ఒకప్పటి బెలూచిస్తాన్‌ ‌ప్రాంతానికి పూర్తి స్వాతంత్య్రం కావాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న మూడు తీవ్రవాద గ్రూపుల కార్యకలాపాలు ఇప్పుడు ఇరాన్‌, ‌పాకిస్తాన్‌ల మధ్య ఘర్షణకు దారితీశాయనేది వర్తమాన చరిత్ర చెబుతున్న సత్యం. ఎందుకంటే పూర్వం పశ్చిమ, దక్షిణాసియాలో విస్తరించిన బెలూచిస్తాన్‌ ‌ప్రాంతం మూడుగా చీలిపోయి పాకిస్తాన్‌, ఇరాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌ ‌దేశాల్లో భాగంగా కొనసాగుతోంది. పాకిస్తాన్‌ అధీనంలోని ప్రాంతాన్ని బెలూచిస్తాన్‌ అని, ఇరాన్‌లో ఉన్న భాగాన్ని సిస్తాన్‌, ‌బెలూచిస్తాన్‌ అని, ఆఫ్ఘనిస్తాన్‌లోని భాగాన్ని దక్షిణ ప్రాంతమని వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఇరాన్‌, ‌పాకిస్తాన్‌లలోని బెలూచిస్తాన్‌ ‌ప్రాంతంలో జైష్‌ అల్‌ ఆదిల్‌, ‌బెలూచిస్తాన్‌ ‌లిబరేషన్‌ ‌ఫ్రంట్‌ (‌బీఎల్‌ఎఫ్‌), ‌బెలూచిస్తాన్‌ ‌లిబరేషన్‌ ఆర్మీ (బీఎల్‌ఏ)అనే మూడు తీవ్రవాద గ్రూపులు ఈ రెండు దేశాల ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాయి. వీటి లక్ష్యం ఒక్కటే… బెలూచి స్తాన్‌కు స్వాతంత్య్రం సాధించడం. అయితే ఈ గ్రూపుల మధ్య ప్రధానంగా కొన్ని తేడాలున్నాయి. బీఎల్‌ఏ, ‌బీఎల్‌ఎఫ్‌లకు తమ లక్ష్యం విషయంలో విస్తృతమైన అవగాహన ఉండగా, జైష్‌ అల్‌ ఆదిల్‌ ఒక సున్నీ సలాఫీ జిహాదీ గ్రూపు. 2012లో ఆవిర్భవించిన దీని ప్రధాన లక్ష్యం బెలూచిస్తాన్‌ ‌స్వాతంత్య్రంతో పాటు, ఇరాన్‌ ‌ప్రభుత్వాన్ని పడగొట్టడం. ఇది ఆగ్నేయ ఇరాన్‌, ‌పాక్‌ ‌పశ్చిమ ప్రాంత ప్రావెన్స్ ‌బెలూచిస్తాన్‌లో తన కార్యకలాపాలను నిర్వహిస్తున్నది. 2013 నుంచి ఈ గ్రూపు తన సరిహద్దు భద్రతాదళంపై దాడులు కొనసాగిస్తుండటంతో ఇరాన్‌ ఈ ‌సంస్థను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది.

ఇక బెలూచ్‌ ‌లిబరేషన్‌ ‌ఫ్రంట్‌ ‌పాకిస్తాన్‌ ‌పశ్చిమ ప్రాంతానికి చెందిన బెలూచిస్తాన్‌ ‌విముక్తిని కోరుతూ పోరాడుతోంది. ఈ సంస్థకు చెందిన ఉగ్రవాదులు ఇరాన్‌ ‌నుంచి పాకిస్తాన్‌లోని కొన్ని ప్రాంతాలపై దాడులు చేస్తుంటారు. బెలూచ్‌ ‌మిలిటెంట్లు, తెహ్రిక్‌ ఇ ‌పాకిస్తాన్‌ ఉ‌గ్రవాద సంస్థలో కలిసి పాక్‌లో ఎన్నో దాడులకు పాల్పడ్డారు. తెహ్రిక్‌ ఇ ‌పాకిస్తాన్‌ ‌సంస్థ ప్రధాన లక్ష్యం పాక్‌ ‌ప్రభుత్వాన్ని పడగొట్టడం. మొత్తంమీద దశాబ్దకాలంగా ఇరాన్‌-‌పాక్‌ల మధ్య ఈ ఉగ్రవాదుల వల్ల సంఘర్షణలు చోటుచేసుకుంటు న్నాయి. వీటికి తోడు రెండు దేశాల మధ్య సరిహద్దు పటిష్టంగా లేకపోవడంతో మత్తుమందుల రవాణాతో పాటు వివిధ ఉగ్రవాద సంస్థలకు చెందిన తీవ్ర వాదులు ఈ ప్రాంతంలో యదేచ్ఛగా సంచరిస్తుండటం మరో సమస్య. జైష్‌ అల్‌ అదల్‌ ‌సంస్థ ఇరాన్‌కు వ్యతిరేకంగా పనిచేసే సంస్థ కాగా జెండల పేరుతో పనిచేసే మరో గ్రూపు ఇరాన్‌ ‌ప్రభుత్వంపై హింసాత్మక దాడులకు పాల్పడుతోంది. 2003లో ఇరాన్‌ ‌మాజీ అధ్యక్షుడు మహమ్మద్‌ అహమెదినెజాద్‌పై హత్యాయత్నం చేసిన చరిత్ర దీనిది. కాగా జైష్‌ అల్‌ అదల్‌ ‌సంస్థ దక్షిణ సిస్తాన్‌- ‌బెలూచిస్తాన్‌ ‌ప్రావెన్స్‌లో తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. గత డిసెంబర్‌లో ఇరాన్‌లోని రస్క్ ‌పట్టణ పోలీస్‌స్టేషన్‌పై దాడిచేసి 11 మంది పోలీసులను హతమార్చింది. ఇందుకు ప్రతిగా పాకిస్తాన్‌, ఇరాన్‌లో పనిచేస్తున్న బెలూచిస్తాన్‌ ‌లిబరేషన్‌ ఆర్మీ, బెలూచిస్తాన్‌ ‌లిబరేషన్‌ ‌ఫ్రంట్‌ ‌గ్రూపులే లక్ష్యంగా దాడులు చేసింది. ఇరాన్‌లోని రెండు బెలూచ్‌ ‌తెగలకు చెందిన ఉగ్రవాదులు తమకు వ్యతిరేకంగా దాడులకు పాల్పడుతున్నారని పాక్‌ ఆరోపిస్తుండగా, పాకిస్తాన్‌లో పనిచేస్తున్న జైష్‌ అల్‌ అదల్‌ ‌గ్రూపు తమ దేశంలో ఉగ్రవాద దాడులకు పాల్పడుతోందని ఇరాన్‌ ‌పేర్కొంటున్నది.

పాక్‌ ‌స్పందనలో విరోధాభాస

 ‘‘మార్గ్ ‌బార్‌ ‌సర్‌మచార్‌’’ ‌పేరుతో ఇరాన్‌లోని సెయిస్తాన్‌ ఒ ‌బెలుచిస్తాన్‌ ‌ప్రాంతంలో ఉగ్రవాదుల స్థావరాలపై క్షిపణుల దాడులు నిర్వహించినట్టు జనవరి 18న పాక్‌ ‌విదేశాంగశాఖ ఒక ప్రకటనలో వివరించింది. ఈ దాడుల్లో చాలామంది మిలిటెంట్లు హతమయ్యారని ఒకపక్క వివరిస్తూనే తమదేశ ప్రజలు ఎప్పుడూ ఇరాన్‌ ‌ప్రజలను సోదరులుగా పరిగణిస్తారని, వారిపై తమకు అపరిమితమైన గౌరవం ఉందని, ఉగ్రవాదం విసురుతున్న సవాళ్లను ఎదుర్కొనడానికి పరస్పర చర్చలే ఉత్తమ మార్గమనేది తమ ప్రగాఢవిశ్వాసమని పేర్కొనడం ఈ విరోధాభాసకు ఉదాహరణ. అయితే ఇరాన్‌పై చర్యకు ప్రతిచర్య తీసుకోవడంలో పాకిస్తాన్‌ ‌కొంచెం ఆలస్యం చేసిందనే చెప్పాలి. పాక్‌ ‌సైన్యం, పాలకవర్గాల్లో నెలకొన్న సందిగ్ధతే ఇందుకు ప్రధాన కారణం. చివరకు దాడులు చేయాలనే నిర్ణయం తీసుకొని అమలుపరచినా, ప్రస్తుతం ప్రజల్లో పలుకుబడి దారుణంగా పడిపోయిన పాక్‌ ‌సైన్యం పరువు తిరిగి నిలబడింది కూడా ఏమీలేదు. ముఖ్యంగా విపక్షనేత ఇమ్రాన్‌ఖాన్‌ ‌పట్ల సైన్యం వ్యవహరిస్తున్న తీరుపై పాక్‌ ‌ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాల్లో ఎటువంటి మార్పు లేదు.

జనవరి 16న ఇరాన్‌, ‌ప్రిసిషన్‌ ‌మిస్సైల్స్, ‌డ్రోన్లతో జైష్‌ అల్‌ అదల్‌కు చెందిన ప్రధాన కేంద్రాలను ధ్వంసం చేసేందుకు దాడులు నిర్వహించింది. ‘తమ దేశ సార్వభౌమత్వంపై జరిపిన దాడులుగా పేర్కొంటూ ఇదెంతమాత్రం సహించ రానిదని’ పాకిస్తాన్‌ ‌తీవ్రంగా ప్రతి స్పందించింది. తర్వాత జనవరి 17న ఇరాన్‌ ‌రాయబారిని బహిష్కరించి, ఇరాన్‌లోని తమ రాయబారిని వెనక్కి పిలిచింది. ఈ దాడులు ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపినప్పటికీ, సంఘటనను మరింత జటిలం చేయకూడదని, ఇంతటితో దీనికి స్వస్తి పలకాలని రెండు దేశాలు నిర్ణయించడం విశేషం. మొత్తంమీద ఇరాన్‌ ‌దాడిపై పాక్‌ ‌స్పందన ఒకపక్క ఆగ్రహం మరోపక్క వదులుకోలేని స్నేహం అన్న చందాన పరస్పర విరోధాభాసను తలపించింది.

సందిగ్ధ స్పందన

ఇరాన్‌-‌పాకిస్తాన్‌ల మధ్య నెలకొన్న సంఘర్షణ నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం స్పందన గందరగోళంగా, సందిగ్ధంగా ఉండటం గమనార్హం. ఎందుకంటే ఈ ప్రాంతంలోని ఉగ్రవాద గ్రూపుల విషయంలో అంతర్జాతీయ సమాజానికి అంతగా అవగాహన లేకపోవడం, బెలూచ్‌ ‌తీవ్రవాదులు, జెండుల్లా, జైష్‌ అల్‌ అదల్‌ ‌గ్రూపులపై ఎవరికీ ఎక్కువగా తెలియకపోవడం ఇందుకు కారణం. దీనికి తోడు అంతర్జాతీయ సమాజానికి ఈ సంఘర్షణ విషయంలో తగిన రీతిలో స్పందించడానికి అవకాశాలు పరిమితం కావడం కూడా ఒక కారణం.

ప్రాంతీయానికే పరిమితం

గతంలో కూడా ఇరాన్‌-‌పాక్‌ల మధ్య ఇటువంటి సంఘర్షణలు చోటుచేసు కున్నా, ఈ తరహా పరిణామాలకు దారితీయలేదు. కానీ గాజాపై ఇజ్రాయిల్‌ ‌జరుపుతున్న యుద్ధం, ఎర్ర సముద్రం వద్ద యుఎస్‌-‌యెమన్‌ ‌తీవ్రవాదుల మధ్య కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ రెండు దేశాల మధ్య పరస్పర దాడులు కొనసాగడం, ఘర్షణలు విస్తరిస్తాయన్న భయాందోళనలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం రెండు దేశాలు వెనక్కి తగ్గాలని నిర్ణయించుకున్నప్పటికీ, మధ్యప్రాచ్యంలో ఇరాన్‌ ‌ప్రాక్సీ గ్రూపులు యుద్ధాల్లో పాల్గొంటున్న నేపథ్యంలో ఇదెంతవరకు నిలుస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లెబనాన్‌లోని హిజ్‌బుల్లాతో, గాజాలోని హమాస్‌తో ఇరాన్‌కు సంబంధాలున్నాయి. ఈ రెండు గ్రూపులు ఇజ్రాయిల్‌తో పోరాడు తున్నాయి. ఇదిలావుండగా యెమెన్‌లోని హౌతీలకు ఇరాన్‌ ‌మద్దతు ప్రకటించింది. ప్రస్తుతం ఈ గ్రూపు ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులు జరుపుతోంది. ఇరాక్‌, ‌సిరియా ల్లోని చిన్నాచితకా ఉగ్ర గ్రూపులకు ఇరాన్‌ ‌మద్దతిస్తోంది. ప్రస్తుతం ఇవి, ఐఎస్‌ఐఎస్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న యుఎస్‌ ‌సంకీర్ణాలపై దాడులు చేస్తున్నాయి. ఇరాక్‌, ‌సిరియాలతో పాటు పాకిస్తాన్‌పై కూడా ఇరాన్‌ ‌దాడులకు పాల్పడటం కేవలం తన పోరాట సామర్థ్యాన్ని ప్రపంచానికి వెల్లడించడానికేనన్న అభిప్రాయాలు వ్యక్తం కావడం మరో కోణం! ఈ పరిణామాల నేపథ్యంలో ఈ పరస్పర దాడులు ఆందోళన కలిగించినప్పటికీ, ఇవి ప్రాంతీయానికే పరిమితమన్నది సుస్పష్టం. ఎందుకంటే ఇరాన్‌, ‌పాకిస్తాన్‌ ‌రెండు దేశాలు ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. అంతర్గతంగా రాజకీయ సమస్యలతో పీకల్లోతు కూరుకుపోయాయి. త్వరలో పాక్‌లో ఎన్నికలు జరుగబోతున్న తరుణంలో దేశం తీవ్ర అస్థిర పరిస్థితులను ఎదుర్కొంటున్నది. ఇదిలావుండగా జనవరి 16న ఇరాన్‌ ‌చేసిన దాడి పాకిస్తాన్‌ను ఆశ్చర్యపరచిందన్నది మాత్రం నిజం.

ఇరాన్‌ ‌భద్రతకు ముప్పు

ఇరాన్‌ ‌కేవలం పాకిస్తాన్‌పై మాత్రమే కాదు, ఇరాక్‌, ‌సిరియాలపై కూడా దాడులు చేసింది. పాక్‌లో జైష్‌ అల్‌ అదల్‌పై, సిరియాలో ఐఎస్‌ఐఎస్‌ అనుబంధ సంస్థలపై, ఇరాక్‌లో మొసాద్‌ ‌ప్రధాన కార్యాలయంపై ఇరాన్‌ ‌జరిపిన దాడులు క్రమంగా ఈ ప్రాంతంలో ఇరాన్‌ ‌వల్ల ప్రమాదం పెరుగుతున్నదన్న అంశం ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇరాన్‌ ‌తాను మద్దతిస్తున్న ఉగ్రవాద సంస్థల ద్వారా దాడులకు పాల్పడుతున్న తరుణంలో, గత రెండు నెలల కాలంలో తన ప్రత్యర్థుల నుంచి ప్రతీకార దాడులను ఎదుర్కొనాల్సి వచ్చింది. ఇరాన్‌ ‌నగరం కెర్మన్‌లో మాజీ ఇస్లామిక్‌ ‌రివ్యూషనరీ గార్డస్ ‌కమాండర్‌ ‌ఖాసిం సులేమాని సంస్మరణ కార్యక్రమంలో జరిగిన బాంబు పేలుడులో వందమంది ప్రజలు మరణించారు. ఇందుకు తామే కారణమని ఐ.ఎస్‌.ఐ.ఎస్‌. ‌ఖొరాసాన్‌ ‌ప్రావెన్స్ ‌ప్రకటించింది. అదేవిధంగా మొసాద్‌ ‌కూడా ఇరాన్‌కు చెందిన ఐఆర్‌జీసీ సైనిక సలహాదారు సయ్యద్‌ ‌రజీ మౌసవీని గత డిసెంబర్‌లో డెమాస్కస్‌లో హతమార్చింది. ఈ సంఘటనలు ఇరాన్‌లో అంతర్గత అభద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్‌కు వ్యతిరేకంగా యు.ఎస్‌. ‌తిరిగి పాకిస్తాన్‌కు మద్దతు ఇవ్వడానికి ముందుకు వస్తే ఇప్పటికే ఆంక్షల ఒడిలో సతమతమవుతున్న ఇరాన్‌ ఉక్కిరిబిక్కిరి కావడం ఖాయం. అయితే ఇరాన్‌కు రష్యా వెన్నుదన్నుగా ఉన్నదనేది జగమెరిగిన సత్యం. ఉక్రెయిన్‌ ‌యుద్ధంలో రష్యా, ఇరాన్‌ ‌డ్రోన్లనే వాడింది. ఈ నేపథ్యంలో రష్యా సమ్మతిలేకుండా ఇరాన్‌ ఇటువంటి దాడులకు పాల్పడే సాహసం చేస్తుందంటే నమ్మశక్యం కాదు. ప్రస్తుతం హమాస్‌, ‌హౌతీ, హిజ్‌బుల్లా తీవ్రవాదులకు ఇరాన్‌ ‌మద్దతిస్తోంది. ఇవి ఎర్రసముద్రంలో అమెరికాతో సంఘర్షిస్తున్నాయి. హమాస్‌, ‌హౌతీలు ఇజ్రాయిల్‌తో పోరాడుతున్నారు. ఇజ్రాయిల్‌కు మద్దతిస్తున్న అమెరికా, ఇరాన్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్‌కు మద్దతివ్వడానికి వెనుకాడదు. అప్పుడు ఇరాన్‌కు రష్యా ప్రత్యక్ష మద్దతు ఇవ్వక తప్పదు. భారత్‌కు ఇరాన్‌ ‌మిత్రదేశం! తనకు సన్నిహిత మిత్రులుగా ఉన్న పాక్‌-ఇరాన్‌ల మద్య ఘర్షణ చైనాకుఎంతమాత్రం ఇష్టంకాదు. ప్రస్తుతం పాక్‌-ఇరాన్‌ల మధ్య ఘర్షణ ముదరలేదు కాబట్టి ఈ పరిణామాలు సంభవించే అవకాశం లేదు.

షియా-సున్నీల ఘర్షణల్లో ఇరాన్‌ ‌హస్తం?

పాకిస్తాన్‌లో ఏటా మొహర్రం పర్వదినం సమయంలో షియా-సున్నీల ఘర్షణలు జరగడం సర్వసాధారణమైపోయింది. షియా జనాభా పెద్ద సంఖ్యలో ఉన్న ప్రాంతాల్లో లేదా షియా మతపెద్దలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సందర్భాల్లో ఈ దాడులు జరుగుతున్నాయి. గత ఏడాది మొహర్రం సందర్భంగా షియా మతపెద్ద చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రెండు వర్గాల మధ్య ఉద్రిక్తలకు కారణమయ్యాయి. చాలా సంవత్సరాలుగా ఈ రెండు వర్గాల మధ్య జరుగుతున్న ఘర్షణలు పాక్‌ అం‌తర్గత శాంతికి భంగం వాటిల్లజేస్తున్నాయి. నిజానికి పాకిస్తాన్‌లో ఈ వర్గాల మధ్య ఘర్షణలు ఒక్కసారిగా చోటుచేసుకుంటున్నవి కావు. 1979లో ఇరాన్‌ ‌విప్లవం తర్వాత నుంచి ఇవి ప్రారంభమయ్యాయి. ఇరాన్‌లో విప్లవం విజయవంతమయ్యాక పాక్‌లోని బక్కర్‌ ‌పట్టణంలో ‘జఫారీ’ ఉద్యమాన్ని షియావర్గం వారు ప్రారంభించారు. ఈ గ్రూపు నాయకుడి పేరు అరిఫ్‌ ‌హుస్సేన్‌ అల్‌-‌హుస్సేనీ. ఇరాన్‌ ‌విప్లవ నాయకుడు అయొతొల్లా ఖొమైనీకి ఈయన శిష్యుడు. ఇరాన్‌ ‌మద్దతుతో హుస్సేనీ పాకిస్తాన్‌లో ఇరాన్‌ ‌సైద్ధాంతిక సూత్రాలను వ్యాప్తి చేయడానికి కృషిచేశాడు. పాకిస్తానీ మదరసాల్లో ఇరాన్‌ ‌విప్లవ అనుకూల సిద్ధాంతాలను పాఠ్యాంశాలుగా బోధిస్తూ, యువతను ఇరాన్‌లో విద్యను అభ్యసించేలా ప్రోత్సహిస్తూ వచ్చాడు. ఇదే సమయంలో ఇరాన్‌ ‌విప్లవ సిద్ధాంతాలను పాక్‌లో చొప్పించాలని కూడా యత్నించాడు. చివరకు ఆయన యత్నాలు ‘జైనాబియన్‌ ‌బ్రిగేడ్‌’ ఏర్పాటు రూపంలో ఫలించాయి. ఈ సంస్థ పాకిస్తాన్‌కు చెందిన యువతను రిక్రూట్‌ ‌చేసి వారికి ఇరాన్‌ ‌శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టింది. ఈవిధంగా శిక్షణ పొందిన యువకులను ఇరాన్‌, ‌సిరియా అంతర్యుద్ధంలో వినియోగించింది. పాకిస్తాన్‌ ‌షియా వర్గంతో ఏర్పడిన ‘జైనాబియన్‌ ‌బ్రిగేడ్‌’ అలెప్పో, డెమాస్కస్‌ ‌కేంద్రాలుగా పనిచేస్తుంది. కాగా 2012 లో సలాఫీ ఉగ్రవాదులు డెమాస్కస్‌లోని ‘సయ్యిదా జైనాబ్‌’ ‌ప్రార్థనా మందిరంపై క్షిపణి దాడికి పాల్పడిన నేపథ్యంలో 2014లో పాకిస్తాన్‌కు చెందిన షియా మిలిటెంట్లు ‘జైనాబియన్‌ ‌బ్రిగేడ్‌’ ‌పేరుతో ఒక గ్రూపుగా ఏర్పడ్డారు. అంతకు ముందు వీరు ఎవరికి వారే చిన్న గ్రూపులుగా తమ కార్యకలాపాలు నిర్వహించేవారు. ఈ ‘సయ్యిదా జనాబ్‌’ ‌ప్రార్థనా మందిరం పరిరక్షణ బాధ్యతను ఇరాన్‌ ఈ ‌గ్రూపునకు అప్పగించింది. ఈ గ్రూపులో పనిచేసే పాకిస్తాన్‌ ‌షియా యువత ఉన్నత విద్యావంతులు. ముఖ్యంగా వీరు పాక్‌ ‌నుంచి విద్య లేదా ‘పవిత్ర స్థలాల సందర్శన’ పేరుతో ఇరాన్‌లో ప్రవేశించి, విద్యా వంతులైనవారు. ఇరాన్‌లోని ‘ఖోమ్‌’ ‌యూనివర్సిటీ పాకిస్తానీ విద్యార్థులను రిక్రూట్‌ ‌చేయడంలో కీలకపాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం ఇందులో 2500 మంది వరకు మిలిటెంట్లు ఉన్నట్టు పాక్‌ ఇం‌టెలిజెన్స్ ‌వర్గాల అంచనా. ఇందులో రిక్రూట్‌ అయినవారికి ఇరాన్‌ ‌నెలకు 700-750 యు.ఎస్‌. ‌డాలర్లు వేతనంగా చెల్లిస్తుంది. అయితే వీరు ఇరాన్‌ ‌చెప్పిన విధంగా పోరాటాల్లో పాల్గొనాల్సివుంటుంది.

పాకిస్తాన్‌లో సుమారు 80 నుంచి 85 శాతం మంది సున్నీవర్గానికి చెందిన వారే. వీరంతా వివిధ సున్నీ సిద్ధాంతాలను (దియోబంది, బరెల్విస్‌, ‌సుఫీలు, సలాఫీలు/వాహబీ) అనుసరిస్తుంటారు. ఇదే సమయంలో ఇరాన్‌ ‌మద్దతుతో పనిచేసే షియా సంస్థలకు కూడా పాక్‌లో తగినంత గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌లో జరిగే షియా-సున్నీ ఘర్షణల్లో ఇరాన్‌ ‌పాత్ర ఉన్నద న్న అనుమానాలు వ్యక్తమవడం సహజం. పాకిస్తాన్‌లో ఈ రెండు వర్గాల ప్రజలమధ్య మొట్టమొదటిసారి 1986లో ఘర్షణలు జరిగాయి.అప్పటి నుంచి గత ఏడాది వరకు దాదాపు మూడు వేల మతఘర్షణలు పాక్‌లో చోటుచేసు కున్నాయని అంచనా. గత ఏడాది వరకు ఈ ఘర్షణల్లో పది వేల మంది ప్రాణాలు కోల్పోయారు. జైనాబియన్‌ ‌బ్రిగేట్‌ ఏర్పాటుకు ప్రతిస్పందనే పాక్‌లో షియా వర్గాలపై పెరిగిన దాడులు! షియాలకు వ్యతిరేకంగా ఏర్పడిన హింసాత్మక సున్నీ గ్రూపు లష్కర్‌ ఎ ‌జంఘవీ!

 ఇదిలావుండగా ఇటీవలి కాలంలో సిరియాలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో తీవ్రవాదుల రిక్రూట్‌మెంట్లు బాగా తగ్గిపోవడంతో జైనాబియన్‌ ‌బ్రిగేడ్‌ ‌భవితవ్యం ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ఇరాన్‌ ‌తమ దేశం నుంచే మిలిటెంట్లను రిక్రూట్‌ ‌చేసుకుంటుందన్న విషయం పాకిస్తాన్‌కు తెలిసినప్పటికీ పైకి వెల్లడించదు. పాక్‌ ‌మీడియా కూడా దీనిపై పెదవి విప్పకపోవడం మరో విచిత్రం. బెలూచ్‌ ‌నాయకులు, బెలూచ్‌ ఉ‌గ్రవాదులకు ఇరాన్‌ ఆ‌శ్రయం ఇస్తోందని పాక్‌ ఆరోపిస్తుండగా జుండుల్లా, జైష్‌ అల్‌ అదల్‌, ‌హర్కత్‌ అన్సార్‌ ‌వంటి ఇరాన్‌ ‌వ్యతిరేక ఉగ్రవాదులు పాక్‌లో సురక్షితంగా ఉన్నారని ఇరాన్‌ ఆరోపిస్తోంది. కేవలం మత ఛాందసవాదాన్ని నమ్ముకొని, ఉగ్రవాద విష సర్పాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌ ‌ప్రస్తుతం దాని కోరల్లోనే చిక్కుకొని విలవిల్లాడుతూ విషాదాంతం దిశగా పయనిస్తోంద నడంలో ఎంతమాత్రం సందేహం లేదు!

గత దశాబ్ద కాలంగా రెండు దేశాల మధ్య సంఘర్షణల క్రమం

– 2013: 14 మంది ఇరానియన్‌ ‌గార్డులను హతమార్చినట్టు జైష్‌ అల్‌ అదల్‌ ‌ప్రకటించింది.

-2017: ఏప్రిల్‌లో జైష్‌ అల్‌ అదల్‌ 10‌మంది ఇరానియన్‌ ‌గార్డులను చంపేసింది.

– 2017: ఇరాన్‌కు చెందిన డ్రోన్‌ను పాకిస్తాన్‌ ‌కూల్చివేసింది.

– 2018: అక్టోబర్‌లో 12మంది ఇరాన్‌ ‌భద్రతా సిబ్బందిని జైష్‌ అల్‌ అదల్‌ ‌కిడ్నాప్‌ ‌చేసింది.

– 2018: డిసెంబర్‌లో ఈ సంస్థ జరిపిన ఆత్మాహుతి దాడిలో నలుగురు ఇరానియన్‌ ‌పోలీసులు మరణించారు.

-2019: ఇరాన్‌లోని ఉగ్రవాదులు 14మంది బెలూచ్‌ ‌పౌరులను హత మార్చారని పాకిస్తాన్‌ ఆరోపించింది.

-2021: సెప్టెంబర్‌ల• ఇరాన్‌ ‌సైనికులతో జరిగిన పరస్పర కాల్పుల్లో తమ సైనికుడు మరణించినట్టు పాక్‌ ‌ప్రకటించింది.

-2023: ఇరాన్‌ ‌వైపు నుంచి జరిగిన దాడిలో తాము నలుగురు సైనికులను కోల్పోయినట్టు పాక్‌ ‌వెల్లడించింది.

– 2023: డిసెంబర్‌ల•  తాము జరిపిన దాడిలో 11మంది ఇరాన్‌  ‌భద్రతా సిబ్బంది మరణించినట్టు జైష్‌ అల్‌ అదల్‌ ‌ప్రకటించింది.

– 2024: జనవరి 16వ తేదీన పాక్‌లోని జైష్‌ అల్‌ అదల్‌ ‌స్థావరాలపై ఇరాన్‌ ‌క్షిపణులతో దాడులు చేసింది. ఈ సంఘటనలో ఇద్దరు పిల్లలు మరణించారని పాక్‌ ‌పేర్కొంది.

– 2024: జనవరి 18న పాకిస్తాన్‌ ఇరాన్‌లోని బెలూచ్‌ ‌తిరుగుబాటుదారుల స్థావరాలపై క్షిపణులతో దాడులు జరిపింది. ఈ దాడుల్లో 9 మంది ఇరానేతరులు మరణించారని ఇరాన్‌ ‌మీడియా పేర్కొంది. అంటే బహుశా వీరంతా పాక్‌ ‌జాతీయులై ఉంటారని అనుమానం.

-జమలాపురపు విఠల్‌రావు,

సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram