భారతదేశ దక్షిణ ప్రాంతానికి ఏమైంది? కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న వారందరినీ వేధిస్తున్న ప్రశ్న ఇది. ఉచిత హామీలతో పది నెలల క్రితం కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. ఫలితాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయని తెలిసిన మరుక్షణమే  పాకిస్తాన్‌ అనుకూల శక్తులు రెచ్చిపోవడం మొదలుపెట్టాయి.  బెలగావి దగ్గర లెక్కింపు కేంద్రం దగ్గర పాకిస్తాన్‌ జిందాబాద్‌ అంటూ నినాదాలు చేశారు. అదే కలచివేస్తున్న అంశం. తరువాత హిందూ దేవాలయాల మీద పన్ను విధించే సాహసానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఒడిగట్టి భంగపాటుకు గురైంది. అయినా ధీమా ఏమిటో తెలియదు, మళ్లీ అదే చట్టం తీసుకురావడం ఖాయమని కర్ణాటక ఉపముఖ్యమంత్రి నిస్సిగ్గుగా ప్రకటించాడు. ఇది జరిగి వారం కాకముందే శాసనసభలో పాకిస్తాన్‌ అనుకూల నినాదాలు. అదికూడా రాజ్యసభకు కాంగ్రెస్‌ అభ్యర్థి ఎన్నికైనప్పుడే. ఆ వెంటనే బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌ వద్ద ఐఈడీ పేలుడు. వీటికి పరాకాష్ట అన్నట్టు సాక్షాత్తు ఒక రాష్ట్ర మంత్రి శాసనసభలో పాకిస్తాన్‌ బీజేపీకి శత్రువేమో కానీ, కాంగ్రెస్‌ పార్టీకి కాదు అని ఒంటి మీద స్పృహే లేనట్టు మాట్లాడాడు. అది పొరుగు దేశం కాబట్టి, పొరుగును ప్రేమించాలి కాబట్టి ప్రేమిస్తాడట. హోంమంత్రి పరమేశ్వరన్‌ సభ సాక్షిగా చెప్పిన మాటలు ఇవే. ఒక ప్రశ్న. 1947, 1965, 1971 యుద్ధాలు, తరువాత కార్గిల్‌ సంఘర్షణ పాకిస్తాన్‌ మిత్రదేశంగానే చేసిందా? దానిని విశ్లేషిస్తూ  ఆ మంత్రివర్యుడు కొత్త చరిత్ర రాయాలి.  వేయేళ్లు పట్టినా పరవాలేదు, భారత్‌ మీద మతపరమైన విజయం సాధించాలి కాబట్టి జిహాద్‌ను ప్రకటించిన దేశం మిత్రదేశం ఎలా అవుతుందో కూడా ఇదే సందర్భంలో కాంగ్రెస్‌ వెల్లడిస్తే దేశప్రజలు ధన్యులవుతారు. తమిళనాడులో డీఎంకే, కేరళలో సీపీఎం తమవైన పంథాలో దేశ వ్యతిరేకతను స్పష్టంగా ప్రదర్శిస్తున్నాయి. దీనికంతకీ వారు పెట్టుకున్న పేరే సెక్యులరిజం. లేదా ఫెడరలిజం రక్షణోద్యమం.

ఈ పార్టీల నాయకులు, ప్రభుత్వాధినేతలు ఎవరూ కూడా జరిగిన ఘటనల మీద బాధ్యతా యుతంగా, జవాబుదారీతనంలో ప్రకటనలు ఇవ్వకపోవడమే వింత. జాతీయ స్థాయి నాయకులు తమకు పట్టనట్టే ఉన్నారు. స్థానిక నాయకులు ఘటనలోని తీవ్రతను తగ్గించి చూపే యత్నం చేస్తున్నారు. ఇందుకు కాంగ్రెస్‌ మంచి ఉదాహరణ. వాస్తవాలను అంగీకరిస్తే అది మోదీకి అనుకూలమవు తుందేమోనన్న విధ్వంసకర ధోరణి వారిలో కనిపిస్తున్నది.

మరొక దక్షిణాది రాష్ట్రం తమిళనాడులో హిందూత్వ మీద పోరాటం  పేరు మాటున భారత వ్యతిరేకత పెచ్చరిల్లిపోతున్నది. కొద్దికాలం క్రితం సాక్షాత్తు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ హిందూత్వను, సనాతన ధర్మాన్ని కూకటివేళ్లతో పెళ్లగించడమే పరిష్కారమన్నాడు. పైగా ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని కోర్టులు పిలిచినా తను అదే మాట చెబుతానని విర్రవీగుతున్నాడు. రాకెట్‌ లాంచింగ్‌ కేంద్రం ప్రారంభోత్సవ వేళ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పత్రికా ప్రకటనలో చైనా జెండాతో రాకెట్‌ బొమ్మ వేయడం మరింత వివాదానికి దారి తీసింది. హిందూ, హిందీ వ్యతిరేకత పేరుతో వేర్పాటువాదాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలన్న తపన ప్రస్తుత డీఎంకే ప్రభుత్వంలో, పార్టీలో కూడా సుస్పష్టం. ఇక భారతీయ జనతాపార్టీని వ్యతిరేకించడానికీ, భారతదేశాన్ని ధిక్కరించడానికి మధ్య విభజన రేఖను వర్తమాన కేరళ ఎప్పుడో మరచిపోయింది. హిందూత్వను అరికట్టాలన్న నినాదంతో ముస్లిం మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్న ఘనత అక్కడి అధికార సీపీఎంకూ, పినరయ్‌ విజయన్‌ ప్రభుత్వానికి దక్కుతుంది. ఈ మూడు రాష్ట్ర ప్రభుత్వాల రహస్య ఎజెండా విభజన అనేది సుస్పష్టం. ఇందుకు కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు రాహుల్‌ మద్దతు దండిగా ఉంది. దక్షిణ ప్రాంతా భారత రాష్ట్రాలకు నిధుల విషయంలో అన్యాయం జరుగుతున్నదంటూ పార్లమెంట్‌ బయట వ్యాఖ్యానించిన సురేశ్‌ కాంగ్రెస్‌ సభ్యుడే. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ సోదరుడే. కాంగ్రెస్‌ పార్టీ జాతీయవాదాన్ని మరచి, అదొక విదేశీయుడు స్థాపించిన పార్టీయేనని కాస్త ఆలస్యం గానే అయినా ఇప్పుడు తన వైఖరిని దిగంబరంగా ప్రదర్శిస్తున్నది. డీఎంకే ప్రత్యేక ద్రవిడస్థాన్‌ కావాలని, అందుకు జిన్నా మద్దతు తీసుకోవాలని ఆలోచించిన పార్టీ. ఇక కమ్యూనిస్టులకు ఈ దేశ జాతీయతకు ఏనాడూ సంబంధం లేదు. బీజేపీ వ్యతిరేకత పేరుతో ఈ మూడు పార్టీలు, వాటి ప్రభుత్వాలు జాతీయ సమైక్యతకు సవాళ్లు విసురుతున్నాయని చెప్పడం తొందరపాటు కాదు. దీనికి తోడు హైదరాబాద్‌లోని ఎంఐఎం పనిచేస్తున్నది.

బీజేపీని ఓడిరచాలన్న ఒక ముసుగుతో ఇవన్నీ కలసి దేశ ఐక్యతకు, భంగం కలిగిస్తూ  వేర్పాటు వాదాన్ని బాహాటంగానే ప్రోత్సహిస్తున్నాయి. కర్ణాటకలో బీజేపీ ఓడిపోయి, కాంగ్రెస్‌ ఎన్నికైన వెంటనే ఎందుకీ జాతిద్రోహం బయటపడిరది? దీని గురించి భారతీయులంతా ఆలోచించాలి. పేలుళ్లు, మత కల్లోలాలు లేకుండా గడచిన పదేళ్లుగా దేశాన్ని కాపాడుతున్న బీజేపీ ప్రభుత్వాన్ని అభాసు పాలు చేయడమే వీటి లక్ష్యమా? మోదీ గ్రాఫ్‌ను దింపడమే ప్రస్తుత కర్తవ్యం అంటూ  రైతు ఆందోళనలో పాల్గొన్న ఒక వ్యక్తి చెప్పినట్టు ఈ పార్టీలు, వాటి నాయకుల ఉద్దేశం కూడా అదేనా? ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రదర్శిస్తున్న హిందూ వ్యతిరేకతను, బుజ్జగింపు రాజకీయాలను మతోన్మాద, పాక్‌ అనుకూల శక్తులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయని అనుకోవడం కూడా అసమంజసం కాబోదు. మెజారిటీ ప్రజలను, కేంద్ర ప్రభుత్వాన్ని నిరంతరం వ్యతిరేకిస్తూ ఉండడం, అసలు కేంద్ర దర్యాప్తు సంస్థలకు ప్రవేశమే ఉండదని బాహాటంగా చెప్పడం వంటివి కూడా దేశ వ్యతిరేక శక్తులకు ఊతం ఇచ్చేవే. ఇటీవల కర్ణాటకలోనే మరొక ఉదంతం కూడా జరిగింది. అయితే దీనికి పెద్దగా ప్రచారం రాలేదు. రాష్ట్రంలోని కాదబా ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న అమ్మాయిల మీద కొందరు వచ్చి యాసిడ్‌ చల్లారు. వారంతా కేరళ నుంచి వచ్చారని అనుమానాలు ఉన్నాయి.

ముంబై తరహా పేలుళ్లు, లుంబిని, గోకుల్‌చాట్‌ విధ్వంసం వంటి వాటిని మళ్లీ మళ్లీ సృష్టించాలని భారత వ్యతిరేక శక్తులు ప్రయత్నిస్తున్నట్టే ఉంది. మార్చి ఒకటో తేదీన బెంగళూరులోని రామేశ్వరమ్‌ కేఫ్‌లో సంభవించిన పేలుడు ఇలాంటి భావనకు వచ్చేటట్టు చేస్తోంది. మార్చి 1న, పట్టపగలు ఆ కేఫ్‌లో ఈ దుర్ఘటన జరిగింది. ఒక యువకుడు వచ్చి, రవ్వ ఇడ్లీకి ఆర్డర్‌ ఇచ్చి అది తినకుండానే వెళ్లిపోయాడు. కానీ తను కూడా తెచ్చిన బ్యాగ్‌ను మాత్రం అక్కడే వదిలి వెళ్లాడు. అక్కడ ఉన్న ఈ తొమ్మిది పది నిమిషాలు ఫోన్‌లో మాట్లాడుతూనే ఉన్నాడు. అయితే సీసీ ఫుటేజ్‌ చూసిన తరువాత అది నకిలీ ఫోన్‌ అని పోలీసులు నిర్ధారించుకున్నారు. అతడు బస్సు మీద వచ్చి వెళ్లాడని తెలుస్తున్నది. ఆ సమయంలో మొత్తం 26 బస్సులు అక్కడకు వచ్చి వెళ్లాయి. ఇంకొంచెం శోధించిన తరువాత ఒక్క క్లూ దొరికింది. అతడు 500డి బస్సు ఎక్కి రామేశ్వరమ్‌ కేఫ్‌కు కొంత ముందు (కుందలహళ్లి స్టాపు) దిగి, అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లాడు. గంట తరువాత  అతడు తెచ్చిన బ్యాగ్‌లోని ఐఈడీ (ఇంటెన్సివ్‌ ఎక్స్‌ప్లోజివ్‌ డివైస్‌) పేలుడుకు కారణమైంది. పదిమంది గాయపడ్డారు. ఇంతకీ అతడు అంతా కలసి కేఫ్‌లో గడిపినది తొమ్మిది నిమిషాలే. వెంటనే కేసును రాష్ట్ర హోం శాఖ జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించింది. ఈ నిర్ణయమే రామేశ్వరమ్‌ కేఫ్‌ పేలుడు తీవ్రతను వెల్లడిస్తుంది. మొదట సిలిండర్‌ పేలుడు వంటి అర్ధంపర్ధం లేని కారణాలు సాక్షాత్తు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చెప్పినా సకాలంలో మాత్రం మేలు కొన్నారు. పేలుడు తీవ్రతను ఆయన గుర్తించారు. ఈ పేలుడు, 2022లో జరిగిన మంగళూరు పేలుడు ఇంచుమించు ఒకే విధంగా ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ చెప్పారు. మంగళూరు పేలుళ్లకు ప్రెషర్‌ కుక్కర్‌ను ఉపయోగించారు. ఆటోలో ఉంచిన ఆ కుక్కర్‌ తరువాత పేలింది.ఏమైనా ముఖ్యమంత్రి సిద్దరామయ్య పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్ష బీజేపీ గట్టిగానే కోరుతోంది. కానీ ఈ విషయం మీద ఇప్పటివరకు రాహుల్‌ గాంధీ, ఇతర ప్రముఖ కాంగ్రెస్‌ నాయకులు నోరు విప్పలేదు.

ఆ బ్యాగ్‌ తెచ్చి కేఫ్‌లో ఉంచడం, వెళ్లిపోవడం ఇవన్నీ ఒక పథకం ప్రకారమే జరిగాయి. బెంగళూరు పోలీసులు ముందు సేకరించిన కొన్ని వివరాలను బట్టి ఇది తెలిసింది. ఆ యువకుడు తన నివాసాలను పదే పదే మార్చాడు. అలాగే ప్రభుత్వ రవాణా సంస్థ వాహనాలలోనే ప్రయాణించాడు. ఐఈడీని అక్కడ ఉంచడానికి ముందు కొన్నిసార్లు రెక్కి కూడా జరిపాడని తేలింది. అతడు బ్యాగ్‌ ఉంచిన సమయం, పేలుడు జరిగిన సమయం మధ్యాహ్న భోజన సమయం. కాబట్టి తక్కువ శక్తి పేలుడే అయినా ఎక్కువ నష్టం జరుగుతుందని అంచనా వేసి ఉండవచ్చు. పార్లమెంట్‌ ఎన్నికలకు కాస్త ముందు ఇలాంటి వ్యూహంతో ఉన్న శక్తులు తరువాత విజృంభించవన్న పూచీ ఏమీ లేదు. అది జనం గమనించవలసి ఉంటుంది.

కర్ణాటకలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి కొద్ది కాలమే అయింది. ఈ సమయంలోనే విద్రోహ శక్తులు, సంఘ వ్యతిరేక శక్తులు బలం పుంజు కున్నాయి. ఈ ధోరణిని ప్రోత్సహించే విధంగానే ఇప్పటికీ కాంగ్రెస్‌ పార్టీ, ఆ పార్టీ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. ఇది ఆ పార్టీ కొత్త విధానం. బీజేపీ అధికారంలో ఉంటే అది సహించలేదు. గాంధీనెహ్రూ కుటుంబీకులు కానివారు ప్రధాని పదవిలో ఉన్నా ఆ పార్టీ నాయకులు తట్టుకోలేరు. ఇదే పదే పదే బయటపడుతున్నది.

– జాగృతి డెస్క్‌

About Author

By editor

Twitter
YOUTUBE