నాలుగు మాసాలలోనే లోక్‌సభ ఎన్నికల నగారా మోగనున్న నేపథ్యంలో జరిగిన ఐదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికల ఫలితాలు వెలువడినాయి. తిరుగులేని ఒక వాస్తవాన్ని దేశ ప్రజల ముందు ఆవిష్కరించాయి. మధ్యప్రదేశ్‌, రాజస్తాన్‌, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ, మిజోరం ఎన్నికల ఫలితాలు వెలువడి, వచ్చే లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో, ఎటు వైపు మొగ్గబోతున్నాయో ముందుగానే చెప్పేశాయి.

 కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం హ్యాట్రిక్‌ కొట్టడానికి సిద్ధంగా ఉందన్నదే వాటి ఫలశ్రుతి.

 ప్రధాని నరేంద్ర మోదీ మీద, భారతీయ జనతా పార్టీ మీద కొనసాగుతున్న విమర్శలను సాధారణ ప్రజానీకం పట్టించుకోవడం లేదని ఈ ఫలితాలు రుజువు చేశాయి. మూడు రాష్ట్రాలలో బీజేపీ విజయ దుందుభి మోగించింది. తెలంగాణలో ఒకటి నుంచి ఎనిమిది స్థానాలకు  కమలం ఎగబాకింది.

ఎగ్జిట్‌ పోల్స్‌ను ఎగతాళి చేస్తూ మూడు ఉత్తరాది రాష్ట్రాలు బీజేపీకి తిరుగులేని ఆధిక్యాన్ని కట్టబెట్టాయి. రాజస్తాన్‌లో అడ్డూ ఆపూ లేకుండా హనుమాన్‌ శోభాయాత్రల మీద, రామనవమి ఉరేగింపుల మీద జరిగిన ముస్లిం మతోన్మాదుల దాడులను చూస్తూ మిన్నకున్న అశోక్‌ గెహ్లోత్‌ ప్రభుత్వానికి ప్రజానీకం ఈ విధంగా బుద్ధి చెప్పింది. పాకిస్తాన్‌ నుంచి ప్రాణాలు అరచేత పట్టుకుని వచ్చిన హిందూ శరణార్థుల పట్ల వ్యవహరించిన తీరుకు బ్యాలెట్‌ ద్వారా ప్రజలు ఇలాంటి సమాధానం చెప్పారు.  గెహ్లోత్‌కూ, సచిన్‌ పైలట్‌కూ ఉన్న విభేదాలు కాంగ్రెస్‌ దుస్థితిని ఎత్తి చూపాయి. ప్రజాసేవ కంటే పదవీ వ్యామోహమే ఆ పార్టీలో ఎక్కువ అన్న వాస్తవాన్ని ఆ విభేదాలు నిరంతరం ఎత్తి చూపాయి. ఛత్తీస్‌గఢ్‌లో విజయం అనూహ్యం. ఎగ్జిట్‌ పోల్స్‌ ఇక్కడ ఒక ప్రహసనంగా మిగిలిపోయాయి.

‘ఇండియా’ కూటమి బతుకు బండలైంది. ఎక్కడా ఆ ఉసే లేదు. కాంగ్రెస్‌ వైఫల్యాన్ని ఇండియా కూటమి దాని ఖర్మగానే తీర్పు చెప్పాయి. ఇది మీ వైఫల్యం, మమ్మల్ని పిలవలేదు కదా అంటున్నాయి. మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టు  ఒంటరిగా పోటీ చేసి కాంగ్రెస్‌ ఘోర తప్పిదానికి పాల్పడిరదని జేడీ(యు) తిట్ల దండకం అందుకుంది. బీజేపీ విభజన రాజకీయాల గురించి ప్రజలకు విడమరచి చెప్పడంలో కాంగ్రెస్‌ విఫలమై కుప్పకూలిందని కూడా ఆ పార్టీ అధికార ప్రతినిధి నీరజ్‌ కుమార్‌ తేల్చిపారేశారు. మరీ ఇంత తలబిరుసా అని జేడీ (యు) అంటే, మీది జమిందారీ పోకడ అని ఆర్జేడీ దుమ్మెత్తి పోసింది. రిపబ్లిక్‌ టీవీ వ్యాఖ్యానించినట్టు కాంగ్రెస్‌కు పట్టిన ఈ దీనావస్థ ‘సనాతన శాప’మే కావచ్చు? సనాతన ధర్మాన్ని తిట్టిన వారిని అంటకాగితే జరిగేది ఇదే అని ప్రజలు కచ్చితంగా హెచ్చరించినట్టయింది.

ఏ ప్రభావం లేకుండా జరిగిన తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఊహించినదాని కంటే ఎక్కువగానే భారత రాష్ట్ర సమితిని చావు దెబ్బ తీశాయి. ఉద్యమ పార్టీ మూడో అసెంబ్లీ ఎన్నికలలోనే మట్టి కరిచింది. నిజానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అహంకారానికి ఇది చెంపపెట్టు అన్న భావనే సర్వత్రా వినిపిస్తున్నది. కరీంనగర్‌లో బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ఓటమి ఎదురు దెబ్బ. ముఖ్యమంత్రినీ, ముఖ్యమంత్రి అభ్యర్థినీ కూడా ఓడిరచిన ఘనత బీజేపీకే దక్కింది. కామారెడ్డి అసెంబ్లీ స్థానంలో సంభవించిన ఈ అరుదైన విజయంతో కె. వెంకటరమణారెడ్డి జెయింట్‌ కిల్లర్‌ మకుటధారిగా మిగిలారు. ఎంఐఎం ఏడు స్థానాలలో గెలిస్తే బీజేపీ ఎనిమిది స్థానాలను గెలుచుకుని భవిష్యత్‌ చిత్రపటాన్ని ప్రజలకు చూపిందనే అనాలి.

కేసీఆర్‌ మీద ఎంతగా ప్రజాగ్రహం పెల్లుబికినదీ అంటే, మ్యాజిక్‌ ఫిగర్‌కు అవతల కాంగ్రెస్‌ సాధించిన స్థానాలు కేవలం నాలుగు. అంటే ఆ పార్టీ, ముఖ్యమంత్రి ఎంతగా అసిధారావ్రతం చేయవలసి ఉన్నదో ఊహించవచ్చు. ఏ ఒక్కరికీ ఆగ్రహం తెప్పించకూడదు. అసలే కాంగ్రెస్‌ హేమాహేమీలంతా నెగ్గారు.

ఈ నేపథ్యంలో ఎ. రేవంత్‌రెడ్డినే ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ అధిష్టానం ఎంపిక చేసింది.

About Author

By editor

Twitter
YOUTUBE