వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీలో తృతీయ బహుమతి పొందిన రచన

‘‌స్వాతంత్య్రం కోసం చేసే యుద్ధం ఒక పోరాటం..ఆధిపత్యం కోసం అహంకారంతో  చేసే యుద్ధం ఒక ఉన్మాదం. ’ఇది చరిత్ర చెప్పిన ఛాయాచిత్ర సాక్ష్యం. ఒక నిశ్చల ఛాయాచిత్రం అక్షరాల వెలుగులో పురుడు పోసుకుంది.  కాలం సాక్షిగా చరిత్రలో మిగిలింది. చదువరుల హృదయాల్లో నిలిచింది. ఒక యుద్ధాన్ని ఆపింది. ఒక కన్నీటి చెమ్మను సృష్టించింది.

కెమెరాల ఫ్లాష్‌లు, యాంకర్ల చేతుల్లోని మైకులు నిర్విరామంగా పని చేస్తూనే ఉన్నాయి. అనామిక ఇంటి ముందు కోలాహలం. ఓబీ వ్యాన్లు హడావిడి దీనికంతటికీ కారణం. ఇరవై మూడేళ్ల అనామికకు జాతీయ స్థాయిలో బెస్ట్ ‌ఫొటోగ్రాఫర్‌ అవార్డు రావడం.

చిన్నప్పటి నుంచి ఫొటోగ్రఫీ మీద ఉన్న ఇష్టంతో కంటికి కనిపించి మనసుకు నచ్చిన ప్రతి విషయాన్నీ కెమెరాలో బంధించే అనామిక ఈ సంవత్సరానికి గాను జాతీయ స్థాయిలో బెస్ట్ ‌ఫొటోగ్రాఫర్‌ అవార్డు అందుకుంది.

హాల్లో గోడమీద ఉన్న చిత్రం అనామిక హృదయాన్ని, స్పందించే ఆమె మనసును ఆవిష్కరిస్తుంది.

‘‘ఒక తల్లి తన పక్కనే ఉన్న బిడ్డకు సీసాలో పాలు పడుతోంది. మరోవైపు అనాచ్ఛాదితంగా బొమ్మలా కూర్చొని ఉంది. ఆమె స్తన్యం నుంచి పాలధార కారుతోంది’

ఆమె ఒంటరి తల్లి. బిడ్డను బ్రతికించుకోవడానికి మోడల్‌గా మారింది. చిత్రకారులకు స్ఫూర్తిని ఇచ్చే మోడలింగ్‌.

ఆమె నగ్నంగా కూర్చుంది. మోడలింగ్‌ ‌చేసినందుకు వచ్చిన డబ్బుతో బిడ్డను పోషించుకోవాలి… బిడ్డ ఏడుస్తుంది. బిడ్డకు సీసా పాలు పడుతూ మరోవైపు ఆ భంగిమలో చిత్రకారుడికి సహకరిస్తుంది.

ఆ దృశ్యం చూసిన అనామిక చేతివేళ్లు కెమెరాను క్లిక్‌ ‌మనిపించింది. అద్భుతమైన దృశ్యం.

‘బిడ్డకు పాలు పడుతూ, ఒక బొమ్మలా ఆ అమ్మ కూర్చుని ఉంటే, చిత్రకారుడు ఆ దృశ్యాన్ని కాన్వాసు మీద చిత్రిస్తూ ఉంటే, ఆ దృశ్యాన్ని ఫొటో తీసి పోటీకి పంపించింది. డబ్బు కోసం కాదు, ఆ ఫొటో చెప్పే మనసు కథను ప్రపంచానికి చెప్పడానికి’. బహుమతిని గెలుచుకున్న అనామికను మీడియా చుట్టుముట్టింది. అభినందనల పర్వం, ప్రశ్నల వర్షం. అందరికీ సమాధానం చెబుతోంది.

‘‘మీలాంటి ఫొటోగ్రాఫర్‌ ‌మన రాష్ట్రానికి గర్వకారణం’’ మీడియా అభినందిస్తుంటే. ప్రముఖుల సందేశాలు టీవీ ఛానెల్స్‌లో స్క్రోల్‌ అవుతున్నాయి.

అప్పుడు..అప్పుడు..అప్పుడు గొంతు విప్పింది అనామిక.

అనామిక కాటన్‌ ‌చీరలో, చాలా సింపుల్‌ ‌గా ఉంది.

‘మీ అభినందనలకు, ప్రశంసలకు ధన్య వాదాలు. కానీ మీరు భావిస్తున్నంత గొప్ప వ్యక్తిని కాదు. ఫొటోగ్రాఫర్‌ ‌కావాలనే నా కోరిక, నా వెనుక ఉన్న వ్యక్తులు ఇద్దరు..’ చెప్పడం ఆపింది. మీడియా లైవ్‌ ‌పెట్టింది. ఆసక్తిగా అనామిక మాటలు వినడానికి. కాసేపు మైకులు మౌనవ్రతం పాటిం చాయి.

అనామిక హాల్లో కుడివైపు నడిచింది. అక్కడ గోడ మీద ఒక చిత్రం ఉంది. చక్రాల కుర్చీలో కూర్చున్న ఆజాను బాహుడు. ఆ చిత్రాన్ని దాటి ముందుకు వెళ్లింది. అక్కడ ఒక సజీవ సాక్ష్యం. చక్రాల కుర్చీలో ఉన్న వ్యక్తి.

అనామిక అక్కడికి వెళ్లింది. సహాయకులను పక్కకు తప్పుకోమని చెప్పి ఆ వీల్‌ ‌చైర్‌ని మీడియా ముందుకు తీసుకుని వచ్చింది.

‘నాకు జన్మను ఇచ్చిన తండ్రి. నేను ఫొటోగ్రాఫర్‌గా సాధించే విజయాల కన్నా, నేను తీసే ఛాయాచిత్రాలు ప్రాణం పోసుకుని ప్రపంచాన్ని పలకరించాలని ఆశ పడ్డ వ్య్త.’ తండ్రి పాదాలకు నమస్కరిస్తూ చెప్పింది. ఒక్క క్షణం ఫ్లాష్‌ ‌లైట్‌ ‌వెలుతురులు ఆకాశంలో మెరుపులతో పోటీపడ్డాయి.

అనామిక మాట్లాడడం కొనసాగించింది.

‘కెమెరాతో నేను చేసింది సాహసం కాదు, సహవాసం. కానీ అంతకు మించి ఒక ఉన్మాద యుద్ధాన్ని ఆపిన ఒక ఫొటో మీకు చూపిస్తాను, ప్రపంచాన్నే కదిలించి, ఒక యుద్ధాన్ని ఆపిన స్ఫూర్తి చిత్రాన్ని చూపిస్తాను’

అనామిక కదిలింది. కెమెరాలు ఆమెను అనుసరించాయి. ఒక ఉద్విగ్న భరిత వాతావరణం అక్కడ నెలకొని ఉంది.

అనామిక తండ్రి వీల్‌చైర్‌ని ముందుకు కదిలించింది. ఎడమవైపు గోడమీద ఒక సన్నటి తెర. దానిని తొలగించింది.

చీకటిని చీల్చుకుంటూ, ఒక నిశ్చల ఛాయాచిత్రం. ఒక సినిమా తెర సైజులో ఉంది. నలుపు తెలుపుల చిత్రం యుద్ధభూమి దృశ్యం.

కురుక్షేత్రాన్ని పోలిన యుద్ధక్షేత్రం.

ఆకాశం నుంచి కిందికి జారుతున్న కెమెరా…కిందకి జారుతూ నేలమీద దృశ్యాన్ని బంధిస్తూ… ఆ కెమెరాలో వెలుగు….చుట్టూ మృతదేహాలు. మధ్యలో ఒక మహిళ ..ఆమె కుడి చేతిలో ఒక కెమెరా ఆకాశం వైపు చూస్తూ…రెండు కాళ్ల మధ్య స్రవిస్తోన్న రక్తధార..పాదాల చివర అప్పుడే ప్రసవించిన బిడ్డ రక్తం ఓడుతూ…ఆ పక్కనే మరో వ్యక్తి రక్తపు మడుగులో…

ఒక ఉన్మాద యుద్ధానికి సాక్షిగా..

గోడ మొత్తాన్ని పరుచుకుని ఉన్న ఆ ఫొటో కళ్లకు కట్టినట్టు ఉంది.

ఆ ఛాయాచిత్ర కథనాన్ని అనామిక గొంతు తర్జుమా చేస్తుంది.

అక్కడ నిశ్శబ్దం ఊపిరి బిగబట్టింది.

సుమారు యాభై యేళ్ల క్రితం రెండు దేశాల మధ్య యుద్ధం. ఆధిపత్యం కోసం, అణగదొక్కాలనే అహంకారం. యుద్ధం వల్ల దేశాలు మాత్రమే కాదు. ఆయా దేశాల్లోని అమాయక ప్రజలు, అప్పటివరకూ సాధించిన ప్రగతి. పచ్చని భూభాగం రక్తసిక్తమై, ఆకలి కేకలు, చిన్నారుల రోదనలు.

ఏ తప్పు చేయకుండానే శిక్ష అనుభవించే పౌరులు…

పొరుగు రాజ్యాలు వద్దని చెప్పినా, ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో నిరసించిన యుద్ధం మొదలైంది. రక్తం ఏరులై పారుతుంది..

యుద్ధకాంక్ష దేశ సరిహద్దులను మరుభూమిగా మారుస్తున్న దుర్దినాలు.

సరిహద్దుల్లో విధ్వంసక దృశ్యాలు. స్త్రీల మీద అత్యాచార పర్వాలు. మృతదేహాలు, చెల్లా చెదురయ్యాయి.

ఆ సమయంలో యుద్ధ క్షేత్రానికి ఎందరు వారిస్తున్నా వినకుండా వెళ్లింది కొత్తగా పెళ్లయిన వసుంధరాదేవి. వృత్తిరీత్యా ఒక పత్రికలో ఫొటోగ్రాఫర్‌. ‌యుద్ధానికి సంబంధించిన వార్తలు ఫొటో కవర్‌ ‌చేయడానికి వెళ్తానని అన్నప్పుడు పత్రిక ఎడిటర్‌ ‌వారించాడు.

‘ ఇది రాక్షస యుద్ధం. ఎప్పుడు ఎటువైపు నుంచి ఎవరు మారణాయుధాలతో విరుచుకుపడతారో తెలియదు. సూర్యాస్తమయం అయినా యుద్ధనీతి పాటించని దమనకాండ. అందులోనూ నెలలు నిండిన గర్భిణీ.

అయినా పాతికేళ్ల వసుంధరాదేవి భయపడలేదు.

రాక్షస యుద్ధాన్ని ప్రపంచానికి ఛాయాచిత్రాల ద్వారా చాటిచెప్పాలని బయల్దేరింది. ఆమె వెన్నంటి నడిచాడు ఆమె భర్త ..సీత వెంట రాముడై….

యుద్ధం భీకర రూపం దాల్చింది. శతఘ్నులు విస్ఫోటాన్ని సృష్టిస్తున్నాయి. శరీరాలు మాంసం ముద్దలుగా మారుతున్నారు అమాయకులు. రెండువైపులా ప్రాణనష్టమే. అయినా యుద్ధోన్మాదం ఆగలేదు.

వసుంధరాదేవి యుద్ధరంగంలోకి అడుగు పెట్టింది. తనతో పాటు మరికొందరు యుద్ధ వార్తలు కవర్‌ ‌చేసేందుకు వెళ్లారు. బాంబుల వర్షం కురుస్తుంది. ఎటు చూసినా హాహాకారాలు. ఆహారా నికి కొరత. స్త్రీల మాన ప్రాణాలకు భద్రత కొరత. పాలిస్తున్న తల్లి ఇంటి మీద బాంబు పడి బిడ్డకు పాలిస్తూ అలానే చనిపోయింది.

తల్లి చనిపోయిన విషయం తెలియని ఆ బిడ్డ తల్లి స్తన్యాన్ని నోటితో పట్టుకుని ఆకలి తీర్చు కుంటుంది. పక్కనే ఉన్న మరో తెర తొలగించింది. బిడ్డకు పాలిస్తూ బాంబు దాడిలో మరణించిన ఒక తల్లి ఫొటో. చుట్టూ మృతదేహాలు.’’

మీడియా ఒళ్లు గగుర్పొడిచింది.

అనామిక కొనసాగించింది ‘‘వసుంధరాదేవి భయపడలేదు. యుద్ధం తాలూకూ తీవ్రత ప్రపం చానికి చాటి చెప్పాలనుకుంది. తన ఫొటోలతో ఎలుగెత్తి చాటాలనుకుంది. ఒక వైపు చిమ్మ చీకటి. భయంతో దేశాన్ని చిమ్మచీకటిగా మార్చుకుని బిక్కు బిక్కుమంటున్న ప్రజలు. ఎప్పుడు ఎక్కడ బాంబు పడుతుందో, ఎప్పుడు సైనికుల ఆయుధాల్లోని తూటాలు తమ శరీరాన్ని ఛిద్రం చేస్తాయో.’’ అన్న భయం.

తెల్లవారింది. ఎందరి జీవితాలనో తెల్లవారేలా చేయడానికి యుద్ధోన్మాదం

ఒళ్లు విరుచుకుంది. శత్రువుల చొరబాటు కెమెరాలో బంధిస్తోన్న వసుంధరాదేవి. ముందు జాగ్రత్తగా కెమెరాలో టైం సెట్‌ ‌చేసింది.. కొద్ది క్షణాల వ్యవధి.

దూరంగా బాంబుల వర్షం. ఆకాశం నుంచి మృత్యుదాడి. విమానాల నుంచి బాంబుల వర్షం.

వసుంధరాదేవి ఎగిరిపడింది. ఆమె చేతిలోని కెమెరా ఆకాశంలో ఎగిరి కిందికి పడుతూ, తన యజమాని రుణంతీర్చుకోవడానికి అన్నట్టు, నేలమీద రక్తపు మడుగులో పడిపోయిన వసుంధరా దేవి రూపాన్ని చివరిసారిగా భద్రపరిచింది చిన్న క్లిక్‌తో…

అప్పుడే పురిటి నొప్పులు బాంబుల మోతలో కలిసిపోయాయి. ఆమె రెండు కాళ్లు వెడల్పు అయ్యాయి. ఉన్మాద యుద్ధం సాక్షిగా, తన వేదనను, తల్లి ఆవేదనను వ్యక్తం చేస్తున్నట్లు గుక్కపట్టి ఏడుస్తున్న బిడ్డ. రక్తపు తడిలో..

కన్నుమూసే ముందు వసుంధరాదేవి భర్త వైపు చూసింది. ఆతన్ని చేతిలోని కెమెరా తీసింది. శక్తి కూడదీసుకుని. గాల్లో నుంచి నేల జారుతూ ఉన్న తన కెమెరాను ఫొటో తీసింది వసుంధరాదేవి. కెమెరా ఆమె పాదాల చెంత అప్పుడే కళ్లు తెరిచిన బిడ్డ పక్కనే.. పడింది నివాళిగా.

బాంబుల దాడిలో ఆ బిడ్డ రెండు కాళ్లు దెబ్బతిన్నాయి.

ప్రాణం లేని కెమెరా తన యజమాని ప్రాణం పెట్టి, తన ప్రాణాలు ధార పోస్తూ తీసిన ఆ ఫొటో.

ఆ ఫొటో, ప్రపంచ దేశాలను చుట్టేసింది.  ఐక్యరాజ్యసమితి కదిలింది. ఐరాస సభ్యత్వం ఉన్న దేశాలు కదిలిపోయాయి. ప్రపంచ దేశాలు ఒక్కతాటి మీద నిలబడ్డాయి.

ఆ ఫొటో ఖండాంతరాలు దాటింది. కోట్లాది ప్రపంచ ప్రజల హృదయాలను తట్టి లేపింది. ప్రపంచ దేశాల ఒత్తిడి మొదలైంది. ఫలితంగా యుద్ధం ఆగింది.

వసుంధరాదేవి, ఆమె భర్త చేసిన ప్రాణత్యాగానికి సార్థకత లభించింది. ఒక్క ఫొటో యుద్ధాన్ని కళ్లకు కట్టింది. కోట్లాది హృదయాలను ఆలోచించేలా చేసింది.’ అని ఆగింది.

ఆ ఫొటోదగ్గర నిలబడింది.

‘‘ఇప్పటి తరానికి వసుంధరాదేవి ఎవరో తెలియకపోవచ్చు. ఈ ఫొటోలో యుద్ధభూమిలో కళ్లు తెరిచి, అదే యుద్ధభూమిలో తన కాళ్లు కోల్పోయిన బిడ్డ ఎవరో తెలుసా? మీడియా వైపు చూస్తూ, వీల్‌ ‌చైర్‌లో కూర్చున్న తండ్రిని చూపించింది.

‘ఆ బిడ్డే, నా తండ్రి. తల్లి ప్రాణ త్యాగానికి గుర్తు.. తన తల్లిని నాలో చూసుకోవాలని అనుకున్నాడు. నన్ను ఫొటోగ్రాఫర్‌గా తీర్చిదిద్దాడు. ఆ వసుంధరా దేవి నా నాన్నమ్మ.

‘‘తిరుగుబాటు యుద్ధాలు ఫ్రెంచి విప్లవం యుద్ధాలు, పెనిన్సులార్‌ ‌యుద్ధాలు స్పానిష్‌ అం‌తర్యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం… ఇలా యుద్ధాలు ఏవైనా, స్వేచ్చా స్వతంత్రం కోసం చేసే యుద్ధాలు మినహాయిస్తే హననం కోసం, ఆధిపత్యం కోసం చేసే యుద్ధాల తీవ్రతకు అద్దం పట్టిన నాన్నమ్మ తీసిన ఈ ఫొటో నాకు ఛాయాచిత్ర భగవద్గీత.

 సెల్ఫీలతో, ఫేస్‌ ‌బుక్‌లో, వాట్సాప్‌లో ఇన్‌స్టాలో, డీపీలు పెట్టుకునే మనం ఒక్కసారైనా, ఒక్కరోజైనా, ప్రపంచానికి మేలుకొలుపులా, మనసులను కదిలించే ఒక్క ఫొటో, ఒక్కరోజైనా పెట్టుకోవాలని నా కోరిక.

యుద్ధానికి కాలుదువ్వే ఉన్మాదం ఒక్కసారైనా మా నాన్నమ్మ తీసిన ఫొటో చూసి ఆలోచించాలి. టెక్నాలజీ పెరిగింది. సెల్ఫీలు రాజ్యమేలు తున్నాయి.

ఒకప్పుడు అమ్మానాన్న కుటుంబం కలిసి ఫొటో తీసి గోడకు ఫ్రేమ్‌గా తగిలించుకునే వాళ్లు.

ఫొటో ఒక జ్ఞాపకమే కాదు, ఒక ఆలోచన, ఒక ప్రేరణ. రోజూ పదుల కొద్దీ సెల్ఫీలు తీసుకునే మనం ఒక ఫొటోగ్రాఫర్‌గా మారి, మన జ్ఞాపకాలను, అమ్మతో చెప్పే కబుర్లు… పిల్లలతో ఆడుకునే ఆటలు., మొదలు సమాజంలో జరిగే విపరీతాలు విడ్డూరాలు చైతన్యపరిచే ఫొటోలు తీస్తే భావితరానికి ఫొటో ఒక చరిత్రను చూపిస్తుంది.

యుద్ధభూమిలో ఎందరో ఫొటోగ్రాఫర్‌లు యుద్ధోన్మాదం కళ్లకు కట్టినట్టు చూపించారు. ఒక వార్త చెప్పలేని విషయాన్ని ఒక ఫొటో చెబుతుంది’’

‘‘వసుంధరాదేవి తీసిన ఛాయాచిత్రం ముందు నిలబడి నివాళి అర్పిస్తూ.. ఫొటోగ్రఫీకి.. ఫొటోలకు అద్భుతమైన భాష్యం చెబుతూ అనామిక.

మీడియా హర్షధ్వానాలతో అక్కడ కెమెరాలను క్లిక్‌ ‌మనిపించింది.

అన్ని పత్రికల్లో యాభై ఏళ్ల క్రితం వసుంధరాదేవి తీసిన ఫొటో హెడ్‌లైన్స్‌లో న్యూస్‌గా వచ్చింది. అనామిక చెప్పిన వసుంధరాదేవి ఛాయా చిత్ర కథనం నేపథ్యం ఫొటో గ్రాఫర్‌ ‌లక్ష్యానికి ఆశయానికి అర్థం చెప్పింది. ఫేస్‌బుక్‌లో,వాట్సాప్‌లో, ఇన్‌స్టాలో వసుం ధరాదేవి చివరిసారి దిగిన ఫొటో ప్రత్యక్ష మైంది.

 ప్రాణాలు తీసే నిరర్థకమైన సెల్ఫీల స్థానంలో చూడముచ్చటైన ఫొటోలు దర్శనం ఇస్తున్నాయి. సమాజాన్ని ప్రభావితం చేస్తూ చైతన్యపరిచే ఫొటోలు ఊపిరి పోసుకుంటున్నాయి.

ఈ కథకు అనామిక ఒక స్ఫూర్తి వాక్యం అయ్యింది.

వీల్‌ ‌చెయిర్‌లో కూర్చున్న తండ్రి భుజాల మీద చేయివేసి ముందుకు తీసుకువెళ్తుంది అనామిక. బ్యాక్‌ ‌గ్రౌండ్‌లో నాన్నమ్మ వసుంధరాదేవి తీసిన ఛాయా చిత్రం.

అందమైన ఫ్రేమ్‌లో ఇమిడిపోయిన ఛాయా చిత్ర కథనం.

(ప్రపంచ గమనాన్ని, శాంతిని, ఉద్వేగభరిత సందర్భాలను కెమెరాలో చిత్రించిన వారికి… యుద్ధభూమిలో వృత్తిలో భాగంగా, ప్రాణాలు కోల్పోయిన వారికి, కాలంలో నిలిచిపోయే జ్ఞాపకాలను బంధించి మనసు పొరల్లో నిలిపే ఫొటో జర్నలిస్టులకు ఈ కథ అంకితం.)

– విజయార్కె

వచ్చేవారం కథ..

నేను మలచిన శిల్పాలు – డా. కనుపూరు శ్రీనివాసులు రెడ్డి

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram