ఎక్కడైనా ఎంతో గొప్పవాళ్లైన మహర్షులు తపస్సు చేసీ చేసీ ప్రతిపాదించి అందించిన ఆ శాస్త్రం నేటి లోకంలోని అతి సామాన్యులు నిందిస్తూ, అవిశ్వసనీయమని ప్రచారం చేయడానికి కారణం..శా•స్త్రంలో పసలేకపోవడం కానే కాదు. దాన్ని అభ్యసించిన ఈ వ్యక్తి పూర్తిగా చదివి ఉండకపోవడమో లేక సరికానివాని వద్ద అభ్యసించి ఉండడమో  లేక జ్యోతిషం వంటి శాస్త్రానికి వాక్ఛుద్ధి ఉండి తీరాలి కాబట్టి అలాటి నిత్యానుష్ఠానం లేకపోవడమో మాత్రమే కారణం. ఈ చెప్పుకుంటున్న సిద్ధాంతం నిజమనడానికి ఆది కావ్యమైన శ్రీమద్రామాయణం అందులో కన్పడే రామ-లక్ష్మణ- భరత- శత్రుఘ్న – సీత- ఆంజనేయులు మాత్రమే. క్రమంగా పరిశీలించుకుంటూ వెడదాం! మచ్చుకి రాముని విశేషాల్ని గమనిద్దాం!

రాముడు – పునర్వసు

తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నావమికే తిథౌ।

నక్షత్రే దితి దైవత్యే స్వోచ్చ సంస్థేషు పంచసు।।

రామచంద్రుడు 12వ నెలలో (ద్వాదశే మాసే) పుట్టాడు. లోకంలో అందరూ 10వ నెలలోనే (త్రిపాదూర్థ్వే) పుడతారు మనుష్య లక్షణాలున్నవారు. అయితే రాముడు మాత్రం తాను మానవుడు కానని తెలియజేస్తూ 12వ నెలలో పుట్టాడు. ఇది నిజం కాబట్టే రావణుడు నాగాస్త్రాన్ని వేసి వీరి సైన్యాన్ని మొత్తం నాగ పాశాస్త్రాలతో బంధించి వేస్తే శ్రీ విష్ణు వాహనమైన గరుడుడు ఒక్కసారిగా ఆ నాగాస్త్రాన్ని ఛేదించి రామాదులందర్నీ పాశవిముక్తిల్ని చేయించుకోగలిగాడు. అందుకే రాముణ్ణి ఎవరైనా ఆత్మ పరిచయాన్ని అడిగితే ‘ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజమ్‌’ – ‌నన్ను నేను మనుష్య జాతికి చెందినవానిగా, అందునా దశరథ మహారాజు పుత్రునిగా అనుకుంటూ ఉంటాను – అన్నాడు. లోకంలో ఎవరైనా తమని గురించి తాము గాని ఇలా అన్నట్లయితే ఏమనుకుంటాం? అందుకే రాముడు శ్రీహరే అనే విషయాన్ని శ్రీమద్రామాయణం స్వయంగా చెప్పినా – రాముడు దాన్ని బహిరంగ పరచకున్నా ఒకటి రెండు సందర్భాల్లో నిరూపించు కున్నాడు శ్రీహరి స్వరూపమే అని. రాముడు కృష్ణుడూ అనే ఇద్దరూ భగవదవతారమూర్తులే అయినా – రాముడు తనని భగవంతుడని వాచ్యంగా (నోటి మాటతో) చెప్పడు. కృష్ణుడు చెప్పకుండానూ, తన భగవదంశని నిరూపించుకోకుండానూ లేడు. (కృష్ణస్తు భగవాన్‌ ‌స్వయమ్‌- అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః)

12వ నెలలో అందునా చైత్రమాసంలో (చైత్రే) పుట్టాడు. చైత్ర శ్రీమానయం మాసః – చెట్ల ఆకులన్నీ చిగురిస్తాయి. పండ్లని కాస్తాయి, పుష్పాలన్నీ విచ్చుకుని కన్పిస్తాయి. ప్రతి పుష్పమూ తుమ్మెదల ద్వారా తేనెని ఆహారంగా వాటికందిస్తూ కన్పిస్తాయి. మనుష్యులకైతే గాదెలన్నీ ధాన్యంతో నిండి కన్పిస్తాయి. మొత్తం పశుపక్షి జలచరాది అన్ని జీవరాశులకీ ఆహారం పుష్కలంగా లభిస్తుంది. లోకంలో అందరికీ ధాన్యాదులు లభించే కారణంగా సంతానానికి వివాహాదుల్ని తలపెట్టాలనే శుభకార్యాలోచనలు వస్తాయి. ఈ రాముని శిరసున అక్షతలు పడేవరకూ (శ్రీరామనవమి) ఆగి ఆ మీదటే ముహూర్తాలను చూసుకుని నిర్వహించుకుంటారు వాటిని. అందుకే ఇది ‘శ్రీమాన్‌’ ‌శుభకరమైన మాసమంది శాస్త్రం.

చైత్రమాసం

అంతేకాదు, చైత్రే మధురభాషేస్యాత్‌ అని జ్యోతిశ్శాస్త్రం చెప్తోంది. చైత్రమాసంలో పుట్టినవాడు తియతియగా మాట్లాడతాడని దీనర్థం. లోకంలో ఓ నిందా వాక్యముంది. ‘అబ్బో! వాడు తీయతీయగా మాట్లాడుతాడు అని (చేసే ప్రతి పనీ మాత్రం దానికి విరుద్ధంగా ఉంటుందనే అర్థంలో). అలాటి వ్యక్తి కాడు రాముడు. తియతియ్యగా మాట్లాడేవాడు – అంటే అవతలివాడెంతటి కఠినంగా మాట్లాడినా – ఎదురు తిరిగి అంతకంటే కఠినంగా మాట్లాడుతూ, గొంతు బిగ్గరగా చేసుకుని నోరు మూయించేవరకూ ఆగనివాడనేది అర్థం కాదు. అది నేటి కాలంలో ఉం(టుం)ది. వాలిని ఒకే బాణంతో రాముడు వధించాడు. నేలన వెల్లకిలాపడిన వాలి, తన వింటికి పైభాగాన ఉన్న వంపు (కొప్పు అంటారు) మీద తలపెట్టి పరమ ప్రశాంతంగా వాలి, తనని నింది స్తూన్న ఆ మాటల్ని చివరి అక్షరం వరకూ ఏకాగ్రతతో విన్నాడు. ‘సమాధానం చెప్పు!’ అని వాలి అన్నాక రాముడు, ఆ వాలి తనని నిందించిన ప్రతి వాక్యానికీ సమాధానాన్ని సవివరంగా చెప్పాడు. అంతా విన్న వాలి తనంత తానుగా – మరెవరి ప్రోత్సాహమూ లేకుండా-తనది తప్పేనని అంగీకరిస్తూ రామునికి త్రికరణశుద్ధిగా నమస్కరించాడు. పుత్రుడైన అంగదుడూ భార్య తారా కూడా వాలి దోషాన్ని అంగీకరించారు. అంతటి మెత్తని శైలితో ప్రతి వ్యక్తీ చెవులతో కాకుండా హృదయంతో వినేలా మాట్లాడగల నైపుణ్యమున్నవాడు రాముడు. చైత్రమాసంలో పుట్టడం దీనిక్కారణం.

