జూన్‌ 19 ‌హిందూ సామ్రాజ్య దినోత్సవం

‘‌భారతీయులు స్వాతంత్య్ర సంపాదనకై శివాజీ ఆదర్శాన్ని స్వీకరించాలి.’ విజయరత్న మజుందార్‌తో 1937లో నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌ అన్నమాట. ఈ వాక్యంలో భారతీయ స్వాతంత్య్ర సంగ్రామం వెనుక ప్రేరణలోని ఒక మహత్తర సత్యం దాగి ఉన్నది. శివాజీ కార్యపద్ధతి నుండి 1857 స్వాతంత్య్ర సంగ్రామ సూత్రధారులు మార్గదర్శనాన్ని పొందారు. వాసుదేవ బలవంత్‌ ‌ఫడ్కే ఇతర విప్లవవాదులు శివాజీ ఆదర్శాన్ని తమ ముందుంచుకున్నారు. ‘అభినవ భారత్‌’ అనే విప్లవసంస్థలో సభ్యత్వ ప్రతిజ్ఞ శివాజీ చిత్రం ఎదుట చేసేవారు. లోకమాన్య తిలక్‌ ‌ప్రజాసామాన్యంలో స్వాతంత్య్ర పిపాసను రగుల్కొల్పడానికై శివాజీ ఉత్సవాలను బహిరంగ సభలుగా జరిగే సంప్రదాయాన్ని ప్రారంభించారు. మహాకవి రవీంద్రనాథ్‌ ‌టాగూర్‌, ‌మహర్షి అరవిందులు, వీర సావర్కార్‌ ‌ప్రభృతులు శివాజీ జీవనాన్ని భక్తి భావంతో స్మరించారు.

వేయేళ్ల పరదాన్యంలో అవమానాలతో, నిరాశతో నిండిన జీవితం నుండి భారత ప్రజలకు విముక్తి ప్రసాదించిన మహా పురుషుడు శివాజీ మహారాజు. మొగల్‌ ‌సామ్రాజ్యాన్ని ప్రతిఘటించి స్వతంత్ర హిందూ రాజ్యాన్ని స్థాపించిన పరాక్రమశాలి. ఆయన ఇటీవలి కాలపు వ్యక్తి. ఆయన స్మృతులు ప్రజాజీవనంలో చెరగకుండా నిలిచి ఉన్నాయి. శివాజీ కార్యం దివ్యం, విలక్షణం, అసామాన్యం. ఆయన సాహసం, పరాక్రమం, రాజనీతి చతురత, రణకౌశల్యం, తీక్షణమైన బుద్ధి, సంఘటనా సామర్థ్యం లోకోత్తరమైనవి. తన 50 ఏండ్ల జీవితంలోనే చరిత గతిని మార్చాడు. హిందువులలో ఆత్మవిశ్వాసాన్ని పూరించాడు. శివాజీ జీవితాన్ని గురించిన చారిత్రక ప్రమాణాలు, సాహిత్యం విస్తారంగా ఉన్నాయి. శివాజీ లేడని ఎవరూ అనలేరు కనుకనే స్వరాజ్య సమరంలో దేశభక్తులంతా ఆయన ఆదర్శాన్ని ప్రేరణగా స్వీకరించారు.

శివాజీ జీవితంలోని తేజస్విత రహస్యం ఏమిటి? శివాజీకి రాజ్యాభిషేకం జరిగింది. ఇదే ఆయన గొప్పతనానికి కారణమా? శివాజీ కేవలం ఒకరాజు కాడు, యుగపురుషుడు. శివాజీ జన్మించిన నాటికి హిందూ సమాజం అధోగతిలో ఉంది. మొగలుల నిరంకుశ పాలన సాగుతోంది. దక్షిణాన ఆదిల్‌షాహీ, నిజామ్‌ ‌షాహీ, బీదర్‌ ‌షాహీ, కుతుబ్‌షాహీలు ఏలుతున్నారు. హిందూ రాజులు సామంతులు, యోధులు యవన రాజ్యలక్ష్మికి ఊడిగం చేస్తున్నారు. అత్యాచారాలు, పాశవికత హిందూ సమాజాన్ని క్రుంగదీసివేశాయి. దాస్యంవల్ల, నిరాశ వల్ల ఆత్మగౌరవం అడుగంటిపోయింది. యుద్ధంలో హిందువులు గెలవడం అసంభవమనే భావన సర్వత్రా వ్యాపించింది, ‘ఇదంతా మన ఖర్మ’, యవనులు, మ్లేచ్ఛులు రాజ్యమేలుతారని పురాణాలలో ఉన్నదని ప్రజలు చెప్పుకోసాగారు. ‘ఢిల్లీశ్వరో వా జగదీశ్వరో వా’ అంటూ పండితులు షాజహాన్‌ను విష్ణువు అవతారంగా పరిగణించే స్థితికి దిగజారిపోయారు.

ఘోరమైన ఈ భావదాస్యపు కాలఖండంలో జన్మించిన శివాజీ స్వరాజ్య స్థాపన మంత్రాన్ని ఉచ్చరించాడు. పరాక్రమం ద్వారా, నిర్భయమైన తేజస్విత ద్వారా సహచరులను సమీకరించుకున్నాడు. మెరుపువలె శత్రువుపై దాడి చేసే కళను నేర్చుకున్నాడు, నేర్పాడు. సైన్య సంచలనంలో, వ్యూహ నిర్మాణంలో తన విలక్షణమైన ప్రతిభ ద్వారా కొద్దిమంది శిక్షితులైన సహచరులతో విశాలమైన మొగల్‌ ‌సేనావాహినులపై దెబ్బ తీశాడు. కొద్ది సమయంలోనే ‘హరహర మహాదేవ’ జయనాదాలు మిన్నుముట్టాయి. హిందూ పద పాదషాహీ కలలు నిజమైనాయి. శివాజీ రాజ్యాభిషిక్తుడయి ఆత్మవిశ్వాసం అనే కలశాన్ని జాతీయ గౌరవమనే ఆలయంపై ప్రతిష్ఠించాడు. ఉత్తమ పరిపాలనా వ్యవస్థను నిర్మించాడు. మొగల్‌, ‌పఠాన్‌, ఆం‌గ్లేయ, ఫ్రెంచి, డచ్‌, ‌పోర్చుగీసుల దురంతాల కలియుగాన్ని వెనక్కి తిప్పి కృతయుగాన్ని ఆరంభించాడు. ఆయనది యుగపరివర్తన కార్యం. ఆయన రాజ్యాభిషేకం ఈ కార్యంలో ఒక ప్రముఖ అంశం మాత్రమే. 500 ఏండ్లుగా తిష్ట వేసుకున్న ఇస్లాం రాజ్యశక్తి హిందూ మనస్సును ఎంతగానో ప్రభావితం చేసింది. దాస్యంతో వచ్చిన కుసంస్కారాలను క్షాళితం చేయడానికి హిందువులలో తమ సామ్రాజ్యం యెడల విశ్వాసం జనించడం అవసరం. కనుకనే ఆయన హిందూ రాజ్య సింహాసనం రూపంలో ఒక శ్రద్ధా కేంద్రాన్ని స్థాపించాడు. ఈ మహోద్దేశంతోనే శివాజీ రాజ్యాభిషేకం జరిపించి ఛత్రపతి బిరుదు స్వీకరించాడు. ‘ఛత్రపతి శివాజీ మహారాజ్‌ ‌కీ జై’ అని జయ జయ నినాదాలు చేయడంతో హిందువులలో తాము కూడా స్వతంత్రం, సార్వభౌమత్వంతో కూడిన రాజ్యాన్ని స్థాపించగలమనే విశ్వాసం జనించింది. ఈ కార్యమంతటిలోను వ్యక్తిగత కీర్తి ప్రతిష్టల ఛాయ సైతం లేదని ధ్యేయనిష్ఠతో కూడిన ఆయన జీవనం చెపుతోంది. హైందవీ స్వరాజ్యం అనే ఆయన కార్యం భారత వర్షం అంతటి కోసమే జరిగింది. ఆయన పోరాటం ముమ్మాటికి ఒక జాతీయ పోరాటం. ఆయన సాధించింది ఒక జాతీయ విప్లవం. కనుక శివాజీ కేవలమొక సమ్రాట్టు కాడు; ఆయన ముమ్మూర్తులా రాష్ట్ర పురుషుడు.

 హిందూ పద పాదషాహీని స్థాపించిన కొద్ది కాలంలోనే అంతిమ క్షణాలు సమీపించేసరికి శివాజీ సహచరులతో ఇలా అన్నాడు : ‘భరతఖండం యావత్తూ జయించండి. ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించండి. గంగానదిని విముక్తి చేయండి. అబక్‌ ‌నది వరకు గల భూభాగాన్ని పాలించండి. ఈ పని మిగిలిపోయింది. నేను లేనందుకు విచారించకండి, వివేకంతో విచారాన్ని తొలగించుకోండి.’ ఈ వాక్యాలను బట్టి భరతఖండ భవ్య ప్రతిమ ఆయనకు ఆరాధ్యదైవంగా వెలుగొందుతూ ఉందని స్పష్టమవుతోంది. హిందూ రాష్ట్ర పునః ప్రతిష్ఠ ఆయన లక్ష్యం కనుకనే ఆయన, ఆయన వారసులు ప్రయాగ, కాశీ, హరిద్వారం, కురుక్షేత్రం, పుష్కరం, గడముక్తేశ్వర్‌ ‌వంటి తీర్థ స్థలాలను ముస్లిం ఆధిపత్యం నుండి విముక్తం చేశారు. తద్వారా ధర్మపునరుద్ధరణ జరిగింది. శివాజీ మిర్జా రాజా జయసింగ్‌కు రాసిన లేఖ ఆయన ఈ దృక్పథాన్ని నిరూపిస్తోంది. క్రీ.శ. 1645లో ఆయన తన ఉద్యోగి దాదాజీ నరసీ ప్రభుకు రాసిన ఉత్తరంలో ‘రోహిరేశ్వర్‌ ‌మీ లోయకు కులదైవం, ఆయన సమీపాన ఉన్న కొండమీద వెలసి ఉన్నాడు. ఆయన కృపవల్ల విజయం లభించింది. భవిష్యత్తులో కూడా ఆయన హైందవి స్వరాజ్య స్థాపన లక్ష్యాన్ని సాధింపజేయగలడు. ఈ రాజ్యస్థాపన జరిగి తీరుతుంది. అది పరమేశ్వరుని సంకల్పం’ అని అన్నాడు.

ఈ ఆకాంక్షతోనే ఆయన బుందేల్‌ఖండ్‌లోని చంపత్‌రాయ్‌కి, ఛత్రసాల్‌కు ప్రోత్సాహం ఇచ్చాడు. పంజాబులో కూడా హిందూ ధ్వజాన్ని స్థాపింపజేయడం, రాజస్థాన్‌లోని రాజపుత్రులు సంఘటితం కావడం, దక్షిణాదిన విజయనగరాది రాజులు తిరిగి విజృంభించడం ఇట్టి ఉద్దేశాలతో శివాజీ ఆగ్రా వెళ్లాడు. శివాజీ హిందుత్వాన్ని, శృతి, స్మృతి పురాణాలను రక్షించాడని భూషణకవి అన్నాడు.

శివాజీ అష్టప్రధానుల భారతీయ పద్ధతిని పరిపాలనలో ప్రవేశపెట్టాడు. ఆయన రాయించిన రాజ్య భాషా కోశం ఆయన భాషా శుద్ధి ప్రయత్నానికి సూచకం. సైన్య వ్యవస్థలోను, నౌకాబల నిర్మాణంలోను ఆయన విదేశీయులను అనుసరించలేదు; భారతీయ ప్రతిభా, విశ్వాసాలు ఆధారంగా క్రొత్త క్రొత్త నిర్మాణాలు చేశాడు.

బానిసత్వ కాలంలో సమాజంలో ప్రవేశించిన సముద్ర యాత్రా నిషేధం వంటి దురాచారాలను శివాజీ తొలగించాడు. బాజాజీ నింబాల్కర్‌, ‌నేతాజీ పాల్కర్‌లను శుద్ధి చేసి హిందూధర్మంలోకి ఆహ్వానించాడు. అంతేకాదు, వారితో వివాహ సంబంధాలను ఏర్పరచుకొని సమాజంలో వారికి గౌరవాన్ని సమాజం నుండి దూరమై ముస్లింలుగా మారినవారు తిరిగి తమ సమాజంలో ప్రవేశించడానికి మార్గం చూపాడు.

 లక్ష్యం ఎంత ఉదాత్తంగా ఉంటే కార్య సాఫల్యానికి వ్యక్తి చేసే ప్రయత్నాలలో అంతటి పవిత్రత, దృఢత్వం, నిష్ట కానవస్తాయి. కనుకనే శివాజీ రాజ్యపాలనలో కఠోరమైన అనుశాసనం అమలు జరిగేది. శివాజీ తాను నిజమైన కర్మయోగిగా జీవించాడు; అనుచరులను కూడా అనుశాసనంలో ఉంచాడు. ఒకసారి ఆయన నేతాజీ పాల్కర్‌ అనే సేనాపతిని ‘‘నిర్ణీత సమయానికి ఎందుకు కాలే’’దని నిగ్గదీసి అడిగాడు. ప్రతాప్‌రావ్‌ ‌గుజార్‌ను ఆయన ‘‘ఎవరిని అడిగి నీవు శత్రువుతో సంధి ప్రతిపాదన చేశావు. అనధికారంగా ఎందుకు వ్యవహరించావు?’’ అని సూటిగా అడిగాడు. తన పుత్రుడు శత్రువుతో కలసినప్పుడు ఆయన అతనిని ఖైదు చేశాడు. పుత్ర వ్యామోహంలో మునిగిపోలేదు. అఫ్జల్‌ఖాన్‌ ‌వధ తర్వాత అతని కొడుకు ఫాజల్‌ఖాన్‌ ‌పారిపోతూ ఉండగా బండూజీ ఖోపడే అతనిని పట్టుకున్నాడు. కాని ఖండూజీ అతనిని శివాజీకి అప్పగించడానికి బదులు లంచం తిని వదలిపెట్టాడు. శివాజీ ఖండూజీకి ఉరిశిక్ష విధించాడు.

ఆయన స్వీయ జీవనంలో పూర్తి సంయమనం, నిష్కళంకమైన శీలం కానవస్తాయి. కల్యాణ్‌ ‌సుబేదార్‌ ‌కోడలిని బందీగా తెచ్చి తనకు బహుమతి ఇచ్చినప్పుడు శివాజీ ఆమెను చూచి ‘ఎంతటి దివ్య సౌందర్యం ఈమెది. మా తల్లి గారికి ఇంతటి అందం ఉంటే, మాకు కూడా ఇట్టి రూపం వచ్చేది’ అని ఆమెను ఆబాజీ సోన్‌దేవ్‌కు అప్పగించి ‘ఇట్టి పొరపాటు మళ్లీ జరిగితే కఠోరమైన శిక్ష తప్పదని’ చెప్పి ఆ ముస్లిం వనితకు వస్త్రాలంకారాదులు బహుమతులిచ్చి సాదరంగా పంపించాడు.

ఇట్టి అతులిత గుణసంపద కలిగిన శివాజీ దైనందిన జీవితం వివేక, వైరాగ్యాలతో తొణికిసలాడేది. అనుక్షణం యుద్ధంలో గడిపినప్పటికీ ఆయన అంతఃకరణ సదా ఈశ్వరచింతనలో లీనమై ఉండేది. కనుకనే ఆయన ఇన్ని పనుల మధ్య కూడా సంత్‌ ‌శిరోమణి రామదాసు, తుకారామ్‌, ‌మోర్యా గోస్వామి వంటి సాధుసంత్‌ల చరణాల వద్ద కూర్చొనడానికి వ్యవధి కల్పించుకునేవాడు. దేశం, ధర్మం కోసం సర్వస్వాన్నీ బలిదానం చేయడంలో లభించే అలౌకిక ఆనందంలోని అనుభవాన్ని ఆయన జాతి అంతటికీ కలిగించాడు. కనుకనే ‘‘జయ జయ రఘువీర్‌ ‌సమర్థ’ అని పాడుకుంటూ వచ్చిన రామదాస స్వామికి జోలెలో తన రాజ్యమంతటినీ అర్పణ చేసి, శివాజీ సన్యాసం ఇవ్వమని ఆయనను అర్థించాడు. ఆ తర్వాత ధర్మ సంస్థాపన కార్యానికి ఒక ప్రతినిధిగా మాత్రమే ఆయన సేవాభావంతో రాజ్య భారాన్ని వహించాడు.

నాయకగణం ఇవాళ స్వార్థంతో, అధికారం కోసం పోటీలు పడుతూన్న తరుణంలో శివాజీ త్యాగమయ జీవనం నిత్యం స్మరణీయమే. నేటికీ కొందరిలో పరానుకరణ ఉంది. ఆత్మవిశ్వాస రహితమైన జీవనంలోనే సార్థక్యం ఉన్నదని భావించేవారూ తక్కువ కాదు. ఇట్టి స్థితిలో శివాజీ ఆదర్శ సాక్షాత్కారం బలీయమైన జాతిగా రూపొందించగలుగుతుంది. నిజమైన జాతీయత, స్వధర్మాభిమానం, సహిష్ణుత, శ్రేష్టమైన రాజకీయ వ్యవస్థలతో పాటుగా పరిపాలనా విధానం, రక్షణ వ్యవస్థ సైన్య సంచలనం విదేశాలతో సంబంధాలు, వ్యాపార దక్షతతో సంపదలతో కూడిన ఆర్థిక వ్యవస్థ, వివిధ దేశాలతో వాస్తవిక దృష్టితో శత్రుమిత్ర విచారంతో వ్యవహరించడం – ఇవన్నీ నేటి పాలకులకు శివాజీ ఆదర్శం నుండి లభిస్తాయి. నిష్కళంకం, కర్మశీలం అయిన యశస్సుతో తేజస్సుతో నిండిన శివాజీ జీవనం నేటి విపరీత పరిస్థితుల నుండి మార్గాన్ని కనుగొనడానికి ధృవతారగా నిలుస్తుంది. ఈ ఆదర్శాన్ని స్వీకరించినప్పుడే మనం మన జాతిని సమృద్ధం, ఆధునికం, ప్రగతి శీల బలశాలి అయిన జాతిగా నిర్మించగలుగుతాం.

కనుకనే ప్రసిద్ధ చరిత్రకారుడు యదునాథ్‌ ‌సర్కార్‌ ఇలా వ్యాఖ్యానించాడు: ‘‘శివాజీ రాజకీయ లక్ష్యం అత్యంత శ్రేష్ఠమైనది. నేడు సైతం మనం దానిని యథాతథంగా స్వీకరించవచ్చు. ప్రజలకు సుఖశాంతులు ఇవ్వడం ఆయన ఉద్దేశం. విశాలమైన సహిష్ణుతా భావంలో ఆయనకు విశ్వాసం ఉండేది. ఆయన రాజ్యంలో అన్ని కులాలవారికీ, అన్ని మతాలవారికీ, అన్ని ఉపాసనాపద్ధతులవారికి మార్గం తెరిచి ఉండేది. ఆయన రాజ్యవ్యవస్థ, జన కల్యాణకారి. కార్యక్షేమం దోష రహితమైనది.

– జాగృతి, 15.06. 1970

About Author

By editor

Twitter
YOUTUBE