ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో మధ్యంతర బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, మరుసటి రోజు ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి చేసిన ప్రసంగాలు వైసీపీ ఎన్నికల కరపత్రాన్ని చదివి విన్పించి నట్లుందని రాజకీయ పార్టీలు, రాజ్యాంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రంలో చేసిన అభివృద్ధిపై వారు చెప్పినవన్నీ అసత్యాలేనని అంటున్నారు.

ఇది మధ్యంతర బడ్జెట్‌. ఏ ప్రభుత్వమైనా ఏప్రిల్‌ నుంచి జూన్‌ మాసం వరకు రాష్ట్ర ఆర్థిక నిర్వహణ, జీతాల చెల్లింపు వంటి పద్దులను చూపిస్తుంది. కానీ వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని గత నాలుగున్నరేళ్లలో చేసినవి, చేయనివి కలిపి రాష్ట్రాన్ని ప్రపంచంలో నంబర్‌ వన్‌గా నిలబెట్టామని ఆర్థికమంత్రి గొప్పలు చెప్పుకున్నారు. అయితే అవన్నీ తప్పుడు లెక్కలేనని, గణాంకాలేవీ నమ్మదగ్గవిగా లేవని విపక్షాల వాదన. ఒకవైపు రాష్ట్రంలోని అవినీతిపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుంటే ఆర్థికమంత్రి సభలో ‘సుపరిపాలన ఆంధ్ర, సామర్థ్య ఆంధ్ర, మన మహిళా మహారాణుల ఆంధ్ర, సంపన్న ఆంధ్ర, సంక్షేమ ఆంధ్ర, భూభద్ర ఆంధ్ర, అన్నపూర్ణ ఆంధ్ర’ అని ‘సప్తాంధ్రల’ను చెప్పుకోవడాన్ని చూసి విపక్షాలే కాదు ప్రజలు కూడా నవ్వుకుంటున్నారు.

2-3శాతం కంటే ఎక్కువ ఉండకూడని ద్రవ్యోల్బణం నేడు రాష్ట్రంలో 8.5 శాతంగా ఉంది. రాష్ట్రం దాదాపు రూ.13 లక్షల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోతే దానిని రూ. ఏడెనిమిది లక్షలకు కుదించడానికి ప్రయత్నం చేశారు. జగన్మోహన్‌రెడ్డి సర్కారు చేస్తున్న మితిమీరిన రుణాలపై కేంద్రప్రభుత్వం ఎన్నోసార్లు హెచ్చరికలు జారీచేసినా, లక్ష్య పెట్టకుండా అప్పులు చేయడం ఆనవాయితీగా మార్చేశారు. రెవెన్యూ లోటును రూ.24,758.22 కోట్లుగా, ద్రవ్యలోటును రూ.55,817.50 కోట్లుగా చూపించారు. గడిచిన నాలుగేళ్లలో రెవెన్యూలోటు 224%, ద్రవ్యలోటు 128% పెరిగిందని కాగ్‌ నివేదిక బట్టబయలు చేసినా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం లోటును కప్పిపుచ్చిందంటున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి ఒరిగేదేమీ లేకపోవచ్చు. కానీ రాష్ట్ర ఆర్థికవ్యవస్థకు తీవ్రముప్పు. అంచనాకు, వాస్తవ వ్యయానికి ఎంతో తేడా కన్పిస్తోంది. ఒక్క నాల్గవ త్రైమాసికంలోనే 63% మాత్రం వ్యయం నమోదైంది. రూ.4000 కోట్ల సెక్యూరిటీ బాండ్లను ఆర్బీఐకి కుదవబెట్టి ఉద్యోగులకు జీతాలిచ్చిన చరిత్ర వైసీపీ సర్కారుది. జనానికి పనికల్పిస్తేనే ఆదాయం వస్తుంది. కానీ ఇక్కడ ప్రజల తలసరి ఆదాయం శూన్యం. ఖాతాల్లోకి బదిలీ అయిన సొమ్మునూ తలసరి ఆదాయంగా చూపించారు. నైపుణ్యాభివృద్ధి లేనప్పుడు మానవ వనరుల అభివృద్ధికి అవకాశం ఉండదు.

రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను  మంత్రి ప్రస్తావించలేదు. డీబీటీ పేర్లతో బటన్‌ నొక్కుడు కార్యక్రమాలు, అనవసర ప్రచారాలు, నిధులు దుర్వినియోగం, ఉత్పత్తికి దోహదపడని అనవసర వ్యయాలు ఉన్నాయి. వెనుకబడిన 7 జిల్లాలను ఏ రకంగా అభివృద్ధి చేస్తారో చెప్పలేదు. విశాఖపట్నం రైల్వేజోన్‌కు స్థలం ఇవ్వలేదు. రామాయపట్నం పోర్టు, కడప ఉక్కు కర్మాగారం వంటి అంశాలను ప్రస్తావించలేదు. పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో స్పష్టత లేదు. ఈ ప్రాజెక్టుకు రూ.55వేల కోట్లు ఖర్చు చేస్తుందని అంచనా వేస్తే, ఇందులో రూ.33వేల కోట్లు పోలవరం నిర్వాసితుల కోసం కేటాయించాలి. పునరావాసం పూర్తికాకుండా, నిర్వాసితుల సమస్యలు పరిష్కరించకుండా ఈ ప్రాజెక్టు పూర్తి కాదనేది అందరికీ తెలిసిన విషయమే. కాని పోలవరం విషయంలో ప్రభుత్వం తీవ్ర అలసత్వం చూపిస్తోంది. పులిచింతల నిర్వాసితులకు పరిహారం కంటితుడుపు చర్యగానే మిగిలిపోయింది.

రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టులు ఎలాగూ లేవు. కనీసం కీలక ప్రాజెక్టులకు ఒకరాయి పేర్చలేదు. ఒకవైపు రైతులు తుపానులు, వర్షాభావ పరిస్థితుల్లో చిక్కుకుని లక్షల ఎకరాల్లో పంటలు కోల్పోయినా, ప్రభుత్వం ఆదుకోకపోగా ‘అన్నపూర్ణ ఆంధ్ర’గా చెప్పుకోవడం సరికాదనే వ్యాఖ్యలు ఉన్నాయి. రాష్ట్రంలో 62 శాతం మంది వ్యవసాయంమీదనే ఆధారపడినట్లు చెబుతున్న ప్రభుత్వం రైతులను ఉద్ధరణకు తీసుకున్న చర్యలు ఏమిటో చెప్పలేదు. కేంద్రం ఇచ్చే నిధులకు కొంత చేర్చి మొత్తం తామే ఇస్తున్నట్లు చెప్పుకోవడం చూస్తున్నాం. పంటల బీమా క్లెయిమ్‌ల్లో జాప్యంపై రైతులకు ఇంతవరకు సమాధానం చెప్పలేదు. రైతు కూలీలను ఆదుకునేందుకు ఒక్క పథకమూ లేదు. రాష్ట్రంలో గ్రామీణ నిరుద్యోగం విపరీతంగా పెరగడానికి ఇదే ప్రధాన కారణం. పైగా, విద్యుత్‌ మీటర్లు పెట్టి రైతులను దెబ్బతీస్తున్నారు. కరెంటు కోతలేమైనా తగ్గాయా అంటే అదీలేదు. నీటి వాటాలు గానీ, విద్యుత్‌ బకాయిలు గానీ… ఏవీ తేలలేదు. అవన్నీ అపరిష్కృత సమస్యలే. కొత్తగా చేసిన భూహక్కు పరిరక్షణ చట్టం, రక్షణ కల్పించడం మాట అటుంచి తన భూహక్కులను కోల్పోయే ప్రమాదంలో రైతులను పడేసింది. రెవెన్యూ అధికారులే న్యాయ మూర్తులుగా మారిపోయిన పరిస్థితి ఏర్పడిరది.

వికేంద్రీకరణ పేరుతో అస్తవ్యవస్థం చేశారు. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీకి ముద్రవేశారు. మూడు ముక్కలాట ఆడి రాష్ట్రాన్ని నాశనం చేశారు. మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకున్న విషయాన్నీ ప్రభుత్వం మరచిపోయింది. ఈ ప్రసంగాలలో కీలకమైన రాజధాని అంశమే ప్రస్తావనకు నోచుకోలేదు. స్థానిక సంస్థలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయి. జిల్లా, మండల, సర్పంచుల నిధులను పూర్తిగా ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.

డీబీటీ అందిస్తున్నామనే పేరుతో ఎస్సీ,ఎస్టీ, సబ్‌ప్లాన్‌ అమలు చేయడం లేదు. 56 బీసీ కార్పొరేషన్‌ల ద్వారా ఖర్చు చేయడానికి నిధులు ఎంత కేటాయించారో చెప్పలేదు. రాష్ట్రంలో ప్రధాన రహదారుల పరిస్థితి ఎంతో అధ్వానంగా ఉంది.

నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అధికారంలోకి వస్తే 2.30 లక్షల ఉద్యోగాలను భర్తీచేస్తామన్న జగన్మోహన్‌రెడ్డి మాట తప్పారని నిరసనవ వ్యక్తమవుతోంది. వలంటీర్ల నియామకం తప్ప కొత్తగా ఉపాధి కల్పించలేదు. రాష్ట్రంలో 8,366 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గత సెప్టెంబర్‌ 22వ తేదీన శాసనమండలిలో ప్రకటిం చారు. కానీ 6,100 ఖాళీల భర్తీకి మాత్రమే నోటిఫికేషన్‌ విడుదల చేశారు. అందుకు కారణం చెప్పవలసి ఉందని, మిగిలిన పోస్టులూ భర్తీ చేయాలని డిమాండ్‌లువ వస్తున్నాయి. ఐటీకి ప్రోత్సాహం లేక బీటెక్‌ పాసైన వారంతా ఇళ్ల వద్ద ఖాళీగా ఉంటున్నారు. తలసరి ఆదాయంలో రాష్ట్ర స్థానం 17కాగా, రాష్ట్రంలో పట్టభద్రుల నిరుద్యోగిత 24శాతంగా నమోదైంది.్ణ.

ఉద్యోగులకు 11వ వేతన సంఘం సిఫార్సులు అమలు చేశామని చెప్పారు. కానీ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పోరాటాలు చేసేవారిపై రాష్ట్రప్రభుత్వం నిర్భంధం ప్రయోగిస్తోంది. ఇది ఏ స్వేచ్ఛ, ఎలాంటి సమానత్వం. అంగన్‌వాడీ, ఆశలు, పారిశుద్ధ కార్మికులు ఆందోళన చేస్తుంటే ఎస్మా ప్రయోగించారు. రాష్ట్ర పిఆర్‌సిల చరిత్రలో అత్యంత అప్రజాస్వామికంగా, ఏకపక్షంగా 11వ పిఆర్‌సి అమలు జరిగింది. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సమస్యలపై గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఎప్పటికి అమలవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.

రాష్ట్రంలో విద్యావ్యవస్థను నిస్తేజం చేశారని విద్యారంగ నిపుణులు ఆరోపిస్తున్నారు. మాతృభాష తెలుగును దూరం చేసేందుకు శతవిధాల ప్రయత్నాలు చేశారు. ఉపాధ్యాయులు లేకుండానే ఆంగ్ల మాధ్యమంలో సీబీఎస్‌ఈ, ఐటీ, టోఫెల్‌లలో బోధిస్తామని చెప్పి బోల్తా పడిరది. 3 నుంచి 12వ తరగతి విద్యార్ధులకు పరీక్షలు నిర్వహిస్తే విద్యారంగంలో నాణ్యత ఎంతుందో అవగతమవు తుందంటున్నారు. రాష్ట్రంలో అక్షరాస్యతలోనూ వెనుకబడినా, డ్రాపౌట్లు తగ్గాయని చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది. గత ప్రభుత్వ హయాంలో పీజీ కోర్సుల్లో చేరిన వారికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేయలేదు. ఈ అంశంపై కళాశాలలు న్యాయస్థానంలో గెలిచినా, వారికి బిల్లులు చెల్లించడంలో బేరాలాడుతున్నారని విమర్శలొచ్చాయి. 17 వైద్య కళాశాలలు ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. అయితే వాటిలో ఐదింటికే ప్రవేశాలు మొదలయ్యాయి. తక్కినవి కేంద్రం అనుమతుల్లేక ఆగిపోయాయి.

సుపరిపాలన అర్థాన్నే మార్చి పడేశారు. సాధారణ పాలనలోనే ప్రభుత్వం విఫలమైంది. వైసీపీ నాయకులు చేసిన భూకబ్జాలకు కొదవేలేదనేది రోజూ వచ్చే ఆరోపణల్లో వెల్లడౌతోంది. సహజవనరులను ఇష్టానుసారం దోచుకుంటున్నారు. ఇసుక, కొండలు, గుట్టలు లూటీ చేస్తున్నారు. ఈ పరిస్థితిలో ‘సంపన్న ఆంధ్ర’ అని చెప్పుకోవడం అర్థరహితం. లేని పెట్టుబడులను, రాని కంపెనీలను వచ్చినట్లు చెప్పుకున్నారు. నిజానికి కొత్త కంపెనీ ఒక్కటి కూడా రాకపోగా, గతంలో వచ్చినవి సైతం వైసీపీ నేతల ఒత్తిళ్లు తట్టుకోలేక పక్క రాష్ట్రాలకు తరలిపోయాయి. ప్రభుత్వ వేధింపులు భరించలేకనే ఎందరో పారిశ్రామికవేత్తలు హైదరాబాద్‌ వెళ్లిపోయారు. సంపద సృష్టి జీరో. ‘మహిళా మహరాణుల ఆంధ్ర’ అని మంత్రి చెప్పడం అసహజంగా ఉంది. రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా మహిళల పట్ల క్రైమ్‌ రేటు పెరిగింది. మిస్సింగ్‌ కేసుల్లో మనదే అగ్రస్థానం.

వైసీపీ వచ్చే ఎన్నికల్లో గెలుపునకు నవరత్నాలపైనే ఆధారపడిరది. అందుకే బడ్జెట్‌ ప్రసంగంలో నవరత్నాల గురించి పదేపదే చెప్పడానికి నానాతంటాలు పడ్డారు. గ్రామాల్లో, పట్టణాల్లో నవరత్నాల లబ్ధ్దిదారుల ఎంపికలోనూ, వారి తొలగింపులో గత రెండేళ్లలో రాజకీయాలు చొరబడ్డాయి. ఇవన్నీ గ్రామ సచివాలయాలు వేదికగా జరిగాయన్నది వాస్తవం. లబ్ధిదారుల సంఖ్యలోనూ, లబ్ధిలోనూ కోతలు విధించిన విషయాన్ని విస్మ రించారు. సంక్షేమానికి, అభివృద్ధికి మధ్య అంతరాన్ని ఇన్నేళ్లకూ గుర్తించలేక పోవడం బాధాకరం. విద్యాదీవెన, అమ్మ ఒడి పథకాల్లో ఎన్నిసార్లు మీటలు నొక్కినా, తల్లుల ఖాతాల్లో కోతలే కన్పించాయి. ఏదేమైనప్పటికీ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చూపాల్సిన బడ్జెట్‌ కేవలం వైసీపీ ఎన్నికల కరపత్రంగా, క్షేత్రస్థాయి వాస్తవాలకు విరుద్ధంగా ఉందని నిపుణులు విమర్శిస్తున్నారు.

  • వల్లూరు జయప్రకాష్‌ నారాయణ, ఛైర్మన్‌,సెంట్రల్‌ లేబర్‌ వెల్ఫేర్‌ బోర్డు, కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ

About Author

By editor

Twitter
Instagram