వాస్తవానికి విద్య ముఖ్యోద్దేశం వ్యక్తి సాంస్కృతిక జీవనాన్ని నిర్మాణం చేయడం. కాని ఆంగ్లేయులు మనపై రుద్దిన విద్యా విధానానికి దీనికి అణు మాత్రమయినా సంబంధం లేదు. ఆంగ్లేయు లకు పూర్వం భారతవర్షంపై దురాక్రమణలు అనేకం జరిగాయి. కాని భారత్‌ ‌బుద్ధి చైతన్యాన్ని ఎవరూ నశింపజేయలేకపోయారు. కేవలం రాజకీయంగా పరాధీనం కావడం చేత భావదాస్యం ఏర్పడదు. భావదాస్యం ఏర్పడడానికి రెండు కారణాలు ఉంటాయి.

1.ఓడిపోయిన వారి సంస్కృతి కన్నా గెలిచినవారి సంస్కృతి గొప్పది కావడం లేదా

2.ఓడిపోయిన వారు తమ స్వత్వాన్ని గురించి ఈ మాత్రం జ్ఞానం లేకుండా చేయడానికి ప్రయత్నం జరిగి, దాని ఫలితంలో వానిలో అపరిమితమైన న్యూనగండం ఉత్పన్నం కావడం. విదేశీయుల  సాంస్కృతిక శ్రేష్టత విషయంలో ప్రబల విశ్వాసం ఏర్పడడం, ఒక జాతి  భావ దాస్యానికి నాంది అని ఆంగ్లేయులకు బాగా తెలుసు. భారతీయుల ఆత్మ విశ్వాసం చెక్కు చెదరకుండా ఉంటే కొద్ది సంఖ్యలో ఉన్న తాము వారిని ఎల్లకాలం దాస్యంలో ఉంచలేమని ఆంగ్లేయులకు తెలుసు. జీవనోపాధికి సౌకర్యాలు, ఉద్యోగాలు, సమాజంలో గౌరవం వీటిని విద్యా విధానంతో ముడిపెట్టి వారు భారతీయ జీవన  సాంస్కృతిక సంస్కారాలను నాశనం చేశారు. సహేతుకము, విశుద్ధము అయిన భారతీయ, ఆధ్యాత్మిక సంస్కారాలను ఇలా నశింపజేసి వారు భారత్‌, ‌పతితము, అధమ శ్రేణిదీ అయిన ఒక జాతి అని ప్రచారం చేయనారంభించారు.

పాశ్చాత్యుల పరిశోధన వెనుక రాజకీయం

జస్టిస్‌ ‌కుడ్రాన్‌ ఒకచోట ఇలా వ్రాశాడు: ‘‘ఈ దృష్ట్యాను, ఇతర విధాలుగాను భారతదేశం నాగరికమైన దేశం కాదనీ, అది అనాగరికమైన దేశమనీ నిరూపించగలిగితే, రాజకీయ స్వాతంత్య్రానికి అది తగదనే వాదన బలపడుతుంది. ముఖ్యంగా భారతీయ నాగరికత ఆధ్యాత్మికమైనదనే వాదాన్ని ఖండించడం అవసరం. ఎందువల్లనంటే ఆధ్యాత్మికతను అందరూ గౌరవిస్తారు. అది ఉన్న చోట మిగతా సద్గుణాలన్నీ ఉంటాయి.’’

భారతీయ సంస్కృతి నీచశ్రేణికి చెందినదనీ, హిందూ సమాజం పూర్వులు ఆటవికులనీ, మొద్దులనీ హిందూధర్మం అజ్ఞానమయము, అంధకారమయము, అయిన పరిస్థితికి నిదర్శనమనీ నిరూపించడమే భారతీయ సాంస్కృతిక వాఙ్మయం  పరిశోధనలో పాశ్చాత్య పండితుల ఉద్దేశ్యం. వారి మరొక ఉద్దేశ్యం భారతీయులకు పాశ్చాత్య విద్యావిధానానికి అనుకూలురను చేయడం. మేక్స్‌ముల్లర్‌ ‘‌ఛిప్స్ ‌ఫ్రమ్‌ ‌జర్మన్‌ ‌వర్క్ ‌షాప్‌’ అనే గ్రంథానికి తాను వ్రాసిన ఉపోద్ఘాతంలో తన పరిశోధన కార్యం ఉద్దేశ్యాన్ని స్పష్టంచేస్తూ ఇదే భావాన్ని వ్యక్తం చేశాడు.

సాయనునికి వేదం అర్థం కాలేదనే పాశ్చాత్యులు

ఒక దేశ సాంస్కృతిక సంఘటనలోని అంతర్యాన్ని గ్రహించడానికి ఆ దేశపు ప్రాచీన పరంపరల జ్ఞానం అవసరం. పాశ్చాత్యపండితులు ఈ సత్యాన్ని గుర్తించక పోవడానికి కారణం వారి దృష్టి రాజకీయం కావడమే. కనుకనే డా.మేక్‌డనల్‌ ‌వలె పాశ్చాత్య పరిశోధకులలో దాదాపు అందరూ భారతీయ సాహిత్యం విషయంలో ఈ క్రింది నియమాన్ని అనుసరించారు:

‘‘ ఈ పరిశోధన ఉద్దేశ్యం సత్యాన్ని గ్రహించడమే. కనుక ప్రాచీన గ్రంథాల అనువాదకులు స్థానికులు కాక ఇతరులు కావడంలోనే ఎక్కువ ప్రయోజనం    ఉంది. స్థానికులు తమ మత పక్షపాతాన్ని వదులుకోలేకపోయారు.’’

ఇలాంటి నియమం ఏర్పరచుకున్న తర్వాత ఇక భారతీయ సంస్కృతిని గురించి ఏది తోచితే అది వ్రాయడానికి దోవ ఏర్పడింది. పాశ్చాత్యులద్వారా నిర్మితమైన భారతీయ విజ్ఞానం కపోల కల్పితములైన సిద్ధాంతములు ఆసరాగా ఏర్పడినది.

– బాశాస్త్రి హరదాస్‌

‘‌జాగృతి’ 08.06.1964 సంచిక నుంచి

About Author

By editor

Twitter
Instagram