దక్షిణాదిలో, ముఖ్యంగా… తెలుగురాష్ట్రాలలో ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ పేరు చెప్పగానే వెంటనే స్ఫురణకు వచ్చే ప్రముఖులలో పూర్వ ఉపరాష్ట్రపతి  ముప్పవరపు వెంకయ్య నాయుడు ఒకరు. ఆయన ఇప్పుడు పద్మవిభూ షణులయ్యారు. సాధారణ రైతు కుటుంబంలో పుట్టి ఏబీవీపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ ‌ద్వారా  రాజకీయం రంగ ప్రవేశం చేసిన ఆయన ఉప రాష్ట్రపతి స్థాయికి ఎదిగారు. బీజేపీ దిగ్గజం ఏబీ వాజ్‌పేయీ మంత్రివర్గంలో, ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ మొదటి మంత్రివర్గలో, అనంతరం  ఉపరాష్ట్రపతిగా సేవలు అందించారు.  

రెండో ఏటనే తల్లిని కోల్పోయి అమ్మమ్మ ఒడిలో పెరిగిన తనకు భవిష్యత్‌ను, రాజకీయ జీవితాన్ని ప్రసాదించినవి ఆర్‌ఎస్‌ఎస్‌, ‌బీజేపీ అని తరచూ చెప్పుకునే వెంకయ్యనాయుడు ఆంధప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం చవట పాలెంలో జూలై 1, 1949లో పుట్టారు. బుచ్చిరెడ్డి పాలెం, నెల్లూరు, విశాఖపట్నంలో చదివారు. యుక్తవయసు నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌, ఏబీవీపీతో అనుబంధాన్ని పెంచుకున్న ఆయన లోక్‌నాయక్‌ ‌జయప్రకాశ్‌ ‌నారాయణ్‌ 1974లో నిర్వహించిన అవినీతి వ్యతిరేక ఉద్యమానికి (ఛాత్ర సంఘర్ష సమితి) రాష్ట్ర కన్వీనర్‌గా పనిచేశారు. 1975లో అత్యవసర పరిస్థితులకు వ్యతిరేకంగా ఉద్యమించి జైలుకు వెళ్లారు. నాలుగున్నర దశాబ్దాలకు పైగా రాజకీయ ప్రస్థానంలో శాసనసభ్యుడిగా, బీజేపీ రాష్ట్ర, జాతీయ ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగా, పార్టీ పార్లమెంటరీ బోర్డు కార్యదర్శిగా, పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ కార్యదర్శిగా, రాజ్యసభ సభ్యుడిగా (1998-2017), కేంద్రమంత్రిగా, 13వ ఉప రాష్ట్రపతి (2017-2022)గా సేవలు అందించారు. స్వతంత్ర భారతదేశంలో పుట్టి ఉప రాష్ట్రపతి అయిన మొదటి నేతగా నిలిచారు. వాజ్‌పేయీ ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ప్రధాన మంత్రి గ్రామసడక్‌ ‌యోజన, నరేంద్రమోదీ ప్రభుత్వంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా స్మార్ట్ ‌సిటీ, అమృత పథకం ప్రవేశపెట్టారు. పర్యటనలు అంటే ఇష్టపడే ఆయనత తమ దశాబ్దాల రాజకీయం జీవితంలో వివిధ హోదాల్లో దేశంలో దాదాపు అన్ని జిల్లాలను సందర్శించారు.

‘మాతృభాషను గౌరవించు..పర భాషలను ప్రేమించు’ అన్నది ఆయన నినాదం. ఆ విధానం మేరకే అమ్మభాషతో పాటు ఆంగ్లం,హిందీలో అనర్గళంగా ప్రసంగించే ప్రావీణ్యం సంపాదించారు. ‘ఏ దేశమేగినా… ఎందుకాలిడినా…’ అన్నట్లు విదేశీ పర్యటనల్లోనూ వేషభాషలకు ప్రాధాన్యమివ్వడం ఆయన ప్రత్యేకత.

మాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌ ‌నుంచి నేర్చుకున్న క్రమశిక్షణ, సమయపాలనను పాటించేందుకు శక్తిమేర ప్రయత్నిస్తున్నట్లు తరచూ చెబుతుంటారు. ఆ స్ఫూర్తితోనే రాజ్యసభ అధ్యక్షుడిగా సమయపాలనకు ప్రాధాన్యం ఇచ్చారు. సభ్యులు తమ మాతృభాషల్లో ప్రసంగించే ఏర్పాట్లు చేశారు. రాజ్యసభ సమావేశాల సందర్భంగా సభా కార్యకలాపాలు సాగిన తీరుపై నిమిషాలు సహా వారం వారం గణాంకాలు వెల్లడించే జవాబుదారీతనాన్ని ప్రవేశపెట్టారు. ముఖ్యంగా, ర్యాసభలో ఆర్టికల్‌ 370 ‌రద్దు బిల్లు ప్రవేశపెట్టినప్పుడు తీవ్రంగా ప్రతిఘటించిన విపక్షాలను సముదాయిస్తూనే, సభను నిమిషం కూడా వాయిదా వేయకుండా నిభాయించు కుంటూ బిల్లును సున్నితంగా ఆమోదింప చేయడంలో కృతకృత్యులయ్యారు.

‘నరేంద్రమోదీ నాయకత్వంలో దేశం ప్రగతి పథంలో పయనిస్తోంది. అన్నివర్గాల ప్రజలు నవభారత పునర్నిర్మాణంలో భాగస్వాములవుతున్న తరుణంలో, భారత్‌ ‌ప్రభుత్వం ప్రకటించిన పద్మ విభూషణ్‌ ‌పురస్కారం ఆయా వర్గాలకు అంకితం. నా రాజకీయ ప్రస్థానంలో అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రజా శ్రేయస్సుకు వినియోగించేందుకు ప్రయత్నించాను. ప్రస్తుత పురస్కారం నా బాధ్యతను మరింత పెంచింది. ఆ స్ఫూర్తితో ఆత్మనిర్భ భారత నిర్మాణానికి ప్రజలతో కలిసి నడుస్తానని’ అని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.

-జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram