‌ప్రాంతాల వారీగా వివక్ష పేరిట తెలంగాణలో మళ్లీ ప్రాంతీయ రాజకీయాలు మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రాజెక్టుల్ని కేంద్రానికి అప్పగించే అంశంపై ప్రారంభమైన వివాదం తిరిగి ప్రాంతాల వారీగా ప్రాజెక్టులపై చేసిన నిర్లక్ష్యం గురించిన చర్చకు దారి తీస్తున్నట్లుగా కనిపిస్తోంది. దక్షిణ తెలంగాణలో ప్రాజెక్టుల్ని పట్టించుకోకుండా ఉత్తర తెలంగాణ ప్రాజెక్టుల్ని నిర్మించారని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. అసలు ఉత్తర తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అవసరం ఏమిటని ప్రశ్నిస్తోంది. భారీ ఖర్చుతో అవసరం లేకపోయినా ప్రాజెక్టు కట్టారని, అసలైన ప్రాజెక్టుల్ని నిర్లక్ష్యం చేశారని మంత్రులు ఆరోపిస్తున్నారు. మరో వైపు.. కాంగ్రెస్‌పార్టీ నిర్ణయాలే తెలంగాణకు నష్టదాయకమంటూ బీఆర్‌ఎస్‌ ‌తనదైన శైలిలో ఆరోపణలు గుప్పిస్తోంది. మొత్తానికి తెలంగాణలో నీటి పంచాయతీ నెలకొంది. ఈ క్రమంలో ఎవరు చెప్పేది నిజం అనేది సందిగ్ధంగా మారింది. గత ప్రభుత్వ పాలకులు చెబుతున్నది వాస్తవమా? లేక ప్రస్తుత ప్రభుత్వాధినేతల వాదనలు కరెక్టా? అనేది తేలాల్సి ఉంది.

బీఆర్‌ఎస్‌ ‌పాలనలో లోటుపాట్లను ఏరుతోన్న కాంగ్రెస్‌ ‌పార్టీ తెలంగాణలో నీటి పాపాలు మొత్తం కేసీఆర్‌వే అని దుమ్మెత్తి పోస్తున్నారు. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. కేసీఆర్‌ ‌తీరుపై అంతెత్తున ఎగిసిపడుతున్నారు. కేసీఆర్‌ ‌పాలనలోనే నదీ జలాలపై హక్కులను ఆంధప్రదేశ్‌కు ధారాదత్తం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా ప్రాజెక్టుల అప్పగింతకు అంగీకరించింది బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వమే అని.. తాము ఒప్పుకోకున్నా తమపై అభాండాలు వేస్తున్నారని రేవంత్‌ ‌ధ్వజమెత్తారు. అంతటితో ఆగకుండా, పక్క రాష్ట్ర పాలకులతో కుమ్మక్కై జలదోపిడీకి కేసీఆర్‌ ‌సహకారం అందించారని కూడా ఆరోపణలు గుప్పించారు. అసెంబ్లీ సమావేశాల్లో సాగునీటిపై శ్వేతపత్రం విడుదల చేస్తామని కూడా స్పష్టం చేశారు.

‘‘2022 మే 27వ తేదీన జరిగిన 16వ కృష్ణాబోర్డు సమావేశం ఎజెండాలోని 16.7వ అంశం కింద ప్రాజెక్టు కాంపొనెంట్‌లను అప్పగించడానికి అభ్యంతరం లేదని చెప్పారు. 2023 మే 19న 17వ కృష్ణాబోర్డు సమావేశంలోనూ ప్రాజెక్టులను అప్పగిస్తామని అంగీకరించారు. 2023-24 రాష్ట్ర బడ్జెట్‌లో శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ‌కాంపొనెంట్లతో పాటు గోదావరి బేసిన్‌లో పెద్దవాగును అప్పగించ డానికి అంగీకరించినట్లు స్పష్టంగా పేర్కొన్నారు. సీడ్‌మనీ కింద ఒక్కో బోర్డుకు రూ.200 కోట్ల చొప్పున కేటాయించాలని బడ్జెట్‌లో ప్రతిపాదించారు. ఈ మొత్తం వ్యవహారంలో మామా అల్లుళ్లు కేసీఆర్‌, ‌హరీశ్‌రావు ఉన్నారు’’ అని సీఎం రేవంత్‌రెడ్డి కుండబద్దలు కొట్టారు.

గత తొమ్మిదిన్నరేళ్ల కాలంలో కేంద్రానికి, ఆంధప్రదేశ్‌ ‌ప్రభుత్వానికి కేసీఆర్‌ ‌సర్కారు పూర్తిగా లొంగిపోయిందన్నారు. ఉమ్మడి ఆంధప్రదేశ్‌కు ఉన్న 811 టీఎంసీల్లో ఆంధప్రదేశ్‌ 512, ‌తెలంగాణకు 299 టీఎంసీలు మాత్రమే వినియోగించుకునేలా 2015లోనే కేంద్రం వద్ద కేసీఆర్‌ ఒప్పందం చేసుకున్నారని మండిపడ్డారు. తెలంగాణ నీటి హక్కులను శాశ్వతంగా ఆంధప్రదేశ్‌కు ధారాదత్తం చేసిన ఘనుడు కేసీఆర్‌ అం‌టూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. సాగునీటి రంగంపై అసెంబ్లీలో చర్చకు రావాలని సవాల్‌ ‌విసిరారు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ‌ప్రాజెక్టులను కృష్ణానదీ యాజమాన్యబోర్డుకు అప్పగించడం వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లిందని బీఆర్‌ఎస్‌ ఆరోపణలు చేసిన నేపథ్యంలో నీటిపారుదల, అటవీశాఖల మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కొండా సురేఖతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్ర సచివాలయంలో మాట్లాడారు. కృష్ణా, గోదావరి ప్రాజెక్టులను బోర్డులకు స్వాధీనం చేసే విషయంలో కేసీఆర్‌, ‌హరీశ్‌రావు, కేటీఆర్‌లు తాము చేసిన పాపాలను కప్పిపుచ్చుకుని.. వాటిని కాంగ్రెస్‌పై నెట్టేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపణలు చేశారు. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇలాంటి నిర్ణయమేదీ తీసుకోలేదని, ఆంధప్రదేశ్‌ ‌పునర్విభజన చట్టం ప్రకారం విధి విధానాలను కేంద్రం రూపొందించాల్సి ఉందని, కానీ, ప్రతి అంశం తనను అడిగే చేశారని, ఈ చట్టానికి తానే రూపకల్పన చేశానని కేసీఆర్‌ ‌గతంలోనే చెప్పారని గుర్తు చేశారు. ఆ రోజు 50 శాతం కావాలని అడగకపోగా, ఈ రోజు సగం నీళ్లు రావాలంటున్నారని ఎద్దేవా చేశారు. తొలుత ఒక్క సంవత్సరానికే అని చెప్పి.. 2019 వరకు ఏటా 299 టీఎంసీలు మాత్రమే తెలంగాణకు ఇచ్చేలా కొనసాగించారని కుండబద్దలు కొట్టారు.

ప్రగతి భవన్‌ ‌వేదికగానే రాయలసీమ ఎత్తిపోతలకు కుట్ర జరిగిందన్నారు రేవంత్‌రెడ్డి. 2020 జనవరి 14న ప్రగతిభవన్‌లో రెండు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్‌, ‌జగన్‌ ‌కలిసి ఆరుగంటల పాటు సమీక్షించారని, రాయలసీమ ఎత్తిపోతల నుంచి రోజుకు 8 టీఎంసీలు తరలించుకునిపోయేలా అనుమతించారని, శ్రీశైలం కనీస మట్టం 834 అడుగులైతే, 797 అడుగుల మట్టం నుంచి అంటే బురద నీటిని కూడా తీసుకెళ్లేలా 2020 మే నెల 5న ఎత్తిపోతల పథకాన్ని జీవో 203తో ఆంధప్రదేశ్‌ ‌ప్రభుత్వం చేపట్టిందన్నారు. తెలంగాణ అధీనంలోని నాగార్జునసాగర్‌ ‌ప్రాజెక్టును.. ఏపీ సీఎం జగన్‌ ‌తమ సాయుధ పోలీసులను పంపి ఆక్రమిస్తే అప్పటి ముఖ్య మంత్రి కేసీఆర్‌ ఒక్క మాట కూడా మాట్లాడలేదని విమర్శించారు.

2020 ఆగస్టు 5వ తేదీన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం ఏర్పాటు చేసిందని, దీని ఎజెండాలో రాయలసీమ ఎత్తిపోతల పథకం ఉందని, కానీ 20వ తేదీ వరకు బిజీగా ఉన్నామని, తర్వాత సమావేశం ఏర్పాటు చేస్తే వస్తామని నీటిపారుదలశాఖ కార్యదర్శితో కేసీఆర్‌ ‌లేఖ రాయించారని.. దీనికి కారణం పదో తేదీన రాయలసీమ ఎత్తిపోతల టెండర్‌ ఉం‌డడమే అని రేవంత్‌ ‌వివరించారు. దాన్ని మేఘా కృష్ణారెడ్డికి అప్పగించడానికి ఆటంకం కలగకూడదనే ఆ సమావేశానికి రాలేమని చెప్పించారని.. అయిదో తేదీన బోర్డు సమావేశానికి హాజరై గట్టిగా పట్టుబడితే రాయలసీమ టెండర్‌ ‌వాయిదా పడేదని రేవంత్‌ అభిప్రాయపడ్డారు.

అంతేకాదు.. బీఆర్‌ఎస్‌ ‌నేతలకు రేవంత్‌ ‌తనదైన శైలిలో సవాల్‌ ‌విసిరారు. సాగునీటి రంగంపై అసెంబ్లీలో శ్వేతపత్రం ప్రవేశపెడతామని.. దీనిపై 48 గంటల పాటు చర్చిస్తామని.. చర్చకు రమ్మని కేసీఆర్‌కు సవాల్‌ ‌విసురుతున్నారు. కేటీఆర్‌, ‌హరీశ్‌రావు కూడా చర్చలో పాల్గొనవచ్చని, కవిత కూడా మాట్లాడతానంటే ఉభయసభల సమావేశం ఏర్పాటు చేస్తామని రేవంత్‌ ‌చెప్పారు. కేసీఆర్‌ ‌మాట్లాడేందుకు పూర్తి అవకాశం ఇస్తామని.. ఒక్క నిమిషం కూడా మైక్‌ ‌కట్‌ ‌చేయబోమని.. ఎవరు తెలంగాణకు ద్రోహం చేశారో తేలిపోతుందని రేవంత్‌ అన్నారు. . శ్రీశైలం నుంచి నీటిని తీసుకునే అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసినా తెలంగాణ తీసుకోగలిగేది రోజుకు రెండు టీఎంసీలే అని.. కానీ ఆంధ్రా మాత్రం రోజుకు 12 నుంచి 13 టీఎంసీలు తీసుకుంటుందని వెల్లడించారు. వారం రోజులు కళ్లు మూసుకుంటే శ్రీశైలం నుంచి 100 టీఎంసీలు పోతాయని, తర్వాత బురదే మిగులుతుందని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు.

అందుకే నీటి వినియోగం ప్రస్తుతం 50 శాతం చొప్పున ఉండాలని కేంద్రానికి చెప్పామన్నారు రేవంత్‌రెడ్డి. నికరజలాలు కేటాయించాక ఏ ప్రాజెక్టు నుంచి ఎంత అనే స్పష్టత వస్తుందన్నారు. ఆ తర్వాతే ప్రాజెక్టుల అప్పగింతపై చర్చ జరుగుతుందన్నారు. తెలంగాణ తరఫున గత ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేసి, ఎనిమిదేళ్ల తర్వాత ఉపసంహరించుకుని.. రెండు రాష్ట్రాల మధ్య అంశంగా ట్రైబ్యునల్‌కు పంపిందన్నారు. మహారాష్ట్ర, కర్ణాటకలను కూడా ఇందులోకి తెమ్మని కోరామని.. ఈ ప్రయత్నం చేస్తున్నామని రేవంత్‌ ‌చెప్పారు.

మరోవైపు.. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ ‌నేతలు కాంగ్రెస్‌ ‌ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయ పోరాటం చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ప్రాజెక్టుల్ని కేంద్రానికి అప్పగించిందని బీఆర్‌ఎస్‌ ‌వాదిస్తోంది. కృష్ణా నదీ జలాల వివాదం, యాజమాన్య నిర్వహణ అంశంలో కాంగ్రెస్‌ ‌పార్టీని ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ‌వ్యూహాలు రచిస్తున్నారని చెబుతున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్‌ ‌పార్టీపై గట్టిగా కౌంటర్‌ అటాక్‌ ‌చేయాలని బీఆఎస్‌ ‌నిర్ణయించిందంటున్నారు. ఈ మేరకు కృష్ణా నదీ పరివాహక ప్రాంతమైన దక్షిణ తెలంగాణ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ‌తెలంగాణ భవన్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కృష్ణా బేసిన్‌లో ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్‌ఎం‌బీకి అప్పగించడంపై పార్టీ భవిష్యత్తు కార్యాచరణను ఖరారు చేశారు. అలాగే అసెంబ్లీ సమావేశాలలో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా చర్చించారు. వీటితో పాటు క్యాబినెట్‌లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ప్రధానంగా చర్చించారు. ప్రాజెక్టులు కేంద్రం చేతిలోకి వెళ్తే తాగడానికి కూడా నీరు ఉండదని బీఆర్‌ఎస్‌ ఆరోపిస్తోంది. అయితే అసలు బీఆర్‌ఎస్‌ ‌విభజన చట్టం కింద ఎప్పుడో ప్రాజెక్టుల్ని కేంద్రానికి అప్పగించిం దని.. కాంగ్రెస్‌ ‌పత్రాలు చూపించింది. నీటి పంపకాల్లో వాటాలకు అనుమతించి సంతకాలు కూడా చేశారని చెబుతున్నారు. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల రోజున ఏపీ సర్కార్‌ ‌సాగర్‌ ‌ప్రాజెక్టును ఆక్రమించుకున్న విధానంతో.. కేంద్రం మరోసారి అలాంటి వివాదాలు రాకుండా నిర్వహణను తన చేతుల్లోకి తీసుకోవాలని నిర్ణయించడంతో మరో చాయిస్‌ ‌లేకుండా పోయింది.

నిజానికి పదేళ్ల కాలంలో దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులపై కేసీఆర్‌ ‌పెద్దగా దృష్టి పెట్టలేదన్న ఆరోపణలు ఉన్నాయి. పూర్తిగా కాళేశ్వరం కోసమే ఖర్చు పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలోనూ ఇలాంటి చర్చ జరిగింది. మహబూబ్‌ ‌నగర్‌ ‌జిల్లాలో నిర్మించాల్సిన ఎస్‌ఎల్‌బీసీ, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులు ఎప్పుడో పూర్తి కావాల్సి ఉంది. కానీ ఇంకా ప్రారంభం కాలేదు. దక్షిణ తెలంగాణ కరువు తీర్చేస్తుందని ఆశపడ్డ పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు ఎక్కడ ఉంది అక్కడే ఉంది. ఎన్నికలకు ముందు కేసీఆర్‌ ఓ ‌మోటార్‌ ఆన్‌ ‌చేశారు. కానీ ప్రాజెక్టు ఇంకా నలభై శాతం కూడా పూర్తి కాలేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టును పూర్తి చేసి ఉంటే పది లక్షల ఎకరాలకు నీరు అందేదని చెబుతున్నారు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గం పని రాష్ట్ర పునర్విభజన నాటికి 30 కి.మీ. పూర్తయింది. పది కి.మీ. పెండింగ్‌లో ఉండగా.. గత పదేళ్లలో ఒక కి.మీ. మాత్రమే పూర్తి చేశారు. ఇది పూర్తయితే మూడున్నర లక్షల ఎకరాలకు గ్రావిటీ ద్వారా నీళ్లందుతాయి. కేసీఆర్‌ ఉద్దేశపూర్వకంగా పనులు చేయలేదని ప్రజల ముందుకు తీసుకెళ్తోంది. పాలమూరు- రంగారెడ్డికి రూ.30 వేల కోట్లు ఖర్చుచేసినా ఎకరాకు కూడా నీరివ్వలేదని కాంగ్రెస్‌ ‌గుర్తు చేస్తోంది.అదే సమయంలో దక్షిణ తెలంగాణ జిల్లాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారని రేవంత్‌ ‌రెడ్డి ఆరోపిస్తున్నారు. డిండి, పాలమూరు ఎత్తిపోతల పథకాలకు ఒకే దగ్గరి నుంచి నీటిని తరలించే విధంగా ప్రాజెక్టులను పూర్తిచేస్తే నల్లగొండ, పాలమూరు జిల్లాల మధ్య పోరాటాలు జరుగుతా యన్న ఆందోళన ఉందంటు న్నారు. బీఆర్‌ఎస్‌ ‌తరపున దక్షిణ తెలంగాణ నేతల చేతగానితనం వల్లే దక్షిణ తెలంగాణకు, పాత మహబూబ్‌నగర్‌ ‌జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది.

ఈ క్రమంలోనే పెండింగ్‌ ‌ప్రాజెక్టుల్లో చిన్నచిన్న పనులు చేస్తే.. త్వరగా పూర్తయ్యే వాటికి తొలి ప్రాధాన్యం ఇస్తామంటున్నారు రేవంత్‌. శ్రీ‌శైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గం పని రాష్ట్ర పునర్విభజన నాటికి 30 కిలోమీటర్లు పూర్తయింద న్నారు. పది కిలో మీటర్లు పెండింగ్‌లో ఉండగా.. గత పదేళ్లలో ఒక కిలో మీటర్‌ ‌మాత్రమే పూర్తి చేశారని.. ఇది పూర్తయితే మూడున్నర లక్షల ఎకరాలకు గ్రావిటీ ద్వారా నీళ్లందుతాయన్నారు రేవంత్‌. ఉమ్మడి రాష్ట్రంలో కంటే ఎక్కువగా నిర్లక్ష్యానికి గురైన ఈ ప్రాజెక్టును 18 నెలల్లోగా పూర్తి చేయాలన్నది లక్ష్యమన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల కూడా ఇంతేనని.. పాలమూరు- రంగారెడ్డికి 30 వేల కోట్ల రూపాయలు ఖర్చుచేసినా ఎకరాకు కూడా నీరివ్వలేదని మండిపడ్డారు. కాళేశ్వరంపై విచారణకు న్యాయమూర్తిని కేటాయించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరామన్నారు. సమాధానం రాగానే చర్యలు తీసుకుంటామని.. మేడిగడ్డ కుంగుబాటుపై సీడబ్ల్యూసీ, నేషనల్‌ ‌డ్యాం సేఫ్టీ, అనుభవజ్ఞులైన ఇంజినీర్లతో కమిటీ ఏర్పాటు చేసి, వారి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

సుజాత గోపగోని, 

వ్యాసకర్త : సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE