– జంధ్యాల శరత్‌ బాబు సీనియర్‌ జర్నలిస్ట్‌

వాల్మీకి రామాయణం, గీతగోవిందం, కుమార సంభవం..ఇంకా మరెన్నో కావ్యాలకు నృత్యరూపకాలు అక్కడ ప్రదర్శితమవుతుంటాయి. ఇప్పటికీ నృత్యంతో పాటు సంగీత సాహిత్యాలకు పెద్దపీట.

ఆ స్థలం: కళాక్షేత్రం. అది తమిళనాడు రాజధాని చెన్నైలో. స్థాపించి ఇప్పటికి ఎనిమిదిన్నర దశాబ్దాల పైమాటే. సంస్థాపకురాలు రుక్మిణీదేవి.ఆమె స్థాపించిన సంస్థ ఒకప్పుడు ` ఇంటర్నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ ఆర్ట్స్‌. అనంతరకాలంలో కళాక్షేత్రంగా అవతరించింది. ‘సేవ నిరుపమానం’ అని సాక్షాత్తూ రవీంద్రనాథ ఠాగూర్‌ కితాబిచ్చారు. భరతనాట్యంతో పాటు కర్ణాటక సంగీత ప్రక్రియకి కీలకస్థానం కలిగించి, ప్రోత్సహించారు ఆమె.

మధురైకి చెందిన రుక్మిణీదేవి నాట్యకళా సేవలు ఆరున్నర దశాబ్దాలుగా కొనసాగాయి. భర్త అరండేల్‌ విదేశీయుడైనా, భారతీయతను ఎంతగానో గౌరవించిన వ్యక్తి. ఆ ఉత్సాహమే నర్తకమణిని మరింత తీర్చిదిద్దింది. మనదైన నాట్యరీతిలోని దైవిక తత్వాన్ని దేశవిదేశాల్లో చాటిన ఆమెను ‘పద్మభూషణ్‌’తో గౌరవించింది కేంద్రప్రభుత్వం. ‘దేశికోత్తమ’గా పురస్కార ప్రదానం చేసింది శాంతినికేతన్‌ విశ్వవిద్యాలయం. రుక్మిణీదేవి తల్లి శేషమ్మ, తండ్రి నీలకంఠశాస్త్రి.

విశ్వకవి, నృత్య కళాకారి ఉభయుల ఉదయ అస్తమయాలు ఫిబ్రవరిలోనే! 29న ఆమె జయంతి.

రుక్మిణీదేవి మొదట సంగీత ప్రేమికురాలు. ఎప్పుడూ పాటలు పాడుతుండే వారు. ఒక కార్యక్రమంలో ఆమె గాత్రాన్ని విన్న తండ్రి ‘బాగా పాడుతున్నావ్‌. సంగీతం నేర్చుకో, ఇంకా బాగుంటుంది’ అని సూచన చేశారు. అలా ఆమె సంగీత అనురక్తికి కారకుడు తండ్రి. కొంతకాలం గడిచింది. రుక్మిణికి పెళ్లయింది.దంపతులు పలు దేశాల్లో పర్యటించారు. ఒకచోట నర్తకరీతి రుక్మిణీదేవిని ఎంతగానో ఆకట్టుకుంది. మరోసారి వేరొక వేదికపై నృత్యప్రదర్శనకు ఆమె ముగ్ధురాలయ్యారు. ఆ కళాప్రక్రియని అభ్యసించారు.

తొలి ప్రదర్శన ఇచ్చినప్పుడు, ఆమెకి 30 ఏళ్లు. నాటి నుంచే జైత్రయాత్ర మొదలైంది. చాలాకాలం సాగింది. కళాక్షేత్ర స్థాపన 1936లో. నాటికి ఆమె వయసు 32.

నృత్యం – భరతనాట్యం, సంగీతం- గంధర్వవేదం. దరిమిలా, దాదాపు వంద ఎకరాల్లో సరికొత్త నిర్మాణం. అదే క్షేత్రాన్ని వారసత్వ సంపదగా గుర్తించింది కేంద్రం.

నర్తనకు మూలం, ఆకర్షకం … అలంకారం. అంతటి అలంకృతికి నిదర్శనమైన దుస్తులు క్షేత్రం నుంచి రూపొందాయి. అభినయానికి సరికొత్త సొగసులను సంతరించి పెట్టాయి.

‘అభినయ దర్పణం’ గురించి ఇక్కడ ప్రస్తావించి తీరాలి. నందికేశ్వర విరచిత కావ్యం అది.

‘కళ్యాణాచల వాసాయ కరుణారస సింధవే

నమోస్తు నందికేశాయ నాట్యశాస్త్రార్థదాయినే’- అని ఉవాచ. నర్తన పరంగా ప్రధాన కావ్యం అభినయ దర్పణమే. ఇందులో వందలాది సంస్కృత శ్లోకాలున్నాయి.

యతో హస్తః తతో దృష్టి

యతో దృష్టిః తతో మనః

యతో మనః తతో భావః

యతో భావః తతో రసః

(నృత్య హస్తం ఎక్కడుంటుందో అక్కడే చూపు. ఇది ఉన్నచోటనే మనసు కేంద్రీకృతం. ఆ మది ఉన్న దగ్గర భావం నెలకొంటుంది. ఆ భావ కారణంగానే రసానుభూతి).దీన్ని ఆచరించి చూపేలా కళాక్షేత్రం వ్యవస్థీకృతమైంది. ఎందరెందరికో కళానిపుణత పంచిపెట్టింది. భారతీయతే వెల్లివిరిసేలా చేసింది.

భరతనాట్య ఆధ్యాత్మిక దృక్పథం రుక్మిణీదేవి ఆచరణలో ప్రతిఫలించింది. భరతముని నాట్య శాస్త్రమైనా, నందికేశ ఆభినయ దర్పణమైనా భరతనాట్య కళకి మూలాధారాలు.

రుక్మిణీ కళాక్షేత్రం మొదటి గురువులు మీనాక్షీ సుందరం పిళ్లయ్‌, చొక్క లింగం పిళ్లయ్‌. వారి నిర్దేశకత్వం ఎందరినో రూపుదిద్దింది. యామినీ కృష్ణమూర్తి, సంయుక్త పాణిగ్రహి… ఇంకా మరెందరో. వృత్తి విద్యలు, దేశవాళీ పరిశ్రమలనీ ఉత్సాహపరచిందీ ‘క్షేత్రం’. విద్య వ్యవస్థకి నూతనతను జోడిరచింది.

భాషాభారతి, నృత్య హారతి – రుక్మిణీదేవి

‘నమోనమో నటరాజా! జయజయ

నమో జగతిత్రయ నాట్యసమాజ!

రక్తి ముక్తి అనురక్తి నీవే

గళం నీవే సంగీతం నీవే

రాగ తాళలయ రసార్ద్ర మూర్తీ

నిత్య సత్య సాహిత్య స్ఫూర్తీ!’ అనేలా వెల్లివిరిసింది క్షేత్ర ఆవరణమంతా. అక్కడే సుందర నందనాలు, తామర కొలనులు, శాస్త్రీయ రీతి కట్టడాలు.

 1. సంగీత సిద్ధాంత చర్చలు
 2. సంగీతకారుల జీవన చరిత్రల అధ్యయనాలు
 3. దృశ్యకళల పరిశోధనలు

వీటికి తోడు నిత్య అభ్యసనాల విస్తృతీకరణ. మొత్తం మీద సాంస్కృతిక వైభవ శోభ. గురుకులం/ నివాస అభ్యాస కేంద్రంగా పరిఢవిల్లింది క్షేత్రమంతా. విభిన్న అభిరుచులు, శాస్త్రీయ ప్రదర్శనలకు కేంద్రస్థలిగా భాసించింది.

బోధనా శాస్త్రం ప్రత్యేకించి రూపుదిద్దుకుంది. కథా, కథనాలకు నృత్యరీతి జోడిరపు సొబగులద్దింది.

తెలుగులో భాగవత మేళాలు

సంస్కృతంలో గీతగోవిందం

బెంగాలీలో నర్తన రూపాలు

తమిళనాట విశేష రీతులు

వీటన్నింటినీ సమీకరించిన విధానం కళాక్షేత్రను సుసంపన్నం చేసింది. సూక్ష్మచిత్రణకు కాణాచిగా నిలిచింది.కళాక్షేత్ర వ్యవస్థాపకురాలి మాటల్లోనే చెప్పాలంటే..

 1. చదువు అనేది జీవన భృతికి కాదు.

జీవితాన్ని తెలుసుకుని మసలడానికి.

 1. డిగ్రీల కొలతలు జ్ఞాన సంపాదనకు గుర్తులు కావు

అవి మనలోని సహశక్తిని పెంచడానికి.

 1. నృత్యం అనేది భావ రూపాంతరీకరణ

దృశ్యవర్ణన, సమాజ చిత్రం అందులో భాగాలు.

 1. మనసు, మాట, శరీరం.

ఈ మూడిరటి సమ్మిళతమే నర్తన. ఇదొక కళ, శాస్త్రం.

 1. మంగళప్రదం, శుభకరం, హితదాయకం నాట్యం.

పుష్టినీ తుష్టినీ పెంచి పోషించేది ఇదే.

 1. రామాయణ, భారతం, భాగవతం

ఈ మూడిరటిలోనూ నృత్య సంగీత ప్రస్తావనలు అనేకం.

 1. నాట్యశాస్త్రం నాట్యవేదం.. ఈ రెండూ స్థూలంగా ఒక్కటే.
 2. రసం, భావం, అభినయం, వృత్తి ప్రవృత్తి

గానం, స్వరం, రంగం ` ఇవన్నీ నృత్య అంశాలే.

ముఖ, హస్త, పాద కదలికలున్న నాట్య శాస్త్రానికి విస్తార ప్రాచుర్యం కలిగింది కళాక్షేత్రమే. బోధన, అభ్యాసం, ప్రదర్శనలు అక్కడ మూర్తీభవించాయి. సంప్ర దాయ కళాత్మకతలు అన్నివిధాలా అక్కడ వెల్లివిరిశాయి. అధునాతన సంస్కరణలూ ఆ కోవలోనే.

భాష, సంస్కారం, నాగరికతలను కలగలిపిన విధానమే భరతనాట్యం. ఆ ప్రక్రియను వ్యవస్థీకృతం చేసిన, చేస్తున్న వారందరూ ఆదర్శప్రాయులే.

భారతీయతకు పట్టంకట్టి, నర్తనాభిషేకం చేస్తున్న సంస్థలే జాతికి కాంతిరేఖలు. వాటిని విస్తృత పరచడం అందరి బాధ్యత. మన సంస్కృతీ సంప్రదాయ రీతులను పదిలపరచుకోవడమే ప్రతి ఒక్కరి విధి. అంతకుమించిన పరమ ధర్మం మరేదీ లేదు, ఉండదు. యద్భావం తద్భవతి!

About Author

By editor

Twitter
Instagram