నవమి తిథి

‘నిర్భయస్సర్వభూతేభ్యో నవమ్యా ముపజాయతే’ – నవమీ తిథి అందునా శుద్ధపక్షంలో గాని జన్మిస్తే భయం లేకుండా మాట్లాడగలిగేవాడౌతాడని జ్యోతి శాస్త్రం చెప్తోంది. భయమనేది ఎప్పుడు కలుగుతుంది? సత్యం వద -ధర్మం చర అనే రెండు వాక్యాలకీ విరుద్ధంగా అసత్యాన్ని మాట్లాడుతున్నా – లేదా- అధర్మాన్ని ఆచరిస్తున్నా మాత్రమే కదా భయం పుడుతుంది. అలాంటి అసత్య అధర్మ భయాలు ఆయనకి లేకపోవడానిక్కారణం శుద్ధ నవమి నాటి పుట్టుక. ఇది నిజం కాబట్టే – రాముడు, అరణ్యాలకి వెళ్తున్న వేళ కౌసల్య (సొంత తల్లి) తీవ్రంగా దుఃఖిస్తూ ‘భర్త ఉండగానే పుత్రుణ్ణి కోల్పోయినంత బాధని అనుభవించ వలసి వస్తోందనీ- సవతి (కైకమ్మ) తనమీద ఇంతటి అధికారాన్ని చెలాయిస్తోందని రామునికి చెప్పు కుంటూ తాను కూడా రాముని వెంట వచ్చేస్తానని పలికింది. దానికి రాముడు బదులు పలుకుతూ ‘పితురాజ్ఞా పరో ధర్మః స్వధర్మో మాతృరక్షణమ్‌’ ‌తల్లీ! నాన్న ఆజ్ఞని పాటించడమనేది పుత్రునికి కర్తవ్యం – ధర్మం కూడా. అందుకని అరణ్యాలకి వెళ్లి తీరాల్సిందే. అది కూడా నేను మాత్రమే. ఆజ్ఞాపించిన ఆ ఆజ్ఞలో నీ పేరు లేదు. ఇక భర్త వెంట – అందునా మరణ భయం దాదాపుగా ఉన్న భర్త వెంట ‘ధర్మ-పత్ని’గా నువ్వు ఉండి తీరాల్సిందే అని స్పష్టంగా చెప్పాడు. కైకమ్మ తననిలా అరణ్యాలకి పంపించి వేస్తోందనీ – సుమిత్రామాత దశరథుని ఎందుకు నిలదీయలేదనీ ఏ మాత్రమూ అనకుండా తన కర్తవ్య విధిని మాత్రమే చెప్తూ అరణ్యాలకి వెళ్ళిపోయాడంటే దానిక్కారణం తనది శుద్ధ నవమి జన్మ కావడమే.

పునర్వసు నక్షత్రం

ఆకాశంలో కన్పిస్తాయి నక్షత్రాలనీ ఆయా రూపాల్లో ఖగోళ దృష్టి ఉన్నవారు గనుక పరిశీలిస్తే ఆ విషయం అవగాహనకి వస్తుంది. హస్తా నక్షత్రం అరచేతి వేళ్లు విప్పిన తీరుగా కన్పిస్తుంది. కృత్తిగా నక్షత్రం తెరిచిన మంగలి కత్తిలా ఉంటుంది. మృగశీర్షా నక్షత్రం మృగం తలలా కన్పిస్తుంది. ఈ క్రమంలో పరిశీలిస్తే పునర్వసూ నక్షత్రం అనేది 5 నక్షత్రాలు ఓ వింటి ఆకారంలో ఉంటూ కన్పిస్తుంది. ఇది నిజం కాబట్టే రాముడెప్పుడూ ధనుస్సుని ధరించకుండా కన్పించడు. ధనుస్సనే శబ్దానికి ధర్మమనేది కూడా అర్థం కాబట్టి, రాముడెప్పుడూ తానెవరిని వధించ ప్రయత్నించినా ఆ సందర్భంలో ఆ ఎదుటి వ్యక్తి జంతువు పశువు పక్షి…మరణిస్తే తన బాణం ధర్మబద్ధమనీ- అందుకు భిన్నంగా జరిగితే తనదే అధర్మమనీ – ఆ ధనువుతో తన ధర్మాధర్మాలని పరీక్షించుకుంటుండేవాడు. ‘సమరే చింతయాస్థితమ్‌’ ‌యుద్ధ సందర్భంలో రాముడు తన ఎదురుగా ఉన్న రావణుని మీద ఎన్ని బాణాలను ప్రయోగించినా ఒక్కటీ పనిచేయకపోవడంతో యుద్ధభూమిలో చింతతో నిలిచిన రాముడు రావణుని తపశ్శక్తి తనకంటే ఎక్కువని గ్రహించగలిగాడు. ఆ సందర్భంలో అగస్త్య మహర్షి సూర్య వంశీయుడు రాముడు కాబట్టి ఆ ఆదిత్యశక్తిని ఆదిత్యహృదయ స్తోత్ర మహామంత్రం ద్వారా రామునికి ఉపదేశించి రావణ విజయాన్ని సాధించేలా చేసాడు. అందుకే రాముడు తాటకా వధకు (తాటకి అనడం తప్పు)  ధనుష్టంకారాన్ని చేశాడు. దాని శక్తి ఎంతటిదో గమనించడానికి. వెంటనే అర్థమయింది దాని శక్తి. వధించనే వధించాడు దాన్నీ దాని పుత్రుడైన మారీచుని స్నేహితుడు సుబాహువునీ కూడా. తన వింటికి పని చెప్పి మారీచునికి మోక్షాన్నీయవలసి ఉంది. కాబట్టి మారీచుణ్ణి మాత్రం సముద్ర మధ్యంలో పడేలా బాణంతో కొట్టి అప్పటికి బతికేలా చేసాడు. రామబాణం తగిలిన మరుక్షణం నుండీ మారీచునికి రామమంత్రోపదేశ మైనట్లయింది. దాంతో రామధ్యానపరుడూ, రావణ విరోధీ అయ్యాడు మారీచుడు. అంతటి శక్తి పునర్వసు నక్షత్ర జన్మ కారణంగానే.

పంచగ్రహాలూ ఉన్నతంగా…

స్వ + ఉచ్చసంస్థేషు + పంచసు – ఏయే నక్షత్రాలకి ఏదేది ఉచ్ఛస్థానమో – అంటే – సర్వశక్తి ఫలితాన్ని ఇచ్చేదో అలా రవి మేషంలో – అంగారకుడు (కుజుడు/మంగలుడు) మకరంలో  – శని తులలో- గురువు (బృహస్పతి) కర్కాటకంలో – శుక్రుడు మీనంలో ఉండగా పుట్టాడు రాముడు.

ఒక్క గ్రహంలో ఉచ్ఛగనుక ఉంటే సర్వ అరిష్టాలనీ తొలగించుకోగల ఆత్మస్థైర్యం కలవాడౌతాడు. అందుకే అయోధ్యా రాజ్యం నుండి పంపినా, పోనీ అయోధ్య పొలిమేరల్లో కూడా కాకుండా దూరంగా, అయోధ్యకు సంబంధంలేని దండకికి పంపేసినా, అక్కడ సీతమ్మను కోల్పోగొట్టు కున్నా- సీతా రక్షణ కోసం తనంత తానే వచ్చిన జటాయుపక్షిని రావణుడు వధించి తనకి ఆత్మీయుడు లేకుండా అయిపోయినా – ఏ మాత్రపు ధైర్యాన్నీ కోల్పనే లేదు రాముడు. (ఏకగ్రహోచ్చ జాతస్య సర్వారిష్ట నివారణమ్‌)

‌ద్విగ్రహోచ్చేతు సామంత రెండు గ్రహాలు ఉచ్ఛలో గనుక ఉంటే సామంతరాజుగా ఉండేవాడౌతాడు. రామునికి 5 గ్రహాలు ఉచ్ఛలు ఉన్నాయిగా! అందుకే సామంతరాజుగా కావడం, యుద్ధాలని చేసి రాజుగా ఉన్నత స్థితిని పొందడం… వంటివి లేనే లేవు.

త్రిరుచ్చేతు మహీపతిః – మూడు గ్రహాలు గనుక ఉచ్ఛలో ఉంటే ఆ వ్యక్తి మహీ (భూమికి) పతిః (భర్త) అంటే ఓ రాజుగా అవుతాడు – అయితే అనేక ప్రదేశాలున్న విశాలభూమికి రాజౌతాడు. రాముడు పంచగ్రహాలూ ఉచ్చలో ఉండగా పుట్టినవాడు కాబట్టి సాధారణ రాజు కానే కాలేదు.

చతుర్గ్రహోచ్చే సమ్రాట్‌- ‌నాలుగు గ్రహాలు ఉచ్ఛ గనుక ఉంటే సమ్రాట్టు కాగలుగుతాడు. అందుకే ప్రారంభంలోనే యువరాజుగా పట్టాభిషేకాన్ని పొందాడు. అది వారసత్వం ప్రకారంగా కావచ్చు – లేదా- సాహసపరాక్రమ ప్రదర్శనాదులవల్ల కావచ్చు.

ఇక పంచోచ్చే లోక నాయకః – అని జ్యోతిశ్శాస్త్ర వచనం. ఆ కారణంగానే లోకమంతటికీ నాయకుడు కాగలిగాడు. నాయకుడంటే ఏదో ఓ వందమందిని తన వెంట ఉంచుకుని తిరిగేవాడూ- వాళ్లని తిప్పుతూ ఉండేవాడనేది దాని అర్థం కాదు. నయతి నాయయతీతి వా నాయకః తాను నడుస్తూ అదే ధర్మమార్గంలో అందర్నీ కూడా నడుస్తూ ఉండేలా నడిపించేవాడని దీని భావం.

ఇది నిజం కాబట్టే తాను ధర్మమార్గాన్ని ఏనాడూ తప్పకుండా-ధర్మమార్గాన్ని తప్పిన వానర జాతివాడైన వాలినీ, ధర్మమార్గాన్ని తప్పిన రాక్షసజాతివాడైన రావణుణ్ణీ, స్త్రీ అయిన తాటకనీ, మహాద్భుత శివతపఃశ్శక్తిమంతులైన ఖర దూషణ త్రిశురుల్నీ, వధించాడు. మరి అవే జాతుల్లో ఉన్న – అంటే- వానర జాతివాడైన సుగ్రీవుణ్ణీ- రాక్షసజాతివాడైన విభీషణుణ్ణీ-రాక్షసజాతివాడైన మారీచుణ్ణీ- పక్షిజాతికి చెందిన జటాయువుకి తానే అంత్యక్రియలని చేయడమేగాక ఉత్తమలోకాలని ధారపోసి మోక్షాన్నియ్యడాన్నీ చేసాడు రాముడు.

ఇలా అనేక లక్షణాలు రామునిలో తన జన్మనక్షత్ర కారణంగా కన్పిస్తాయి. ఇదే తీరు పరిశీలన చేస్తే ఉత్తర ఫల్గుని (ఉత్తర అంటారు వ్యవహారంలో)లో పుట్టిన సీతమ్మనీ- ఆశ్లేషా నక్షత్రంలో పుట్టిన లక్ష్మణుణ్ణీ – పుష్యమిలో పుట్టిన భరత శత్రువుల్నీ – దశమీ తిథిలో పుట్టిన కారణంగా మరికొని విశేషాలనీ- పూర్వాభాద్ర నక్షత్రంలో పుట్టిన ఆంజనేయుణ్ణీ సోదాహరణంగా తెలుసుకోగలం. ఈ మొత్తం ఆరుగురే ఎలా ఒకటయ్యారో ఆ విశేషాలనీ అర్థం చేసుకోగలం. శ్రీరామచంద్రానుగ్రహాస్తు

డా।। మైలవరపు శ్రీనివాసరావు

ప్రవచనకర్త

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram