ఐదువందల సంవత్సరాల అయోధ్య ఉద్యమం అంతిమ విజయం దిశగా సాగడానికీ, మందిర నిర్మాణ స్వప్నం సాకారం కావడానికీ కీలకమైనవి చివరి మూడు దశాబ్దాల•. భారత రాజకీయాల స్వరూప స్వభావాలనే కాదు, తాత్త్వికతను కూడా మార్చినవి కూడా ఈ ముప్పయ్‌ ఏళ్లే. అయోధ్య ఉద్యమానికి ముందు, తరువాతి భారతదేశం అన్నంతగా ఆ పరిణామం భారత సామాజిక, రాజకీయ వ్యవస్థను కదిపింది. ఈ మధ్యలో మరే పెద్ద పరిణామం జరగలేదని కాదు. కానీ, అత్యవసర పరిస్థితి, ఆ తరువాత అయోధ్య. ఈ రెండే భారతదేశం మీద ప్రబలమైన ముద్రను మిగిల్చాయి. భారతీయత ఒక మహాశక్తిగా వ్యవస్థలో ప్రవేశించడానికి నాందీ వాచకమే మందిర నిర్మాణ ఆలోచన. రామాలయం అంటే ఇటుకలూ, విగ్రహాలూ కాదు, నాగరికతకు మేలుకొలుపు, కుహనా సెక్యులరిజానికి వీడ్కోలు, నాగరికత పట్ల స్పృహ అని నినదించిన ఘడియలవి. అత్యధిక సంఖ్యాకుల మనోభావాలకు విలువేది అని నిలదీసిన క్షణాలవి. 20వ శతాబ్దం చివరి అంకంలోని చింతనాధోరణిలో జాతీయవాదాన్ని ప్రబలంగా నిక్షిప్తం చేసినది కూడా రామమందిర నిర్మాణోద్యమమే. భారతీయ సమాజాన్ని, నిజం చెప్పాలంటే హిందూ సమాజాన్ని చీల్చడానికి మండల్‌ ‌సిఫారసులు బుజ్జగింపు రాజకీయ పిశాచాల చేతి ఆయుధం కాకుండా ఆదిలోనే ఆపినది కూడా అయోధ్య రథమే. ఆధునిక భారతదేశ చరిత్రలో ఇంతటి కదలికకు, మలుపునకు కారణమైన ఆ కొద్దిమంది అసాధారణ వ్యక్తులలో ఒకరే లాల్‌ ‌కృష్ణ అడ్వాణీ. ఆయనను 2024 సంవత్సరం ‘భారత రత్న’ పురస్కారానికి ఎంపిక చేయడం జాతికి ఆనందమయ క్షణమే.

యాదృచ్ఛికం కావచ్చు. లేదా సంకల్పం కూడా కావచ్చు. ఏమైనా, అయోధ్యలో బాలక్‌రామ్‌ ‌ప్రాణప్రతిష్ఠ జరిగిన పదిరోజులకి అడ్వాణీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రకటించడం స్వాగతించదగినదే. ఎవరో అన్నట్టు ఆ పురస్కారం ప్రకటన విని ఆయన సంతోషించడం కాదు, పురస్కారం కూడా పులకించి ఉంటుంది. మాజీ ప్రధాని అటల్‌ ‌బిహారీ వాజపేయికి ప్రకటించిన తొమ్మిదేళ్ల తరువాత అడ్వాణీకి కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాన్ని ప్రకటించి మరొకసారి తనను తాను గౌరవించుకుంది. సంఘ్‌ ‌పరివార్‌ ‌నుంచి వచ్చిన నానాజీ దేశ్‌ముఖ్‌ను గతంలోనే (మరణానంతరం) ఈ పురస్కారం వరించింది. భారత రాజకీయాలలో, సమాజసేవలో, సాంస్కృతిక పరిరక్షణలో, పునరుజ్జీవన నిర్మాణోద్యమంలో ఈ ముగ్గురి సేవ చరిత్ర ప్రసిద్ధం.

స్వాతంత్య్రోద్యమం తరువాత హిందువులంతా ఆకాంక్షించిన సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమం కదిలినట్టే కదిలి ఆగిపోయింది. పదిహేడు పర్యాయాలు దాడులకు గురైన సోమనాథ్‌ ‌మందిర జీర్ణోద్ధరణ దగ్గరే పునరుజ్జీవనోద్యమాన్ని బుజ్జగింపు రాజకీయాలు, కుహనా సెక్యులరిజం భగ్నం చేశాయి. భారతీయ పునరుజ్జీవనోద్యమం ఎక్కడ ఆగిపోయిందో అక్కడ నుంచి పున: ప్రారంభించిన ఘనత లాల్‌ ‌కృష్ణ అడ్వాణీకి చెందుతుంది. అయోధ్యను హిందువులకు అప్పగించాలనీ, లేదా రామమందిర నిర్మాణానికి అవకాశం కల్పించాలని కోరుతూ అడ్వాణీ సోమనాథ్‌ ఆలయం (గుజరాత్‌) ‌నుంచే శంఖం పూరించారు. అయోధ్య రథయాత్ర అక్కడే మొదలయింది. నిజానికి అంతకు ముందే ప్రారంభమైన అయోధ్య ఉద్యమాన్ని అడ్వాణీ వేగవంతం చేశారు. విస్తృత పరిచారు. నిజమే, రథం గమ్యం చేరలేదు. కానీ మందిర నిర్మాణ ఆశయం, దృఢ సంకల్పం అయోధ్యకు దిగ్విజయంగా చేరాయి. దీనికంతటికీ చోదకశక్త అడ్వాణీ ఇచ్చిన హిందూ ఆత్మగౌరవ నినాదమే. కుహనా సెక్యులరిజంతో భారతీయతకు, జాతి సమైక్యతకు జరుగుతున్న అన్యాయాన్ని ఆయన వివరించిన తీరు కూడా అందుకు దోహదం చేసింది.    

అయోధ్య ఉద్యమానిదీ, అందులో అడ్వాణీ పాత్రదీ విడదీయలేని బంధం. ఆ ఉద్యమాన్ని ముందుకు సాగించడంలో ఆయన మడమ తిప్పని వైఖరిని అనుసరించారు. మందిర నిర్మాణంలో భాగస్వాములం కావాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించిన సమయంలో (పాలాంపూర్‌ ‌సమా వేశాలు, 1989) సంస్థ అధ్యక్షుడు అడ్వాణీయే. అడ్వాణీ లేని అయోధ్య ఉద్యమాన్ని ఊహించడం కష్టమని ఎందరో భావిస్తారు. అందులో సత్యమే ఉంది. పాలాంపూర్‌ ‌నిర్ణయం తరువాత సెప్టెంబర్‌ 25, 1990‌న అడ్వాణీ రథం ఎక్కారు. ఆ రోజు ఆయన వెంట ప్రయాణించినవారిలో నేటి ప్రధాని, బీజేపీ గుజరాత్‌ ‌రాష్ట్ర శాఖ నాటి కార్యదర్శి నరేంద్ర మోదీ కూడా ఉన్నారు. తనకు పురస్కారం ప్రకటించిన సమయంలో అడ్వాణీ ఇవన్నీ గుర్తు చేసుకున్నారు. మోడీ ఆనాటికి మరీ అంత ప్రసిద్ధులు కాదనీ, కానీ ఆలయ నిర్మాణానికి రాముడు మోదీనే ఎంచుకున్నాడని అడ్వాణీ వ్యాఖ్యానించడం గమనార్హం. తమ వరకు అయోధ్య ఉద్యమం ఎప్పటికీ జాతీయ చైతన్యానికి ప్రతీకేనని ఆయన నిర్ద్వంద్వంగా చెప్పారు. ఈ ఉద్యమంతో అడ్వాణీ గొప్ప మానసిక సంఘర్షణ అనుభవించారనే చెప్పాలి. డిసెంబర్‌ 6, 1992‌న మసీదును కరసేవకులు కూల్చిన తరువాత జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వచ్చిన వత్తిడి, వ్యతిరేకత తక్కువేమీ కాదు. 28 ఏళ్ల తరువాత కూల్చివేత ఆరోపణల నుంచి సీబీఐ ప్రత్యేక కోర్టు అడ్వాణీకి విముక్తి కల్పించింది. ఆయన ఆత్మకథ ‘నా దేశం నా జీవితం’లోని కొన్ని వాక్యాలు ఈ విషయాన్ని నిరూపిస్తాయి. దాదాపు ఐదు దశాబ్దాలు కలసి పనిచేసిన అటల్‌ ‌బిహారీ వాజపేయితో అయోధ్య ఉద్యమం గురించి చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినా, అడ్వాణీ ఉద్యమం వైపే మొగ్గారు. ఆయన దారి నిర్దుష్టమైనదని చరిత్ర రుజువు చేసింది. అలాగే గోధ్రా అల్లర్ల తరువాత నాటి గుజరాత్‌ ‌ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ వెనుక గట్టిగా నిలిచినవారు అడ్వాణీయేనన్న సంగతి దాచనక్కర లేదు. అడ్వాణీ తీసుకున్న ఆ నిర్ణయమే ఈ దేశానికి చరిత్రలో కనీవినీ ఎరుగని ఒక ప్రధాని ఆవిర్భవించ డానికి కారణమైందని ఇప్పుడు ఎవరైనా చెబుతారు. ఆ రెండూ అయోధ్యతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ముడిపడి ఉన్నవే. కాబట్టి అయోధ్యలో బాలక్‌రామ్‌ ‌ప్రాణప్రతిష్ఠ జరిగిన నేపథ్యంలో అడ్వాణీని భారత రత్నతో సత్కరించుకోవడం నిశ్చయంగా సబబే. నిజానికి అడ్వాణీకి ఎప్పుడు ఆ అత్యున్నత పౌర పురస్కారం ఇచ్చినా విమర్శలు సిద్ధంగానే ఉంటాయి కూడా. కానీ ఇప్పుడు ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. కర్పూరి ఠాకూర్‌కు మొదట ఈ సంవత్సరానికి ఈ పురస్కారం కోసం ప్రకటించారు. ఆయన సామాజిక న్యాయ దృష్టికి ఆద్యుడని చరిత్ర చెబుతుంది. హిందూత్వ రాజకీయాలకు ఆద్యుడని పేర్గాంచిన అడ్వాణీకి కొన్ని రోజుల తరువాత అదే పురస్కారం (ఒక సంవత్సరం ముగ్గురికి ఇవ్వవచ్చు) ప్రకటించారు. ఇదొక సమన్వయ సాధనా యోజన. సామాజిక న్యాయాన్నీ, హిందూత్వ దృష్టిని రెండు కళ్లుగా చూడవలసిన యుగంలోకి మనం ప్రవేశించాం.

అయోధ్య రథానికి ఎందుకంత ప్రత్యేకత? ఎందుకంత ఆదరణ? అడ్వాణీ వినిపించిన వాదన అందులో ప్రధానమైనది. హిందూత్వ బలోపేతం కావడానికీ, జాతీయవాదంతో కూడిన హిందూ చింతనకూ ఆయన ఉపన్యాసాలు ఉపకరించాయి. నిజానికి హిందూత్వకు గళం ఇవ్వాలన్న సూత్రం భారతీయ జనతా పార్టీ తన మూల సంస్థ జనసంఘ్‌ ‌నుంచి అందుకున్నదే. అప్పటి పరిస్థితిని బట్టి అడ్వాణీ దానికి పదును పెట్టారు. వీపీ సింగ్‌, ‌దేవీలాల్‌ల ఆధిపత్య రాజకీయాలతో దేశం ముక్కలు చెక్కలు కాకుండా కాపాడిన ఘనత అయోధ్య రథయాత్రకు దక్కుతుందని ఎవరైనా అంటే దానిని నిరాకరించడం అంత సులభం కాదు. అంతటి ఒక సామాజిక ఉత్పాతం నుంచి భారతీయ సమాజాన్ని రక్షించిన ఆ రథయాత్రకు ఇంకొక కోణం దొంగ సెక్యుల రిజాన్ని పాతరేయడం. రాముడిని ఈ దేశ సాంస్కృతిక ఐక్యతా చిహ్నంగా భావించాలన్న అడ్వాణీ వాదనకే భారతీయులు బ్రహ్మరథం పట్టారు. దేశంలో స్వైరవిహారం చేస్తున్న దొంగ సెక్యులరిజం కంటే రాముడు ఈ దేశ చైతన్య కేంద్రమన్న వాదనకే బలం ఉందని ఆయన రుజువు చేశారు. భర్త తలాక్‌ ‌చెప్పిన షాబానో అనే ముస్లిం మహిళకు మనోవర్తి ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పినా, దానిని బేఖాతరు చేసే ఉద్దేశంతో అత్యున్నత న్యాయస్థానం తీర్పుకు కాలదోషం పట్టించడానికి రాజీవ్‌గాంధీ ప్రయత్నించడం అడ్వాణీ వాదనకు సరైన భూమికను కూడా కల్పించి పెట్టింది. ఇందిర హత్యానంతర వాతావరణం, ఆపరేషన్‌ ‌బ్లూస్టార్‌ అలజడి, మండల్‌ ‌సిఫారసుల కల్లోలం ఇవన్నీ భారతీయ సమాజం మూలాలను కదిలించే శక్తి కలిగి ఉన్నా, అడ్వాణీ రథయాత్రతో చతికిలపడ్డాయి. స్వతంత్ర భారత దేశంలో హిందువుల స్థితిని అడ్వాణీ గమనించిన తీరు ప్రత్యేకమైనది. రోజుకు ఐదుసార్లు క్రమం తప్పకుండా ప్రార్థన చేసే మతవర్గంతో, మత భావన పట్ల తక్కువ స్పందన కలిగిన వర్గం చేయవలసి వచ్చిన అస్తిత్వ పోరాటంగానే చూశారు అడ్వాణీ. హిందూ సమాజ దుస్థితికి ఉన్న కారణాలకు ప్రత్యక్ష సాక్షి అడ్వాణీ. ఆ అనుభవాల సారమే ఆయన వాదన. ఆయన సింధ్‌ ‌ప్రాంతానికి చెందినవారు. 1946-47 నాటి రక్తపాతానికీ, దేశ విభజనకు వెనుక ఉన్నది మత మౌఢ్యమే. హిందువుల అనైక్యతకీ, దూరదృష్టి లేమికీ స్వతంత్ర భారతదేశం మూల్యం చెల్లించక తప్పదన్న దృష్టితో, దాని నుంచి కాపాడే ప్రయత్నంలో భాగంగానే 1925లో డాక్టర్‌జీ ఆర్‌ఎస్‌ఎస్‌ను స్థాపించారు. కానీ డాక్టర్‌జీ వేసిన అంచనా నిజమైంది. ఆ క్షణాలను చూసిన వారు అడ్వాణీ. డాక్టర్‌జీ ఊహించినట్టుగానే హిందువులు ద్వితీయ శ్రేణి పౌరులుగా మారిపోయే క్రమం మొదలయింది. కాంగ్రెస్‌ అ‌ప్రతిహతంగా సాగించింది. అయితే ఆర్‌ఎస్‌ఎస్‌ ‌దాని నుంచి హిందూ సమాజాన్ని రక్షించగలిగింది. ఆ క్రమాన్ని కూడా అడ్వాణీ చూశారు. అది ఆయన జీవితంలోని మరో గొప్ప కోణం.

అడ్వాణీని కేవలం రామభక్తుడిగా, అయోధ్య ఉద్యమ నిర్మాతగా చెబితే ఆయన చరిత్రకు పూర్తి న్యాయం చేసినట్టు కాదు. నిబద్ధ రాజకీయాలకీ, సూత్రబద్ధ వైఖరికీ ఆయన చిరునామా. నవంబర్‌ 8, 1927‌న కరాచీలో పుట్టారు (ప్రస్తుతం పాకిస్తాన్‌లో ప్రముఖ నగరం) అడ్వాణీ. తండ్రి కిషన్‌చంద్‌, ‌తల్లి జ్ఞానీదేవి. కరాచీలోనే సెయింట్‌ ‌పాట్రిక్స్ ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు. 1941లో అంటే, తన 14వ ఏట ఆయన ఆర్‌ఎస్‌ ఎస్‌కు దగ్గరయ్యారు. తరువాత పాకిస్తాన్‌లోని హైదరాబాద్‌లో డీజీ నేషనల్‌ ‌కళాశాలలో న్యాయశాస్త్రం అభ్యసించారు.  స్వాతంత్య్రం రావడం, ఆనాటి హింస, తరువాత గాంధీజీ హత్య సమయంలో అడ్వాణీ రాజస్థాన్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌  ‌ప్రముఖ బాధ్యతలు నిర్వహించారు. నిజానికి ఆయన చూసిన దానిలో బయటికి చెప్పినది తక్కువే అయి ఉండాలి. దేశ విభజన తరువాత పాకిస్తాన్‌ ‌నుంచి భారతదేశానికి వచ్చిన అనేక లక్షల కుటుంబాలలో వారిది కూడా ఒకటి. విభజన తరువాత బొంబాయిలో స్థిరపడింది ఆ కుటుంబం. తరువాత రాజస్తాన్‌ ‌ప్రాంత సంఘ బాధ్యతలు చేపట్టారు. 1951లో జనసంఘ్‌ ఏర్పడిన తరువాత దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ, అటల్‌ ‌బిహారీ వాజపేయి, అడ్వాణీ ఆ పార్టీ విస్తరణ బాధ్యత స్వీకరించారు. శ్యామాప్రసాద్‌ ‌ముఖర్జీ వారికి నాయకుడు. అంటే దేశంలో హిందూత్వ భావనకు రాజకీయ స్పృహనూ, చైతన్యాన్నీ అద్దిన మొదటి తరంలోనే అడ్వాణీ ఉన్నారు. 1957లో అడ్వాణీ ఢిల్లీ చేరుకుని జనసంఘ్‌ ‌నగర శాఖ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. 1966లో ఢిల్లీ మెట్రోపాలిటన్‌ ‌కౌన్సిల్‌ ‌మధ్యంతర ఎన్నికలలో విజయం సాధించారు. మరుసటి సంవత్సరమే కౌన్సిల్‌ ‌చైర్మన్‌గా గెలిచారు. ఇలా అడ్వాణీ ప్రత్యక్ష రాజకీయ యాత్ర మొదలయింది. 1970-72 సమయంలో జనసంఘ్‌ ‌ఢిల్లీ విభాగానికి అధ్యక్షుడిగా పనిచేశారు. జనసంఘ్‌ అధ్యక్షునిగా ఉండగానే 1970లో ఆయన మొదటిసారి రాజ్యసభలో అడుగుపెట్టారు. ఆ విధంగా జాతీయ రాజకీయాలలోకి ప్రవేశించారు. ఢిల్లీ నుంచే ఆయన పెద్దల సభకు వెళ్లారు. 1976లో గుజరాత్‌ ‌నుంచి మరొకసారి రాజ్యసభ సభ్యుడయ్యారు. స్వాతంత్య్రం వచ్చిన 26 సంవత్సరాల తరువాత దేశంలో విధించిన అత్యవసర పరిస్థితి ఎంత చేటు చేయగలదో అంచనా వేసిన వారిలో అడ్వాణీ ఒకరు. అత్యవసర పరిస్థితికి ఆయన సాక్షి. బాధితుడు కూడా.

సుదూర చరిత్రే కాదు, సమీప గతం కూడా భారతీయులకు, ప్రధానంగా రాజకీయ నాయకులకు పరగడుపేనన్న వాస్తవం ఆయన గొప్పగా గ్రహించారు. అత్యవసర పరిస్థితి తరువాత పరిస్థితిని బట్టి, కాంగ్రెస్‌ ‌కుటుంబ రాజకీయాలను ఆపాలన్న గట్టి లక్ష్యంతో ఆనాటి నాయకత్వం భారతీయ జనసంఘ్‌ను రద్దు చేసి, జనతాపార్టీలో విలీనం చేసింది. మొరార్జీ దేశాయ్‌ ‌నాయకత్వంలో జనతా ప్రభుత్వం ఏర్పడింది. అధికారంలో ఉన్నది దాదాపు రెండేళ్లు. అయినా అటల్‌ ‌బిహారీ వాజపేయి విదేశాంగ మంత్రిగా, అడ్వాణీ సమాచార ప్రసార మంత్రిగా గొప్ప సేవలు చేశారు. జనతా ప్రభుత్వంలో మాజీ జనసంఘీయుల సేవలు చెరగని ముద్ర వేశాయి. విదేశాంగ విధానాన్ని అటల్‌జీ మలుపు తిప్పారు. ఎన్నికల సమయంలో విపక్షాలకు ప్రభుత్వ మాధ్యమాలలో మాట్లాడే అవకాశం కల్పించిన వారు అడ్వాణీ. ఇంతకాలం ఏ విపక్ష అనైక్యత ఇందిరను, ఆమె నియంత పాలనను దీర్ఘకాలం దేశం మీద సాగడానికి ఉపకరించాయో, జనతా పార్టీతోనూ అదే అనైక్యత పునరావృతమైంది. ఫలితం ఒక గొప్ప సంకీర్ణ ప్రయోగం దారుణంగా విఫలమైంది.

సంఘ్‌ అనుకూల ఆంగ్ల వారపత్రిక ‘ఆర్గనైజర్‌’‌తో అడ్వాణీ అనుబంధం చిరకాలం కొనసాగింది. స్వయంగా రచయిత అయిన అడ్వాణీ ఆ పత్రికలో కాలమ్‌ ‌రాశారు. ఇక రచయితగా ఆయన ప్రతిభను చాటేదే ‘ఏ ప్రిజనర్స్ ‌స్క్రాప్‌ ‌బుక్‌’. ‌జూన్‌ 25, 1975‌న అత్యవసర పరిస్థితిని విధించిన ఇందిరా గాంధీ అడ్వాణీ, వాజపేయి, మధు దండావతే ప్రభృతులను బెంగళూరులో అరెస్టు చేయించారు. ఆ సమయంలో ఆయనను పరామర్శించడానికి ఆ రాష్ట్ర ప్రముఖ నాయకుడు రామకృష్ణ హెగ్డే, ఆయన భార్య శకుంతల వచ్చారు. కాలక్షేపం కోసమని, శకుంతల తను ఉపయోగించుకునే చిన్న ట్రాన్సిస్టర్‌ ‌రేడియోను అడ్వాణీకి ఇచ్చారు. ఆ రేడియో ఆధారంగా అడ్వాణీ రచించిన పుస్తకమే ‘ఏ ప్రిజనర్స్ ‌స్క్రాప్‌ ‌బుక్‌’. ఆనాడు భారతదేశంలో సెన్సార్‌షిప్‌ను విచక్షణా రహితంగా అమలు చేశారు. కానీ ప్రభుత్వ వార్తలన్నీ విదేశీ రేడియో కేంద్రాలు ప్రసారం చేసేవి. అవన్నీ విని అడ్వాణీ ఆ పుస్తకం అద్భుతంగా రాశారు. అత్యవసర పరిస్థితిలో భారతదేశంలో ప్రతికాస్వేచ్ఛ ఏ స్థాయిలో అడుగంటిందో ఆ పుస్తకం సాక్ష్యం చెబుతుంది. ఎమర్జెన్సీ చరిత్ర మీద వచ్చిన ది జడ్జ్‌మెంట్‌ (‌కుల్దీప్‌ ‌నయ్యర్‌), ఎం‌డ్‌ ఆఫ్‌ ఏన్‌ ఇరా (సీఎస్‌ ‌పండిట్‌), ‌డెమాక్రసీ రీ డీమ్డ్ (‌వీకే నరసింహన్‌) ‌వంటి పుస్తకాలతో సమానంగా అడ్వాణీ పుస్తకం చరిత్రలో స్థానం సంపాదించుకుంది. అత్యవసర పరిస్థితి కాలంలో పత్రికా రచయిత దిగజారుడు ఎంతటిదో కూడా అడ్వాణీ అంత స్పష్టంగా చెప్పిన రాజకీయ నేత మరొకరు లేరు కూడా. ‘వారు (ప్రభుత్వం) మిమ్మల్ని (జర్నలిస్టులను) వినయంగా ఉండమన్నారు. మీరు నేల మీద పాకారు’ అన్నారాయన. ఈ వ్యాఖ్యను ఇప్పటిదాకా అంతా ఆమోదిస్తూనే ఉన్నారు. చెప్పుకుంటూనే ఉన్నారు.

జనతా ప్రభుత్వ పతనం ఆధునిక రాజకీయ ప్రస్థానంలో పెద్ద విషాదమే. అందుకు దారి తీసిన పరిస్థితులలో ద్వంద్వ సభ్యత్వం సమస్య ఒకటి. అంటే ఆర్‌ఎస్‌ఎస్‌, ‌జనతా రెండింటిలోను సభ్యత్వం కుదరదన్నదే దాని సారాంశం. ఇదే మాజీ జనసంఘీయులు జనతా నుంచి బయటకు రావడానికి కారణమైంది. అయితే అప్పటికే జనతా ప్రభుత్వం పతనమైంది. ఏప్రిల్‌6, 1980‌లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది. అటల్‌జీ తొలి అధ్యక్షుడయ్యారు. పార్టీ అధ్యక్షునిగా అడ్వాణీ కూడా చిరకాలం (1986-1990, 1993-1998, 2004-2005) పనిచేశారు. 1996 నాటి హవాలా కేసులో తన పేరు (జైన్‌ ‌డైరీల వ్యవహారం) ఉందని ఆరోపణలు రాగానే అడ్వాణీ ఎంపీ పదవికి రాజీనామా చేసి సంచలనం సృష్టించారు. అది సంచలనమే అయినా, ఒక విలువ కోసమే ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారు. తన పేరు అందులో లేదని తెలిసిన తరువాతనే ఆయన 1998 మళ్లీ పోటీ చేసి గెలిచారు. 2004లో బీజేపీ ప్రతిపక్షానికి పరిమితమై నప్పుడు విపక్ష నేతగా పనిచేశారు. వాజపేయి ప్రభుత్వంలో ఉపప్రధానిగా, హోం మంత్రిగా అడ్వాణీ వేసిన ముద్ర చెరగనిది. హోంశాఖ కరాకండీగా వ్యవహరించడం మళ్లీ అడ్వాణీతోనే మొదలయింది. ప్రజా జీవితంలో ఉండవలసిన స్వచ్ఛతకి ఇలాంటి చర్యలు అవసరమవుతాయని భావిస్తున్నట్టు ఆయన చెప్పారు. 2014లో ఆయన గాంధీనగర్‌ ‌నుంచి లోక్‌సభకు గెలిచారు. 2019 నుంచి ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు స్వస్తి పలికారు. అడ్వాణీ ఓపెన్‌ ‌మైండెడ్‌గా ఉంటూ, విమర్శలను స్వీకరిస్తారని మేధావులు చెబుతారు.

అడ్వాణీ 1985 నుంచి బీజేపీకి సర్వం తానే అయ్యారు. ఆయన ప్రభావం పడని కార్యకర్త దాదాపు లేడు. ఉత్తర భారతదేశ పార్టీగా, బనియాల పార్టీగా, హిందువుల, హిందీ భాషా ప్రాంత పార్టీగా – ఒక్క మాటలో చెప్పాలంటే అంటరాని పార్టీగా (మిగిలిన రాజకీయ పార్టీల వరకు) ఉండిపోయిన బీజేపీని ఒక సర్వజనామోద పక్షంగా అడ్వాణీ, వాజపేయి తీర్చిదిద్దారు. ఔత్తరాహుల పార్టీ అన్న ముద్రను చెరిపివేశారు. 1989 నుంచి పాతిక సంవత్సరాల పాటు రాజకీయ సుస్థిరత లేకుండా బాధపడుతున్న దేశంలో ఒక బలమైన అధికార పక్షాంగా ఆవిర్భవించే దిశగా బీజేపీని నడిపించారాయన.

కాంగ్రెస్‌కు గడ్డురోజులు తెచ్చిన పరిణామాలలో కీలకమైనవి రెండు. అది చేసిన రెండు మహా తప్పిదాలే ఆ రెండు. ఒకటి అత్యవసర పరిస్థితి. రెండు అయోధ్య సమస్య పట్ల వ్యవహరించిన తీరు. ఈ రెండింటిలోను అడ్వాణీ కీలకంగానే ఉన్నారు. అది ఆయన రాజకీయ ప్రాముఖ్యానికి నిదర్శనం. అడ్వాణీ గొప్ప వక్త. అయితే క్లుప్తంగా విషయం వివరించే తత్త్వం ఆయనది. ప్రజా జీవితంలో విలువలు ప్రవేశపెట్టడానికి, వాటిని ఆచరించడానికి తపన పడిన ఇటీవలి కాలపు రాజనీతిజ్ఞుడు లాల్‌ ‌కృష్ణ అడ్వాణీ. 1984లో లోక్‌సభలో కేవలం రెండు స్థానాలు ఉన్న పార్టీ ఇవాళ 303 స్థానాలకు చేరుకునేటట్టు చేయడంలో అడ్వాణీ నిర్వహించిన పాత్ర ఎనలేనిది. చిరస్మరణీయమైనది. పార్టీలోనే అటు సాటి సీనియర్లకు, ఇటు ఇతర నేతల స్థానానికి ఎలాంటి భంగం లేకుండా తాను ఎదుగుతూ, పార్టీని నిర్మించిన మార్గదర్శకుడు అడ్వాణీ. ఆయన నమ్మిన సిద్ధాంతాలను ఎంత నిశితంగా విమర్శించినా అడ్వాణీని వ్యక్తిగతంగా విమర్శించే సాహసం భారత రాజకీయాలలో ఇంతవరకు ఎవరూ చేయలేదు. ఐదు దశాబ్దాల ఆయన నిష్కళంక ప్రజా జీవితానికి గుర్తింపు భారత రత్న పురస్కారం. భారత రత్న పురస్కారానికి ఎంపికైన సందర్భంలో అడ్వాణీకి జాగృతి అభినందనలు. ఆయనకు శ్రీరామచంద్రుడి ఆశీస్సులు ఉండాలని ఆశిద్దాం.

– జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram