అద్భుతాలతో, అలౌకిక సంఘటనలతో కూడిన పురాణగాథలను పిల్లలకు ఎలా చెప్పాలి? యథాతథంగా చెప్పాలా? ఆ అలౌకిక ఘట్టాలను తొలగించి చెప్పాలా? ఆధునిక పరిస్థితులకు అనుగుణంగా మార్చి చెప్పాలా? నరసింహావతారం కథలో ఒక స్తంభం నుండి సగం మనిషి, సగం సింహం ఆకారంలో భగవానుడు వెలికిరావడం, శ్రీకృష్ణుడు తన చిటికెన వ్రేలుతో గోవర్ధనగిరిని పైకెత్తడం, ఒక రాయికి శ్రీరామచంద్రుని పాదం తాకగానే స్త్రీ (అహల్య) కావడం, ద్రౌపది చీరను లాగిన కొలదీ ఇంకా పెరుగుతూ ఉండటం చిన్నపిల్లలకు ఎలా వర్ణించాలి?

బాల సాహిత్యరచనతోను, విద్యా బోధనతోనూ సంబంధం ఉన్న అయిదుగురు ప్రముఖులను ప్రశ్నించాను. వారి సమాధానాలు సంగ్రహంగా..

చరిత్ర కథల రచయితగా పేరు పొందిన ముహాపతి ఇలా అన్నారు, ‘చమత్కారాలు, లోకాద్భుత ఘట్టాలు పిల్లల మనస్సులను ఆకట్టుకుంటాయి. కథలలో వీటికి గొప్ప స్థానం ఉన్నది. వీటిని కథలలో వర్ణించవలసిందే.  అయితే అలా వర్ణించేటప్పుడు ఆ అద్భుతం వెనుకగల భావనను పిల్లలకు వివరించాలి.

‘నరసింహావతార కథలోని రాతిస్తంభం చైతన్యం లేని ప్రజాభిప్రాయానికి ప్రతీక. ఆ ప్రజాభిప్రాయం ఒక్కసారి బద్దలైతే, అన్యాయానికి ప్రతీకమైన హిరణ్యకశిపుని ప్రేవులుతోడే శక్తి దాని నుండి ఆవిర్భవిస్తుంది. శిలగా మారినా అహల్య రామ చరణ రజ స్పర్శ వల్ల పూర్వ రూపం పొందుతుది.

పసిపిల్లలకు అనుమానాలు రావు. కనుక ప్రాథమిక స్థాయిలో అద్భుతాలను యథాతథóంగా వర్ణించాలి. పిల్లల బుద్ధి కొంత వికసించి ఆ అద్భుతాలను వాస్తవాలతో జోడిరచే తెలివి తేటలు వచ్చినప్పుడు, అంటే మాధ్యమిక దశలో ఆ అద్భుతాల వెనుకగల భావనను వివరించాలి. బాల్యదశ దాటి విద్యార్థి కార్యాకారణ సంబంధాలను తర్కించే దశను చేరినప్పుడు అతడు సహజంగా అద్భుతానికి కన్నా దాని వెనుక గల భావనకు ఎంతో ప్రాధాన్యం ఇస్తాడు.

పౌరాణిక కథలు పిల్లలకు వినోదాన్ని, విజ్ఞానాన్ని ఇస్తాయని సోషలిస్టు రచయిత లక్ష్మీకాంత్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. పుష్పకవిమానం, ఆకాశంలో గుర్రపు సవారీ వంటివి పిల్లలలో కుతూహలాన్ని, జిజ్ఞాసను రేకెత్తిస్తాయి. కనుకనే పంచతంత్రం, హితోపదేశం. ఈసోప్‌ కథలు, అరేబియన్‌ నైట్స్‌కథలు గలివర్‌ యాత్ర మున్నగు కథలు నాటికీ, నేటికీ పిల్లలను ఆకర్షిస్తూనే ఉన్నాయి. ఆ కథలు అనేక భాషలలోనికి అనువాదమయినాయి. పాశుపతాస్త్రం, బ్రహ్మస్త్రం ఉన్నాయంటే పూర్వం నమ్మేవారు కాదు. నేడు రాకెట్లు, మిసైల్‌లు వచ్చిన తర్వాత మనం ఆ అస్త్రాలను కపోల కల్పనలని ఎలా కొట్టివేయగలం? కనుక అద్భుతాలను కథల నుండి తొలగిస్తే ఆ కథలలోని జీవం పోతుంది. అవి నీరసంగా తయారవుతాయి. సందేశాన్నిచ్చే సామర్థ్యాన్ని అవి కోల్పోతాయి.

అలౌకిక ఘట్టాలు ప్రపంచంలోని అన్ని జాతుల సాహిత్యంలోనూ ఉన్నాయం టారు ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ దేవేంద్ర. అయితే వైజ్ఞానిక యుగంలో ఇలాంటి అద్భుత ఘట్టాలను ఎంతో కాలం సహించలేము. హేతువాదం ఆధారంగా కొత్త సాహిత్యం రావాలి. పురాణ కథలలోని అద్భుత ఘట్టాలను ప్రతీకలుగా చూపి వాటి వెనుక గల అర్థాన్ని వివరించినపుడే పిల్లలకు వాటిపై నమ్మకం ఏర్పడుతుంది. ఇలా అర్థం చెప్పకపోతే వినాయక, నరసింహ విగ్రహాలు హాస్యాస్పదాలుగా మిగులుతాయని ఆయన భావన.

బాల సాహిత్యంలో అసంభవ ఘట్టాలను, అలౌకిక ఘట్టాలను చేర్చడం హాస్యాస్పదమంటూ డాక్టర్‌ కృష్ణచంద్ర ఇలా అన్నారు. ‘విజ్ఞానం విస్తరించిన కారణంగా నేటి పసి పిల్లలకు కూడ అనేక విషయాలు తెలుస్తున్నాయి. నేడు పిల్లలు సైన్సుకథలు ఎంతో ఆసక్తితో చదువుతున్నారు. కపోల కల్పన వినడం పిల్లల వికాసానికి ఏమంత మంచిది కాదు.’

పురాణ కథలలో నేటి పరిస్థితులకు పొసగే, భవిష్యత్తుకు ఉపకరించే కథలను ఏరుకొని వాటిని పిల్లలకు చెప్పాలంటారు ప్రముఖ రచయిత  నిరంకారదేవ. అనాది కాలం నుండి మానవుడు సత్యాన్ని, జ్ఞానాన్ని అన్వేషిస్తున్నాడు. ఆ జ్ఞానం వల్లనే మనిషిలో ఆత్మవిశ్వాసం, స్వతంత్రంగా బ్రతికే సామర్థ్యం అలవడతాయి. కనుక పురాణ కథలను యథాతథóంగా బోధించకూడదు, అద్భుత గాథల వల్ల నేటి పిల్లలకు వినోదం కాని, విజ్ఞానం కాని లభించదు. రావణుణ్ణి పది తలల వ్యక్తిగా వర్ణించే కన్నా ఒక దుర్మార్గుడుగా వర్ణిస్తే పిల్లలకు  దుర్మార్గులను అణచివేయాలనే ప్రేరణ కలుగుతుంది. కనుక పురాణ కథలను అమృత గాథలుగా కాక మానసిక గాథలుగా మలచి చెప్పడం మంచిదని ఆయన సూచించారు. బాల శిక్షణలో నిపుణుడు  రాణా ప్రతాప్‌సింగును ప్రశ్నించగా ఆయన పిల్లలలో సద్గుణాలను వికసింపజేయడం కోసం వారిలో భావాలను నిర్మించడం అన్నది కథలు చెప్పడం వెనుకగల ఉద్దేశమని వివరించారు. కల్పనవల్ల, జిజ్ఞాసవల్ల కథలకు పుష్టి కలుగుతుంది. కవి పాదాలను ‘చరణ కమలములు’ అని ముఖాన్ని, ‘చంద్రముఖం’ అని వర్ణిస్తాడు. అలాగే వివిధ భావాలను వ్యక్తం  చేయడం కోసం కథారచయిత అద్భుతాలను, అలౌకిక ఘటనలను వాడితే దానిలో తప్పేముంది?

కథలలో అద్భుతాలను వర్ణించడం ఒక సాధనమే కాని లక్ష్యం కాదు. విషయం పిల్లల మనస్సుకు హత్తుకునేటందుకు అలంకారాలు, ప్రతీకలు వాడడం అవసరం. శాస్త్ర పరిభాష అర్థాన్నే   కాక దానిలోని మర్మాన్ని కూడ మనం అర్థం చేసుకోవాలి. అద్భుత గాథలను హేతుబద్ధంగా చెప్పడం ఎలా? అనే అంశంపై పరిశోధనలు జరుగుతున్నాయి.

ప్రహ్లాదుడు ప్రజల తరఫున నిలిచాడు. వారికి ప్రహ్లాదుడంటే పట్టరానంత ప్రేమ. ప్రహ్లాదుణ్ణి కొండలమీదనుండి పడదోయాలని, అతనికి విషం పెట్టాలని ఏనుగులచేత తొక్కించాలని హిరణ్య కశిపుడు ఉత్తరువులు ఇచ్చాడు. కాని ప్రజలు ప్రహ్లాదుణ్ణి ఆ ఆపదలనుండి కాపాడారు. సభలో స్తంభాన్ని తన్ని ఈ ఇందులోనీ హరి ఏడి?’ అని హిరణ్యకశిపుడు ప్రశ్నించడం అన్యాయాలను, అత్యాచారాలను ఏండ్ల తరబడి సహించి సహించి రాళ్లవలె మొద్దుబారిపోయిన సభికులకు అవమానం, సభికులలో క్రోధం పెల్లుబికింది. వారంతా హిరణ్యకశిపుణ్ణి చంపి వేశారు. అలా చంపినవారు మామూలు వ్యక్తులే. అయితే క్రోధావేశంతో వారి ముఖాలు సింహాల ముఖాలవలె భయంకరంగా తయారైనాయి 1977 మార్చి ఎన్నికలలో ఇలాంటి నరసింహ అవతారాన్ని ప్రజలు మరోమారు దర్శించారు. ప్రముఖ రచయితలు వ్యక్తం చేసిన యీ అభిప్రాయాలు మనలో ఈ విషయమై  ఆలోచనలు రేకెత్తిస్తాయి. పురాణకథలు పిల్లలకు వర్ణించి చెప్పడం వెనుక ఎంతో భావన ఉన్నది. ఆ భావన పిల్లల మనస్సుకు హత్తుకునేలా చెప్పడం ప్రధానం.

– డా॥ పుష్పేంద్రశర్మ

16.02.1979 ‘జాగృతి’ నుంచి

About Author

By editor

Twitter
YOUTUBE