిణామాలు తెలిసినవే. కాంగ్రెస్‌ ‌నాయకులు, కార్యకర్తలు ఈసాకుతో అమాయక సిక్కులను కూడా ఊచకోత కోశారు. అటువంటి సమయంలో పరిణతి ప్రదర్శించకపోవడమే కాదు, ఒక వటవృక్షం కూలినప్పుడు ప్రకంపనలు ఉంటాయంటూ ఆమె కుమారుడు రాజీవ్‌ ‌గాంధీ ప్రకటించడం సిక్కుల హృదయాలను మరింత గాయపరిచింది. ఆ ఊచకోతపై సరైన న్యాయవిచారణా సాగలేదు, అసలు నిందితులకు శిక్ష పడకపోవడమే కాదు, వారిని ఎవరూ సరైన రీతిలో సాంత్వన పరచలేకపోయారు. సిక్కులను బాధితులుగా చూశారు కనుకనే వారిని బాధపెట్టకూడదనే దృష్టితో ప్రధాని మోదీ వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్నప్పటికీ, వారిలో వ్యతిరేక భావనపోలేదు.

విదేశీ శక్తుల జోక్యం

ఖలిస్తాన్‌ ‌వ్యవహారంలో ప్రస్తుతం ఈ మాట అనగానే వెంటనే గుర్తు వచ్చేది కెనెడా. భారత నుంచి పెద్ద సంఖ్యలో అక్కడకు వెళ్లిన సిక్కులలో ఖలిస్తానీ భావన తీవ్రంగా ఉండటానికి కారణం అక్కడి ప్రభుత్వ మద్దతే. ప్రధానంగా, కెనెడా వీరికి అండగా నిలబడినా, భారత్‌ ఎదుగుదలను సహించలేకపోతున్న ఇతర పాశ్చాత్య దేశాలు కూడా పన్నూన్‌ ‌వంటి వారిని తమ పావులుగా చేసుకొని అక్కడి ప్రజలను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నాయి. తాము పురుడుపోసి, పెంచుతున్న ఆమ్‌ ఆద్మీ పార్టీకి ఉదారంగా నిధులను సమకూర్చి, రాజకీయంగా కూడా ఆ రాష్ట్రంలో ఖలిస్తానీ సమస్యను సజీవంగా ఉంచుతున్నారు. ఇదేమీ రహస్య విషయం కాదు, పన్నూన్‌ ఎన్నికలకు ముందు విడుదల చేసిన వీడియోలో తాము ఎన్ని కోట్ల రూపాయలను ఆప్‌కు ఇచ్చామో చెప్పుకురావడం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే అమృత్‌పాల్‌ ‌సింగ్‌ ‌వంటివారు కూడా భింద్రన్‌వాలేకు ప్రత్యామ్నాయంగా పుట్టుకు వచ్చారు. తన వేషభాషలను కూడా భింద్రన్‌వాలేలాగే మార్చుకున్న అమృత్‌పాల్‌ ‌సింగ్‌ ‌కొద్దికాలంలోనే ప్రజాదరణ పొందడం గమనార్హం. అమృత్‌పాల్‌ ఎదుగుతున్న సమయంలోనే కేంద్ర ప్రభుత్వం తుంచివేసి ఉంటే, నేడు అతడు అస్సాంలోని దిబ్రూగఢ్‌ ‌జైలు నుంచి పోటీ చేసి గెలిచి ఉండేవాడే కాదు. జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టు చేసిన అతడు ఖదూర్‌ ‌సాహిబ్‌ ‌నియోజకవర్గం నుంచి పోటీ చేయడమే కాదు, భారీ మెజారిటీతో గెలవడం ఆందోళన కలిగించే విషయం. ప్రత్యేక పంజాబ్‌ ‌రాష్ట్ర అవతరణే సిక్కు సమస్యలన్నింటికీ పరిష్కారమంటూ అతడు చేసిన అతివాద ఉపన్యాసాలతో సాధారణ ప్రజలు ప్రభావిత మయ్యారు.

జనాభా సమీకరణల్లో మార్పు

దాదాపు 32 శాతం దళితులు, మఝబీ సిక్కు జనాభా ఉన్న రాష్ట్రంలో 10వేలకు పైగా డేరాలు ఉన్నాయి. వీటన్నింటికీ ఈ వర్గాల మద్దతు ఉండడంతో, ఇవి ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులకు పుణ్యక్షేత్రాలుగా మారుతుంటాయి.  అయితే, వాటివల్ల లాభం ఎంత అన్నది చర్చ నీయాంశం. ఈ వర్గాన్ని ఎవరు ప్రభావితం చేస్తున్నారన్నది ఇంకా స్పష్టంగా తేలవలసి ఉంది. వీటికి తోడుగా, ఇప్పుడు క్రైస్తవం రాష్ట్రాన్ని మింగివేస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం, ఇప్పటికే 1.26 శాతం జనాభా క్రైస్తవులు అయినప్పటికీ, క్రైస్తవ నాయకులు మాత్రం ఈ శాతం 10 నుంచి 15 శాతం ఉన్నట్టు ప్రకటిస్తున్నారు. ఇందుకు కారణం ఆ తర్వాతికాలంలో తమ దళిత అస్తిత్వాన్ని నిలుపుకునే మఝబీ సిక్కులను పెద్ద ఎత్తున మతాంతరీకరించడమే. సరైన మార్గదర్శనం లేక పంజాబ్‌ ‌రాష్ట్రం అతలాకుతలమైపోతోందనడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ముఖ్యంగా క్రైస్తవ మిషనరీలు సరిహద్దు రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకొని మతాంతరీకరించడం వెనుక ఉన్న కుట్రను కనుగొని తిప్పి కొట్టాలి.

వేర్పాటువాదిని విడిపించేందుకు నిధులు

 ఈ ఎన్నికలపై విదేశాలలోని సిక్కు అతివాదుల ప్రభావం కూడా తక్కువేమీ కాదు. దోషిగా నిరూపితమైన దేవిందర్‌పాల్‌ ‌సింగ్‌ ‌భుల్లార్‌ను విడుదల చేయించేందుకు ఆప్‌కు 2014-2022 మధ్య 133.54 కోట్లు ఇచ్చామని పన్నూన్‌ ‌బహిరంగ ప్రకటించాడు. 1993లో ఢిల్లీలో తొమ్మిది మంది వ్యక్తుల మరణానికి, 31మంది  గాయపడటానికి కారణమైన బాంబు పేలుడు ఘటనలో దోషిగా నిరూపితుడయ్యాడు. అయినప్పటికీ, అతడిని విడిపించాలని అతివాదులు  కోరడం, అందుకు ఆప్‌ అధిపతి అర్వింద్‌ ‌కేజ్రీవాల్‌ అం‌గీకరించడం ఆందోళన కలిగించే విషయాలు.

అసలు ఇండియా ఎక్కడిది?

‘సిక్కులు 150 ఏళ్ల నుంచి బానిసలుగా బతుకు తున్నారు. మొదట బ్రిటిష్‌వారి పాలనలో. ఇప్పుడు హిందు వుల కింద బానిసత్వం అనుభవిస్తున్నారు. దీనికి విరుగుడు ఒక్కటే. సిక్కుల పాలన రావాలి’ ఇవి వారిస్‌ ‌దె పంజాబ్‌ ‌సంస్థ ఆధిపత్యం స్వీకరిస్తున్న సమయంలో అమృత్‌పాల్‌ ‌సింగ్‌ ‌చెప్పిన మాటలు. ఆ బాధ్యతలు స్వీకరిస్తున్నప్పుడు కూడా ఖలిస్తాన్‌ ‌జిందాబాద్‌ ‌నినాదాలు చేశారు. ఇప్పుడు ఇతడే పంజాబ్‌లోని ఖదూర్‌ ‌లోక్‌సభ నియోజక వర్గం నుంచి నెగ్గాడు. జీసస్‌ ‌తనను తాను రక్షించుకోలేకపోయాడు. ఇక తన పట్ల విశ్వాసం ఉన్నవారిని ఎలా కాపాడగలడు? వంటి ఇతడి ప్రకటనలు వివాదాస్పదం కాకుండా ఎలా ఉంటాయి? అసలు 1947 వరకు ఇండియా అనే దేశమే లేదని కూడా కొత్త చరిత్ర చెబుతున్నాడితడు.

ఔను కొట్టాను… ఎందుకంటే?

హిమాచల్‌ ‌ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఎంపికైన సినీనటి కంగనా రనౌత్‌ను చండీగఢ్‌ ‌విమానాశ్రయంలో రక్షణ సిబ్బంది చాటున ఉన్న ఖలిస్తానీ వాది కుల్విందర్‌ ‌కౌర్‌ (‌కానిస్టేబుల్‌) ‌చెంప మీద కొట్టిన సంగతి తెలిసిందే. అందుకు ఆమె చెప్పిన కారణం దారుణంగా ఉంది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ధర్ణా చేస్తున్న సమయంలో వారికి వ్యతిరేకంగా కంగన చేసిన వ్యాఖ్యలకు నిరసనగానే తాను చేయి చేసుకున్నట్టు కుల్విందర్‌ ‌బిగ్గరగానే చెప్పింది. ధర్ణాకు దిగిన వారంతా వందకీ, రెండువందలకీ వచ్చిన వారేనని కంగన వ్యాఖ్యానించడం కుల్విందర్‌ను బాధించిందట. అందులో ఆమె తల్లి కూడా ఉన్నదట. ఈమె చర్యను మహిళా సంఘాలు ఖండించలేదు. పైగా ఈమెను అరెస్టు చేస్తే న్యాయపోరాటానికి సహాయం అందిస్తామని పలువురు ముందుకు రావడం ఒక దౌర్భాగ్యం.

-నీల

About Author

By editor

Twitter
YOUTUBE