ఆయనను కొద్దికాలం క్రితం వరకు ‘ప్రజాన్యాయమూర్తి’ అని గౌరవంగా పిలిచేవారు. ఆయనే కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అభిజిత్‌ ‌గంగోపాధ్యాయ. ఇప్పుడు హఠాత్తుగా గంగోపాధ్యాయ తన పదవికి రాజీనామా చేసి క్రియాశీలక రాజకీయాలలోకి వచ్చారు. తన రాజీనామాను ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ‌డీవై చంద్రచూడ్‌కు, కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్‌ ‌శివజ్ఞానంకు కూడా పంపించారు. ఈ సంవత్సరం ఆగస్ట్‌లోనే పదవీ విరమణ చేయనున్న ఈ న్యాయమూర్తి ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక పశ్చిమ బెంగాల్‌ ‌ప్రస్తుత రాజకీయ పరిస్థితులే కారణం. తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ అరాచకం మొత్తంగా అన్ని వ్యవస్థలను నాశనం చేసినట్టే న్యాయ వ్యవస్థను కూడా దిగజార్చడం కూడా గంగోపాధ్యాయ తీవ్ర నిర్ణయానికి వెనుక ఉన్న మరొక బలమైన కారణం. తృణమూల్‌ ‌కాంగ్రెస్‌తో తలపడినట్టే సుప్రీంకోర్టుతో గంగోపాధ్యాయ సంఘర్షించ వలసిన పరిస్థితులు రావడం కూడా ఒక కారణం. ఇలాంటి ఘర్షణ చరిత్రలో మొదటిసారి కావచ్చు.

మార్చి 5న గంగోపాధ్యాయ న్యాయమూర్తి పదవికి రాజీనామా చేశారు. తరువాత విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తన అభిప్రాయాలను ఎలాంటి శషభిషలు లేకుండానే వెల్లడించారు. తృణమూల్‌ ‌కాంగ్రెస్‌తో తలపడగల సత్తా ఉన్న ఒకే ఒక్క జాతీయ పార్టీ బీజేపీయేనని ఆయన అన్నారు. తనను బీజేపీ, తానూ బీజేపీని సంప్రతించుకుంటూనే ఉన్నామని కూడా ఆయన చెప్పారు.

తాను గడచిన రెండేళ్లుగా రాష్ట్ర విద్యాశాఖలో జరిగిన అవకతవకల కేసులను చూస్తున్నానని, అక్కడ అంతులేని అవినీతి జరిగిందని ఆయన వెల్లడించారు. అవి బయటపడినందువల్ల ప్రభుత్వంలోని పెద్ద పెద్ద వ్యక్తులు విచారణలో ఉన్నారు, లేదంటే జైలులో ఉన్నారని ఆయన చెప్పారు. ఇప్పుడు కార్మికశాఖలో జరిగిన అవకతవకలు తన విచారణ పరిధిలోకి వచ్చాయని అక్కడ జరిగిన అవకతవకలు కూడా తక్కువ కాదని ఆయన చెప్పారు. ప్రావిడెంట్‌ ‌ఫండ్‌, ‌గ్రాట్యుటి వంటి విషయాలలో ఎన్నో అక్రమాలు జరిగాయని తేలింది. మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌వ్యవహార సరళిని ఆయన ఏనాడూ సహించలేదు. ఆ ప్రభుత్వం సీబీఐ నీ, కేంద్ర దర్యాప్తు సంస్థలనీ అసలు రాష్ట్రంలోకే అనుమతించబోనని ప్రకటిస్తే, జస్టిస్‌ ‌గంగోపాధ్యాయ వాటితోనే దర్యాప్తు జరిపించాలని ఆదేశాలు ఇచ్చేవారు. ఆ పార్టీ నాయకుల అరాచకత్వం, ఫలితంగా రాష్ట్రంలో ఏర్పడిన అవాంఛనీయ వాతావరణం గురించి గంగోపాధ్యాయ గతంలోను చాలాసార్లు విమర్శలు కురిపించారు. ‘తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ఏలుబడిలో బెంగాల్‌ ‌దొంగలరాజ్యంగా మారిపోయిందని నేను గతంలో అన్నాను. కాబట్టి ఆ పార్టీలో ఎప్పటికీ చేరను. తాను మత విశ్వాసాలు కలవాడిని కాబట్టి సీపీఎంలో చేరలేను’ అని కూడా వెల్లడించారు. జైరామ్‌ ‌రమేశ్‌ ‌వంటి సామర్థ్యం ఉన్న నేతలను కూడా పక్కన పెట్టి వంశ పారంపర్య పాలన విధానం అనుసరించే కాంగ్రెస్‌ అం‌టే తనకు సరిపడదని కూడా తేల్చారు. ప్రధాని నరేంద్ర మోదీ మంచి వ్యక్తి అని, గొప్పగా కష్టించే తత్త్వం కల మనిషి అని, దేశానికి చేతనైనంత మేలు చేద్దామన్న ఆశయం ఉన్నవారని వ్యాఖ్యానించారు గంగోపాధ్యాయ. నిజానికి మార్చి నెల ఆరంభంలోనే ఆయన న్యాయమూర్తి పదవి నుంచి వైదొలగుతున్న సంగతిని, ప్రధాన స్రవంతి రాజకీయాలలోకి వస్తానని ఒక బెంగాలీ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు.

2022 నుంచి జస్టిస్‌ ‌గంగోపాధ్యాయ తన తీర్పులతో వార్తలలోని వ్యక్తిగానే ఉన్నారు. ఆ క్రమంలోనే ‘ప్రజా న్యాయమూర్తి’ అని ప్రజలు నీరాజనాలను అందుకున్నారు. అవన్నీ అధికార తృణమూల్‌ ‌మంత్రులు, మంత్రిత్వ శాఖల అవినీతి వ్యవహారాల మీద వెలువరించిన తీర్పులే. బెంగాల్‌ ‌పాఠశాలల నియామకాల అవినీతిపై ఆయన ఇచ్చిన తీర్పు మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని కల్లోల పరిచింది. అసలు టీఎంసీ అవినీతి వ్యవహారాలతో న్యాయ వ్యవస్థ పరిధిలో పోరాడుతున్న ఏకైక యోధుడన్న ఖ్యాతి కూడా వచ్చింది. దీనితో వెంటనే ఆయన మీద టీఎంసీ ద్వేషిగానూ, బీజేపీ అనుకూలునిగానూ ముద్ర పడిపోయింది. పదవికి రాజీనామా చేయడానికి వారం ముందు నుంచి ఆయన సెలవులో ఉన్నారు. తాను బీజేపీలో చేరతానని ఆయన చెప్పడంతోనే గంగోపాధ్యాయ మీద బురద చల్లే వ్యవహారం మొదలయింది. కలకత్తా లా జర్నల్‌ ‌సంయుక్త సంపాదకుడు, కలకత్తా హైకోర్టు న్యాయవాది ఇంతియాజ్‌ అఖ్తర్‌ ‌వెంటనే విషం చిమ్మారు. ‘బీజేపీ తానూ పరస్పరం సంప్రతింపులలో ఉన్నామని ఆయన చెప్పడమంటేనే ఇద్దరి మధ్య ఇచ్చిపుచ్చుకునే వ్యవహారం ఉందని అర్ధం’ అని ఇంతియాజ్‌ ‌భాష్యం చెప్పారు. మమతా బెనర్జీ అరాచకాలు, టీఎంసీ రక్తపాతం అన్నీ వదిలేసి రాజ్యాంగ ప్రకారం ప్రమాణం చేసిన గంగోపాధ్యాయ ఇలా బీజేపీతో ‘టచ్‌’‌లో ఉండడం ఏం సబబు అంటూ ఇంతియాజ్‌ ‌సుద్దులు కూడా మాట్లాడారు. ఇంకా ఈ బాపతు బీజేపీ వ్యతిరేక నల్లకోట్లన్నీ యథాశక్తి గంగోపాధ్యాయ మీద బుదర చల్లే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి.

గంగోపాధ్యాయను 2018లో కలకత్తా హైకోర్టులో అదనపు జడ్జిగా నియమించారు. 2020 నుంచి శాశ్వత ప్రాతిపదికను విధులు నిర్వహిస్తున్నారు. బెంగాల్‌ ‌వైద్య కళాశాలలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరపవచ్చునని గంగోపాధ్యాయతో ఏర్పడిన ఏక న్యాయమూర్తి ధర్మాసనం తీర్పు చెప్పింది. దీని మీదనే సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రతికూలంగా స్పందించింది. అయినా గంగోపాధ్యాయ సుప్రీం కోర్టును  పరిగణనలోనికి తీసుకోలేదు. నిజానికి గంగోపాధ్యాయ తీర్పుల విషయంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం అదే మొదటిసారి. సెప్టెంబర్‌ 2022‌లో గంగోపాధ్యాయ ఒక బెంగాలీ వార్తా చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇలాంటి ఇంటర్య్యూలు ఇవ్వడం న్యాయమూర్తులకు సబబు కాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ‌చంద్రచూడ్‌ ‌కూడా అభిప్రాయపడ్డారు. అదే ఇంటర్వ్యూలో తన పట్ల గంగోపాధ్యాయ వ్యతిరేక భావనను వ్యక్తం చేశారని టీఎంసీ నాయకుడు, మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్‌ ‌బెనర్జీ సుప్రీంకోర్టులో పిటిషన్‌ ‌వేశారు. అభిషేక్‌ ‌మీద చేసిన వ్యాఖ్యలు బెంగాల్‌ ‌పాఠశాలలో నియమకాల అవకతవకలకు సంబంధించినవే. తరువాత ఈ కేసు నుంచి సుప్రీంకోర్టు గంగోపాధ్యాయను తప్పించింది. ఆ ఘర్షణ ఇంకాస్త ముందుకు వెళ్లింది.

ముందుస్తు పదవీ విరమణ తీసుకుని న్యాయమూర్తులు రాజకీయాలలో ప్రవేశించడం గంగోపాధ్యాయతోనే మొదలుకాలేదు. మద్రాస్‌ ‌ప్రెసిడెన్సీ కాలంలో వీఆర్‌ ‌కృష్ణయ్యర్‌ ‌మద్రాస్‌, ‌కేరళలలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన ఈఎంఎస్‌ ‌నంబూద్రి మంత్రివర్గంలో సభ్యుడు కూడా. తరువాత 1968లో ఆయనను కేరళ హైకోర్టులో, 1973లో సుప్రీంకోర్టులోను న్యాయమూర్తిగా నియమించారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ‌బహరుల్‌ ఇస్లాం లోక్‌సభకు పోటీ చేయడానికి 1983లో పదవికి రాజీనామా చేశారు. తరువాత రాజ్యసభకు వెళ్లారు. జస్టిస్‌ ‌గుమన్‌ ‌మాల్‌ ‌లోధా కొద్దికాలం జనసంఘ్‌ ‌రాజస్థాన్‌ అధ్యక్షునిగా పనిచేసిన తరువాత ఆ రాష్ట్ర హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. ఇలాంటి ఉదాహరణలు ఇంకా ఉన్నాయి. జస్టిస్‌ ‌కేఎస్‌ ‌హెగ్డే, జస్టిస్‌ ‌రంజన్‌ ‌గొగొయ్‌ ‌కూడా అలా చట్టసభలకు వెళ్లినవారే. అయినా గంగోపాధ్యాయ మీద కొందరు బురద చల్లడం విచిత్రమే. ఆయన బీజేపీని ఎంచుకోవడమే ఇందుకు కారణం కావచ్చు. కానీ మిగిలిన న్యాయమూర్తులకీ, గంగోపాధ్యాయకు మధ్య చాలా తేడా ఉంది. ఆయన ఒక గూండా రాజ్యంతో తలపడ్డారు.

తాను బీజేపీలో చేరుతున్నానని గంగోపాధ్యాయ మార్చి 7న తేల్చి చెప్పారు. ఆయన టీఎంసీ మీద గట్టి ఆరోపణలే చేశారు. నేను ఏ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలో త్వరలోనే పార్టీ తెలియ చేస్తుందని కూడా ఆయన వెల్లడించారు. న్యాయ మూర్తిపై దాడికి దిగడం దారుణమని ఆయన టీఎంసీని విమర్శించారు. ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రతి సందర్భంలోను తన మీద దాడికి దిగారని కూడా ఆరోపించారు. ఒక న్యాయమూర్తి గురించి అలాంటి విషయాలు మాట్లాకూడదని కూడా వాళ్లకి తెలియదని అన్నారు. వాళ్ల అక్రమాలు వరసగా బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆ పార్టీ న్యాయమూర్తి మీద దాడికి దిగడం ఒక ఫ్యాషన్‌గా మార్చుకుందని గంగోపాధ్యాయ అన్నారు. ఆ పార్టీ లోపల లోపలే కునారిల్లిపోతున్నదని, అది ఎక్కువ కాలం మనుగడ సాగించలేదని కూడా ఆయన జోస్యం చెప్పారు.

సందేశ్‌ఖాలీ ఘోరకలి నేపథ్యంలో కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ‌టీఎస్‌ ‌శివజ్ఞానం చేసిన వ్యాఖ్యలు గమనించాలి. ఆ ఉదంతంలో ప్రధాన నిందితుడు షాజహాన్‌ అరెస్టయి నప్పుడు, అతడి న్యాయవాదితో జస్టిస్‌ ‌శివజ్ఞానం అన్నమాటలు నిజానికి టీఎంసీ ప్రభుత్వ అరాచకానికి నిజంగా అద్దం పట్టేవే. షాజహాన్‌ ‌మీకు పదేళ్ల పాటు ఊపిరిసలపనంత పని ఇస్తాడు అన్నారు న్యాయ వాదితో జస్టిస్‌ ‌శివజ్ఞానం. కాబట్టి ప్రధాన న్యాయమూర్తి మీద కూడా టీఎంసీ కక్ష కట్టడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు.

-జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
Instagram