మార్చి 25 హోలీ

-డా।। ఆరవల్లి జగన్నాథస్వామి

దుష్టశక్తులపై సాధించిన విజయాలకు సంకేతంగా హోలీ పండుగను జరుపుకుంటారు. ఫాల్గుణ, చైత్ర మాసాల సంధికాలంలో వచ్చే ఈ పండుగ గురించి భవిష్య, నారద పురాణాలతో పాటు గాథాసప్తశతి, మాళవికాగ్నిమిత్రం, నాగావళి లాంటి గ్రంథాలు పేర్కొన్నాయి.దుష్ట సంహారం,వసంత రుతువు ఆగమనం నేపథ్యంలో ఆనంద చిహ్నంగా రంగులుచల్లుకుంటూ, మధుర పదార్థాలు పంచుకొంటూ ఆరగిస్తుంటారు ఫాల్గుణ పూర్ణిమ నాటి ఈ పండుగను వసంతోత్సవం, కాముడిపున్నమి, మదనోత్సవంగా ప్రాచీన గ్రంథాలు పేర్కొంటున్నాయి. వేదకాలంలో ఉగాది ఈ పున్నమి నాడే ప్రారంభమయ్యేదని చెబుతారు. అప్పట్లో నాలుగు మాసాలను ఒక రుతువుగా పరిగణించేవారట. ఆ నాలుగు నెలలను చాతుర్మాస్యం అంటారు అలాంటి మూడు మాసాలలో మొదటిది ఫాల్గుణ పున్నమి అని పెద్దలు చెబుతారు. ఇది హిందువుల పండగే అయినా సర్వ మతస్థులు ఉత్సాహంగా పాల్గొంటారు. పంజాబ్‌లో హిందువులు, సిక్కులు కలిసిపోయి హోలీ ఆడతారు.

హోలీ పండుగను యుగయుగాలుగా జరుపుకుంటున్నట్లు ‘ధర్మసింధువు’లాంటి స్మృతి గ్రంథాలు చెబుతున్నాయి. తూర్పు, ఉత్తర భారత ప్రాంతాలలో ఈ రోజే వసంత రుతువు మొదలవు తుంది. వసంత రుతువు ఆగమనానికి సంకేతం హోలీ పున్నమి. రాలే ఆకులు రాలుతూ, వచ్చే ఆకులు వచ్చే వేళ, ప్రకృతిలో వ్యక్తమయ్యే నవచైతన్యానికి సంకేతంగా ఈ పండుగను భావిస్తారు. ఆధునిక కాలంలో సామాజిక సమైక్యత, సమష్టి భావనకు ప్రతీకగా నిలిచినట్లే, ఈ పండుగకు పురాణ నేపథ్యమూ ఉంది. ముఖ్యంగా, ప్రహ్లాద చరిత్ర, పూతన వధ, కాముని దహనం ఈ పండుగతో ముడిపడి ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి. హోలీ గురించి అనేక గాథలు ప్రచారంలో ఉన్నాయి. ము్య•ంగా దీని నేపథ్యాన్ని పరిశీలిస్తే శ్రీకృష్ణుడి ప్రస్తావన కనిపిస్తుంది. ఆయన గోపీగోపికలతో ఈ పండుగ ఆడాడని పురాణోక్తి. ఆయన పూతనను చంపిన సందర్భాన్ని పురస్కరించుకొని జరుపుకునే ఉత్సవంగా చెబుతారు. రక్కసి గండం నుంచి బయటపడిన ఆయనను వ్రేపల్లె మహిళలు ఊయలలో వేసి వేడుక జరుపుకోవడంతో ‘డోలోత్సవం’ అనే పేరు వచ్చిందని చెబుతారు. నాటి నుంచి ఆయనకు ఈ ఉత్సవం నిర్వహించి, బొబ్బట్లు నివేదిస్తారు. శ్రీకృష్ణుడితో ముడిపడిన మరో కథ ప్రకారం, ‘రాధ అంత తెల్లగా ఉంటే, తాను ఇంత నల్లగా ఎందుకున్నాను’ అని తల్లి యశోద వద్ద మారాం చేయగా, దాంతో ఆమె రాధ ముఖానికి రంగు పులిమి తనయుడిని ఓదార్చిందిదట ఆ కథనం ప్రకారమే, కృష్ణుడు పుట్టి పెరిగిన మథుర, బృందావనంలో ఈ పండుగను పదహారు రోజుల పాటు జరుపు కుంటారు. అయిదవ నాడు అంటే ఫాల్గుణ బహుళ పంచమి నాడు ఈ పండుగ ముగింపు సూచనగా రంగులతో ‘రంగ పంచమి’ని ఘనంగా నిర్వహిస్తారు. శ్రీకృష్ణుడు మేధాసురుడు అనే రాక్షసుని సంహరించినందుకు గుర్తుగా బెంగాల్‌లో ఈ పండుగను పాటిస్తారు. పెద్ద గడ్డిబొమ్యను తయారుచేసి దహనం చేస్తారు. దీనికి దక్షిణ భారత్‌లోని కామదహన గాథ తరహాలో పోలికలు ఉంటాయి.మహారాష్ట్ర, కర్ణాటకలో భక్ష్యాలను (పోలీలు) హోలికాగ్నిలో వేసే ఆచారం ఉంది.

శ్రీకృష్ణుడు అనుసరించిన ఈ పండుగ అంతరార్థాన్ని ఆధ్యాత్మిక పరంగా విశ్లేషిస్తే.. జ్ఞానరూమమనే గులాంలతో, విజ్ఞాన (యోగ) రూపమనే కుంకుమ రంగులతో భక్తుల మనస్సులను శుద్ధి పరచి, పవిత్రులుగా చేసే యోచనతోనే ఆయన హోలీ ఆడడాని అంటారు. హస్తిన ధర్మరాజు ఏలుబడిలో ఉన్న కాలంలో ప్లేగు వ్యాధి సంభ వించగా, అందుకు కారణం అడిగిన ధర్మజునితో శ్రీకృష్ణుడు, ‘ఇది హోలిక అనే బ్రహ్మ రాక్షసి చర్య. అది నిద్రిస్తున్న ప్రజలను పొట్టన పెట్టుకుంటుంది’ అంటూ దానిని ఎదుర్కొనేందుకు కొన్ని పక్రియలు ఉపదేశించాడట. హోలీ మంటలు వేసుకోవడం అందులో ఒకటి.        ప్రహ్లాద చరిత్ర ప్రకారం, శ్రీ మహా విష్ణువుకు ఆగర్భ శత్రువైన హిరణ్య కశిపుడు, తన కుమారుడి విష్ణుభక్తిని సహించలేడు. కుమారుడిని హరి నామ స్మరణ నుంచి మళ్లించేందుకు నయనాభయానా చెప్పి చూశాడు. కఠిన దండనలు విధించాడు. కడుపుతీపిని పక్కనపెట్టి, అనుచరులతో చంపించేందుకూ యత్నించాడు. అందులో భాగంగానే తన సోదరి హోలిక ఒడిలో ప్రహ్లాదుని కూర్చోపెట్టి నిప్పు అంటించారు. హోళిక కాలి బూడిదకాగా బాల ప్రహ్లాదుడు భగవత్సహాయంతో సజీవంగా ఉన్నాడు. ఈ సంఘటన ఫాల్ణుణ పూర్ణిమ నాడే జరిగింది. అలా ప్రహ్లాదుడు తనకు ఎదురైన ఎన్నో అవంతరాలను అధిగమించి, ముక్తి సోపాన మార్గంలో పురోగమించి లక్ష్య సిద్ధిని పొందాడు. హోలిక దహనమైన ఫాల్గుణ పౌర్ణమినే ‘ప్రహ్లాద పౌర్ణమి’ అంటారు. రాక్షసి పీడ వదలినందుకు సంతోషంతో ప్రజలు రంగునీళ్లు (వసంతాలు) చిమ్ముకుంటూ వేడుక జరుపుకున్నారట. కృతయుగంలో ‘దుందు’ అనే రాక్షసి అంతం కావడంతో ప్రజలు ఆనందంగా పండుగ జరుపు కున్నారని, అది ఆనవాయితీగా మారిందని ‘చండీతంత్రం’ పేర్కొంటోంది.

లోకకంటకుడు తారకాసుర వధకు కుమార స్వామి జననం అనివార్యం (శివుడిని తపస్సుతో మెప్పించిన ఆ దానవుడు శివ తనయుడి వల్ల తప్ప ఇతరుల చేతిలో మరణం లేనట్లు వరం పొందాడు). అందుకు తపస్సులో ఉన్న శివుడిని చలింపచేయాలి. దానికి బ్రహ్మదేవుడు, సోదరతుల్యుడు మన్మథుని నియోగించాడు. మదనుడి చేష్టలకు ఆగ్రహించిన ముక్కంటి ఫానేత్రం తెరవడంతో అతను బుగ్గి అయ్యాడు. పతి ప్రాణభిక్ష కోసం రతిదేవి విలపించగా, పునర్జీవితుడి చేశాడు శివుడు. అయితే అతను రతిదేవికి మాత్రమే కనిపిస్తూ, లోకుల హృదయాలలో ఉంటాడని వరమిచ్చాడు. ఈ సంఘటన ఫాల్గుణ పౌర్ణిమ నాడు జరిగింది కనుక ‘కాముని పున్నమి’; ‘కామదహనోత్సం’గా ప్రాచుర్యం లోకి వచ్చింది. కాముని పున్నమి నాడు తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో పశువుల కాపరులు తమలో ఒకరికి ఎలుగుబంటి వేషం వేసి ఇళ్ల ముందు ఆడిస్తూ పాటలతో భిక్షాటన చేసేవారని తెలుస్తోంది. తమిళులు ఈ పండుగను ‘కామక్‌ ‌పండగై’ అని, కన్నడిగులు ‘కామనహబ్బు’ అని వ్యవహరిస్తారు.

మన్మథునికి అనంగుడు (శరీరంలేనివాడు) అనీ మరోపేరు. ఆ రోజున కొన్ని ప్రాంతాలలో ‘అనంగ వ్రతం’ జరుపుకుంటారు. మీనాక్షీదేవి ఘోరతపస్సు చేసి సుందరేశ్వరుడిని పరిణయ మాడిందీ ఫాల్గుణ పౌర్ణమి నాడే. దీనిని ‘కల్యాణ పౌర్ణమి’గా వ్యవహరిస్తారు. ఆ రోజున ఆదిదంపతులకు పూజాదికాలు నిర్వహించి ‘హోలికా మిశ్రమం’ (మామిటిపూత, వేపచిగుళ్లు, తేనె మిశ్రమం) నైవేద్యంగా సమర్పిస్తారు. పొలాల్లోని ధాన్యం, దినుసులను సేకరించి, వాటికి ఆవుపాలు జోడించి పాయసం తయారు చేస్తారు.

పండుగ నాటి వరకు మనోవైషమ్యాలు ఉన్నా, ఆ రోజు పరస్పరం రంగులు చల్లుకుంటూ ‘గతం గతః’ అనేలా మరచిపోవాలన్నది మరో అంతరార్థం. ఈ రంగుల పండుగా అంతర్జాతీయంగా వర్ణాలు విరజిమ్ముతోంది. అమెరికా, బ్రిటన్‌, ‌కెనడా తదితర దేశాలలోని ప్రవాస భారతీయులతో పాటు ఆయా దేశస్థులను రంగులు చిమ్ముకునే పండుగ అలరిస్తోంది. ముఖ్యంగా దేవవిదేశాలలోని ఆలయాల వద్ద ఈ పండుగను ఘనంగా నిర్వహిస్తారు.

హోలీ నాడు జనావాస కూడళ్లలో పెద్ద మంటలు (భోగి మంటల మాదిరి) వేసి అగ్నికి ప్రదక్షిణ చేసి ఆ భస్మాన్ని నుదుటన ధరిస్తారు. కొన్ని ప్రాంతాలలో దీనిని ‘ధూళి వందన్‌’‌గా వ్యవహరిస్తూ, దీనివల్ల ప్రతికూలశక్తులు దూరమై, సానుకూల శక్తులు సమకూరుతాయిని విశ్వాసం. జ్ఞానవిజ్ఞాన రూపములనే రంగులు మోక్షసాధనకు చక్కని మార్గాలు అని శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశించాడు. గీతాజ్ఞానమనే రంగులలో మానవులు తమ ఆత్మలను పరమాత్మంలో విలీనానికి ప్రయత్నించాలని ఆధ్యాత్మిక•వేత్తలు చెబుతారు… కానీ వర్తమానంలో అలాంటి ఆధ్యాత్మక కోణానికి భిన్నంగా, కేవలం వేడుక కోసమే ఈ పండుగను జరుపుకుంటున్నారనే వ్యాఖ్యానాలు ఉన్నాయి. రంగులు చల్లుకోవడం, మద్యపానం, వేళాకోళాలు శ్రుతిమించి మాటలు ముదరడం, ఒక్కొక్కసారికి అవి ఘర్షణకు దారి తీసే సంఘటనల గురించి అక్కడక్కడ వింటూనే ఉన్నాం.

ఇక రుతువు మారే క్రమంలో చిన్నపాటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండేలా ఈ రంగులు దోహదపడతాయని పూర్వికులు భావించేవారు. అందుకు తగినట్లే సంప్రదాయబద్ధంగా వేపగింజలు, కుంకుమ, పసుపు తదితర ప్రకృతి సిద్ధ, ఆయుర్వేద పదార్థాలతో రంగులు తయారు చేసేవారు. కాలక్ర మంలో వాటి స్థానంలో పూర్తిగా రసాయనాలతో నిండిన రంగులు వాడకంలోకి వచ్చాయి. వీటిని చల్లుకోవడంలో ఆనందం, వినోదం మాట ఎలా ఉన్నా ఆరోగ్యపరంగా నష్టం వాటిల్లుతోందని. వాతావరణం కలుషితమవుతోందని నిపుణులు అంటున్నారు. ఈ రంగులలోని రసాయనాల కారణంగా చర్మవ్యాధులు, అంధత్వం, మూత్ర పిండాల వ్యాధులు సంక్రమించే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సంప్రదాయకంగా వస్తున్న పండుగలను జరుపుకో వలసిందే. అదే సమయంలో పూర్వీకులు రూపొందించిన నియమాలను పాటించడం ద్వారా ఆరోగ్యాలను, పర్యావరణాన్ని కాపాడిన వారమవుతాం.

About Author

By editor

Twitter
Instagram