అప్పటికే ఆమె కవయిత్రి. కవితలెన్నో రాశారు. ఒకసారి ఆయనతో సమావేశమయ్యారు.

‘నా రచనలు మీరు చూస్తున్నారు కదా’ అడిగారు. చూడటమే కాదు… చదువుతున్నా’ బదులిచ్చారాయన.‘మరి – సాహిత్యపరంగా మీ సలహా?’‘ఇవ్వాల్సిన పనుంది. ఇంకా ఇంకా రాయండి. భావాలు ఎలాగూ ఉంటాయి. పదబంధాలమీద చూపు నిలపండి’‘అంటే?’‘అదే చెప్తున్నా. ఏ భావమైనా భాషతోనే అందగిస్తుంది. మీ మాటలు పూలు ఎలా ఉంటాయో అలా ఉండాలి. అవి సుతారంగా చదువరి మనసును తాకాలి. బలంగా కాదు… సుతిమెత్తగా’

‘మీ మౌనం వెనుక ఏముందో నాకు తెలుసు. అదను చూసి పదునుగా రాయండి. పాఠకుల మనసు గెలుచుకోండి.’

‘ఆ తర్వాత’

‘భరతమాత’ బంధనాలు పటాపంచలవుతాయి. మన దేశం విముక్తమ వుతుంది. కలాన్ని ఖడ్గంగా కాదు – సమహారంగా మలచండి. స్వాతంత్య్ర పిపాసను అంతటా పెంచండి. రచయిత్రిగా ఇదే మీ మొదటి, ముఖ్య బాధ్యత’

ఆమె కళ్ళు మిలమిలా మెరిశాయి. అటు తర్వాత కాలక్రమంలో కవితల విరివానలెన్నో కురిశాయి. తన రచనలకు అర్థపరమార్థాలు కలిగాయి. ఆయన గోపాలకృష్ణ గోఖలే. ఆమె సరోజినీ నాయుడు!

‘స్ఫటికంలా స్వచ్ఛం ఆ మనసు. ఎంత సౌమ్యుడో అంత ధీరుడు.  అక్షరాన్నే నమ్మిన పరిపూర్ణుడు’ అని జాతిపిత ప్రశంస అందుకున్న మాననీయుడు గోఖలే. అప్పట్లో తనను సంప్రదించిన కలల యోధురాలికి మార్గనిర్దేశం చేసిన మహనీ యుడు. ఆ వనితా యోధ- అనంతర ‘భారత కోకిల’ అయ్యారు.

సరోజినీనాయుడు పుట్టింది హైదరాబాద్‌లో. చిన్నవయసులోనే మెట్రిక్‌ ‌చదువుకుంది మద్రాసులో. తండ్రి అనేక భాషల్లో పండితుడు. భాగ్యనగర కళాశాల ప్రధాన అధ్యాపకుడిగా అనుభవం గడించిన దీక్షాదక్షుడు. తల్లి బెంగాలీ భాష సాహిత్యవేత్త. మనందరికీ తెలిసిన ‘గోల్డెన్‌ ‌త్రెషోల్డ్’ ‌సరోజిని నివాసస్థలం. విద్య, వారసత్వ, సాంస్కృతికపరంగా ఎందరెందరికో చిరపరిచిత భవన ప్రాంగణం. ఇప్పుడైతే హైదరాబాద్‌ ‌విశ్వవిద్యాలయ నిర్వాహకత్వం.

కవి కోకిలకు బంగారు వాకిలి! అప్పటికీ, ఇప్పటికీ కళలూ, సంస్కృతుల నెలవు. అదే గోల్డెన్‌ ‌త్రైషోల్డ్. ‌పేరిట వందలాది పంక్తుల సుదీర్ఘ కవితాఖండికను రాసినపుడు, సరోజినికి కేవలం పదమూడేళ్లు! పుస్తక ఆవిష్కరణ మాత్రం విదేశీ నగరమైన లండన్‌లో, కానీ స్వదేశీ కీలకమైన హైదరాబాద్‌లో అది ఏర్పాటైంది. భవంతి జాతీయ, అంతర్జాతీయ విఖ్యాతిని అందుకుని నిలువెత్తు నిదర్శనంగా భాసిస్తోంది. వివిధ భాషలవల్ల, కళారూపాల కూడలిగా వర్థిల్లుతోంది.

బాల్యం నుంచే భాష, భావ నిపుణత నిండిన ఆమె తన కావ్యానికి పెట్టిన మొదటిపేరు ‘సరోవర రాణి’. ఆ అక్షర ప్రతిభ సుప్రసిద్ధుల దృష్టికెళ్లింది. విదేశీ యానానికి దారితీసింది. లండన్‌ ‌కళాశాల, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయ సంస్థల్లో సరోజిని విద్యాభ్యాసం కొనసాగింది. కావ్యరచనల పరంపర వేగం అందుకుంది.

బంగారు వాకిలిని ‘స్వర్ణద్వారం’గా కీర్తించారు విమర్శకులు. కాలవిహంగం, విరిగిన రెక్కలు వంటి ఆంగ్ల గ్రంథాలనూ ఎంతగానో కొనియాడారు. పరకాయ ప్రవేశం తరహాలో… అక్కడ ఉండి ఇక్కడి జీవితాలను ఆ కవయిత్రి చిత్రీకరించిన రీతిని పలు విధాలా మెచ్చుకున్నారు. కవన కదన వైఖరికి జేజేలు పలికారందరూ.

విదేశాల్లో విద్య కాగానే, స్వదేశానికి తిరిగొచ్చా రామె. ఇక్కడే గోవిందరాజులు నాయుడితో పరిణయం.

విముక్త ఉద్యమం సాగుతున్న రోజులవి. స్వేచ్ఛాయుత వాతావరణమే ఆమె కోరుకుంది కూడా. సారస్వత మూర్తిగా రంగప్రవేశం చేశారు. గోపాలకృష్ణ గోఖలే నేతృత్వాన కదిలారు.

దాస్య జీవితం ఎప్పుడూ బాధాకరమే. తూటాలకు బెదిరితే, లాఠీలకు అదిరితే, కారాగార శిక్షలకు జంకితే ఎలా…. అంటూ ప్రజను ఉత్తేజపరిచారు. తాను కదిలి, తన వారిని ముందుకు నడిపించారు.

దేశంలోనివారిని, విదేశంలో ఉన్న భారత సంతతివారినీ చైతన్యవంతం చేశారు సరోజినీ నాయుడు తన రాతలూ, పర్యటనలతో!

నువ్వు వేరే వ్యక్తివి కాదు

ఆ ఆలోచనే చేయకు ఒక్కగా

‘ఎక్కడో ఉన్నాను కదా’ అనుకోకు.

నీ మూలం ఇక్కడేనని మరవకు.

నువ్వూ, నీ దేశం, నీ జాతి

అంతా ఒక్కటే. మనదంతా ఐక్యతే!

నీ కదలికతోనే ఏకత

స్వతంత్ర సాధనతోనే తీరుతుంది వెత.

సంకెళ్లకు అలవాటుపడితే నిరాశ

తెంచుకునే నీ యత్నంతోనే సత్వర సఫలత

వంటి కవితా పంక్తులతో చైతన్య జ్యోతిని వెలిగించి పరీక్షించారామె.

దేశ విదేశాల్లోని స్థితిగతులకు చలించారు. 1926లో దక్షిణాఫ్రికా వెళ్లారు. అక్కడి భారతీయ హక్కుల కోసం ఉద్యమాన్ని విస్తరించారు. 1928లో అమెరికా, కెనడాలకు చేరుకున్నారు. విముక్త సాధన ప్రాధాన్యాన్ని అక్కడా విపులీకరించారు. మరో ఏడాదికే తూర్పు ఆఫ్రికాను సందర్శించారు. అలుపూ సొలుపూ లేని పర్యటనలే అవన్నీ. ఆంగ్ల పాలకుల గుండెలదిరాయి. దమనకాండకు దిగారు. కారాగారంలో బంధించారు. నెలల తరబడి బాధించారు.

ఆ చీకటి కొట్లలో ఆమె ఆరోగ్యం క్షీణించసాగింది.

అయినా తన సంకల్ప శక్తిని ఆపలేకపోయారు ఎవరూ!

1947కు ముందు రెండు సంవత్సరాలవరకు ఆమెకు నిర్బంధవాసమే.. భరించారు, సహించారు.

ఉద్యమ తీవ్రత మహాగ్నిని తలపించింది. ఫలితంగా భారతదేశం దాస్య విముక్తమైంది. స్వేచ్ఛాపతాక వినువీధిన ఎగసింది.

స్వాతంత్య్ర అనంతర తరుణంలో –

ఉత్తరప్రదేశ్‌కు మొట్టమొదటి మహిళా గవర్నర్‌ ‌సరోజినీ నాయుడే.

సామాజిక, సాంస్కృతిక, కళా, సాహిత్య రంగాలకూ విస్తరించాయి. ఆ మహిళామణి నేతలు. అవి అపురూపం, అనంతం. రచనలపరంగా ఎంతైనా నాణ్యత. జాతీయతకీ సమధిక ప్రాధాన్యత.

నవరసాలనూ పండించిన విదుషీమణి

భారతీయ కోకిల.

‘భారతీయుల కళాప్రాభవమ్మొలికించి

తీయగా పాడిన కోయిలమ్మ!

స్వారాజ్య వీర విహార రంగములోన

కోరి దూకిన వెలుగు కోడలమ్మ!

భరతనారీ ప్రతాప ప్రభావ గరిమ

ఖండఖండాలు జల్లి. విఖ్యాతిగన్న

దివ్యమూర్తి!’ అంటూ కవుల కళలు శ్లాఘించాయి.

‘ఆ దేవి దివ్యసుగుణ పుష్పముల

ఏరి విరిదండ పూర్తిచేసి

పుణ్యభారతమాతను పూజచేసి

ఘనతకెక్కుడీ బారత వనితలారా!’

అని ప్రబోధించింది ఘంటసాల గళమాధురి.

సరోజినీ నాయుడి దృష్టికోణంలో –

  1. మానవ జీవితం అనంత కవితాత్మకం.
  2. తనలోనే, తనతోనే దాని ఆవిష్కరణం.
  3. ఆదేశం, ఈ దేశం అనుకుంటేనే భిన్నత్వం.
  4. తేరిపారచూస్తే మాత్రం అంతా ఐక్యసూత్రం.

మనలోని సున్నితత్వం, సునిశితత్వం పదిలంగా ఉండాలెప్పుడూ. వాటిమీద ఎటువంటి ముద్రలూ పడకూడదు. ఎన్నడూ చెక్కు చెదరరాదు. మనల్ని మనం తెలుసుకుంటే, తెలిసింది ఆచరణకు తెస్తే – అప్పుడే, ఆనాడే స్వేచ్ఛ, సమత్వం, స్వతంత్రం, పరిరక్షణం.

ఇంతటి ప్రత్యేకత, విలక్షణత వెల్లివిరిసిన తేజోమూర్తి కాబట్టే; ఇదే ఫిబ్రవరి నెలలో సరోజినీ నాయుడు జయంతి… జాతీయ వనితా దినోత్సవ సుసందర్భం. ఆ కోకిలమ్మను స్మరిద్దాం. సంభావిద్దాం. పాండితీ, స్వరప్రభను మనమూ అవలోకిద్దాం. ఆస్వాదిద్దాం.

‘అమ్మా! సరోజినీ దేవీ! పరిపూర్ణ సువర్ణ కళామయ జీవీ!’

జంధ్యాల శరత్‌బాబు

సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE