Glimpses of Pran Pratishtha ceremony of Shree Ram Janmaboomi Temple in Ayodhya, Uttar Pradesh on January 22, 2024. PM presents on the occasion.

దేశమంతా ప్రస్తుతం రామనామంతో దద్దరిల్లిపోతున్నది. అయోధ్య పేరు వినగానే ప్రజలు పులకరించి పోతున్నారు. ఐదువందల ఏళ్లకు పైగా తన సొంత గృహానికి దూరమైన ప్రభు శ్రీరాముడు ఇప్పుడు నూతనంగా దివ్యంగా, భవ్యంగా నిర్మించిన నూతన మందిరంలోకి ప్రవేశించాడు. ఆ దివ్యభవ్య మందిరంలో విరాజమానమైన తమ ప్రభువును ఎప్పుడెప్పుడు దర్శించు కుందామా అని యావత్‌ ‌దేశం తహతహలాడుతోంది. ఈ సమయంలోనే కొన్ని అరాచక శక్తులు శంకరాచార్య పీఠాలను అడ్డుపెట్టుకొని ఈ ఉత్సాహపూరిత వాతావరణంపై నీళ్లు చల్లే విఫలయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే అందులోని సత్యాసత్యాలను చర్చించేందుకు ఉద్దేశించిందే ఈ వ్యాసం.

హిందూత్వం బహు సుందరమైంది. అది చర్చల సంప్రదాయాన్ని, పాండిత్య వాదనలను ప్రోత్సహించడమే కాదు, సున్నితమైన ప్రత్యామ్నా యాలను తిరస్కరించి, ఎదుటివారిపై హింసకు తావులేకుండా, విముక్తినిచ్చే సత్యానికి తక్కువ మరి దేనినీ అంగీకరించని సమూల సంస్కరణవాదాన్ని, విప్లవ తత్వాన్ని ప్రాచీనకాలం నుంచి సజీవంగా నిలుపుకున్నది. ఒకరకంగా, హిందువులు కేవలం విభేదించడానికి మాత్రమే అంగీకరించారు. ‘ఇతర వ్యక్తులు అనుసరించే మార్గాలు ఎక్కడికీ దారితీయని భ్రాంతిపూర్వక పథాలు అని తెలిసినా, అందులో జోక్యం చేసుకోరు’ అని బెల్జియం చరిత్రకారుడు డా।। కాన్‌రాడ్‌ ఎల్సట్ అం‌టారు. అందుకే హైందవ ధర్మం ఒక నదిలా ప్రవహిస్తూ, ఆటంకాలు ఎదురైనప్పుడు తన ప్రవాహాన్ని మళ్లించుకొని ప్రవహించిందే తప్ప ఎక్కడా ఆగిపోయి, పాచిపోలేదు. హైందవం తన మూలాలను కాపాడుకుంటూనే నిత్య నూతనంగా ప్రాచీన కాలం నుంచి ప్రవహిస్తోంది. ధర్మం అంటే, ఈ సృష్టితో సామరస్యాన్ని, పొందికను నిర్వహించేదే. అందుకే, హైందవ ధర్మం జీవన విధానమైంది తప్ప మతం కాలేదు.

ఈ క్రమంలోనే దాదాపు 72 భిన్న విశ్వాసాలు, ధర్మాలు (వైదికేతర) హిందూ ధర్మాన్ని సవాలు చేసి, సమాజాన్ని అతలాకుతలం చేస్తున్న కాలంలో ఆదిశంకరుడు దేశం నలుమూలలా పర్యటించి, వివిధ విశ్వాసాల పండితులతో, చర్చలను నిర్వహించి, వారి వాదనలను ఓడించి మరీ హిందూ మతాన్ని పునరుజ్జీవింపచేసి, సంస్కరించారు, దేశం మొత్తాన్నీ ఏకతాటిపైకి తెచ్చారు.

ఈ క్రమంలో ఆయన ఎప్పుడూ మరొకరి వాదనను కించపరచలేదు, తిరస్కరించలేదన్న వాస్తవాన్ని గుర్తించడం కూడా మనకు అవసరం. నిత్యనూతనమైన, సచేతనమైన హైందవ జీవన విధానంలోని గొప్పతనాన్ని ఆయన నాటి ప్రజలకు గుర్తుచేసి, వారు అందులో సమ్మిళితం కావలసిన అవసరాన్ని తెలియచేశారు. అందుకే దేశంలో నేటికీ పలు తాత్వికతలు, సిద్ధాంతాలు ఇంకా కొనసాగు తున్నాయి. ప్రజలు క్రమబద్ధమైన జీవితాన్ని సాగించేందుకు, హిందూ ధర్మ సజీవతను కొనసాగించేందుకే ఆయన భారతదేశం నాలుగు దిక్కులా నాలుగు పీఠాలను ఏర్పాటు చేసి, కంచిలో యోగ పీఠాన్ని నెలకొల్పి అక్కడ కొంతకాలం బసచేశారు. మనిషిలో అంతర్గతంగా ఉండే క్రూరత్వం నుంచి అతడిని విడుదల చేయాలని గ్రహించి, విశిష్ట, విజయవంతమైన ప్రయత్నానికి రూపకల్పన చేసి, ప్రారంభించడమే కాదు, శ్రేష్టమైన గురు పరంపర ఆ ఉన్నత భావనను యుగ యుగాలుగా ముందుకు తీసుకువెడుతున్నారనేందుకు ఈ పీఠాలే సాక్ష్యం. అందుకే ఈ పీఠాల అప్రతిహ తంగా శంకరుల పరంపరలోనే కొనసాగుతున్నాయి.

ప్రాథమిక హిందూ గ్రంథాలు అయిన వేదాలు, భగవద్గీతలో కుల వివక్ష లేదా అస్పృశ్యతకు సంబంధించిన భావనలు కనిపించవు. అవి విశ్వ వాస్తవాలను ఆవిష్కరించి, మోక్షమనే అత్యున్నత ఆధ్యాత్మిక లక్ష్యాన్ని ప్రతి మనిషి సాధించేందుకు అవసరమైన మార్గాన్ని అందించాయి. హిందూ సమాజం కూడా ఆ భావనలను ఒంటబట్టించుకొని కొనసాగుతూ వచ్చింది. అయితే, విదేశీ పాలకుల కుట్రల కారణంగా దేశంలో వర్ణం కాస్తా కులమై, చివరకు ఆ కుమే ఒక పరికరమై పోయింది.

ఆది శంకరులవారు కూడా ఇటువంటి భావనలను వ్యక్తి అధిగమించాలనే విషయాన్ని గ్రహించే ‘మనీషా పంచకాన్ని’ రచించారని అంటారు. కాశీలో ఉన్న ఆది శంకరులవారు తన శిష్యులతో కలిసి గుడి వైపుగా వెడుతుండగా, ఆయనకు ఒక ఛండాలుడు ఎదురు రావడం, శంకరులవారు అతడిని పక్కకి తప్పుకోమని చెప్పడం, అప్పుడు అతడు… ‘ఓ మహానుభావా! నన్ను దారికి పక్కగా తొలిగిపొమ్మని నువ్వన్నది, నేను తక్కువ జాతికి చెందినవాడననా? లేక ఒక శరీరంలో ఉన్న ఆత్మ, మరో శరీరంలోని ఆత్మను పక్కకి తొలగి పొమ్మని చెబుతుందా? ఈ రెండిటిలో ఏది పక్కకి తప్పుకొని దూరంగా ఉండాలి?’ అంటూ ప్రశ్నించి నప్పుడు, అతడిని ఈశ్వరుడిగా గుర్తించిన శంకరుల వారు ఐదు శ్లోకాలను మనీషా పంచకంగా ప్రజలకు అందించారు. అందులోనే ఆయన –

‘ఈ జగత్తంతా ఆ పరమాత్మ పరబ్రహ్మ స్వరూపమే. అజ్ఞానం వల్లనో, త్రిగుణాల (సత్త్వరజ•్త•మో గుణాలు) ప్రభావంతో పరబ్రహ్మ స్వరూపాన్ని చూడలేము. వీటికి అతీతంగా తనని తాను నిర్మలమయిన, అనంతమయిన పరమాత్మ పరబ్రహ్మగా గుర్తించినవారు ద్విజుడయిన బ్రాహ్మణుడే కానీ, చండాలుడే కానీ-నా గురువుగా అతడిని నేను నమ్ముతాను’ అన్నారు.

అటువంటి పరంపర నుంచి వచ్చిన పీఠాధిపతు లైన శంకరాచార్యులను అపకీర్తిపాలు చేసే ప్రయత్నం ఇప్పుడు జరుగుతున్నది. శంకరాచార్య పరంపరకు చెందిన పీఠాధిపతులు ముహూర్తాన్ని తప్పు పట్టారని, కట్టడం పూర్తికాకుండానే ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నారని, బ్రాహ్మణేతరుడైన మోదీ ప్రాణప్రతిష్ఠ ఎలా చేస్తారని ప్రశ్నిస్తూ, అందుకే ప్రాణ ప్రతిష్ఠకు హాజరు కామన్నారనే ప్రచారం మీడియాలో తీవ్రంగా జరుగుతున్నది. ఈ క్రమంలోనే మీడియాలో, సోషల్‌ ‌మీడియాలో కూడా వారు ఏదో ఒక సందర్భంలో కులాల గురించి మాట్లాడిన క్లిప్పింగులను పోస్టుచేస్తూ, వారిని కులతత్వవాదులుగా ముద్రవేయడం కూడా జరుగుతోంది.

అయోధ్యలో శ్రీరాముని ఆలయ నిర్మాణం కల సాకారమవుతున్న వేళ, దేశ వ్యతిరేకశక్తులు రంగంలోకి దిగి, ఈ రకమైన ప్రచారానికి పాల్ప డ్డాయని చెప్పడానికి మనం సందేహించనవసరం లేదు. హిందూ మతం బలపడడాన్ని భరించలేని, మతాంతరీకరణ శక్తులు తమ చివరియత్నంలో భాగంగా శంకరాచార్య పీఠాలను భ్రష్టుపట్టించేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. గతంలో తమిళనాడు, ఆంధప్రదేశ్‌లలో మతాంతరీకరణను అడ్డుకున్నందుకు కంచి పీఠం 69వ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతీ స్వామిని దీపావళి రోజున అరెస్టు చేయించిన విషయం ఎవరి జ్ఞాపకాల నుంచీ జరిగిపోలేదు. ఆ ఘటన వెనుక ఉన్న శక్తులు ఎవరో కూడా తదనంతర కాలంలో బయటకు వచ్చాయి కదా? అవే శక్తులు ఇప్పుడు మరొక రూపంలో అయోధ్య ఆలయానికి సంబంధించి వివాదాన్ని రేకెత్తించేందుకు ప్రయత్నం చేస్తున్నాయి.

శైశవంలో హిందూ పునరుజ్జీవనం

నేడు ‘హిందూ పునరుజ్జీవనం’ జరుగుతున్న మాట వాస్తవం. అయితే, అది ప్రస్తుతం శైశవ దశలో ఉంది. అంటే, నిన్న మొన్నటి వరకూ మెకాలే, వామపక్ష చదువులు చదువుకున్న మనకు హిందుత్వం లేదా హిందూ ధర్మం గొప్పతనం గురించి మాట్లాడే సాహసం రాలేదు. కానీ, నేడు బాలాది వృద్ధ పర్యంతం అందరూ తాను హిందువునని ఎటువంటి సంశయమూ లేకుండా, నిర్భయంగా చెప్పుకుంటు న్నారు. తన విశ్వాసాలు, గత వైభవం ఎంత శాస్త్రీయమైనవో, ప్రాచీనమైనవో బహిరంగంగా చాటుకుంటున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ సగర్వంగా సంబరాలు జరుపు కుంటున్నారు. ఈ తరుణంలో హిందువుల ఆత్మగౌరవాన్ని మసకబార్చి, వారిలోనే విభజనలు తెచ్చేందుకు జరుగుతున్న ప్రయత్నమిది. ఇంకా శైశవంలోనే ఉన్న ఈ పునరుజ్జీవనోద్యమాన్ని మొక్కలోనే తుంచేయాలనే వృథా ప్రయాస జరుగు తున్నట్టు కనిపిస్తోంది.

ముందుగా అసంపూర్ణమైన ఆలయంలో ప్రాణప్రతిష్ఠ ఎలా చేస్తారంటూ కాంగ్రెస్‌ ‌సహా కొందరు ప్రతిపక్ష రాజకీయ నాయకులు ప్రశ్నించడం వెనుక ఉన్న ఆంతర్యం మనకు తెలిసిందే. ఇది బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ ‌కార్యక్రమమని, అందుకే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి తాము హాజరు కామంటూ వారు ప్రకటనలు చేసి విషయాన్ని రాజకీయం చేశారు. అయితే, వారి నియోజకవర్గాల ప్రజలు కూడా వారి మాట వినని పరిస్థితి కనిపించడంతో దేశ వ్యతిరేకశక్తులతో కలిసి ప్రజల దృష్టి మళ్లించేందుకు పీఠాధిపతులు కూడా అదే మాటంటున్నారనే పుకార్లు పుట్టించారు.

ఈ కారణంగా, ఇటువంటి అంశాలకు దూరంగా ఉండే పీఠాధిపతులు కూడా ముందుకు వచ్చి, తాము అలా అనలేదని పత్రికా ప్రకటనలు జారీ చేయ వలసి వచ్చింది. ఆదిశంకరులు స్థాపించిన నాలుగు పీఠాలలో ఉత్తరంలో స్థాపించిన జ్యోతిర్మయి బద్రికాశ్రమం పీఠాధిపతిగా చెప్పుకుంటున్న శ్రీ అవిముక్తేశ్వరానంద సరస్వతిని ఈ శక్తులు ఎంతో కొంతమేరకు ప్రభావితం చేసినట్టు ఆయన మాట్లాడే మాటలను బట్టి అనిపిస్తున్నది. వాస్తవానికి, ఆయన పీఠాధీశుడు అయ్యేందుకు అవసరమైన శిక్షణను పూర్తి చేసుకొని, పరీక్షలో నెగ్గి, మిగిలిన పీఠాధీశుల చేత ‘అర్హుడు’ అనిపించుకో వలసి ఉంది. ఆయనకు ఇంతవరకు ఆ అనుజ్ఞ రాకపోవడం, దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా ఆయన నియామకంపై స్టే ఇవ్వడంతో నిరాశతో ఉన్న ఆయనను వామపక్ష శక్తులు ప్రభావితం చేసి, సందర్భశుద్ధి లేని మాటలు మాట్లాడిస్తూ, పీఠాధీశులందరినీ ఒకటే గాటన గట్టి, అదే పంథాలో మాట్లాడుతున్నట్టుగా చిత్రిస్తున్నారు. కానీ, వాస్తవమది కాదనే విషయాన్ని మనం గుర్తించాలి.

ఇది హిందువులందరూ అప్రమత్తంగా ఉండవలసిన సమయం. హిందువుల పురోగతిని భరించలేని శక్తులు అనేకం ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. నిన్నటివరకూ మనను సెక్యులరిజం భ్రమల్లోనే ఉంచారు పాలకులు. నేడు హిందువుల పక్షాన నిలిచే ఒక ప్రభుత్వం కేంద్ర స్థాయిలో వచ్చినందువల్లనే నేడు దేశవ్యాప్తంగా ప్రతి ఇంట, వాడవాడలా నిర్భయంగా సంబరాలు, ఉత్సవాలు జరుపుకోగలుగుతున్నారన్నది నిజం. తాము ఒక ప్రాచీన నాగరికతకు చెందినవారిమన్న భావన వారిలో ఇప్పుడిప్పుడే స్థిరపడుతున్నది. అది వేళ్లూనుకునేలా ఈ పీఠాధిపతులు చేస్తారేమోనన్న భయంతోనే వారిని ఇప్పుడు నడిరోడ్డున నిలబెడు తున్నారు. ఈ కుట్రలను ప్రతి భారతీయుడూ గమనించాల్సి ఉంది.

దాదాపు ఐదువందల ఏళ్ల నిరీక్షణ అనంతరం ఈ కల నెరవేరుతున్న నేపథ్యంలో ధార్మిక పీఠాలకు అధిపతులుగా ఉన్నవారు అటువంటి మాటలు మాట్లాడుతారని విశ్వసించడం సరికాదు. ఏ ధర్మాన్ని అయితే వారు నిలబెట్టాలనుకున్నారో, దానికి సంకేతంగానే ఆలయం నిర్మాణం జరిగింది ఇప్పుడు. శంకరాచార్యులవారి బాటలో కాలినడకన పలుమార్లు దేశమంతా తిరిగి ‘నడిచే దేవుడు’ అని పిలిపించు కున్న కంచి పీఠాధిపతి పరమాచార్యులు శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు ఇచ్చిన ఆలయాల జీర్ణోద్ధరణ పిలుపులో భాగంగానే కంచి మఠాధీ శ్వరులు దేశవ్యాప్తంగా పర్యటిస్తూ ఆలయాల జీర్ణోద్ధరణ కోసం పాటుపడుతు న్నారు. అందులో భాగంగానే, అయోధ్య ఉద్యమ సమయంలో అక్కడ ఆలయ నిర్మాణం కోసం శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి హిందూ, ముస్లిం పక్షాల మధ్య సయోధ్య తెచ్చేందుకు జరిగిన చర్చల్లో పాలుపంచుకున్నారు. దానికి కొనసాగింపు గానే, ప్రస్తుత పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతీ స్వామివారు అయోధ్యలో ప్రాణప్రతిష్ఠకు ముందు రోజున ‘నేత్రోన్మీలనం’ క్రతువును ప్రారంభించి, మూల విగ్రహానికి న్యాసంతో ప్రత్యేక పూజను నిర్వహించారు. అంతేకాకుండా, మఠం తరుఫున రామచంద్రునికి ప్రత్యేక ఆభరణాలను సమర్పించారు. ట్రస్టు కంచిపీఠం మూలామ్నాయ పీఠం కనుక నాలుగు పీఠాలకు ప్రతినిధిగా శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామివారిని గుర్తించి, స్వాగతించడం విశేషం.

డి. అరుణ

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram