–  టిఎన్‌.భూషణ్‌

తుపాను బాధితులైన తమకు భరోసా ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందిందని, ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి  కనీసం తమ గోడు వినే ప్రయత్నం కూడా చేయడం లేదని రైతులోకం మండిపడుతోంది.  తుపానుతో పంటలు దెబ్బతిన్న ప్రాంతాలు బాపట్ల, తిరుపతిల్లో ముఖ్యమంత్రి పర్యటనలు ఆద్యంతం ఆర్భాటానికి, ఆంక్షలకే పరిమితమవడం, రైతుల ఇబ్బందులు పట్టించుకోలేదని విమర్శలు వ్యక్త మవుతున్నాయి. హెలిప్యాడ్‌లో సీఎంకు  కార్పెట్‌తో స్వాగతం ఇవ్వడం కొత్త ప్రాజెక్టుల ప్రారంభానికి వచ్చినట్లుంది. ఆయన వరద నీరు చేరిన పొలంలోకి దిగలేదు. రైతుల సమస్యలను ఆలకించలేదు. పొలాలకు పక్కన ఏర్పాటు చేసిన వేదిక  పౖౖెనుంచి రైతులను ఉద్దేశించి ప్రసంగించారు.

సభ ప్రాంతంలో అడుగడుగునా బ్యారికేడ్లు, ఎటు చూసినా పోలీసులే. ఈ సభకు వెళ్లేవారిపై అలవిమాలిన ఆంక్షలు విధించారు. ఎంపిక చేసిన రైతులకే ప్రవేశం కల్పించారు. వారిలోని కొందరు మహిళలు సీఎంను నవ్వుతూ పలకరించారు. ఆయనా వారితో ముచ్చటించారు. ‘మీ ప్రాంతంలో వరద వచ్చిందా’ అనే సీఎం ప్రశ్నకు, ‘వచ్చింద’ని, ‘పంట నష్టం నమోదైందా? అధికారులు ఆదుకున్నారా’ అని అడగ్గానే ‘అంతా బావుంది. నెల రోజులకు సరిపడా వస్తువులు ముట్టాయి’ అని ఆ మహిళలు ప్రశంసించారు. వారిలో పంటలు కోల్పోయిన బాధ కనిపించలేదు. సీఎం వారి తలలు పట్టుకుని ఆశీర్వదించారు. ఇదంతా చూస్తుంటే ముందే తర్ఫీదు ఇచ్చి వారితో మాట్లాడిరచినట్లు ఎవరికైనా అర్థమవుతుంది. ఇప్పుడే కాదు నాలుగేళ్ల నుంచి ప్రకృతి వైపరీత్యాలు వచ్చిన ప్రతిసారి అధికారిక యంత్రాంగం చేస్తున్న తంతే ఇది. గోడు వెళ్లబోసుకుందామని వచ్చిన తుపాను బాధిత రైతులకు నిరాశే మిగిలింది. రైతుల పరామర్శలో ముఖ్యమంత్రి ప్రతిపక్షాలను విమర్శిస్తూ రాజకీయ ప్రసంగాలు చేశారు.

 ఒకపక్క నీరందక పంటలు ఎండిపోతే, మరోవైపు తుపాను వచ్చి మిగిలిన పంటను ఊడ్చుకుపోవడంతో రైతాంగం తీవ్ర ఆర్ధిక భారంతో కుంగిపోయింది. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తూ వ్యవసాయాన్ని చిన్నచూపు చూస్తోంది. డ్రైన్లలో పూడికలు తీయరు. కొత్త ప్రాజెక్టులు నిర్మించరు. నీటి వనరులకు ప్రోత్సాహం లేదు. పండిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు. రైతుల నుంచి కొన్న ధాన్యానికి సకాలంలో డబ్బులివ్వరు. ధాన్యం నిల్వచేసే గోతాల పంపిణీలో అవినీతి ఆరోపణలు. విత్తనాలు, ఎరువులు బ్లాక్‌ మార్కెట్‌లో లభిస్తున్నాయి. నకిలీ విత్తనాలపై అదుపు లేదు.

అపార పంటనష్టం

మిచౌంగ్‌ తుపాను అపారమైన పంట నష్టాన్ని మిగిల్చింది. శ్రీకాకుళం జిల్లా నుంచి తిరుపతి జిల్లా వరకు ఎక్కడ చూసినా లక్షల ఎకరాల్లో కోతకొచ్చిన పంటలు నీటమునిగాయి. ఉద్యాన పంటలు నేల కొరిగాయి. అత్యధికశాతం రైతులకు పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. తుపాను తీరం దాటి రోజులు గడుస్తోన్నా వరద తగ్గలేదు. వరి, మిరప, శనగ, కంది, మినుము, పొగాకు తదితర పైర్లు నీటిలో నానుతున్నాయి. ధాన్యంలో మొలకలు వస్తున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పొగాకు పంటకూ తీరని నష్టం వాటిల్లింది. కొన్నిచోట్ల నేల కరిచాయి. కృష్ణా, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో శనగ, కంది, మినుము పంటలు నీటిలో తేలుతున్నాయి.

 రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20 లక్షల ఎకరాల్లో పంట నష్టం ఉంటుందని నిపుణుల అంచనా. ఇందులో వరి సుమారు 12 లక్షల ఎకరాలు, మిరప 2.5 లక్షల ఎకరాలు, శనగ, కంది, మినుము 5.50 లక్షల ఎకరాల వరకు ఉంటాయి. ఎకరాకు సగటున రూ.20 వేల లెక్కన చూసినా.. పంటనష్టం రూ.4 వేల కోట్ల పైనే ఉంటుంది. పండ్లు, పూలతోటలు సుమారు 2.50 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్నా యంటున్నారు. అరటి, బొప్పాయి తోటలకు తీరని నష్టం వాటిల్లింది. ఎకరాకు రూ.50 వేల చొప్పున నష్టం రూ.1,250 కోట్ల వరకు ఉంటుంది. తడిసిన ధాన్యంతో నష్టపోయిన మొత్తాన్ని కూడా కలిపితే.. ఇది రూ.10 వేల కోట్లకు పైగా చేరుతుందని అంచనా. పంటలు దెబ్బతిన్న వారిలో 80% మంది రైతులకు పెట్టుబడిలో పైసా కూడా చేతికొచ్చే పరిస్థితి లేదు. కోత కోయించడం కంటే ట్రాక్టర్లతో దమ్ము తొక్కించేయడమే మేలని వరి రైతులు ఆలోచిస్తున్నా రంటే.. రాష్ట్రంలో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. ప్రభుత్వం పంట నష్ట తీవ్రతను అంచనా వేయడంలో విఫలమైంది. కేవలం 1.40 లక్షల హెక్టార్లలో మాత్రమే పంట నష్టం జరిగినట్లు ప్రకటించడాన్ని విపక్షాలు తప్పుపడుతున్నాయి. అతి భారీ వర్షాలు, తీవ్ర గాలులతో అన్ని జిల్లాల్లోనూ నష్టం జరుగుతుందని వాతావరణశాఖ హెచ్చరించినా పట్టించుకోలేదు. తుపాను హెచ్చరికలు మొదలైన నాటి నుంచి.. 8 జిల్లాల్లోనే ప్రభావ మంటూ.. వాటిపైనే దృష్టి పెట్టింది. మిగిలిన జిల్లాల్లోనూ పంట నష్టం తీవ్రంగా ఉందని.. అక్కడి రైతులు కుదేలయ్యారని గుర్తించడం లేదు. తుపాను తీరం దాటే ముందురోజు కూడా ముఖ్యమంత్రి 8 జిల్లాల కలెక్టర్లు, అధికారులతోనే సమీక్షించారు. ప్రత్యేకాధికారులను కూడా ఈ జిల్లాలకే నియ మించారు.

పంట పోయింది.. అప్పులు మిగిలాయి

మిరప, పొగాకు, పసుపు రైతులు ఎకరాకు రూ. లక్షకు పైగా పెట్టుబడి పెట్టారు. వరి రైతులు ఎకరాకు రూ. 40 వేలకు పైనే ఖర్చు చేశారు. శనగ, మినుము, కంది రైతులకూ ఎకరాకు రూ. 25 వేలకు పైగానే ఖర్చయింది. సగటున రెండున్నర ఎకరాల రైతుకు రూ. లక్ష వరకు నష్టం. ఖరీఫ్‌ ఆరంభం నుంచి అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టిన రైతులు.. వారం, పది రోజుల్లో పంటలు చేతి కొస్తాయనే ఆశల్లో ఉన్నారు. తుపాను ధాటికి అవన్నీ నీటిపాలయ్యాయి. తెచ్చిన అప్పులు తీర్చే పరిస్థితి లేదు. మళ్లీ పంట వేయాలన్నా.. తీసుకున్న అప్పు సంగతేంటని అడుగుతారనే ఆవేదన రైతాంగంలో వ్యక్తమవుతోంది.

గాడి తప్పన సాగు

వైసీపీ పాలనలో సాగు గాడి తప్పింది. రైతులు కాలాన్ని బట్టి సాగుచేసే విధానాన్ని వదిలేశారు. నీరు ఇచ్చినప్పుడే సాగు చేయాలి. సార్వాలో సమయం కంటే నెల, రెండు నెలలు ఆలస్యంగా ప్రారంభి స్తున్నారు. ఆ పంట మాసూళ్లు ఆలస్యమై దాళ్వాపై దాని ప్రభావం పడుతోంది. ఇది దిగుబడి తగ్గడానికి దోహదపడుతోంది. ఈ క్రమంలో వచ్చే తుపాన్లు, వరదలకు రైతు మునిగిపోతున్నాడు. ఇదీ గడిచిన మూడేళ్లుగా సాగుతున్న తీరు. వాస్తవానికి సార్వా నారుమడులు జూన్‌ 15 నుంచి, నాట్లు జూలై 15 నుంచి వేయాలి. మాసూళ్లు నవంబరు నెలాఖరుకు పూర్తికావాలి. డిసెంబరు మొదటి వారంలో దాళ్వా నారుమడులు వేసి, నెలాఖరున నాట్లు పడాలి. మార్చి నెలాఖరుకు పంట మాసూళ్లు జరగాలి. కాని, గడిచిన మూడేళ్లుగా జూలై రెండో వారం నుంచి నెలాఖరు వరకు సార్వా నారుమడులు, ఆగస్టు నుంచి సెప్టెంబరు మొదటి వారం వరకు నాట్లు ప్రక్రియ జరుగుతోంది. సార్వా మాసూళ్లు డిసెంబరులోనే సాగుతోంది. దాళ్వా నారుమడులు డిసెంబర్‌ చివరి వారం, జనవరి మొదటి వారం పడతాయి. నాట్లు జనవరి చివరి వారం ఫిబ్రవరి మొదటి వారంలో వేస్తే పంట మాసుళ్లు ఏప్రిల్‌ చివరి వారం, లేదా మే నెలలో జరుగుతాయి. ఈ సాగు వేళలు గాడి తప్ప డంతో రైతులు నిలువునా నష్టపోతున్నారు.

రైతుకు ఆశించిన స్థాయిలో ప్రభుత్వం నుంచి సహకారం లభించడం లేదు. యాంత్రిక పనిముట్లపై సబ్సిడీ నిలిపివేశారు. కాలువల ఆధునికీకరణ ఊసే లేదు. పంట నీరు సక్రమంగా రాదు. మురుగునీరు బయటకు వెళ్ళదు. ప్రజా ప్రతినిధుల మాట అధికారుల వద్ద చెల్లడం లేదు. పనులు చేసేందుకు నిధులు రావు. ముందస్తుగా చేద్దామన్నా.. తర్వాత వస్తాయో రావోననే భయం అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల్లో సైతం నెలకొంది. దీంతో ఎవరికి వారు మనకెందుకులే అన్నట్లు వదిలేస్తున్నారు.

అడ్డంకిగా తేమశాతం నిబంధనలు

ఇక సార్వా కోతలు ప్రారంభమైనా ధాన్యం కొనుగోళ్లు ఆలస్యం కావడం, తేమ శాతం నిబంధనలు కొంత అడ్డంకిగా మారడంతో కోసిన ధాన్యాన్ని అమ్మడానికి ఆలస్యమైందని, ఈ లోగా తుపాన్‌ వచ్చి పంటలను దెబ్బతీసిందని రైతులు చెబుతున్నారు. తేమశాతం నిబంధనలు తుఫాన్‌ వచ్చిన తర్వాత కాకుండా ముందుగా సడలిస్తే ధాన్యం తడిసిపోయే పరిస్థితులు ఉండేవి కావని రైతులు చెబుతున్నారు. ఆర్‌బీకే కేంద్రానికి ధాన్యం శాంపిల్‌ను తీసుకెళ్తే తేమ 17 శాతం ఉందని, ఇది రైస్‌మిల్లుకు వెళ్లేసరికి కొంత పెరుగుతుందని, కనుక ధాన్యాన్ని ఆరబెట్టి మరో రెండు శాతం తక్కువగా, అంటే 15 శాతం వచ్చాక తీసుకురమ్మని చెప్పడంతో రైతులు ధాన్యాన్ని అమ్మలేకపోయారు. ఈ లోగా వచ్చిన తుఫాన్‌కు మొత్తం ధాన్యం తడిసి పోవడంతో పూర్తిగా పంట నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

అయితే, ఇప్పుడు తేమ శాతంతో నిమిత్తం లేకుండా ఆఫ్‌లైన్‌ ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. ఇది తుఫాన్‌ హెచ్చరికలు విడుదలయినప్పుడే చేసి ఉంటే తమ ధాన్యం అమ్మకం జరిగి ఉండేదని రైతులు వాపోయారు. తుఫాన్‌ హెచ్చరికల నేపథ్యంలో రైతులను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ముందస్తు చర్యలు చేపట్టలేదు. ఖరీఫ్‌లో వర్షాభావ పరిస్థితులను తట్టుకుని పండిరచిన పంట కోసిన తర్వాత కొనుగోలు ఆలస్యం చేయడం వల్ల రైతులు నష్టపోయారు. టార్ఫాలిన్స్‌ను సైతం ప్రభుత్వం అందించలేక పోయింది. తేమ శాతం పేరుతో ఇబ్బందులు పెడుతున్నారు. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలి. పంట నష్టాలను నమోదు చేసి పరిహారం అందించి అన్నదాతలను ఆదుకోవాలి.

పంటల బీమా

ఉచిత పంటల బీమా అమలు చేస్తున్నామంటూ ఊదరగొడుతున్న సర్కార్‌.. ప్రీమియం భారమవుతుందనే కారణంగా లక్షలాది రైతులకు అన్యాయం చేస్తోంది. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజనలోని పంట కోత అనంతర నష్టానికి పరిహారం పొందే అవకాశాన్ని పక్కన పెట్టేసింది. కేవలం దిగుబడి అంచనా ప్రకారమే బీమా అమలు చేస్తోంది. దీనివల్ల విపత్తు సమయాల్లో కోసిన పంట దెబ్బతిని, తీవ్రంగా నష్టపోయే రైతులకు ఎలాంటి సాయమూ అందడంలేదు. పీఎంఎఫబీవై మార్గదర్శకాల ప్రకారం విత్తనం మొలకెత్తిన తర్వాత పంట పండకపోతే(సోయింగ్‌ ఫెయిల్‌) పరిహారం రైతుకు అందాలి. పైరు వేశాక మధ్యలో విపత్తులకు పంట దెబ్బతింటే వెంటనే పరిహారాన్ని బీమా కంపెనీలు విడుదల చేయాలి. దీంతోపాటు పంట కోశాక ఏదైనా విపత్తుకు దెబ్బతింటే.. రైతుకు పరిహారం ఇచ్చే వెసులుబాటు కూడా ఉందని బీమా కంపెనీలు చెప్తున్నాయి. ఈ అవకాశాలను ఇతర రాష్ట్రాలు పొందుతున్నాయి. ఏపీ ప్రభుత్వం మాత్రం పంట కోత అనంతర నష్టానికి బీమానూ పూర్తిగా పక్కన పెట్టేసింది.

2018 నుంచి అమలులో ఉన్న పంట కోత అనంతర నష్టాలను పరిగణలోకి తీసుకుంటే.. పంట కోసి, కల్లాల్లో ఉండగా, వర్షం పడి ఉత్పత్తి కొట్టుకు పోయినా, పాడైపోయినా ప్రతి రైతు దగ్గరకు వెళ్లి, నష్టాన్ని అంచనా వేసి, పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. 2021, 22లో మిర్చి, మొక్కజొన్న పంటలు పంట దశలో కొత్త రకం తెగుళ్లతోనూ, పంట కోశాక అకాలవర్షాలకు దెబ్బతిని,  రైతులు రూ.వందల కోట్లు నష్టపోయారు. పంట కోసిన తరువాతి నష్టాలకు బీమా వర్తింపజేసి ఉంటే లక్షలాది రైతులు నష్టపోకుండా ఉండేవారని నిపుణులు చెప్తున్నారు. తుఫాన్‌ కారణంగా ధాన్యం, పత్తి, ఇతర పంటలతో పాటు ఉద్యాన పంటలు భారీగా దెబ్బతిన్నాయి. వాటిరి బీమా అందించ కుండా, వర్షాలకు తడిసిన ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ కొనుగోలు చేస్తుందని చెప్పి, ప్రభుత్వ పెద్దలు మభ్యపెడుతున్నారు.

వ్యాసకర్త : సీనియర్‌ జర్నలిస్ట్‌

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram