– సుజాత గోపగోని

తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలు కూడా మొదలెట్టింది. తొలుత మహిళా సెంటిమెంట్‌ను ఒడిసి పట్టుకునేందుకు ఆర్టీసీ బస్సుల్లో వారికి ఉచిత ప్రయాణం మొదలుపెట్టింది. ఈ పథకం ఇప్పుడు రాష్ట్రమంతటా అమలవుతోంది. దీంతో పాటు.. మిగతా హామీల అమలుపై దృష్టి పెట్టినట్లు ప్రభుత్వ పెద్దలు ప్రకటిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్‌ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ‘ఆరు గ్యారెంటీలు’ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారాయి.

శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయానికి ఆ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలు కీలక పాత్ర పోషించాయి. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వీటిపై తొలి సంతకం చేస్తామని పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అన్నట్లుగానే.. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత.. వీటి ముసాయిదాపై తొలి సంతకం చేశారు. అనంతరం క్యాబినెట్‌ సమావేశం ఆరు గ్యారెంటీలకు ఆమోదం తెలిపింది. వీటి అమలులో భాగంగా ఇప్పటికే ప్రజాపాలన పేరుతో గ్రామ, వార్డు సభలు నిర్వహించారు. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. వార్డుల స్థాయిలో నిర్వహించిన ఈ సభల్లో లక్షల మంది ఆయా పథకాల కోసం దరఖాస్తులు సమర్పించారు. వాటి క్రోడీకరణే ఇబ్బందిగా మారింది. అంటే.. ఆ స్థాయిలో ప్రజల నుంచి దరఖాస్తులు వచ్చి చేరాయి. అయితే, ఈ హామీలన్నీ ఎప్పుడు అమలు అవుతాయో! అందుకు సరిపడా నిధులు ఎలా? అన్న సందిగ్ధం ఇప్పుడు వెంటాడుతోంది. మొన్నటి ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ తర్వాత.. నిధుల కేటాయింపులు చూస్తే.. ప్రకటనలకు, అమలుకు మధ్య పరిస్థితి తేట తెల్లమవుతోంది. దీంతో, ఆరు గ్యారంటీల అమలు కోసం బడ్జెట్‌లో కేటాయించిన నిధులపై అటు అధికారిక వర్గాల్లో, ఇటు రాష్ట్ర ప్రజానీకంలో కూడా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. తాము కేటాయించిన నిధులతో ఆరు గ్యారంటీలు అమలవుతాయని సర్కారు చెబుతోంటే.. మరికొన్ని నిధులు అవసరమని అధికార వర్గాలు లెక్కలు కడుతున్నాయి. మరోవైపు.. ఎన్నికల సమయంలో, మేనిఫెస్టోలో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను యథాతథంగా అమలు చేయాలంటే.. ఇప్పుడు బడ్జెట్‌లో కేటాయించిన నిధులకు సుమారు మూడు రెట్లు ఎక్కువగా నిధులు అవసరమనే చర్చ జరుగుతోంది.

ఈ హామీలను సంపూర్ణంగా అమలు చేయాలంటే ఏటా రూ.1.36 లక్షల కోట్లు పైనే కావాల్సి ఉంటుందనే అంచనాలు నెలకొన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన 2024-25 ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో ఆరు గ్యారంటీలకు రూ.53 వేల కోట్లు మాత్రమే కేటాయించింది. ఈ లెక్కలన్నీ చూస్తుంటే హామీల అమలు వ్యవహారం అయోమయంగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకవేళ ‘గ్యారంటీ’లను పూర్తిస్థాయిలో కాకుండా, కొందరికే పరిమితం చేసినా ఏటా రూ.80 వేల కోట్లకు పైనే అవసరమని అధికార వర్గాలు అంటున్నాయి. అయితే, అధికారికంగా ఎవరూ దీనిపై స్పష్టత ఇవ్వడం లేదు.

పైకి ‘ఆరు గ్యారంటీ’(మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి, రైతు భరోసా, చేయూత, యువ వికాసం)లుగా కనిపిస్తున్నా వాటి పరిధిలో మొత్తం 13 సంక్షేమ పథకాలు ఉన్నాయి. వీటన్నింటినీ పూర్తిస్థాయిలో అమలు చేయాలంటే భారీ మొత్తంలో నిధులు అవసరం అవుతాయని ఆర్థిక రంగ నిపుణులు లెక్కగడుతున్నారు. అన్నదాతలకు సంబంధించిన ‘రైతు భరోసా’ను పరిశీలిస్తే… గత బీఆర్‌ఎస్‌ సర్కారు రాష్ట్రంలోని దాదాపు 1.52 కోట్ల ఎకరాలకు సంబంధించి సుమారు 69 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చింది. రైతుబంధు పథకం పేరుతో ఏటా ఎకరానికి రూ. 10 వేల చొప్పున చెల్లించింది. తాము అధికారంలోకి వచ్చాక బీఆర్‌ఎస్‌ సర్కారు ఇచ్చిన సాయం మొత్తాన్ని పెంచుతామని, ఎకరాకు మరో రూ. ఐదు వేలు పెంచి…రూ.15 వేలు చొప్పున అందజేస్తామని కాంగ్రెస్‌  పార్టీ ప్రకటించింది. ఇందుకు ఏటా సుమారు రూ. 22 వేల 800 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేస్తున్నారు. ‘రైతు భరోసా’ గ్యారెంటీని మరింత లోతుగా విశ్లేషిస్తే.. రాష్ట్రంలో భూమి లేని కౌలు రైతులు 6.5 లక్షల మంది ఉన్నట్టు ఓ అంచనా. వారికి ఏటా రూ.15 వేల చొప్పున అందించేందుకు రూ. 975 కోట్లు అవసరం అవుతాయి. అలాగే, రైతుకూలీలకు ఏటా రూ. 12 వేలు చొప్పున ఇస్తామని కాంగ్రెస్‌ పార్టీ పేర్కొంది. రాష్ట్రంలో 52లక్షలకు పైగానే ఉపాధి హామీ జాబ్‌కార్డులు ఉన్నాయి. వీటిలో దాదాపు 32 లక్షల మేర అమలులో ఉన్నాయి. ఆ కార్డుదారులందరికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తే ఏటా రూ. 6 వేల 240 కోట్లు అవసరం అవుతాయి. యాక్టివ్‌గా ఉన్న జాబ్‌కార్డులకే పరిమితం చేసినా.. ఏటా రూ. 3వేల 840 కోట్లు అవసరం అవుతాయని అధికారులు పేర్కొంటున్నారు. ఇక, రైతులకు సంబంధించిన ఇతర హామీలను చూస్తే.. వరి ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ ఇస్తామని కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది.ఈ లెక్కన, రాష్ట్రంలో కొనుగోలు చేస్తున్న కోటి 30లక్షల టన్నుల ధాన్యానికి రూ. 6వేల 500 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి.

ఇక, ‘గృహజ్యోతి’కి సంబంధించి… ప్రస్తుతం రాష్ట్రంలో 200యూనిట్ల లోపు విద్యుత్‌ వినియోగిస్తున్న గృహ విద్యుత్‌ కనెక్షన్ల సంఖ్య 95.23 లక్షలని టీఎస్‌ ట్రాన్స్‌కో లెక్కలు చెబుతున్నాయి. ఆ కుటుంబాలు ఏటా దాదాపు 9వేల 022 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను వినియోగిస్తున్నాయి. ఒక్కో యూనిట్‌ విద్యుత్‌ కొనుగోలు వ్యయం సగటున 7 రూపాయలుగా లెక్కించినా, ఈ హామీ అమలు కోసం ఏటా సుమారు రూ. 6వేల 315 కోట్లను ప్రభుత్వం విద్యుత్‌ సంస్థలకు చెల్లించాల్సి ఉంటుంది.

‘ ఇందిరమ్మ ఇళ్ల’ విషయానికి వస్తే…. రాష్ట్రంలో సొంతిల్లు లేని పేదలకు 20 లక్షల ఇళ్లు కట్టిస్తామన్న హామీ ప్రకారం, ఏటా నాలుగు లక్షల ఇళ్ల నిర్మాణానికి ,ఒక్కో ఇంటికి రూ.5 లక్షల మేరకు లెక్కగడితే.. 20లక్షల ఇళ్లకు మొత్తంగా రూ.లక్ష కోట్లు అవసరం అవుతాయి. అంటే.. రానున్న ఐదేళ్ల కాలానికి ఏటా బడ్జెట్‌లో రూ.20 వేల కోట్లు కేటాయించాల్సి ఉంటుంది. అయితే, సర్కారు తాజా ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో ఏడు వేల కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించింది. అంటే.. అంచనా మేరకు మరో రూ.13 వేలకోట్లు కేటాయించాల్సి ఉంటుంది.

మరో గ్యారంటీ ‘చేయూత హామీ’ని పరిశీలిస్తే.. రాష్ట్రంలో ప్రస్తుతం 43.68 లక్షల మంది వివిధ రకాల పింఛన్లు పొందుతున్నారు. ప్రతినెల దివ్యాంగులకు రూ.4 వేలు, ఇతర లబ్ధిదారులకు రూ. 2 వేలు అందజేస్తున్నారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో దివ్యాంగుల పింఛన్‌ రూ. 4 వేల నుంచి రూ. 6 వేలకు, ఇతర పింఛన్లను రూ.2 వేల నుంచి రూ. 4 వేలకు పెంచుతామని హామీ ఇచ్చింది. ఈ లెక్కన చూస్తే ఏటా 5.5 లక్షల మంది దివ్యాంగుల పింఛన్లకు రూ. 3వేల 960 కోట్లు, సుమారు 38 లక్షల ఇతర పింఛన్ల కోసం రూ.18వేల 240 కోట్లు కేటాయించాల్సి ఉంటుంది.

కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికలకు ముందు యువ ఓటర్లపైనే ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. నిరుద్యోగులకు సంబంధించి పోరాటాలు చేసింది. ముఖ్యంగా ఉద్యోగ నియామకాలపై ఫోకస్‌ పెట్టింది. అందులో భాగంగానే ఆరు గ్యారెంటీల్లో ‘యువ వికాసం’ పేరుతో యువకులను ఆకట్టుకునే హామీలు ఇచ్చింది. అయితే, ఈ పథకంపై ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. విద్యార్థుల ఫీజులు, కోచింగ్‌ చెల్లింపుల కోసం రూ. 5 లక్షల విలువైన విద్యా భరోసా కార్డు ఇస్తామని హామీ ఇచ్చింది. రాష్ట్రంలో ఏటా దాదాపు ఆరు లక్షల మంది విద్యార్థులు డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్‌, ఇంటర్మీడియట్‌ వంటి కోర్సులు పూర్తి చేసుకుంటున్నారు. వీరికి విద్యా భరోసా కోసం బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుని ఆర్థిక సహాయం ఇస్తారా? లేదంటే ప్రభుత్వం నేరుగా వాళ్లకు ఈ ఆర్థిక సహాయం మొత్తం అందజేస్తుందా? ఫీజుల రూపంలో చెల్లిస్తుందా? అనే అంశాలపై స్పష్టత ఇంకా రాలేదు. అయితే, ఈ నిధులను ఎలా సర్దుబాటు చేస్తారనే విషయంపైనా, అప్పులు తీసుకుని ఇస్తే వడ్డీ ఎవరు భరిస్తారన్న విషయంపైనా స్పష్టత లేదని, దీనిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాల్సిన అవసరం ఉందంటున్నారు నిరుద్యోగులు

 ఆరుగ్యారెంటీల్లో ప్రధానంగా చెప్పుకోదగిన ‘మహాలక్ష్మి గ్యారెంటీ’ కింద ప్రధానంగా మూడు హామీలు ఇచ్చింది కాంగ్రెస్‌. వీటిలో ఒకటి అమలు చేసి.. ప్రజల నుంచి సానుకూల స్పందనను చవిచూసింది. ‘మహాలక్ష్మి’ కింద రాష్ట్రంలోని ప్రతి మహిళకు నెలకు రూ. 2,500 ఆర్థిక సాయం అందచేస్తామని, రూ.500కే వంట గ్యాస్‌ సిలిండర్‌ అందజేస్తామని, ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రమంతటా ఉచిత ప్రయాణం కల్పిస్తామని హమీలు ఇచ్చింది. ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన మహిళలు కోటీ 65లక్షల మంది ఉన్నారు. ఇందులో సుమారు 26 లక్షల మంది ఇప్పటికే వితంతు, ఒంటరి, వృద్ధాప్య పింఛన్లు పొందుతున్నారు. వారిని మినహాయించినా మిగతా కోటీ 39లక్షల మంది మహిళలకు ప్రతినెలా రూ. 2వేల 500 లెక్కన చూస్తే.. ఏటా రూ. 41వేల 700 కోట్లు కావాల్సి ఉంటుంది.

ఇక, గ్యాస్‌ సిలిండర్‌ హామీని చూస్తే.. రాష్ట్రంలో మొత్తం 70లక్షల మంది మహిళల పేరిట వంటగ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. సిలిండర్‌ రూ.500 హామీ అమలుకు ఏడాదికి పన్నెండు సిలిండర్లు ఇస్తే.. ఏటా రూ.4,200 కోట్లను గ్యాస్‌ కంపెనీలకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. ఆరు సిలిండర్లకే పరిమితం చేస్తే రూ.2, 100 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇక.. ఇప్పటికే ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్‌, పల్లె వెలుగు బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలవుతోంది. దీనికోసం ప్రతి నెలా రూ. 300 కోట్లు సర్కారుపై భారం పడుతోంది. ఈ లెక్కన చూస్తే.. ఏటా ఆర్టీసీకి కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.3 వేల 600 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.

వ్యాసకర్త : సీనియర్‌ జర్నలిస్ట్‌

About Author

By editor

Twitter
Instagram