తెలంగాణ గ్రామ పంచాయతీల్లో మరోసారి ప్రత్యేక పాలన మొదలయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా 12వేల 769 గ్రామ పంచాయ తీల సర్పంచుల పదవీకాలం ఫిబ్రవరి 1వ తేదీన ముగిసిపోయింది. దీంతో పాలనా బాధ్యతలు అధికారులకు బదిలీ అయ్యాయి. దీంతో, ప్రత్యేక అధికారులు నియమితు లయ్యారు. ఈ నేపథ్యంలోనే సెలవుల్లో ఉన్న పంచాయతీ రాజ్‌ ‌శాఖ సిబ్బంది అందరూ తక్షణమే విధుల్లో చేరాలని నాలుగురోజుల ముందే ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జెడ్పీ సీఈఓలు, డీపీవో లకు సంకేతాలు ఇచ్చింది. మరోవైపు.. పెండింగ్‌లో ఉన్న బిల్లుల పరిస్థితిపై సర్పంచ్‌లలో ఆందోళన నెలకొంది.

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఇప్పట్లో సాధ్యపడదని ప్రభుత్వం భావించింది. రాష్ట్రంలో అధికార బదలాయింపు జరిగి రెండు నెలలు కూడా పూర్తి కాకపోవడం, గత బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలు, అస్తవ్యస్త పాలన కారణంగా దెబ్బతిన్న వ్యవస్థను గాడిలో పెట్టేందుకు సమయం పట్టే అవకాశం ఉన్నందున, ప్రస్తుత కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం గ్రామ పంచాయతీల ఎన్నికలను పక్కనబెట్టింది. కనీసం అటువైపు ఆలోచించనూలేదు. అందుకే గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన అనివార్యంగా మారింది.

పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించాలన్న ప్రభుత్వం నిర్ణయం మేరకు, కలెక్టర్లు ప్రభుత్వానికి అధికారుల జాబితాలను పంపించారు. ప్రతిపాదిత ప్రత్యేకాధికారుల జాబితాను పరిశీలించిన ప్రభుత్వం.. అధికారిక ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగానే రాష్ట్ర పంచాయతీరాజ్‌ ‌శాఖ ఉన్నతాధికారి ముందుగానే జిల్లా పరిషత్‌ ‌సీఈవోలు, జిల్లా పంచాయతీ అధికారులకు సూచనలు చేశారు. సిద్ధం చేసిన జాబితా ప్రకారం పంచాయతీల వారీగా నియామకం, నిబంధనలకు తగినవిధంగా లేనివారి స్థానంలో మరొకరిని నియమించడం వంటి వాటిపై ముందు గానే చర్చించి నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ప్రత్యేకాధికారులంతా మండల స్థాయి వాళ్లే కావడంతో.. బాధ్యతలు చేపట్టిన వెంటనే.. సంబంధిత ఫైళ్లు అన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ప్రత్యేక పాలన సమయంలో జిల్లా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని, సంబంధిత అధికారులు గ్రామాల పర్యవేక్షణపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టేలా చర్యలు తీసుకోవాలని డీపీవోలు, సీఈవోలను రాష్ట్ర ఉన్నతాధికారి ఆదేశిం చారు. అవసరమైన మార్గదర్శకాలు జారీచేశారు.

సర్పంచ్‌ల పదవీకాలం పూర్తి కావడంతో.. పాలనా వ్యవస్థ స్తంభించకుండా ఉండేందుకు.. ఈ ప్రత్యేకాధికారులను నియమించారు. ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఉప తహసీల్దార్లు, పంచాయతీరాజ్‌ అసిస్టెంట్‌ ఇం‌జనీర్లు, గ్రామీణ నీటి సరఫరా విభాగం అసిస్టెంట్‌ ఇం‌జనీర్లు, ఐసీడీఎస్‌ ‌సూపర్‌వైజర్లు, మండల విద్యాధికారులు, వ్యవసాయ, వెటర్నరీ, ఉద్యానవన శాఖ అధికారులు, ఆరోగ్యశాఖ సూపర్‌ ‌వైజర్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, మండల పరిషత్‌ ‌సూపరిం టెండెంట్లు, సీనియర్‌ అసిస్టెంట్లు, జూనియర్‌ అసిస్టెంట్లు, వ్యవసాయ విస్తరణ అధికారులు, టైపిస్టులు, గెజిటెడ్‌ ‌హెడ్మాస్టర్లు, స్కూల్‌ అసిస్టెంట్‌ ‌టీచర్లను ప్రత్యేకాధికారులుగా నియ మించారు. కొన్ని మండలాలు చిన్నవి కావడంతో.. పంచాయతీల సంఖ్యను బట్టి ఇతర శాఖల అధికారులసేవలను కూడా వినియోగించు కుంటున్నారు.

అయితే, ఈ పరిణామాలపై సర్పంచ్‌లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే.. రాష్ట్ర వ్యాప్తంగా భారీ మొత్తంలో గ్రామ పంచాయతీలకు సంబంధించిన బిల్లులు బకాయిలు పేరుకు పోయాయి. ఆ అభివృద్ధి పనులన్నింటినీ సర్పంచ్‌లే చేయించారు. సాధారణంగా గ్రామీణ స్థాయిలో మెజారిటీ స్థాయి సర్పంచ్‌లు మధ్యతరగతికి చెందిన వాళ్లే ఉండటంతో పాటు.. ఆర్థికంగా అంత ఉన్నత స్థితిలో లేని వాళ్లే ఎక్కువగా ఉండటంతో.. చాలా మంది తమ గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులకోసం పెద్దమొత్తంలో అప్పుడు చేసి పనులు చేయించారు. వాటికి సంబంధించి ఒక్కొక్కరికీ లక్షల రూపాయల్లో బిల్లులు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. సగటున ఒక్కో సర్పంచ్‌కు 3లక్షల రూపాయల నుంచి 20 లక్షల రూపాయల దాకా బిల్లులు పేరుకుపోయాయని చెబుతున్నారు.

కాగా, తమ పదవీ కాలాన్ని పొడిగించాలని సర్పంచ్‌ల నుంచి డిమాండ్‌లు వచ్చాయి. ప్రత్యేక అధికారులను నియమించే బదులు.. ఇప్పటిదాకా పాలన సాగించిన సర్పంచ్‌ల పదవీకాలాన్నే తదుపరి ఎన్నికలు జరిగేదాకా పొడిగిస్తే బాగుంటుందన్న ప్రతిపాదనలు చేశారు. అంతేకాదు.. గత బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వహయాంలో పేరుకుపోయిన పెండింగ్‌ ‌బిల్లులను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్‌ ‌చేశారు. లేదంటే గ్రామ పంచాయతీలకు తాళాలు వేసి నిరాహార దీక్షలు చేస్తామని సర్పంచ్‌లు హెచ్చరించారు. అంతేకాదు.. తమ బకాయిలు చెల్లిస్తేనే కాంగ్రెస్‌పార్టీకి మద్దతు ఇస్తామని తెలంగాణ సర్పంచ్‌ల సంఘం ప్రకటిం చింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీలకు 1,200 కోట్ల రూపాయల బకాయిలు రావాల్సి ఉందని, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు 30 నెలలుగా నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, లేకపోతే పంచాయతీలకు తాళాలు వేసి రిలే నిరాహార దీక్షలు చేస్తామని హెచ్చరించారు. సర్పంచ్‌లు అప్పులు చేసి గ్రామాలను అభివృద్ధి చేశారని, నిధులు విడుదల కాకపోవడం వల్ల కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరిస్తే వచ్చే లోక్‌ ‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అండగా ఉంటామని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ ‌ప్రభుత్వం సర్పంచ్‌లను పట్టించుకోలేదని ఆరోపించారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వమైనా సర్పంచ్‌లకు న్యాయం చేయాలని తెలంగాణ సర్పంచ్‌ల సంఘం బాధ్యులు కోరారు. అంతేకాదు.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సర్పంచ్‌ల సంఘం నేతలు స్వయంగా కలిసి తమ పదవీకాలాన్ని పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. రైతు వేదికలు, క్రీడా ప్రాంగణాలు, వైకుంఠధామాలు, గ్రామ పంచాయతీల భవనాలు, సీసీరోడ్డు, బీటీరోడ్ల నిర్మాణాలకు సంబంధించి 1200 కోట్ల రూపాయల నిధులు పెండింగ్‌లో ఉన్నాయని.. వాటిని వెంటనే విడుదల చేయించాలని కోరారు. ప్రత్యేక అధికారు లను నియమించినప్పటికీ.. తమను కూడా విధులకు హాజరయ్యేలా చూడాలని ముఖ్యమంత్రిని కోరారు. ఈమేరకు వినతిపత్రం సమర్పించారు.

– సుజాత గోపగోని

About Author

By editor

Twitter
Instagram