జాతీయ విద్యావిధానం-2020 (ఎన్‌ఈపీ`2020) కింద పాఠశాల విద్యా ప్రణాళికలో మార్పులు తీసుకొని రావాలని నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎన్‌.సి.ఇ.ఆర్‌.టి.) సంకల్పించింది. ఇందులో భాగంగా పాఠశాలల స్థాయి సాంఘిక శాస్త్ర విభాగంలో చేపట్టాల్సిన మార్పులు చేర్పులపై తగిన సిఫారసుల కోసం ఏడుగురు సభ్యులతో కూడిన ఒక కమిటీని గత ఏడాది ఏర్పాటు చేసింది. ఈ ఉన్నతస్థాయి కమిటీ రామాయణ, మహాభారతాలను పాఠశాల స్థాయి పాఠ్యప్రణాళికలో చేర్చాలని సిఫారసు చేయడం ప్రస్తుతం పెద్ద చర్చకు దారితీసింది. ఈ కమిటీ పై సిఫారసు చేయడమే కాదు, తరగతి గదుల గోడలపై రాజ్యాంగ పీఠికను రాసి ఉంచాలని కూడా కోరింది. వీటితోపాటు ఎన్‌.సి.ఇ.ఆర్‌.టి. పుస్తకాల ఫౌండేషన్‌ను మరింత బలోపేతం చేసేందుకు మరిన్ని సిఫారసులు చేసింది. 19 మంది సభ్యులతో కూడిన నేషనల్‌ సిలబస్‌ అండ్‌ టీచింగ్‌ లెర్నింగ్‌ మెటీరియల్‌ కమిటీ (ఎన్‌.ఎస్‌.టి.సి.) పై సిఫారసులపై తగిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ కమిటీ ఆమోదిస్తే వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ఇక సాంఘికశాస్త్ర పాఠ్యప్రణాళిక, బోధనోపకరణాలను అభివృద్ధి పరచే లక్ష్యంతో ఎస్‌.ఎస్‌.టి.సి. ఇటీవల పాఠ్యప్రణాళిక గ్రూపు (సీఏజీ)ని కూడా ఏర్పాటుచేసింది.

కౌమారదశ పిల్లల్లో దేశభక్తి, దేశంపట్ల అభిమానం పెంపొందేలా చేయాలి. ఏటా కొన్ని వేలమంది విద్యార్థులు విదేశాల్లో పౌరసత్వం కోసం ప్రయత్నాలు చేస్తుండటం మనం చూస్తూనే ఉన్నాం. వీరిలో ఈ వైఖరి ప్రబలంగా వృద్ధి చెండానికి ప్రధాన కారణం తమ దేశం పట్ల అభిమానం కొరవడటమే. దేశభక్తి పెంపొందాలంటే విద్యార్థులకు తమ సాంస్కృతిక మూలాలపై పూర్తి అవగాహన ఏర్పడాలి. అందుకోసం పాఠశాల స్థాయిలో రామాయణ, మహాభారతాలను బోధించాలని తన సిఫారసులో స్పష్టం చేసింది. కొన్ని ఎడ్యుకేషన్‌ బోర్డులు రామాయణ మహాభారతాలను సిలబస్‌లో చేర్చినప్పటికీ వాటిని కేవలం పౌరాణిక గాధలుగానే బోధిస్తున్నాయి. పురాణమంటే కేవలం కల్పిత కథ అన్న భావనే ఉంది. ఇందువల్ల ఆశించిన ప్రయోజనం సిద్ధించదు. వీటిని చారిత్రక సత్యాలుగా బోధించినప్పుడు మాత్రమే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలమని పేర్కొంది. అంతేకాదు పాఠ్యపుస్తకాల్లో ‘ఇండియా’ స్థానంలో ‘భారత్‌’ను చేర్చాలని, ‘ప్రాచీన చరిత్ర’కు బదులు ‘శాస్త్రీయ చరిత్ర’గా మార్పు చేయాలని కూడా కోరింది. ముఖ్యంగా 3 నుంచి 12 తరగతుల వరకు ఈ మార్పు చేయాలని సిఫారసు చేసింది. రామాయణ మహాభారతాలను పాఠ్యప్రణాళికలో చేర్చాలని సిఫారసు చేయడం ఇదే ప్రథమం కాదు. ఇది గతంలో చేసిన సిఫారసే. దాన్నే పునరుద్ఘాటిస్తున్నామని వివరించింది. రాజ్యాంగ పీఠికను తరగతి గోడలపై రాయడం వల్ల మన రాజ్యాంగం పేర్కొన్న సెక్యులరిజం, ప్రజాస్వామ్యంతో సహా సామాజిక విలువలు విద్యార్థుల మనసులో నాటుకుపోతాయని అభిప్రాయపడిరది. ఈ మార్పులు బహుశా వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమల్లోకి వచ్చే అవకాశముంది.

సర్వహితాన్ని కోరే ధర్మం

హైందవం అనేది కేవలం ఏదో ఒక జాతికి తెగకు సంబంధించింది కాదు. ఇందులో పేర్కొన్న ధర్మాలు సమస్త మానవాళికి వర్తిస్తాయి. భారతీయ సంస్కృతికి ఇంతటి ఘనచరిత్ర ఉన్నప్పటికీ, మన విద్యావ్యవస్థ మొత్తం పాశ్చాత్య శైలిని అనుసరించి ఉండటం విచిత్రం. నిజం చెప్పాలంటే బ్రిటిషర్లు బలవంతంగా రుద్దిన విద్యావిధానాన్నే మనం అనుసరిస్తున్నాం. విద్యాసంస్థల్లో నేర్చుకున్న విద్యకు, వర్తమాన సమాజంలో జరుగుతున్న దానికి పొంతన శూన్యం. భారతీయ చరిత్రలో నిజమైన హీరోలకు పాఠ్యపుస్తకాల్లో స్థానం లభించలేదు. పుస్తకాల్లో ప్రముఖులుగా పేర్కొన్న వ్యక్తులకు నిజంగా అంతటి ప్రాధాన్యత లేదు. చరిత్ర పుస్తకాల్లో వలసవాదం గురించి విపరీతమైన ఊకదంపుడు తప్ప, అంతకుముందు నాటి భారత చరిత్రపై ఎటువంటి ప్రాధాన్యం కనిపించదు. ఈ దుస్థితికి కారణం లేకపోలేదు. నిరంకుశ పాలనకంటే, విద్యాపరంగా తమకు అనుకూలమైన మార్పులు తీసుకొని రావాలన్న లక్ష్యంతో బ్రిటిషర్లు తమ వ్యూహాన్ని అమలు చేశారు. ముందుగా ప్రాంతీయ భాషల కంటే, ఇంగ్లిష్‌ ఎంతో ఉత్తమమైనదిగా ప్రచారం చేసి, మధ్యతరగతి వర్గాల్లో ఆ భాషను బాగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. ఈవిధంగా పాశ్చాత్య విద్య ప్రభావంతో, విలువలతో కూడిన గురుకుల విద్యావిధానం దేశంలో కనుమరుగైపోయింది. ఈ గురుకులాలు ధర్మం అంటే ఏమిటో విడమరచి చెప్పడమే కాదు, విద్యార్థులను ధర్మదీక్షాపరులుగా, ధర్మ పరిరక్షకులుగా మార్గనిర్దేశం చేసేవి. మానవతా విలువలను బోధించే రామాయణ, మహాభారతాలను పాఠ్యాంశాలుగా చేర్చడం వల్ల పిల్లల్లో నైతిక విజ్ఞానం పెరిగి, క్రమంగా నేర సంఘటనలు తగ్గుతాయి. బంధాలు, అనుబంధాలకున్న విలువ బాగా అర్థం కావడం వల్ల కుటుంబ వ్యవస్థ మరింత పటిష్టమవుతుంది. జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంపొందించేదిగా ప్రస్తుత విద్యా విధానం లేదు. దీని ఫలితమే ఆత్మహత్యలు! భగవద్గీత జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను ఎదుర్కొనే సామర్థ్యాన్ని కలిగించడమే కాదు, పరిష్కారాలను కూడా చూపుతుంది. దీన్ని బాగా అవగాహన చేసుకున్నవారు జీవన సమరంలో పోరాడి విజయం సాధించడానికి యత్నిస్తారు తప్ప, పలాయనవాదాన్ని ఆశ్రయించరు. ఇటువంటి విలువలను, సామర్థ్యా లను పెంపొంది స్తాయి కనుకనే రామాయణ మహాభారతాలను పాఠ్యాంశాలుగా చేర్చాలన్న సిఫారసు ఎంతో సముచితం.

సౌదీ అరేబియా నుంచి నేర్చుకోవాలి

సౌదీ అరేబియా విజన్‌`2030లో భాగంగా పాఠశాల విద్యాప్రణాళికలో రామాయణ, మహాభారతాలను చేర్చిన సంగతిని గుర్తుచేసుకోవాలి. ‘అరబ్‌ యోగా ఫౌండేషన్‌’ వ్యవస్థాపకురాలు నౌఫ్‌ అల్‌ మర్వాయీ తన కుమారుడి సాంఘిశాస్త్ర ప్రశ్నపత్రంలో హైందవం, బౌద్ధం గురించిన ప్రశ్నల వివరాలను స్క్రీన్‌షాట్‌ ద్వారా ట్విట్టర్‌లో షేర్‌చేయడం 2021లో ఎంతోమందిలో ఆసక్తిని రేకెత్తించింది. హైందవం, రామాయణం, మహాభారతం, కర్మ, మహాభారత ధర్మం వంటి అంశాలను తన కుమారుడికి బోధించడంలో తానెంతో స్ఫూర్తిని పొందుతున్నానని ఆమె తన ట్విట్టర్‌లో పేర్కొంది. ఇంగ్లిష్‌తో పాటు ఇంటువంటి విద్యావిషయిక అంశాలవల్ల ప్రజల్లో సహనం పెరిగి, ఉదారవాద సమాజ ఏర్పాటుకు దోహదం చేస్తుంది. రామాయణ మహాభారతాలతో పాటు యోగా, ఆయుర్వేదం వంటివి కూడా సౌదీ అరేబియా ప్రభుత్వం తన పాఠ్య ప్రణాళికలో చేర్చడం విశేషం.

వెలకట్టలేని సాహిత్యం

వేదాలు, ఉపనిషత్తులు, రామాయణం, మహాభారతం, భగవద్గీత వంటి వాటి విలువను హైందవ సంస్కృతిలో వెలకట్టడం అసాధ్యం. ఒక మనిషిని సంస్కారవంతుడిగా, పరిపూర్ణ మానవుడిగా తీర్చిదిద్దే సామర్థ్యం కలిగినవి. మరి అటువంటి వాటిని పాఠ్యప్రణాళికలో చేర్చడం వల్ల పిల్లలు నైతిక నిష్ఠాపరులుగా, పరిపూర్ణులుగా ఎదిగి సమాజానికి ఎంతో మేలు చేస్తారు. రామాయణం ఆధారంగా తులసీదాస్‌ రచించిన రామచరిత మానస్‌ విద్వేషాన్ని పెంచేదిగా ఉన్నదంటూ అర్థంపర్థంలేని విమర్శలు చేసే బిహార్‌ విద్యాశాఖ మంత్రి చంద్రశేఖర్‌ వంటి వారు ఎలాగూ ఉంటారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌ మాజీ మంత్రి, సమాజ్‌వాదీ పార్టీ జనరల్‌ సెక్రటరీ స్వామి ప్రసాద్‌ మౌర్య కమిటీ సిఫార్సులను తీవ్రంగా వ్యతిరేకించడంలో పెద్దగా ఆశ్చర్య పోవాల్సిందేమీ లేదు. సీత, శూర్పణక, ద్రౌపది వంటి గొప్ప వనితలు పడిన కష్టాలను ప్రోత్సహించడమే ప్రభుత్వ ఉద్దేశమా అంటూ ప్రశ్నించారు. సీత అగ్ని పరీక్షను ఎదుర్కొంది, వివాహ ప్రతిపాదన చేసినందుకు శూర్ఫణక ముక్కుచెవులు కోశారు, ద్రౌపదిని ఘోరంగా అవమానించారు. పాఠ్యప్రణాళికలో రామాయణ, మహాభారతాలను చేర్చడమంటే ఈ గొప్ప మహిళలు పడిన కడగండ్లను మరింత ప్రోత్సహించడమేనంటూ ఆయన చేసిన విమర్శ అవగాహనా రాహిత్యంతో చేసింది మాత్రమే.

చరిత్రను తెలుసుకోవాలి

ప్రతి భారతీయుడు విద్యాభ్యసన కాలంలో భారత చరిత్రను తప్పనిసరిగా అధ్యయనం చేయాలి. ఇదే సమయంలో వేదాలు, స్మృతులు, శృతులు, వేదాంతం, రామాయణం, మహాభారతాలపై పరిజ్ఞానాన్ని బాగా పెంచుకోవాలి. నిజానికి ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన ఈ సాహిత్యంలోని, పురాతనత్వం, సుదృఢ ఆలోచనాశైలి, విషయ విశ్లేషణ, విస్తృతి ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది. దురదృష్టవశాత్తు స్వాతంత్య్రం వచ్చిన దగ్గరినుంచి ప్రభుత్వాలు, లెఫ్ట్‌ భావజాలం ఉన్న మేధావులు దీన్ని ఎంతమాత్రం పట్టించుకోలేదు. విచిత్రమేమంటే విద్యను మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరించాలన్న లక్ష్యంతో ప్రభుత్వాలు పనిచేసినప్పటికీ, దాని నాణ్యతపై దృష్టిపెట్టకపోవడంతో, విద్యలో ప్రమాణాలు పడిపోయాయి. ఇటువంటి పరిస్థితులో భారతీయ సంస్కృతి, వారసత్వ సంపద, ప్రపంచ దేశాలకు మన నాగరికత వల్ల కలిగిన మేలు, వేదాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు వంటి వాటిని ఒక క్రమపద్ధతిలో అందరికీ అందుబాటులోకి తీసుకొని రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విద్యావిధానంలో వీటిని భాగం చేయడమే ఇందుకు సరైన మార్గం. భారత నాగరికత ఎప్పుడూ భిన్నత్వంలో ఏకత్వాన్ని విశ్వసించింది. వసుదైక కుటుంబకమే పరమావధిగా ముందుకు సాగింది. భారతీయ తత్త్వశాస్త్రం సకల జీవుల హితాన్నే కోరింది.

మన పూర్వీకుల నిబద్ధత, ఆలోచన, తపస్సు ద్వారా సంపాదించిన పరిజ్ఞా నంలోని శక్తిని తెలుసుకునే హక్కు ప్రతి భారతీయ విద్యార్థికి ఉంది. ఇందు కోసం ప్రస్తుత భారతీయ విద్యా విధానంలో సాహసోపేతమైన మార్పులు తీసుకొనిరాక తప్పదు. వ్యక్తి, సమాజం, ఆత్మపరంగా అత్యుత్తమమైన మార్గా న్ని చూపేది విద్య మాత్రమే. అటువంటి విద్యను సక్రమమైన రీతిలో అందిం చినప్పుడు, మానవులు తమలోని అజ్ఞానాంధ కారాన్ని జయించి, జ్ఞాన వెలుగుల వైపునకు ప్రయాణం కొనసాగించగలరు. బృహదారణ్యకోపనిషత్‌ చెప్పింది ఇదే. ‘తమసోమా జ్యోతిర్గమయ’ అంటే ‘నన్ను అంధకారం నుంచి వెలుగు వైపునకు నడుపు’ అని అర్థం. అటువంటి విద్య ప్రతి కటుంబాన్ని ఉత్సాహపూరితం చేసి వ్యక్తుల హృదయాలను మరింత వికసితం చేయగలదు. పాలకులు అటువంటి విద్యావిధానంపై దృష్టిపెట్టక తప్పదు.

  • జమలాపురపు విఠల్‌రావు, సీనియర్‌ జర్నలిస్ట్‌

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram